సంగీతం—నాదవేదం—64

18—09—2021; శనివారం.

51వ మేళకర్త కామవర్ధిని రాగాన్ని, దీక్షితులవారి రాగవిభాగపద్ధతిలో “కాశీరామక్రియరాగం” అని పిలుస్తారు. సంగ్రహచూడామణి గ్రంథం ప్రకారం కాశీరామక్రియరాగం కామవర్ధినిరాగజన్యంగా పరిగణింపబడుతోంది. కాశీరామక్రియ వక్రసంపూర్ణ—సంపూర్ణ ఆరోహణ—అవరోహణ రాగం. ఈ కాశీరామక్రియ రాగంలో దీక్షితస్వామి — “మార్గసహాయేశ్వరం భజేsహం ~ మరకతవల్లీ మనోల్లాసకరం ॥మార్గసహాయేశ్వరం॥ (మిశ్రచాపుతాళం); రామనాథం భజేsహం ~ రామచంద్ర పూజితం ॥రామనాథం॥ (త్రిస్ర ఏక తాళం); శ్రీసుందరరాజం భజేsహం ~ శ్రితకల్పమహీరుహం ముఖాంభోరుహం ॥శ్రీసుందరరాజం॥ (ఆదితాళం); సేనాపతే! పాలయ మాం సన్ ~ మునిజనాది పూజితానందకర! ॥సేనాపతే!॥ (ఆదితాళం); ఉచ్ఛిష్టగణపతౌ భక్తిం కృత్వా ~ ఉన్నతపదవీం వ్రజ! రే! రే! హృదయ! ॥ఉచ్ఛిష్టగణపతౌ॥ (ఆదితాళం); విశాలాక్షీం విశ్వేశీం ~ భజ! రే! రే! మానస! సదా ॥విశాలాక్షీం॥ (మిశ్రచాపుతాళం)” అనే దివ్యకృతులను రచించేరు.

51వ మేళజన్యమైన “కుముదక్రియరాగం” ఔడవ—షాడవ రాగం. ఆరోహణలో “ప-ని” వర్జిత స్వరాలు. అవరోహణలో “ప” వర్జితం. కుముదక్రియరాగం, రూపకతాళం లో దీక్షితస్వామి వారు “అర్ద్ధనారీశ్వరం ఆరాధయామి సతతం ~ అత్రి భృగు వసిష్ఠాది మునిబృందవందితం శ్రీ ॥అర్ద్ధనారీశ్వరం॥” అనే మనోహరకృతిని నిర్మించేరు.

52వ మేళకర్త అయిన “రామప్రియరాగం” యొక్క విశేష లక్షణ స్వరసంపుటి “ర-గు-ధి-ని”. సంపూర్ణ-సంపూర్ణ రాగం అయిన రామప్రియరాగం లోని స్వరస్వరూపం ఈ దిగువ రీతిలో ఉంటుంది:—

మంద్ర స—శుద్ధ రి—అంతర గ—ప్రతి మ—ప—చతుశ్శ్రుతి ధ—కైశికి ని—తారా స.

రామప్రియరాగం, దేశాదితాళం లో త్యాగయ్యగారు “సందేహమును తీర్పవయ్య! ~ సాకేతనిలయ! రామయ్య! ॥సందేహమును॥” అనే కృతిని రచించేరు.

రామప్రియరాగ జన్యమైన రామమనోహరిరాగం షాడవ-సంపూర్ణ రాగం. ఆరోహణలో “ని” వర్జ్యం. రామప్రియరాగం, దేశాదితాళం లో త్యాగరాజుగారు “సీతామనోహర! ~ శృంగారశేఖర! ॥సీతామనోహర!॥” అనే కృతిని రచించేరు.

“సంగ్రహ చూడామణి గ్రంథం” లో వివరించబడిన రామప్రియరాగం దీక్షితులవారి పద్ధతిలో అవే స్వరసంపుటీకరణతో కూడిన “రమామనోహరి రాగం” తో అన్నివిధాలా సరిసమానంగా ఉంటుంది. రమామనోహరిరాగంలో దీక్షితస్వామివారు — “మాతంగి! శ్రీరాజరాజేశ్వరి! మామవ ॥మాతంగి!॥ (రూపకతాళం); శృంగార శక్త్యాయుధ ధర శరవణస్య ~ దాసోsహమనిశం ధనధాన్యప్రదస్య ॥శృంగార – – -॥ (రూపకతాళం); శ్రీరాజరాజేశ్వరీ! ~ శ్రీరమామనోహరీ! ॥శ్రీరాజరాజేశ్వరీ!॥ (ఆదితాళం); స్మరామ్యహం సదా రాహుం ~ సూర్యచంద్రవీక్ష్యం వికృతదేహమ్ ॥స్మరామ్యహం॥ (రూపకతాళం)” అనే రమణీయ శ్రవణపేయ కృతులను రచించేరు.

