సంగీతం—నాదవేదం—65
25—09—2021; శనివారము.
ॐ
ఇప్పుడు “దశమచక్రం” లేక పదవచక్రం లోని ఆరు రాగాల పరిచయం చేసుకుందాం. ఈ పదవ చక్రాన్ని “దిక్చక్రం / దిశాచక్రం / దిశిచక్రం” అని అంటారు. మనకి పది దిక్కులు ఉన్నాయి కనుక పదవ చక్రానికి దిక్చక్రం అని పెద్దలు పేరు పెట్టేరు.
ఈ చక్రంలో ఉన్న ఆరు రాగాలలోను “రి-గి” అంటే, “చతుశ్శ్రుతి రిషభం – సాధారణ గాంధారం” ఉంటాయని తెలుసుకోవాలి.ఈ చక్రంలో మొదటి రాగం, అంటే, మొత్తంమీద, 55వ మేళకర్త పేరు — “శ్యామలాంగి రాగం”, {దీక్షితులవారిపద్ధతిలో శ్యామల(ం) రాగం}. శ్యామలాంగిరాగం “రి-గి-ధ-న” స్వరాల కూర్పుతో ఉంటుంది. ఈ రాగం సంపూర్ణ-సంపూర్ణ రాగం. శ్యామలాంగిరాగ స్వరసంపుటీకరణ ఈ దిగువ రీతిలో ఉంటుంది:—
మంద్ర స—చతుశ్శ్రుతి రి—సాధారణ గ—ప్రతి మ—ప—శుద్ధ ధ—శుద్ధ ని—తారా స.
ఈ మేళకర్తలో త్యాగయ్యగారి కృతులు ఏవీ లభ్యం కావడం లేదు. షాడవ-సంపూర్ణ రాగమైన శ్యామలం రాగంలోని ఆరోహణలో “ని” వర్జ్యస్వరం. శ్యామలంలో దీక్షితస్వామి వారి — “శ్యామలాంగి! మాతంగి! నమస్తే ~ శంకరి సరస్వతి వినుతే! ॥శ్యామలాంగి!॥ (ఆదితాళం)” అనే ఒక్క కృతి లభిస్తోంది.
56వ మేళకర్తరాగమైన “షణ్ముఖప్రియరాగం” లో “రి-గి-ధ-ని” స్వరాల కూర్పు ఉంటుంది. షణ్ముఖప్రియ రాగం సంపూర్ణ-సంపూర్ణ రాగం. షణ్ముఖప్రియలో స్వరాల సంవిధానం ఈ దిగువ విధానంలో ఉంటుంది:—
మంద్ర స—చతుశ్శ్రుతి రి—సాధారణ గ—ప్రతి మ—ప—శుద్ధ ధ—కైశికి ని—తారా స.
త్యాగరాజస్వామి షణ్ముఖప్రియరాగంలో — “వద్దనేవారు లేరు ॥వద్దనేవారు॥ (ఆదితాళం); నీ పరాక్రమము ॥నీ పరాక్రమము॥ (మిశ్రచాపుతాళం)” అనే రచనలు చేసినట్లు తెలుస్తూంది.
షణ్ముఖప్రియరాగం దీక్షితులవారి పద్ధతిలో “చామరం రాగం” గా సుప్రసిద్ధమయ్యింది. చామరం షణ్ముఖప్రియరాగం లాగే సంపూర్ణ-సంపూర్ణ రాగం. రాగాలలో నామభేదమే తప్ప స్వరస్వరూపభేదం ఏమీ లేదు. దీక్షితస్వామి చామరం రాగంలో — “ఏకామ్రేశనాయకీం ఈశ్వరీం ~ భజ రే! రే! మానస! ॥ఏకామ్రేశనాయకీం॥ (ఆదితాళం); మహాsసురం కేతుమహం ~ భజామి ఛాయాగ్రహవరం ॥మహాsసురం॥ (రూపకతాళం); సదాశ్రయే! అభయాంబికే! సన్నిధేహి ~ సదాశ్రయే! త్వామంబికే! భద్రం దేహి ॥సదాశ్రయే!॥ (రూపకతాళం); సిద్ధివినాయకం అనిశం చింతయామ్యహం ప్ర – సిద్ధ గణనాయకం విశిష్టార్థదాయకం వరం ॥సిద్ధివినాయకం॥ (రూపకతాళం)” అనే సుమధుర కృతులను రచించేరు.
షణ్ముఖప్రియ విస్తారమైన స్వరసంపుటుల సుందర సంచారాలు కలిగిన మహనీయరాగం. “రాగం-తానం-పల్లవి” ప్రక్రియకి పూర్తిగా అనువైన అందమైన రాగం. కళాకారులకి, రసికజనులకి అత్యంతప్రీతిపాత్రమైన సభారంజక ప్రముఖ రాగాలలో పేరెన్నిక గలవాటిలో ఒకటిగా విరాజిల్లుతూంది. అందువలన అనేక మహనీయ వాగ్గేయకారుల రచనలు షణ్ముఖప్రియరాగంలో ఉండడం రసజ్ఞశేఖరులకి ఆనందాయకమైన విషయం.
57వ మేళకర్త పేరు “సిమ్హేన్ద్రమధ్యమరాగం”. ఈ రాగం స్వరసంపుటి “రి-గి-ధ-ను”. ఇది 21వ మేళకర్త అయిన కీరవాణిరాగం యొక్క ప్రతిమధ్యమరాగం. అంటే, కీరవాణిరాగంలోని శుద్ధమధ్యమాన్ని తొలగించి, ఆ స్థానంలో ప్రతిమధ్యమాన్ని ప్రయోగిస్తే అది సిమ్హేన్ద్రమధ్యమరాగం ఔతుంది. సిమ్హేన్ద్రమధ్యమరాగం సంపూర్ణ-సంపూర్ణ రాగం. సింహేద్రమధ్యమంలోని స్వరానుక్రమణిక ఈ దిగువ రీతిలో ఉంటుంది.:—
మంద్ర స—చతుశ్శ్రుతి రి—సాధారణ గ—ప్రతి మ—ప—శుద్ధ ధ—కాకలి ని—తారా స.
త్యాగయ్యగారు సింహేంద్రమధ్యమరాగంలో — “నతజన పరిపాల! ఘన! ~ నన్ను బ్రోవవే! (మా) ॥నతజన పరిపాల!॥ (రూపకతాళం); నీదు చరణములే గతియని ~ నెర నమ్మినవాడను రా! రామ! ॥నీదు చరణములే॥ (మిశ్రచాపుతాళం)” అనే కృతులని విరచించేరు.
దీక్షితులవారి పద్ధతిలో ఈ రాగాన్ని “సుమద్యుతిరాగం” అని పిలుస్తారు. ఈ సుమద్యుతి రాగం కూడా సంపూర్ణ-సంపూర్ణ రాగమే! సుమద్యుతిరాగంలో దీక్షితస్వామి — “నీలాచలనాథం భజేsహం ~ నిఖిలలోక జగత్ప్రసిద్ధేశ్వరం ॥నీలాచలనాథం॥ (ఆదితాళం); పామరజనపాలిని! ~ పాహి బృహన్నాయకి! ॥పామరజనపాలిని!॥ (రూపకతాళం); శైలేశ్వరం భజ రే! రే! చిత్త! ~ శ్రీవరద గురుగుహముదం వారణ ॥శైలేశ్వరం॥ (ఆదితాళం)” అనే కృతులను కూర్పు చేసేరు.
సింహేద్రమధ్యమరాగంకూడా విస్తృత స్వరసంచారాలు కలిగి, ౘక్కని మనోధర్మసంగీతవ్యక్తీకరణకి సహజమైన అవకాశం కలిగిన రాగం. సింహేంద్రమధ్యమరాగంలో మహనీయవాగ్గేయకారులు కొందరు కొన్ని సంగీతరచనలని చేసేరు.
(సశేషము)