సంగీతం—నాదవేదం—62
04—09—2021; శనివారం.
ॐ
ఇప్పుడు ఎనిమిదవది అయిన “వసు(అష్టవసువులు)చక్రం” లోని ఆరు రాగాల పరిచయం చేసుకుందాం! ఈ చక్రంలోని మొదటిది, అంటే, 43వ మేళకర్త, “గవాంభోధి రాగం”. దీనిలో “ర-గి-ధ-న” స్వరాలు కీలకమైనవి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగం అయిన గవాంభోధిలోని స్వరప్రణాళిక ఈ దిగువ వివరింపబడిన విధంగా ఉంటుంది:—
మంద్రషడ్జం-శుద్ధరిషభం-సాధారణగాంధారం-ప్రతిమధ్యమం-పంచమం-శుద్ధధైవతం-శుద్ధనిషాదం -తారాషడ్జం.
43వ మేళకర్త ఐన ఈ గవాంభోధిరాగంలో త్యాగయ్యగారి కృతులు లభ్యం కావడం లేదు. గవాంభోధిరాగాన్ని దీక్షితులవారి పద్ధతిలో గీర్వాణిరాగం అని అంటారు. గీర్వాణిరాగం, మిశ్రచాపుతాళంలో దీక్షితస్వామివారు — “నమో నమస్తే! గీర్వాణి! ~ నాదబిందుకలాశ్రేణి! ॥నమో నమస్తే!॥” అనే కృతిని రచించేరు.
తరువాత 44వ మేళకర్తరాగం అయిన “భవప్రియరాగం” లో కీలకమైన స్వరాలు, “ర-గి-ధ-ని”. “సంపూర్ణ-సంపూర్ణ” రాగం అయిన భవప్రియరాగంలోని సప్తస్వరాల కూర్పు ఈ విధంగా ఉంటుంది:—
మంద్ర స- శుద్ధ రి-సాధారణ గ-ప్రతి మ-ప-శుద్ధ ధ-కైశికి ని-తారా స.
త్యాగరాజస్వామి భవప్రియరాగం, దేశాదితాళంలో, “శ్రీకాంత! నీ యెడ బలాతిబల ~ చెలంగగ లేదా? వాదా? ॥శ్రీకాంత!॥” అనే ఏకైకకృతిని రచించేరు.
దీక్షితులవారి పద్ధతిలో భవప్రియరాగాన్ని “భవాని రాగం” అని పిలుస్తారు. భవానిరాగం “షాడవ-షాడవ” రాగం. ఇది పంచమవర్జితరాగం. భవానిరాగం, రూపకతాళంలో దీక్షితస్వామి “జయతి శివా భవాని ~ జగజ్జనని నిరంజని ॥జయతి॥” అనే కృతిని రచించేరు.
(భవప్రియరాగజన్యమైన భవానిరాగంలో ౘాలా కాలం క్రితం త్యాగయ్యగారి కృతి ఒకటి ఆ కాలంలోని సంగీతసభలలో ఎక్కువగా పాడబడేదని, అది కాలక్రమంగా అంతరించిపోయి, కనీసం గ్రంథాలలోకూడా లభ్యం కావడం లేదని చరిత్రకారులు తెలియజేసేరు).
తరువాత 45వ మేళకర్తరాగం “శుభపంతువరాళి రాగం”. శుభపంతువరాళిలో కీలకమైన స్వరాలు “ర-గి-ధ-ను” అని గమనించాలి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగమైన శుభపంతువరాళి రాగంలో ఈ దిగువ స్వరావళియొక్క కూర్పు ఉంటుంది:—
మంద్ర స—శుద్ధ రి—సాధారణ గ—ప్రతి మ—ప—శుద్ధ ధ—కాకలి ని—తారా స.
