సంగీతం—నాదవేదం—42
17—04—2021; శనివారం.
ॐ
28వ మేళకర్త అయిన హరికాంభోజికి జన్యరాగాలలో (అకారాది క్రమంలో లేక alphabetical order లో) సుప్రసిద్ధరాగం, శహాన రాగం. ఈ రాగం సంపూర్ణ—సంపూర్ణ రాగం. అంటే ఆరోహణ—అవరోహణలలో సప్తస్వరాలూ ఉంటాయి. ఇది ఉపాంగరాగంగానే శాస్త్రాలలో చెప్పబడింది. ఆరోహణ—అవరోహణలు రెండింటిలోను వక్రసంచారాలు ఉండడం వలన దీనిని “ఉభయ వక్ర సంచార రాగం” అంటారు. ఆరోహణ—అవరోహణలు రెండింటిలోను దీర్ఘస్వరప్రయోగాలు ఉంటాయి. “ప్రత్యాహత గమక ప్రయోగం” వలన ఈ రాగం యొక్క సౌందర్యం, సౌకుమార్యం, హృదయంగమత్వం పెరుగుతాయి. శహానరాగం సభాసంగీతంలో ప్రశస్తస్థానాన్ని కలిగి ఉంది.
త్యాగరాజస్వామివారు వివిధరసస్ఫూర్తి కలిగిన అనేకసందర్భాలలోని కృతలని శహాన రాగం లో నిర్మించేరు. ఈ వసుధ నీవంటి దైవము — నెందు గానరా (ఆదితాళం); ఊరకే గల్గునా రాముని భక్తి (చాపుతాళం); ఏమానతిచ్చేవొ ఏమెంచినావో (రూపకతాళం); గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి (ఆదితాళం); దేహి! తవ పదభక్తిం వై ~ దేహీ! పతితపావనీ! సదా ॥దేహి॥ (ఆదితాళం); నిజముగ నీ మహిమ దెల్పలేరు (దేశాదితాళం); రఘుపతే! రామ! — రాక్షస భీమ! (రూపకతాళం); రామ! రామ! రామ! లాలి శ్రీరామ! ~ రామ! రామ! లావణ్యశాలి! (చాపుతాళం); వందనము, రఘునందన! సేతు ~ బంధన! భక్తచందన! రామ! ॥వందనము॥ (ఆదితాళం); శ్రీరామ! శ్రీరామ! శ్రీమనోహరమా! (ఆదితాళం) అనే వివిధ త్యాగరాజ కృతులు / కీర్తనలు శాహానరాగానికి స్వరబద్ధంచేయబడిన మహామనోహరకృతులు.
దీక్షితస్వామివరులు శహానరాగంలో, “అభయాంబాయాం భక్తిం కరోమి ~ సచ్చిదానందరూపాయాం స్వస్వరూపాయాం శ్రీ ॥అభయాంబాయాం॥ (మిశ్రచాపుతాళం); ఈశానాది శివాకారమంచే శివకామేశ్వర ~ వామాంకస్థితే! నమస్తే! నమస్తే! గౌ ॥రీశానాది॥ (రూపకతాళం); రామకృష్ణేన సంరక్షితోsహం రామాయణ భాగవత ప్రియేణ (ఆదితాళం); శ్రీకమలాంబికాయాం భక్తిం కరోమి ~ శ్రితకల్పవాటికాయాం చండికాయాం జగదంబికాయాం ॥శ్రీకమలాంబికాయాం॥ (త్రిపుటతాళం)” అనే కృతులను విరచించేరు.
సంగీతమూర్తిత్రయం తర్వాత అనేక సుప్రసిద్ధ వాగ్గేయకారులు శహానరాగం లో కృతులను కూర్చేరు. సర్వశ్రీ క్షేత్రయ్య, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతర్, నీలకంఠశివన్, పాపనాశం శివన్, పట్ణం సుసుబ్రమణ్య అయ్యర్, శుద్ధానంద భారతి, ఉపనిషద్బ్రహ్మేంద్రయోగి, వీణ కుప్పయ్యర్, వేదనాయకం పిళ్ళై, “స్పెన్సర్” వేణుగోపాల్ మొదలైనవారు అటువంటి అనేకముఖ్య వాగ్గేయకారులలో కొందరు.
(సశేషం)