సంగీతం—నాదవేదం—58
07—08—2021; శనివారము.
ॐ
ఐదవది అయిన “బాణచక్రం” లోని చివరి మేళకర్త రాగం సంఖ్య:30. 30వ మేళకర్తరాగం అయిన “నాగానందిని రాగం” గురించి ఇప్పుడు పరిచయం చేసుకుందాం! ఈ రాగం లక్షణం నిర్వచించే స్వరసంపుటిని సాంకేతికంగా “రి—గు—ధు—ను” అని చెప్పాలి. అప్పుడు పూర్తి స్వర సంపుటిని ఈ విధంగా విశదం చేయవచ్చు:—
మంద్రస్థాయి షడ్జం—చతుశ్శ్రుతి రిషభం—అంతర గాంధారం—శుద్ధ మధ్యమం—పంచమం—షట్ శ్రుతి ధైవతం—కాకలి నిషాదం—తారాస్థాయి షడ్జం.
30వ మేళకర్త రాగమైన నాగానందిని “సంపూర్ణ—సంపూర్ణ” రాగం. ఈ రాగంలో త్యాగరాజస్వామి “సత్తలేని దినములు వచ్చెనా? ॥సత్తలేని॥ (ఆదితాళం)” అనే ఏకైక కృతిని రచించినట్లు తెలుస్తోంది.
నాగానందిని రాగజన్యమైన అప్రచలితరాగం “గంభీరవాణి రాగం” షాడవ-షాడవ రాగం. దీని ఆరోహణలోరిషభస్వరం వర్జ్యం. అవరోహణలో నిషాదస్వరం వర్జ్యం. ఆరోహణలో వక్రసంచారం ఉంటుంది. ఈ రాగంలో త్యాగయ్యగారు “సదా మదిన్దలతు గదరా! ~ ముదాస్పదా! నగజాధిపతే! ॥సదా మదిన్దలతు॥ (దేశాదితాళం)” అనే అందమైన కృతిని శంకరభగవానుని ఉద్దేశించి రచించేరు.
దీక్షితస్వామివారి మేళకర్త (ప్రాచీన) పద్ధతిలో దీనిని (72 మేళకర్తరాగాల పద్ధతిలోని “నాగానందిని” రాగాన్ని), “నాగాభరణం రాగం” అని పిలుస్తారు. ఈ రాగంలో దీక్షితులవారు “నాగాభరణం నాగజాభరణం నమామి భయహరణం భవతరణం ॥నాగాభరణం॥ (ఆదితాళం)” అనే ఏకైకకృతిని విరచించేరు. అంతేకాక, ఈ జనకరాగ జన్యమైన “సామంత రాగం” లో “ప్రణతార్తిహరాయ నమస్తే వర ~ ధర్మసంవర్ద్ధనీ సహితాయ ॥ప్రణతార్తిహరాయ॥ (ఆదితాళం); విశ్వనాథేన రక్షితోsహం ~ విశాలాక్షీసమేతేన ॥విశ్వనాథేన రక్షితోsహం॥ (ఆదితాళం)” అనే రెండు తలమానికమైన కృతులను కూర్చేరు.
అన్నమాచార్యులవారి కీర్తనలలోని 150 కి పైగా ఉన్న సంగీతరచనలు “సామంతరాగం” లో కూర్చబడ్డాయి అని తెలుసుకుంటే, సామంరాగ రంజకత్వ ప్రశస్తి మనకి తేటతెల్లం ఔతుంది.
బాణచక్రం పూర్తి అయ్యింది కనుక మనం “ఋతుచక్రం” లోని జనక-జన్య రాగాలని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం!
ఋతుచక్రంలోని మొదటి రాగం, అంటే, 31వ మేళకర్తరాగం పేరు “యాగప్రియరాగం”. ఇది “సంపూర్ణ ~ సంపూర్ణ” రాగం. యాగప్రియరాగ స్వరూపం నిర్వచించే ప్రధాన స్వర సంపుటి ఈ విధంగా ఉంటుంది: “రు-గు-ధ-న”. ఈ రాగంలో మొత్తం స్వరాల కూర్పు ఇలాగ ఉటుంది:—
మంద్రస్థాయి షడ్జం—షట్ శ్రుతి రిషభం—అంతర గాంధారం—శుద్ధ మధ్యమం—పంచమం— శుద్ధ ధైవతం—శుద్ధ నిషాదం—తారాస్థాయి షడ్జం.
యాగప్రియరాగంలో త్యాగయ్యగారి కృతులు ఏవీ లభించడంలేదు.
