సంగీతం—నాదవేదం—46

15—05—2021; శనివారం.

“నేను పడుతున్న ఆ యాతనని, వేదికపై గానం చేస్తున్న పెద్దాయన గమనించేరు అనుకుంటాను. అంతవరకు సభని అంతటిని, అన్నివైపులనుంచీ చూచే ఆయన తమాషాగా దరహాసంచేస్తూ నా వైపు తదేకంగా చూస్తూ, తాము అప్పటి వరకు పాడుతున్న పాట ఐపోవడంవలన, ఏదో రాగం అందుకుని, పాట ఏదీ ప్రారంభించకుండా, వివిధకంఠస్థాయిలలో తమ గళం నుండి కేవలం నాదమయమైన కమనీయ విన్యాసాలు (అంటే ఉత్తరభారత సంగీతంలో “ఆలాప్” అని, దక్షిణభారత సంగీతంలో “ఆలాపన” అని వర్ణింపబడే కేవల సృజనాత్మక సంగీత భావమయ గానకళావైదుష్యవిన్యాసం, లేక presentation of purely abstract musical excellence attained by the artiste through absolute sense of dedicated practice and the full Grace of SriSaraswathidevi, the Goddess of Music, Literature and all other fine arts) తన్మయత్వంతో చేయడం ప్రారంభించేరు. అసంకల్పితంగానే నా కళ్ళు రెండూ మూసుకుపోయేయి. నాకు ఏం జరిగిందో తెలియదు. కాల-స్థల ప్రమేయాల స్పృహ క్రమంగా నా నుండి తప్పుకుంది. నేను అనే భావశకలం నాలో మెలిమెల్లిగా సమూలంగాను, సంపూర్ణంగాను,లుప్తమైపోయింది. కార్య-కారణ సంబంధాల ప్రత్యయాలు శూన్యమైపోయేయి.మెలకువలోను, కలలలోను, గాఢనిద్రలోనూ నాలో కొనసాగే వ్యాపారాలకి, నిర్వ్యాపారాలకీ మూలస్థానమైనకేంద్రకం(Nucleus)వంటి అసలైన ఎరుక ఏదైతే సాపేక్షప్రత్యయాలన్నింటికీ అతీతంగా ఉంటుందో అదొక్కటే తనకి తానుగాఉంది. అక్కడే ఒక పరమాద్భుతమైన మహాతత్త్వం తనకి తానుగా వ్యక్తమై నాకు అనుభవంలోకివచ్చింది. “పవర్గ సహితో దేవః (చ) అపవర్గ ప్రదాయకః (లేక— అపవర్గ ఫలప్రదః)॥” అని మనపెద్దలచేత వర్ణింపబడిన శంకరపరమాత్మ మహావైభవంతో వెలిగిపోతూ దర్శనమిచ్చేరు. తలపైన చంద్రవంక, గంగమ్మ, మెడలో హారరూపుడై కమనీయ కాంతులు వెదజల్లుతున్న అహీంద్రశేఖరుడు వాసుకి, అర్థాంగి శ్రీపార్వతీదేవిలతో నయనపర్వంగా దర్శనమిచ్చేరు.

(పవర్గం అంటే మన సంస్కృతభాషలోని అక్షరాలలో “ప, ఫ, బ, భ, మ” అనే ఐదు అక్షరాల సముదాయం.:—”ప-వర్గ సహితో దేవః” — అంటే ఈ ఐదు అక్షరాల సముదాయంతో కూడుకున్నవాడు, అని అర్థం. (1) ప=పార్వతీదేవి తన అర్థాంగిగా కలవాడు; (2) ఫ=ఫణి అంటే సర్పరాజు ఐన వాసుకి కంఠమాలగా ఉన్నవాడు; (3) బ=బాలచంద్రుడు, అంటే, నెలవంక నుదుట వెలుగులీనేవాడు; (4) భ=భస్మం=విభూతి దేహమంతటా అలంకరణగా కలవాడు; (5) మ=మందాకిని=తలపై గంగాదేవిని ధరించినవాడు — ఈ ఐదింటితో సహితుడైనవాడు, అంటే , నిత్యమూ కూడుకున్నవాడు అయిన శంకరమహాదేవుడే “అపవర్గం” అంటే “మోక్షం” ఇచ్చే మహాదైవం అని అర్థం.)

“అలాగ కాల-స్థల స్పృహ లేకండా ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. సభలో కరాతాళధ్వనులు మిన్నుముట్టే సమయంలో నాకు ఇహలోకస్పృహ వచ్చింది. నాకు తెలియకుండానే నా కళ్ళవెంట అశ్రువులు జాలువారుతున్నాయి. పెద్దాయన నా వైపు అమితకారుణ్యంతో చూస్తున్నారు. నా మిత్రులు నా ముఖం వైపు, పెద్దాయన వైపు మార్చి-మార్చి చూస్తూ విషయం స్థూలంగా గ్రహించేరు అనిపించింది. మిగిలిన సభ పూర్తి కాగానే మేమిద్దరం లేచి నిలబడి పెద్దాయనకి నమస్కరించి సభామందిరంనుంచి బయటకొచ్చి, ఇంటిబాట పట్టేం. ఆయన ఏమీ మాట్లాడలేదు. నేను మాట్లాడే స్థితిలో లేను. సూక్ష్మగ్రాహ్యత కలిగిన ఆయన నా స్థితి-గతులు అవగాహన చేసుకున్నారు. ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయేం. మరునాడు సాయంత్రం కళాశాల ముగిసినవెంటనే, మేము ఇద్దరమూ బయలుదేరి వెళ్ళి మా ఇంట్లో కాఫీ తీసుకుని ట్రిప్లికేన్ బీచ్ కి చేరుకుని, జనసమ్మర్దం తక్కువగా ఉన్నచోట ఇసుకలో సముద్రానికి ఎదురుగా కూర్చున్నాం!

“ఆc! ఇప్పుడు చెప్పండి. అరియక్కుడివారి కచేరీ మీకు ఎలాగ అనిపించింది?” అని ఆయన అడిగేరు. నేను, చిరునవ్వుతో ఆయనవైపు చూస్తూ, “నిన్నటి సభలో ఆ మహానుభావుడు అత్యధిక సమయం పాడిన ఆ రాగం ఏమిటి?” అని అడిగేను. వెంటనే ఆయన “అది శంకరాభరణం రాగం” అని బదులు చెప్పేరు. అప్పుడు నేను ఆశ్చర్యంతో నాకు కలిగిన దివ్యానుభూతిని పూర్తిగా వర్ణించి ఆయనకి చెప్పేను. ఆయనకూడా ఆశ్చర్యంతోకూడిన ఆనందంతో, “చూసేరా! మొట్టమొదటి అనుభవంలోనే మీరు నాదయోగానుభూతిని అలవోకగా అందుకోగలిగేరు. అరియక్కుడిగారు ఒక విలక్షణ గానవిద్యావిశారదుడు, ఒక పరిపూర్ణ నాదయోగోపాసనా రససిద్ధుడు. ఆయన, మీ చంచల మానసికస్థితిని గమనించి, మీకు జన్మతః సిద్ధించిన యోగ్యతని తెలుసుకుని, ఆ నాదయోగమయ దివ్యానుభవాన్ని సంకల్పమాత్రంగా మీకు అనుగ్రహించేరు. మా వంటి వారం కొన్ని దశాబ్దాలుగా ఈ సంగీతశ్రవణోపాసన చేస్తూన్నా, మీరు అనతికాలంలో పొందగలిగిన కృతకృత్యతని, ధన్యతని ఇంతవరకు అందుకోలేకపోవడానికి మా పురాకృత కర్మఫలజన్యమైన వైయక్తిక సంస్కారాలే కారణం! అంతే కాదు. మన ఆర్షవిద్యోపాసకులైన నాదయోగులు మన ప్రాచీనతమ రాగాలకి పెట్టిన (కనీసం కొన్నింటి) పేర్లని ఎంత సార్థకంగా పెట్టేరోకదా! అనిపిస్తోంది— మీరు వర్ణించిన మీ దివ్యానుభూతిని వింటూంటే!. “శంకరాభరణరాగాధిదైవం” మీ సమాధితుల్యస్థితిలో మీ ఆంతరిక నేత్రాలముందు వ్యక్తమై, మీకు దర్శనం ఇవ్వడం మీ జన్మజన్మాంతర అపార అలౌకిక తపః ఫలం! “

ఈ వృత్తాంతాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చేవారం నుండి యథాపూర్వంగా మన సంగీతజగత్ప్రయాణం చేద్దాం!

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *