సంగీతం—నాదవేదం—57
31—07—2021; శనివారము.
ॐ
శంకరాభరణరాగంలో తరువాయి రాగం ఒక అపూర్వ లేక అపరిచిత రాగం అయిన వివర్ధని లేక వివర్ధిని రాగం. ఇది “ఔడవ— సంపూర్ణ” రాగం. ఈ రాగం యొక్క ఆరోహణ “ధైవత – నిషాద” వర్జితమయిన “స-రి-గ-రి-మ-ప-స” అనే వక్రసంచారంతో ఉంటుంది. అవరోహణ శంకరాభరణం లో వలెనే “స-ని-ధ-ప-మ-గ-రి-స” అను స్వరప్రయోగంతో ఉంటుంది. ఈ రాగంలో త్యాగయ్యగారి “వినవే! ఓ మనసా! ~ వివరము నే తెల్పెద ॥వినవే!॥ (రూపకతాళం)” అనే ఒకే ఒక కృతి సంగీత గాన/వాద్య సభలలో అప్పుడప్పుడు వినబడుతూ ఉంటుంది.
(కొన్ని గ్రంథాలలో త్యాగయ్యగారి మరొక అపూర్వకృతి అయిన “అభిమానమెన్నడు గల్గురా? ~ అనాథుడైన నాదుపై నీకు ॥అభిమానమెన్నడు – – – ॥ (ఆదితాళం)” కూడా వివర్ధ(ర్ధి)ని రాగ కృతిగా చెప్పబడింది. కాని ఈ కృతి 28వ మేళకర్త ఐన “హరికాంభోజి” రాగజన్యమైన “కుంజరి రాగం” అనే అపరిచిత రాగ కృతిగా అధికసంఖ్యలో శాస్త్రకారులు ఉదహరించేరు. కుంజరిరాగం “చతుస్స్వరి—సంపూర్ణ” రాగం. ఆరోహణలో “గ-ధ-ని” అనే మూడు వర్జిత స్వరాలు. “స-రి-మ-ప-స ~ స-ని-ధ-ప-మ-గ-రి-స” ఆరోహణ-అవరోహణలతో ఈ రాగం ఉంటుంది. దీనిలోని స్వరాలు హరికాంభోజి జనకరాగ స్వరాలై ఉండడం గమనార్హం).
ఆ తరువాత వివరించుకొనవలసిన రక్తిరాగం, “శుద్ధసావేరి రాగం”. ఇది “ఔడవ—ఔడవ” రాగం. ఈ రాగం ఉపాంగరాగం. ఈ రాగంలో “గ-ని” వర్జితస్వరాలు. “షడ్జం-చతుశ్శ్రుతి రిషభం-శుద్ధ మధ్యమం-పంచమం-చతుశ్శ్రుతి ధైవతం” శుద్ధసావేరిలో ఉంటాయి. ఇది సంపూర్ణ మూర్ఛన కారక రాగం. “గ్రహభేద ప్రక్రియ” ద్వారా శుద్ధసావేరి రాగంలోని “రి-మ-ప-ధ” స్వరాలు వరుసగా “ఉభయరవిచంద్రిక—మోహన—మధ్యమావతి—హిందోళం” రాగాల ఆవిర్భావానికి అవకాశం కలిగిస్తాయి. దీనిలో జంటస్వరాల ప్రయోగం, దాటు స్వరాల ప్రయోగం అందాన్నిస్తాయి. దీక్షితులవారి పద్ధతిలో శుద్ధసావేరి రాగాన్ని “దేవక్రియ రాగం” అని పిలుస్తారు. ఉత్తరాభారత సంగీతపద్ధతిలో శుద్ధసావేరిని “రాగ్ దుర్గ్” లేక “దుర్గ రాగం” అని పిలుస్తారు. ఈ రాగంలోని స్వరసముదాయనిర్మాణం చైనా, వియత్నాం, ఇండోనీషియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల సంగీత పద్ధతులలో బాగా ప్రచలితమై ఉందని శాస్త్రకారులు చెపుతారు.
త్యాగరాజస్వామి శుద్ధసావేరి రాగంలో — “ఒరుల నాడుకో వలసిన దేమి? ~ పరమపావన! శ్రీరామ! ॥ఒరుల – – – ॥ (ఆదితాళం); కాలహరణమేలరా? హరే! ~ సీతారామ! ॥కాలహరణమేలరా?॥ (రూపకతాళం); దారిని (దరిని) తెలుసుకొంటి త్రిపురసుందరి! నిన్నే శరణంటి ॥దారిని – – ॥ (ఆదితాళం); నీకెవరి బోధన ॥నీ – – – ॥ (ఆదితాళం); లక్షణములు గల రామునికి ప్రదక్షిణమొనరింతాము రారే! ॥లక్షణములు – – – ॥ (ఆదితాళం)” అనెడి కృతులని రచించేరు.
