సంగీతం—నాదవేదం—54

10—07—2021; శనివారము.

“శంకరాభరణరాగం” జన్యరాగాలలోకి వర్గీకరించబడిన మరొక మహనీయరాగం, సుప్రసిద్ధమైన “దేవగాంధారి రాగం”. ఇది “ఔడవ – సంపూర్ణ” రాగం. ఆరోహణలో, “ఆరభిరాగం” లో వలెనే “గ-ని” స్వరాలు వర్జ్యం. “షడ్జం-చతుశ్శ్రుతి రిషభం-అంతరగాంధారం-శుద్ధమధ్యమం-పంచమం -చతుశ్శ్రుతి ధైవతం-కాకలినిషాదం” మాత్రమేకాక “కైశికి నిషాదం” అన్యస్వరమై దీనిలో భాసిస్తుంది. అందువలన ఆరభిరాగం ఉపాంగరాగమైతే, దేవగాంధారిరాగం భాషాంగరాగంగా శాస్త్రకారులచేత వర్గీకరించబడింది. స్వరప్రయోగం సామాన్యసరళశైలిలో ఉండడం, జంటస్వరాల ప్రయోగాల బాహుళ్యం ఆరభిరాగస్వరూప-స్వభావాలని నిర్వచిస్తే, వీటి ప్రయోగాలని కౌశలంతో పరిహరించడంద్వారా దేవగాంధారిరాగనైజాన్ని ౘక్కగా ప్రకాశింపచేయవచ్చు. ఆరభిరాగంలో మధ్యమకాల స్వరసమూహ ప్రయోగాలు తలమానికమైనట్లుగానే, దేవగాంధారిరాగంలో చౌకకాల సంచార పౌష్కల్యం రాగవిభవాన్ని బాగా వెల్లడి చేస్తుంది. దేవగాంధారిరాగంలోని అవరోహణం, అతిప్రాచీనమైన సంగీత ప్రపంచ స్వరసంపుటీకరణలలో ఒకటైన “Pythagorean Scale” కి అభిన్నమైనది అని పెద్దలు చెపుతారు.

త్యాగరాజస్వామివారు మదరాసు (వర్తమానంలో “చెన్నై”) మహానగరంలో ఈ దేవగాంధారి రాగాన్ని ఎనిమిది రోజులు గానం చేసినట్లుగా ఐతిహ్యం ప్రచారంలో ఉంది. ఇది అంతటి మహనీయ మనోహర విపుల స్వరసమూహ సంచార భరితమైన రాగం.

త్యాగయ్యగారు దేవగాంధారిరాగంలో — “ఎవరు మనకు సమానమిలలో – ని(ఇ)ంతులార! నేడు? ॥ఎవరు మనకు॥ (ఆదితాళం); కరుణాసముద్ర! నను – కావవే శ్రీరామభద్ర! ॥కరుణాసముద్ర॥ (ఆదితాళం); కొలువై యున్నాడే! – కోదండపాణి ॥కొలువై – – -॥ (ఆదితాళం); తనలోనే ధ్యానించి – తన్మయమె గావలెరా! ॥తనలోనే॥ (ఆదితాళం); నా మొరాలకింపవేమి? – శ్రీరామ! ॥నా మొర – – -॥ (రూపకతాళం); పాలయ శ్రీరఘువీర! సుకృ(-)పాలయ! రాజకుమార! ॥పాలయ॥ (ఆదితాళం); మరవక(కు)రా! నవ – మన్మథరూపుని ॥మరవక(కు)రా!॥ (ఆదితాళం); వినరాద? నా మనవి ॥వినరాద?॥ (దేశాదితాళం); శ్రీతులశ(స)మ్మ! మా యింట – నెలకొనవమ్మ! ॥శ్రీతులశమ్మ!॥ (ఆదితాళం); శ్రీరఘువర! కరుణాకర! నీ పద – చింతనమే జీవనము ॥శ్రీరఘువర॥ (ఆదితాళం); సీతావర! సంగీతజ్ఞానము – ధాత వ్రాయవలె రా! ॥సీతావర!॥ (ఆదితాళం); క్షీరసాగరశయన! నన్ను – చింతల బె(పె)ట్టవలెనా? రామ! ॥క్షీరసాగరశయన!॥ (ఆదితాళం)” అను పల్లవిలతో అద్భుతమైన కృతిసంపదని నిక్షిప్తంచేసి మనందరికి పరమవాత్సల్యంతో అందించేరు.

దీక్షితస్వామివర్యులు దేవగాంధారిరాగంలో — “క్షితిజారమణం చింతయే – శ్రీరామం భవతరణం ॥క్షితిజారమణం॥ (ఆదితాళం); శాలివాటీశ్వరం భజేsహం శాలివాటినగరవిహారం ॥శాలివాటీశ్వరం॥ (ఆదితాళం); శ్రీమీనాంబికాయాః పరం న హి రే రే చిత్త! నిత్యం – కామేశ్వర్యారాధిత పరదేవతాయాః ॥శ్రీమీనాంబికాయాః॥ (రూపకతాళం); వదాన్యేశ్వరం భజేsహం సదా – మదాది వృత్తిం త్యజేహం ముదా ॥వదాన్యేశ్వరం॥ (ఆదితాళం)” మొదలైన కృతులను వెలయింపజేసేరు.

సర్వశ్రీ కవికుంజరభారతి, ముత్తయ్య భాగవతర్, మైసూర్ సదాశివ రావు, N.S.రామచంద్రన్, మైసూర్ వాసుదేవాచారి, పాపనాశం శివన్, గోపాలకృష్ణభారతి, క్షేత్రయ్య, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, శాహాజీ మహారాజా, శుద్ధానందభారతి, ఉపనిషద్ బ్రహ్మయోగి, వీణ కుప్పయ్యరు, వీణ శేషన్న, వేదనాయకం పిళ్ళై మొదలైన వాగ్గేయకారవర్యులు దేవగాంధారిరాగంలో వివిధ రచనలు చేసి, సంగీతరసికవరులకి అందించేరు.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *