సంగీతం—నాదవేదం—61
28—08—2021; శనివారం.
ॐ
40వ మేళకర్త పేరు “నవనీత(ం) రాగం”. ఈ రాగంలో “ర-గ-ధి-ని” స్వరసంపుటి ఉంటుంది. “సంపూర్ణ—సంపూర్ణ” రాగం అయిన నవనీతంలో పూర్తి స్వరవిన్యాసం ఈ దిగువ ఉదహరింపబడిన రీతిలో ఉంటుంది:—
మంద్రస్థాయి షడ్జం-శుద్ధ రిషభం-శుద్ధ గాంధారం-ప్రతి మధ్యమం-పంచమం-చతుశ్శ్రుతి ధైవతం- కైశికి నిషాదం-తారాస్థాయి షడ్జం.
త్యాగయ్యగారు “లేమిదెల్ప పెద్దలెవరు లేరో?” అనే ఒకే ఒక కృతిని నవనీతరాగంలో, ఆదితాళం లో రచించేరు.
ఈ నవనీత రాగాన్ని దీక్షితులవారి పద్ధతిలో “నభోమణిరాగం” అంటారు. నభోమణిరాగం”ఔడవ-సంపూర్ణ” రాగం. ఆరోహణలో “ధైవతం-నిషాదం” రెండూ వర్జితస్వరాలు. నభోమణి రాగం ఆరోహణలో వక్రసంచారం ఉంటుంది. “నభోమణి చంద్రాగ్నినయనం ~ నగజాసహిత బృహదీశ్వరం / నమామ్యహం సతతం ~ సతతం ॥నభోమణి॥ (మిశ్రచాపుతాళం); శ్రీనాథసోదరీం ~ తిరస్కరిణీం నమామి ॥శ్రీనాథసోదరీం॥ (రూపకతాళం)” అనే రెండు కృతులని దీక్షితస్వామివారు నభోమణిరాగంలో స్వరపరచడం జరిగింది.
*త్యాగరాజస్వామివారి పద్ధతిలో ఈ నభోమణిరాగం, “నవనీతరాగం” యొక్క జన్యరాగమై విలసిల్లుతోంది. ఈ నభోమణిరాగంలో, ఆదితాళంలో, “నా యెడ వంచన సేయకురా, రాఘవ! (ఓ రామ!) ~ నలుగురికై నమ్మలేదురా, శ్రీరామచంద్ర!” అనే రమ్యమైన కృతిని కూర్పు చేసేరు.
41వ మేళకర్త అయిన “పావనిరాగం” లో “ర-గ-ధి-ను-” అనే ప్రత్యేకస్వరసంపుటి ఉంటుంది. “సంపూర్ణ-సంపూర్ణ” స్వరావళి కలిగిన పావనిరాగంలోని స్వరాలు ఈ విధంగా ఉంటాయి:—
మంద్రస్థాయి షడ్జం—శుద్ధ రిషభం—శుద్ధ గాంధారం—ప్రతి మధ్యమం—పంచమం—చతుశ్శ్రుతి ధైవతం—కాకలి నిషాదం—తారాస్థాయి షడ్జం.
పావనిరాగంలో త్యాగయ్యగారి కృతులేవీ లభించడం లేదు. పావనిరాగాన్ని, దీక్షితులవారి పద్ధతిలో “కుంభినిరాగం” అని పిలుస్తారు. కుంభినిరాగం “సంపూర్ణ-షాడవ” రాగం. ఆరోహణలో అన్ని స్వరాలూ ఉన్నా, అవరోహణలో “ధైవతం” వర్జితస్వరం. ఆరోహణలో వక్రసంచారాలు ఉన్నాయి. కుంభినిరాగంలో దీక్షితులవారు “సచ్చిదానందమయ విజృంభిణీం ~ స్మరామ్యహం స్తనకనకకుంభినీం ॥సచ్చిదానందమయ విజృంభిణీం॥ (ఆదితాళం)” అనే మహిమాన్వితకృతిని రచించేరు.
41వ జనకరాగమైన పావనిరాగజన్యమైనది “చంద్రజ్యోతిరాగం”. చంద్రజ్యోతి “షాడవ—షాడవ” రాగం. ఆరోహణ, అవరోహణలలో “నిషాదం” వర్జితస్వరం.
త్యాగయ్యగారు చంద్రజ్యోతిరాగంలో, (సుప్రసిద్ధకృతి) “బాగాయెనయ్య! నీ మాయలెంతో, ~ బ్రహ్మకైన కోనియాడ తరమా? ॥బాగాయెనయ్య!॥ (దేశాదితాళం); శశివదన! భక్తజనావన! ~ శంకర! నే తాళగలనా? ॥శశివదన!॥ (ఆదితాళం)” అనే రెండు కృతులను కూర్చేరు.
ఈ 41వ మేళకర్త ఐన పావనిరాగజన్యమైన మరొక అప్రచలితరాగం, “విజయశ్రీ రాగం”. (ఈ రాగంలో, వర్తమానకాలంలో, శుద్ధగాంధారం బదులు సాధారణగాంధారం, ప్రయోగించబడుతూ ఉండడంవలన దీనిని “47వ మేళకర్త అయిన సువర్ణాంగి రాగం” యొక్క జన్యరాగంగా ఆధునిక సంగీతశాస్త్రజ్ఞులు పరిగణిస్తున్నారు.). విజయశ్రీరాగం “షాడవ—షాడవ” రాగం. ఇది, ఉభయ “ధైవత” వర్జిత రాగం.
విజయశ్రీరాగంలో త్యాగరాజస్వామి “వరనారద! నారాయణ- స్మరణానందానుభవము గల ॥వరనారద!॥ (ఆదితాళం)” అనే దివ్యకృతిని వెలయింపజేసేరు.
42వ మేళకర్తరాగం, “రఘుప్రియరాగం”, “ర-గ-ధు-ను” స్వరసముదాయం కలిగి ఉంటుంది. ఇది “సంపూర్ణ-సంపూర్ణ” రాగం. రఘుప్రియరాగంలో స్వరానుక్రమం ఈ విధంగా ఉంటుంది:—
మంద్రస్థాయి షడ్జం—శుద్ధ రిషభం—శుద్ధ గాంధారం—ప్రతి మధ్యమం—పంచమం—షట్ శ్రుతి ధైవతం—కాకలి నిషాదం—తారాస్థాయి షడ్జం.
రఘుప్రియరాగంలో త్యాగయ్యగారి కృతులు లభ్యం కాలేదు.
రఘుప్రియ రాగాన్ని దీక్షితులవారి పద్ధతిలో “రవిక్రియరాగం” అంటారు. ఇది “వక్రసంపూర్ణ-షాడవ” రాగం. అవరోహణలో “ధైవతం” వర్జితస్వరం. “72 మేళకర్త రాగ విధానం” లో రవిక్రియరాగాన్ని, “రఘుప్రియరాగం” యొక్క జన్యరాగంగా పరిగణించడం జరుగుతుంది. దీక్షితస్వామి రవిక్రియరాగం, ఆదితాళం లో, “హిమగిరికుమారి! ఈశ్వరి! ~ హేమాంబరి! హరిసోదరి! సుందరి! ॥హిమగిరికుమారి!॥” అనెడి కమనీయకృతిని కూర్చడం జరిగింది.
దీనితో సప్తమచక్రమైన “ఋషిచక్రం” పూర్తి అయ్యింది.
(సశేషం)