దీక్షితులవారు శుద్ధసావేరి రాగంలో అంటే దీక్షితస్వామి సంగీతశాస్త్రపరిభాషలో “దేవక్రియ రాగం” లో — “లలితాంబికాం చింతయామ్యహం ~ శ్రీగురుగుహపూజిత పరాంబికాం ॥లలితాంబికాం॥ (ఆదితాళం); మధురాంబా సంరక్షతు మాం శ్రీమను ~ త్రికోణరూపిణీ త్రిలోచనీ ॥మధురాంబా॥ (ఆదితాళం); శ్రీగురుగుహ తారయాశు మాం (శరవణభవ) ~ సురపతి శ్రీపతి రతిపతి వాక్పతి క్షితిపతి పశుపతి సేవిత ॥శ్రీగురుగుహ॥ (రూపకతాళం); శ్రీవటుకనాథ శివసంజాత ~ జీవదయాకర డమరు భాస్వర ॥శ్రీవటుకనాథ॥ (మిశ్రచాపుతాళం); సంధ్యాదేవీం సావిత్రీం వర ~ గాయత్రీం సరస్వతీం భజేsహం ॥సంధ్యాదేవీం॥ (ఆదితాళం)” అనే మహనీయ సంగీత రచనలని లోకానికి ప్రసాదించేరు. దేవక్రియరాగం దీక్షితులవారి 28వ మేళకర్తజన్యం. (దీక్షితులవారి పద్ధతిలోని శుద్ధసావేరిరాగం పూర్తిగా వేరే రాగం.)
సర్వశ్రీ మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, ముత్తయ్య భాగవతర్, పాపనాశం శివన్, పురందరదాసర్, స్వాతితిరునాళ్ మహారాజా, ఉపనిషద్బ్రహ్మయోగి, మైసూర్ వాసుదేవాచార్, వేదనాయకం పిళ్ళై, పెరియసామి తూరన్ మొదలైన వాగ్గేయకారులు శుద్ధసావేరిరాగంలో రచనలు చేసేరు.
చివరిగా మనం తెలుసుకొనబోయే శంకరాభరణరాగం యొక్క జన్యరాగం సుప్రసిద్ధమైన “హంసధ్వని రాగం”. హంసధ్వనిరాగం “ఔడవ — ఔడవ” రాగం. ఆరోహణ – అవరోహణ లలో “మ – ధ” స్వరాల ప్రయోగం వర్జితం. “షడ్జం-చతుశ్శ్రుతి రిషభం- అంతర గాంధారం-పంచమం- కాకలి నిషాదం” స్వరాలు హంసధ్వనిరాగంలో ఉంటాయి. జంటస్వరాల ప్రయోగాలు, దాటుస్వరాల ప్రయోగాలు హంసధ్వనిరాగ సౌందర్యం ఇనుమడింపజేస్తాయి. ఈ రాగాన్ని ముద్దుస్వామి దీక్షితులవారి తండ్రిగారైన రామస్వామి దీక్షితులవారు సృజించినట్లు చెపుతారు. ఇది ఉపాంగరాగం. జీవచైతన్యాన్ని సమర్థవంతంగా పరిపుష్టం చేయగలిగిన మహోన్నతరాగరాజం.
త్యాగరాజస్వామి హంసధ్వనిరాగంలో — “రఘునాయకా! నీ పాదయుగ ~ రాజీవముల నే విడజాల శ్రీ ॥రఘునాయకా!॥ (దేశాదితాళం); శ్రీరఘుకులమందు బుట్టి (నీవు) ~ సీతను చేకొనిన రామచంద్ర! ॥శ్రీరఘుకులమందు॥ (దేశాదితాళం)” అనే రెండు కృతులను విరచించేరు. (అభీష్టవరద! అనే ఆదితాళకృతి హంసధ్వనిరాగంలో ఒకటి త్రాగయ్యగారిది ఉన్నట్లు ఒక గ్రంథంలో చెప్పబడింది).
దీక్షితస్వామి హంసధ్వనిరాగంలో — “పార్వతీపతిం ప్రణౌమి సతతం ఆశ్రితజనమందారం శశిధరం ॥పార్వతీపతిం॥ (ఆదితాళం); వాతాపిగణపతిం భజేsహం ~ వారణాస్యం వరప్రదం ॥వాతాపిగణపతిం॥ (ఆదితాళం)” అనే రెండు మహనీయసంగీతరచనలని మనకి అనుగ్రహించేరు.
సర్వశ్రీ ముత్తయ్య భాగవతులు, మైసూర్ సదాశివరావు, పాపనాశం శివన్, పట్నం సుబ్రమణియ అయ్యరు, పెరియసామి తూరన్, రామస్వామి దీక్షితస్వామి, మైసూర్ వాసుదేవాచార్, శుద్ధానంద భారతి, ఎం.డి.రామనాథన్ మొదలైన మహామహులు హంసధ్వనిరాగంలో అనేక సంగీతరచనలు చేసేరు.
(సశేషము)