యాగప్రియరాగాన్ని దీక్షితులవారి పద్ధతిలో “కలా(ళా)వతి రాగం” అని పిలుస్తారు. (గమనిక:—16వ మేళకర్త అయిన చక్రవాకరాగ జన్యరాగమైన కళావతిరాగం పూర్తిగా వేరే రాగం.). దీక్షితులవారి కలావతి రాగంలో “కలావతీ కమలాసనయువతీ ~ కల్యాణం కలయతు సరస్వతీ ॥కలావతీ॥ (ఆదితాళం) అనే ఏకైకకృతి లభ్యం ఔతోంది.
*32వ మేళకర్త రాగం అయిన “రాగవర్ధ(ర్ధి)ని రాగం” సంపూర్ణ—సంపూర్ణ రాగం. దీని నిర్వచనాత్మక స్వరసంపుటి: “రు-గు-ధ-ని”. ఈ రాగంలోని స్వరాల కూర్పు ఈ దిగువ రీతిలో ఉంటుంది:—
మంద్రస్థాయి షడ్జం—షట్ శ్రుతి రిషభం—అంతర గాంధారం—శుద్ధ మధ్యమం—పంచమం— శుద్ధ ధైవతం—కైశికి నిషాదం—తారాస్థాయి షడ్జం.
ఈ మేళకర్త రాగంలో త్యాగరాజస్వామి కృతులు ఏమీ దొరకడం లేదు.
రాగవర్ధని రాగాన్ని దీక్షితులవారి పద్ధతిలో “రాగచూడామణి రాగం” అని పిలుస్తారు. రాగాచూడామణిలో దీక్షితస్వామివారు “శ్వేతగణపతిం వందే వా—మదేవప్రతిపాద్యం అనాద్యం ॥శ్వేతగణపతిం॥ (త్రిపుటతాళం)” అనే ఒకే ఒక కృతిని రచించేరు.
33వ మేళకర్త ఐన “గాంగేయభూషణి రాగం” సంపూర్ణ-సంపూర్ణ రాగం. దీని స్వరూప నిర్ధారక స్వరసంపుటి: “రు-గు-ధ-ను”. ఈ రాగంలో స్వరాల మేళవింపు ఇలాగ కూర్చబడి ఉంటుంది:—
మంద్రస్థాయి షడ్జం—షట్ శ్రుతి రిషభం—అంతర గాంధారం—శుద్ధ మధ్యమం—పంచమం— శుద్ధ ధైవతం—కాకలి నిషాదం—తారాస్థాయి షడ్జం.
త్యాగయ్యగారు గాంగేయభూషణి రాగంలో “ఎవ్వరే? రామయ్య! నీ సరి ॥ఎవ్వరే?॥ (దేశాదితాళం)” అనే కృతిని రచించేరు.
*ఈ గాంగేయభూషణి రాగం, దీక్షితులవారి శాస్త్రానుసారంగా “గంగాతరంగిణి రాగం” అనే పేరుతో ప్రచారం పొందింది. దీక్షితులవారు గంగాతరంగిణి రాగంలో, రూపకతాళంలో, “వరదరాజ! అవావ ~ వాంఛితాధికఫలప్రద!” అనే ఏకైకకృతిని రచించేరు.
33వ మేళకర్త జన్యమైన “మనోహరి లేక కమలామనోహరి రాగం” ఔడవ-షాడవ రాగం. ఆరోహణ లో “రి-ధ” వర్జ్య స్వరాలు. అవరోహణలో “రి” వర్జ్యస్వరం. (త్యాగరాజస్వామి మొదలైన మహామహులు ఈ రాగాన్ని “రిషభస్వరవర్జిత రాగం” కనుక, “27వ మేళకర్త ఐన “సరసాంగి రాగం” జన్యంగా పరిగణించడం జరిగింది). ఈ రాగంలో దీక్షితవర్యులు సుప్రసిద్ధమైన “కంజదళాయతాక్షి! కామాక్షి! ~ కమలామనోహరి! త్రిపురసుందరి! ॥కంజదళాయతాక్షి!॥ (ఆదితాళం); శంకరమభిరామీమనోహరం ~ శశిధరమమృతఘటేశ్వరం భజేsహం ॥శంకరమభిరామీమనోహరం॥ (రూపకతాళం)” అనే రెండు కృతులను రచించేరు.
33వ మేళకర్త జన్యమైన “భోగఛాయానాట రాగం” లో దీక్షితస్వామి “భోగఛాయానాటకప్రియే! ~ బోధం దేహి! బృహదీశజాయే! ॥భోగఛాయానాటకప్రియే!॥ (ఆదితాళం)” అనే ఒక కృతిని రచించేరు.
(సశేషము)