53వ మేళకర్త అయిన “గమనశ్రమరాగం” లో ప్రత్యేక స్వర చతుష్టయం “ర-గు-ధి-ను”. సంపూర్ణ-సంపూర్ణ రాగమైన గమనశ్రమరాగంలో స్వరానుక్రమణిక ఈ దిగువ ఉదహరించబడిన విధంగా ఉంటుంది:—

మంద్ర స—శుద్ధ రి—అంతర గ—ప్రతి మ—ప—చతుశ్శ్రుతి ధ—కాకలి ని—తారా స.

గమనశ్రమరాగ జన్యమైన పూర్వీకల్యాణి రాగం షాడవ-సంపూర్ణ రాగం. ఆరోహణలో “నిషాదం” వర్జితస్వరం. పూర్వీకల్యాణి (పూరికల్యాణి) రాగంలో త్యాగరాజవర్యులు — “పరలోక సా – ధనమే మనసా! ॥పరలోక సాధనమే॥ (దేశాదితాళం); పరిపూర్ణకామా! ~ భావమున మరచినామా! ॥పరిపూర్ణకామా!॥ (రూపకతాళం); జ్ఞానమొసగరాదా? ~ గరుడగమన! వాదా? ॥జ్ఞానమొసగరాదా?॥ (రూపకతాళం — ‘జ్ఞానమొసగరాదా?’ కృతిని కొందరు జనకరాగమైన గమనశ్రమరాగంలో పాడుతూ ఉంటారు)” అనే కృతులు విరచించడం జరిగింది.

“సంగ్రహ చూడామణి” వివరించిన 53వ మేళకర్త ఐన గమనశ్రమరాగాన్ని, దీక్షితులవారి పద్ధతిలో “గమకక్రియరాగం” అని పిలుస్తారు. గమకక్రియరాగం గమనశ్రమరాగజన్యంగా పరిగణింప బడుతోంది. గమకక్రియరాగం షాడవ-సంపూర్ణ రాగం. ఆరోహణలో “ని” వర్జితస్వరం. ఆరోహణలో వక్రసంచారం ఉంటుంది.

దీక్షితస్వామివారు గమకక్రియరాగంలో — “ఏకామ్రనాథం భజేsహం ~ ఏకానేక ఫలప్రదం శ్రీ ॥ఏకామ్రనాథం॥ (ఆదితాళం); కాశీవిశాలాక్షీం ~ భజేsహం భజే శ్రీ ॥కాశీవిశాలాక్షీం॥ (ఆదితాళం); మీనాక్షి! మే ముదం దేహి! ~ మేచకాంగి! రాజమాతంగి! ॥మీనాక్షి!॥ (ఆదితాళం); నవరత్న మాలినీం నతజన పాలినీం నమామ్యహం ~ నిజగురుగుహాద్యారాధినీం ॥నవరత్న మాలినీం॥ (ఖండ ఏక తాళం); తిరువటీశ్వరం నమామి ~ సంతతం చింతయామి శ్రీ ॥తిరువటీశ్వరం॥ (రూపకతాళం)” అనే వివిధ విశిష్ట కృతలని వెలయింపజేసేరు.

54వ మేళకర్త అయిన “విశ్వంభరిరాగం” యొక్క విలక్షణ స్వరసంపుటి “ర-గు-ధు-ను”. సంపూర్ణ-సంపూర్ణ రాగమైన విశ్వంభరిరాగంలో ఈ దిగువ స్వరావళి ఉంటుంది:—

మంద్ర స—శుద్ధ రి—అంతర గ—ప్రతి మ—ప—షట్ శ్రుతి ధ—కాకలి ని—తారా స.

విశ్వంభరిరాగంలో త్యాగరాజకృతులు మనకి లభించలేదని చెప్పవచ్చు.

దీక్షితులవారి పద్ధతిలో విశ్వంభరిరాగాన్ని, “వంశవతిరాగం” అంటారు. వంశవతి రాగం సంపూర్ణ-షాడవ రాగం. అవరోహణ “ధైవత వర్జితం”.

దీక్షితస్వామి వంశవతిరాగంలో — “భక్తవత్సలం అభిషేకవల్లీయుతం ~ భజేsహం నిత్యం ॥భక్తవత్సలం॥ (ఆదితాళం); వంశవతి! శివయువతి! పారయ మాం ~ శాంభవి! బహుతరమహిమే! ॥వంశవతి!॥ (ఆదితాళం)” అనే కృతులను విరచించేరు.

దీనితో నవమ(బ్రహ్మ)చక్రం పూర్తి అయ్యింది.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *