సంగీతం—నాదవేదం—59
14—08—2021; శనివారం
ॐ
34వ జనకరాగం మహనీయమైన సరస్వతీదేవికి పరమప్రియమైన “వాగధీశ్వరి రాగం”. ఈ వాగధీశ్వరి రాగం “సంపూర్ణ-సంపూర్ణ” రాగం. “రు-గు-ధి-ని” స్వరసంపుటి వాగధీశ్వరి వ్యక్తిత్వాన్ని సకలంగా సువ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఈ రాగంయొక్క పూర్ణరూపానికి అద్దంపట్టే స్వరస్వరూపాన్ని పరికిద్దాం:—
మంద్రస్థాయి షడ్జం—షట్ శ్రుతి రిషభం—అంతర గాంధారం—శుద్ధ మధ్యమం—పంచమం— చతుశ్శ్రుతి ధైవతం—కైశికి నిషాదం—తారాస్థాయి షడ్జం.
వాగధీశ్వరి రాగంలో త్యాగరాజస్వామివారు వారికి తురీయస్థితిలో కలిగిన శ్రీరామచంద్రస్వామి వారు తమభక్తులు, నాదయోగి ఐన త్యాగయ్యగారికి అనుగ్రహించిన సాక్షాత్కారదర్శనానుభవాన్ని వర్జించే చివరి కృతిగా చెప్పబడే “పరమాత్ముడు వెలిగే ముచ్చట ~ బాగ తెలుసుకోరె ॥పరమాత్ముడు॥ (ఆదితాళం)” లో సంగీతకృతిబద్ధం చేసేరు.
వాగధీశ్వరికి జన్యరాగమైన “ఛాయానాట రాగం” గురించి పరిచయం చేసుకోవాలి. ఈ రాగం “ఔడవ—షాడవ” రాగం. ఆరోహణలో “గ-ధ” రెండు వర్జ్యస్వరాలు. అవరోహణలో “గ” మాత్రమే వర్జితస్వరం. అయితే, ఆరోహణలోను, అవరోహణలోను రెండింటిలోను వక్రసంచారాలు ఉన్నాయి. ఛాయానాటరాగంలో, ఆదితాళంలో త్యాగరాజస్వామివారు “ఇది సమయమురా! ఇనకులతిలక! ॥ఇది సమయమురా!॥” అనే కృతిని వెలయించేరు.
దీక్షితస్వామివారి పద్ధతిలో 34వ మేళకర్తరాగం పేరు “భోగచ్ఛాయానాట రాగం” అని చెప్పబడింది. కాని ఈ రాగాన్ని 33వ మేళకర్తరాగమైన “గంగాతరంగిణి రాగం” యొక్క జన్యరాగంగా పరిగణింపబడడం మనం ఇంతకు గంగాతరంగిణి రాగవిశ్లేషణలో తెలుసుకున్నాం. ఇటువంటి వివరాలు గురుముఖతః తెలుసుకోవలసిందే!
35వ మేళకర్తరాగం సంపూర్ణ-సంపూర్ణ రాగం. దీని పేరు “శూలినిరాగం”. దీని స్వరూప నిర్ధారణ స్వరసంపుటి “రు-గు-ధి-ను”. ఈ రాగ సంపూర్ణ స్వరసంపుటి ఈ విధంగా ఉంటుంది:—
మంద్రస్థాయి షడ్జం—షట్ శ్రుతి రిషభం—అంతర గాంధారం—శుద్ధ మధ్యమం—పంచమం— చతుశ్శ్రుతి ధైవతం—కాకలి నిషాదం—తారాస్థాయి షడ్జం.
35వ మేళకర్త అయిన శూలిని రాగంలో త్యాగయ్యగారు “ప్రాణనాథ! బిరాన బ్రోవవే! ॥ప్రాణనాథ॥” అనే ఏకైక కృతిని దేశాదితాళంలో కూర్చేరు.
శూలినిరాగజన్యమైన “గానవారిధి లేక గానవార్ధి” రాగంలో, ఆదితాళంలో, త్యాగరాజస్వామివారు, “దయజూచుటకిది వేళరా! దాశరథీ! ॥దయజూచుటకిది – – -॥ అనే కృతిని కూర్చేరు.
దీక్షితులవారి పద్ధతిలో శూలినిని, “శైలదేశాక్షి రాగం” అని అంటారు. శైలదేశాక్షిరాగంలో దీక్షితస్వామి “శైలరాజకుమారీ! శంకరి! ~ శివే! పాహి మాం అంబికే! ॥శైలరాజకుమారీ!॥ (ఆదితాళం); శ్రీశూలినీ! శ్రితపాలినీ! జీవేశ్వరైక్యశాలినీ! ~ స్మరచిత్త బ్రహ్మకపాలినీ! శివచిన్మాలినీ! భవఖేలినీ! ॥శ్రీశూలినీ!॥ (ఆదితాళం)” అనే రెండు రమణీయ కృతులని రచించేరు.
36వ మేళకర్త రాగం “చలనాటరాగం”. ఇది సంపూర్ణ-సంపూర్ణ రాగం. “రు-గు-ధు-ను” ఈ రాగాన్ని నిర్వచించే స్వరాల కూర్పు. దీని సంపూర్ణస్వరసంపుటి పరిశీలిద్దాం:—
మంద్రస్థాయి షడ్జం—షట్ శ్రుతి రిషభం—అంతర గాంధారం—శుద్ధ మధ్యమం—పంచమం— షట్ శ్రుతి ధైవతం—కాకలి నిషాదం—తారాస్థాయి షడ్జం.
చలనాట రాగ జన్యమైన మొదటి ఘనపంచక రాగలలో మొట్టమొదటిది “నాట రాగం”. నాటరాగం సంపూర్ణ-ఔడవ రాగం. ఆరోహణలో అన్ని స్వరాలు ఉంటాయి. అవరోహణలో “ధ-గ” రెండూ వర్జ్యస్వరాలే! “స-రి-గ-మ-ప-ధ-ని-స —— స-ని-ప-మ-రి-స” అనేవి ఆరోహణ-అవరోహణలు. ఇది ఉపాంగరాగం. జంట స్వరాల ప్రయోగాలు రాగసౌందర్యాన్ని శోభింపజేస్తాయి. సంగీతలోకంలో వాడుకలో — “ఆది నాట – అంత్య సురటి” అనే సామెత బాగా ప్రచారంలో ఉంది. అందువలన సంగీతసభల ప్రారంభం నాటరాగం తోను, అంతం సురటి రాగం తోను చేయడం పరిపాటిగా వస్తూన్న ఆచారంగా చెప్పవచ్చు. నాగ(ద)స్వరవిద్వాంసులు ప్రాచీన దేవాలయాలలో క్షేత్రదైవంకోసం చేసే వివిధ సేవలకి “వివిధ మల్లారి” ప్రక్రియలని ప్రయోగించడంలో నాటరాగం, గంభీరనాటరాగం ఎక్కువగా పాలు పంచుకోవడం జరుగుతుంది.
త్యాగరాజస్వామి తమ ఘనరాగపంచకకృతులలో మొదటి కృతి అయిన సుప్రసిద్ధ “జగదానందకారకా! జయ జానకీప్రాణనాయకా! ॥జగదానందకారకా!॥ (ఆదితాళం)” ని, నాటరాగంలోనే స్వరపరచడం జరిగింది. నాటరాగంలో వారి మరొక కృతి “నిన్నే భజన సేయువాడను ॥నిన్నే భజన – – -॥ (ఆదితాళం)” కూడా బాగా ప్రసిద్ధిని పొందింది.
దీక్షితస్వామివారు నాటరాగంలో, “మహాగణపతిం మనసా స్మరామి ~ వసిష్ఠవామదేవాది వందిత ॥మహాగణపతిం॥ (చతురశ్ర ఏక తాళం); పరమేశ్వర! జగదీశ్వర! శంకర! ~ పాహి మాం ప్రణతార్తిహర! శ్రీ ॥పరమేశ్వర॥ ఆదితాళం); పవనాత్మజాగచ్ఛ! పరిపూర్ణస్వచ్ఛ! ~ పరమాత్మపుచ్ఛ! పాహి మాం జయ! జయ! ॥పవనాత్మజాగచ్ఛ!॥ (ఖండచాపుతాళం); స్వామినాథ! పరిపాలయాశు మాం ~ స్వప్రకాశ! వల్లీశ! గురుగుహ! దేవసేనేశ! ॥స్వామినాథ!॥ (ఆదితాళం)” అనే నాలుగు దివ్యకృతులను విరచించేరు.
శ్యామాశాస్త్రివర్యులు నాటరాగంలో — “పాహి మాం శ్రీరాజరాజేశ్వరి! అంబ! పాహి మాం ~ శ్రీరాజరాజేశ్వరి! శ్రీరాజరాజేశ్వరి! శ్రీరాజరాజేశ్వరి! ॥పాహి మాం॥ (రూపకతాళం)” అనే రమణీయకృతిని రచించేరు.
(సశేషం)