త్యాగరాజస్వామి శుభపంతువరాళి రాగంలో, మిశ్రచాపుతాళంలో, “ఎన్నాళ్ళు యూరకే యుందువో జూతాము ~ ఎవరు అడిగేవారు లేరా? శ్రీరామ! ॥ఎన్నాళ్ళు॥” అనే కరుణరసభరిత కృతిని రచించేరు.
శుభపంతువరాళిరాగం ధైవతమూర్ఛన ద్వారా, గ్రహభేదపద్ధతిననుసరించి, “చలనాటరాగం” (36వ మేళకర్త) ఏర్పడుతుంది. దక్షిభారతసంగీతపద్ధతిలోని శుభపంతువరాళి రాగం, ఉత్తరభారతసంగీతపద్ధతిలోని “రాగ్ తోడి” ఒకే ఆరోహణ-అవరోహణ కలిగినవి. శుభపంతువరాళి కరుణరసప్రధానమైన రాగం.
ఈ శుభపంతువరాళి రాగాన్ని దీక్షితులవారి పద్ధతిలో “శివపంతువరాళి (సంపూర్ణ—సంపూర్ణ) రాగం” అని పిలుస్తారు. ఈ రెండు రాగాలు పేరులో వేరుగా ఉన్నా స్వరాల కూర్పులో అభేదంగానే ఉన్నాయి. దీక్షితస్వామివారు శివపంతువరాళి రాగంలో — “పశుపతీశ్వరం ప్రణౌమి సతతం ~ పాలితభక్తం సదా భజేsహం ॥పశుపతీశ్వరం॥ (ఆదితాళం); శ్రీసత్యనారాయణం ఉపాస్మహే నిత్యం ~ సత్యజ్ఞానానందమయం సర్వం విష్ణుమయం ॥శ్రీసత్యనారాయణం॥ (రూపకతాళం)” అనే రెండు అనుపమాన సౌందర్యమయ కృతులను ఆవిష్కరింపజేసేరు.
46వ మేళకర్తరాగమైన “షడ్విధమార్గిణి రాగం” లో కీలకమైన స్వరావళి “ర-గి-ధి-ని” గా గ్రహించాలి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగమైన షడ్విధమార్గిణి రాగం యొక్క స్వరక్రమం ఈ విధంగా ఉంటుంది:—
మంద్ర స—శుద్ధ రి—సాధారణ గ—ప్రతి మ—ప—చతుశ్శ్రుతి ధ—కైశికి ని—తారా స.షడ్విధమార్గిణిరాగంలో త్యాగయ్యగారి కృతులు ఏవీ లభించలేదు.
షడ్విధమార్గిణిరాగజన్యమైన “తీవ్రవాహిని” అనే రాగం ఒకటి ఉంది. తీవ్రవాహినిరాగం “ఉభయవక్ర సంపూర్ణ-సంపూర్ణ” రాగం. ఈ రాగంలో త్యాగరాజుగారు “సరిజేసి వేడుక జూచుట ~ సాకేతరామ! న్యాయమా? ॥సరిజేసి॥ (దేశాదితాళం)” అనే కృతికి సుందరాకృతిని యిచ్చేరు.
షడ్విధమార్గిణిరాగజన్యమైన “ఔడవ-ఔడవ” రాగం “స్తవరాజరాగం”. స్తవరాజరాగం దీక్షితులవారి పద్ధతిలో 46వ మేళకర్తరాగం. ఆరోహణలో “గ-ని” స్వరాలు వర్జితమైతే, అవరోహణలో “ప-రి” స్వరాలు వర్జ్యం.
దీక్షితస్వామి స్తవరాజరాగంలో, — “మధురాంబాం భజ రే! రే! మానస! ~ మదనజనకాది గురుగుహసేవిత ॥మధురాంబాం భజ రే!॥ (ఆదితాళం); స్తవరాజాదినుత! బృహదీశ! ~ తారయాశు మాం దయానిధే! ॥స్తవరాజాదినుత!॥ (మిశ్రచాపుతాళం)” అనే రెండు కృతులను రచించేరు.
