సంగీతం—నాదవేదం—60
21—08—2021; శనివారము.
ॐ
ఇప్పటికి 72 మేళకర్తరాగాలలో, 36 మేళకర్తరాగాలని పూర్తి చేసుకున్నాం. అంటే, మనం ముందుగా చెప్పుకున్నట్లు “శుద్ధమధ్యమ రాగాలు 36” పూర్తి చేసుకున్నాం! “ప్రతిమధ్యమ రాగాలు 36” వాటి ప్రధాన జన్యరాగాలు ఇప్పుడు పరిచయం చేసుకుంటే జనక-జన్య రాగాలని గురించి ప్రాధమిక పరిజ్ఞానం మనం సేకరించుకున్నట్లు అనుకోవచ్చు.
37వ మేళకర్త “సాలగం రాగం” లేక దీక్షితులవారి పద్ధతిలోని “సౌగంధిని రాగం” (ఔడవ – సంపూర్ణం) సంపూర్ణ-సుంపూర్ణ రాగం. ఈ రాగంలో ఉండే స్వరాల సంపుటి ఈ దిగువ ఉదహరించబడిన రీతిలో ఉంటాయి:—
మంద్రస్థాయి షడ్జం—శుద్ధరిషభం—శుద్ధగాంధారం—ప్రతిమధ్యమం—పంచమం—శుద్ధధైవతం— శుద్ధనిషాదం—తారాస్థాయి షడ్జం.
సౌగంధిని రాగంలో దీక్షితులవారు “కామకోటిపీఠవాసిని సౌగంధిని ~ మామవ గురుగుహజనని నిరంజని ॥కామకోటిపీఠవాసిని॥ (ఆదితాళం)” అనే రమ్యకృతిని రచించేరు.
38వ మేళకర్త “జలార్ణవం రాగం” (సంపూర్ణ-సంపూర్ణ రాగం), లేక దీక్షితులవారి పద్ధతిలోని “జగన్మోహనం రాగం” (షాడవ – సంపూర్ణం) లో స్వరాలని తెలుసుకుందాం:—
మంద్రస్థాయి షడ్జం—శుద్ధరిషభం—శుద్ధగాంధారం—ప్రతిమధ్యమం—పంచమం—శుద్ధధైవతం— కైశికినిషాదం—తారాస్థాయి షడ్జం.
దీక్షితులవారు జగన్మోహనం రాగంలో “శ్రీవిద్యారాజగోపాలం భజేsహం ~ శ్రీరుక్మిణీ సత్యభామా సహిత దివ్యదేహం ॥శ్రీవిద్యారాజగోపాలం॥ (త్రిస్ర ఏక తాళం)” అనే కృతిని కూర్పు చేసేరు.
39వ మేళకర్త “ఝాలవరాళి రాగం” (సంపూర్ణ-సంపూర్ణ రాగం), లేక దీక్షితులవారి రీతిలో “ధాలివరాళి రాగం” (వక్రసంపూర్ణ-సంపూర్ణ రాగం) లోని స్వరసంపుటిని తెలుసుకుందాం:—
మంద్రస్థాయి షడ్జం—శుద్ధరిషభం—శుద్ధగాంధారం—ప్రతిమధ్యమం—పంచమం—శుద్ధధైవతం— కాకలినిషాదం—తారాస్థాయి షడ్జం.
39వ మేళకర్తకి జన్యరాగమైన “వరాళిరాగం” మొదటి ఘనరాగపంచకంలో ఒక రాగం. ఇది కరుణరసప్రధానమైన రాగం. ఇది సంపూర్ణ-సంపూర్ణ రాగం.
వరాళిరాగంలో త్యాగరాజుగారు — “ఇందుకేమి సేతుమమ్మ? కృష్ణు-డెంతో మాటలాడెనమ్మ ॥ఇందుకేమి సేతుమమ్మ?॥ (మిశ్రచాపుతాళం); ఈ మేను కలిగినందుకు సీతారామ! ~ నామమే పల్కవలెను! ॥ఈ మేను – – -॥ (ఆదితాళం); ఏటి జన్మమిది? హా! ఓ రామ! ॥ఏటి జన్మమిది?॥ (మిశ్రచాపుతాళం); కనకన రుచి రా! ~ కనక వసన! నిన్ను ॥కనకన రుచి రా!॥ (ఆదితాళం); కరుణ ఏలాగంటే నీ విధమే కల్యాణసుందర రామ! ॥కరుణ – – -॥ (ఆదితాళం); నోరేమి? శ్రీరామ! నిన్నాడ ॥నోరేమి? శ్రీరామ!॥ (ఆదితాళం); పాహి పరమాత్మ! ~ సతతం మాం ॥పాహి పసమాత్మ!॥ (ఆదితాళం); పాహి రమారమణ! మాం ~ పాహి సద్గుణగణ! హరే! రామ! ॥పాహి రమారమణ!॥ (ఆదితాళం); భవసన్నుత! నాదఘమెంత? ఘనీభవమో ॥భవసన్నుత!॥ (ఆదితాళం); మరకత మణివర్ణ! రామ! నన్ను ~ మరవక నా యన్న! ॥మరకతమణివర్ణ!॥ (ఆదితాళం); వద్దయుండేదే బహు మేలు! ~ వారిజాక్ష! ॥వద్దయుండేదే – – -॥ (మిశ్రచాపుతాళం); శ్రీరామ! జయరామ! శ్రితజన రిపుభీమ! ~ శృంగార గుణధామ! ఓ రామ! ॥శ్రీరామ!॥ (మిశ్రచాపుతాళం); శ్రీరామ! శ్రీరామ! జితకామ! గతకామ! ॥శ్రీరామ!॥ (ఆదితాళం); ధరను నీ సరి దైవము ~ గానరా! రఘువరా! ॥ధరను – – -॥ (ఆదితాళం)” అనెడి వివిధ కృతులను వెలయించేరు.
దీక్షితులవారు వరాళి రాగం లో — “లంబోదరాయ నమస్తే శ్రీ ॥లంబోదరాయ॥ (ఖండచాపుతాళం); మామవ మీనాక్షి రాజమాతంగి ~ మాణిక్య వల్లకీ పాణి మధురవాణి వరాళి వేణి ॥మామవ మీనాక్షి!॥ (మిశ్రచాపుతాళం); శేషాచలనాయకం భజామి వి-శేష ఫలప్రదాయకం ॥శేషాచలనాయకం॥ (రూపకతాళం)” అనే కృతులను రచించేరు.
శ్యామాశాస్త్రిగారు వరాళిరాగంలో — “కరుణ జూడవమ్మా! వినమ్మా! ~ శ్రితజన కల్పవల్లి! మా తల్లి! ॥కరుణ జూడవమ్మా!॥ (మిశ్రచాపుతాళం); కామాక్షి! బంగారు కామాక్షి! ~ నన్ను బ్రోవవే! ॥కామాక్షి॥ (మిశ్రచాపుతాళం)” అనే రెండు కృతులను రచించినట్లు తెలియవచ్చింది.
వరాళిరాగంలో ఇతర వివిధ వాగ్గేయకారులు అనేకమైన అద్భుత రచనలని చేసేరు.
(సశేషం)