సంగీతం—నాదవేదం—63
11—09—2021; శనివారము.
ॐ
ఇప్పుడు తొమ్మిదవ చక్రమైన “బ్రహ్మ (నవబ్రహ్మలు) చక్రం” లోని ఆరు రాగాలు ఒక్కొక్కటే పరిచయం చేసుకుందాం! (9వ చక్రంలో, అంటే, ఈ చక్రంలోని ఆరు రాగాలలోను, “ర-గు” స్వరద్వయం యొక్క ఉనికి ఈ చక్రానికి సామాన్య లక్షణం).
ఈ చక్రంలో మొదటి రాగం, అంటే, మొత్తంమీద “49వ మేళకర్త రాగం” పేరు:— “ధవళాంబరి రాగం”. ఈ రాగంలో “ర-గు-ధ-న” స్వరాలు ఉంటాయి. ఇది సంపూర్ణ-సంపూర్ణ రాగం. ఈ రాగంలో స్వరాల కూర్పు ఈ దిగువ విధంగా ఉంటుంది:—
మంద్ర స—శుద్ధ రి—అంతర గ—ప్రతి మ—ప—శుద్ధ ధ—శుద్ధ ని—తారా స.
ధవళాంబరి రాగంలో కాని, దాని జన్యరాగాలలో కాని త్యాగరాజుగారి కృతులు ఏవీ లభ్యం కావడం లేదు. దీక్షితులవారి పద్ధతిలో దీనిని “ధవళాంగి(గ/గం)” అని పిలుస్తారు. “సంగ్రహ చూడామణి” ప్రకారం ధవళాంగి ధవళాంబరియొక్క జన్యరాగం. ధవళాంగి “షాడవ-సంపూర్ణ” రాగం. ఆరోహణలో “ని” వర్జితస్వరం. ధవళాంగి రాగంలో దీక్షితస్వామి — “శృంగారాది నవరసాంగి బృహదంబా ~ ssలింగిత పుంగవ ధవళాంగ! శ్రియం దేహి! ॥శృంగారాది – – -॥ (ఖండచాపుతాళం)” అనే రమ్యకృతిని రచించేరు.
50వ మేళకర్త అయిన “నామనారాయణి రాగం” యొక్క నిర్వచనాత్మక స్వరావళి “ర-గు-ధ-ని” గా ఉంటుంది. నామనారాయణిరాగం “సంపూర్ణ-సంపూర్ణ” రాగం. నామనారాయణిరాగం యొక్క స్వరానుక్రమణిక ఈ దిగువ పద్ధతిలో ఉంటుంది:—
మంద్ర స—శుద్ధ రి—అంతర గ—ప్రతి మ—ప—శుద్ధ ధ—కైశికి ని—తారా స.
ఈ రాగంలో త్యాగయ్యగారి కృతులేవీ లభ్యం కావడం లేదు.
“సంగ్రహ చూడామణి గ్రంథం”లో చెప్పబడిన నామనారాయణిరాగాన్ని దీక్షితులవారి పద్ధతిలో “నామదేశి రాగం” అని అంటారు. ఇది “సంపూర్ణ-సంపూర్ణ” రాగం. దీక్షితస్వామి నామదేశిరాగంలో — “నర్మదాకావేరీతీరనిలయే ~ మణివలయే కలయే ॥నర్మదాకావేరీతీరనిలయే॥ (మిశ్రచాపుతాళం)” అనే అందమైన కృతిని కూర్పు చేసేరు.
51వ మేళకర్త ఐన “కామవర్ధిని రాగం” యొక్క విశిష్ట స్వరసంపుటి “ర-గు-ధ-ను” అని గమనించాలి. కామవర్ధిని రాగం “సంపూర్ణ-సంపూర్ణ” రాగం. కామవర్ధినిరాగ స్వరానుక్రమిణిక ఈ దిగువ ఉదహరించబడింది:—
మంద్ర స—శుద్ధ రి—అంతర గ—ప్రతి మ—ప—శుద్ధ ధ—కాకలి ని—తారా స.
కామవర్ధినిరాగాన్ని పూర్వం పంతువరాళిరాగం అని పిలిచేవారు. ఇప్పటికీ కొందరు పంతువరాళి రాగం అని పిలవడం పరిపాటే! అయితే 45వ మేళకర్త శుభపంతువరాళి రాగం సుప్రసిద్ధిని పొందిన తరువాత, 51వ మేళకర్తని కామవర్ధినిరాగం అని పిలవడమే సమంజసంగా పరిగణింపబడుతోంది. ప్రతిమధ్యమరాగమైన కామవర్ధినిరాగానికి శుద్ధమధ్యమరాగం మాయామాళవగౌళరాగం. ఉత్తర భారత సంగీత పద్ధతిలో ఉన్న “పూర్యాధనశ్రీరాగం” కామవర్ధినికి బాగా సన్నిహితమైన రాగం. కామవర్ధినిరాగం అమిత ప్రజాదరణని పొందిన ఒక మహారాగం.
కామవర్ధిని ప్రాచీనరాగాలలో ఒకటిగా భాసిల్లుతోంది. గ్రహభేదప్రక్రియని అనుసరిస్తే కామవర్ధిని రాగంలోని నిషాదమూర్ఛనద్వారా మొట్టమొదటి మేళకర్త ఐన “కనకాంగిరాగం” ఆవిష్కృతం ఔతుంది.
త్యాగరాజస్వామి కామవర్ధినిరాగంలో అనేక ప్రశస్తమైన మహామధుర కృతులను రచించేరు. “అందుండకనే వేగ వచ్చేనని నాపై ~ నాన బెట్టి పోరా! ॥అందుండకనే॥ (మిశ్రచాపుతాళం); అప్ప! రామభక్తి యెంతో గొప్ప రా! మా ॥అప్ప!॥ (రూపకతాళం); చూడరే! చెలులార! యమునా దేవి ~ సొగసెల్ల సంతోషమున ॥చూడరే!॥ (రూపకతాళం); నారదముని వెడలిన సుగుణాతిశయము వినరే! ॥నారదముని॥ (రూపకతాళం); నిన్నే నెర నమ్మినాను రా! ~ ఓ రామ! రామయ్య! ॥నిన్నే – – -॥ (రూపకతాళం); పరమ పావన! గుణశాలి! నన్ను ~ పాలింపవే వనమాలి! ॥పరమ పావన!॥ (మిశ్రచాపుతాళం); రఘువర! నన్ను మరవ తగునా? ॥రఘువర!॥ (ఆదితాళం); వాడేరా! (నా) దైవము ~ మనసా! ॥వాడేరా!॥ (ఆదితాళం); శంభో! మహాదేవ! ~ శంకర! గిరిజారమణ! ॥శంభో!॥ (రూపకతాళం); శివ! శివ! శివ! యనరాదా? ఓరీ! ~ భవభయబాధల నణచుకోరాదా? ॥శివ! శివ! శివ!॥ (ఆదితాళం); శోభానే! శోభానే! ॥శోభానే!॥ (రూపకతాళం); సారమే గాని యన్యమార్గ విచార మేటికే? ఓ మనసా! ॥సారమే గాని॥ (మిశ్రచాపుతాళం); సుందరతరదేహం ~ వందేsహం రామం! ॥సుందరతరదేహం॥ (ఆదితాళం)” అనే అద్భుతమైన రసమయకృతులను త్యాగయ్యగారు రచించేరు!
కామవర్ధినిరాగ జన్యమైన “మందారిరాగం” లో — “పరలోకభయము లేక ~ భవపాశ బద్ధులయ్యేరు ॥పరలోకభయము॥ (దేశాదితాళం” అనే ఒక కృతిని, “దీపకం రాగం” లో — “కళలనేర్చిన మును జేసినది ~ గాకయేమి? అరవైనాలుగు ॥కళలనేర్చిన॥ (దేశాదితాళం)” అనే ఒక కృతిని త్యాగయ్యగారు రచన చేయడం జరిగింది.
(సశేషము)