47వ మేళకర్తరాగమైన “సువర్ణాంగి రాగం” కీలకస్వరావళి, “ర-గి-ధి-ను” గా పరిగ్రహించాలి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగమైన సువర్ణాంగిరాగంలో స్వరానుక్రమణిక ఈ దిగువ తెలియజేయబడుతోంది:—
మంద్ర స—శుద్ధ రి—సాధారణ గ—ప్రతి మ—ప—చతుశ్శ్రుతి ధ—కాకలి ని—తారా స.
సువర్ణాంగిరాగంలో కాని, దాని జన్యరాగాలలో కాని త్యాగయ్యగారి కృతులు లభ్యం కావడం లేదు.
దీక్షితులవారి పద్ధతిలో 47వ మేళకర్త పేరు “సౌవీరరాగం”. సౌవీర రాగం, “సంగ్రహ చూడామణి” గ్రంథం ప్రకారం, అంటే, 72 మేళకర్తరాగాల ప్రణాళికననుసరించి, 47వ మేళకర్త సువర్ణాంగిరాగ జన్యం. సౌవీరరాగం “సంపూర్ణ-షాడవ” రాగం. అవరోహణలో “పంచమం” వర్జితస్వరం.
దీక్షితస్వామి సౌవీరరాగంలో — “సరస సౌవీర రసవాదకరణ ~ సమస్తతర పుష్పవనాధిపతే! ॥సరస సౌవీర॥ (ఆదితాళం)” అనే ఏకైక కృతిని స్వరపరిచేరు.
ఇప్పుడు 48వ మేళకర్తరాగమైన “దివ్యమణి రాగం” గురించి పరిచయం చేసుకుందాం! దివ్యమణి రాగంలో “ర-గి-ధు-ను” కీలకస్వరాలుగా ఉంటాయి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగమైన దివ్యమణిలో స్వరానుక్రమణిక యొక్క ప్రణాళిక ఈ దిగువ సూచితమౌతోంది:—
మంద్ర స—శుద్ధ రి—సాధారణ గ—ప్రతి మ—ప—షట్ శ్రుతి ధ—కాకలి ని—తారా స.
త్యాగరాజస్వామి దివ్యమణిరాగం, ఆదితాళం లో, — “లీలగాను జూచు గుణశీలుల నా ~ పాల గల్గజేసి పాలింపుమయ్య! ॥లీలగాను – – -॥” అనే ఒక కృతిని వినిర్మించేరు.
48వ మేళకర్త, దివ్యమణిరాగజన్యమైన “జీవంతిని లేక విజయవసంత” రాగం “ఔడవ-ఔడవ” రాగం. ఆరోహణలో “రి-గ” వర్జ్యం. అవరోహణలో “ధ-రి” వర్జితస్వరాలు. త్యాగయ్యగారు ఈ రాగంలో — “నీ చిత్తము నా భాగ్యమయ్య ~ నిరుపాధికా! నీవాడనయ్య! ॥నీ చిత్తము – – -॥” అనే కృతిని దేశాదితాళంలో రచించేరు.
దీక్షితులవారి పద్ధతిలో 48వ మేళకర్త పేరు “జీవంతిక రాగం”. ఇది “సంపూర్ణ-షాడవ” రాగం. అవరోహణలో “ధ” వర్జితస్వరం. జీవంతికరాగంలో దీక్షితస్వామి — “బృహదీశ కటాక్షేణ ప్రాణినో జీవంతి ~ అహమహమిత్యాత్మరూప ॥బృహదీశ కటాక్షేణ॥ (రూపకతాళం)” అనే కృతిని ఒకదానిని రచించేరు.దీనితో వసుచక్రంలోని ఆరు జనక రాగాలు, వాటి ముఖ్య జన్యరాగాలు పరిచయం చేసుకోవడం జరిగింది.
(సశేషం).