సంగీతం—నాదవేదం—41
10—04—2021; శనివారం.
ॐ
హరికాంభోజి జన్యరాగాలలో, తరువాత చెప్పుకోవలసినది “రవిచంద్రికరాగం”. రవిచంద్రికరాగంలో ఆరోహణ—అవరోహణలలో పంచమస్వరం వర్జ్యస్వరం. అందువలన రవిచంద్రిక షాడవ (6 స్వరాలు)—షాడవ (6 స్వరాలు) రాగం.
త్యాగరాజస్వామివారు “రవిచంద్రికరాగం” లో, “నిరవధిసుఖద! నిర్మలరూప! నిర్జితమునిశాప! (ఆదితాళం); మాకేలరా! విచారము / మరుcగన్న శ్రీరామచంద్ర! ॥మాకేలరా॥ (దేశాదితాళం) అనే రెండు కృతులు రచించినట్లు కానవస్తున్నది.
“రవిచంద్రిక” కమనీయమైన రాగం అయినప్పటికీ దీనిలో శ్రీ హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతర్, శ్రీ పెరియసామి తూరన్ రచనలు మాత్రం అప్పుడప్పుడు సంగీతసభలలో వినిపిస్తూంటాయి.
ఆ తర్వాత చెప్పుకోవలసినది, రాగపంజరం రాగం. ఇది షాడవ (6 స్వరాలు)—ఔడవ (5 స్వరాలు) రాగం. అంటే, ఆరోహణలో “గాంధారం” వర్జ్యస్వరం. అవరోహణలో “గాంధారం, పంచమం, ఈ రెండూ” వర్జ్యస్వరాలు.
త్యాగరాజస్వామివారు రాగపంజరం రాగం లో, “వరదా! నవనీతాశా! పాహి / వరదానవమదనాశా! ఏహి ॥ వరదా! ॥ (చాపుతాళం); సార్వభౌమ! సాకేతరామ! మన~సారcబల్కరాదా? దేవతా ॥సార్వభౌమ॥ (దేశాదితాళం) అనే కృతులను రచన చేసేరు.
రాగపంజరం రాగం లో శ్రీ త్యాగరాజస్వామివరులు తప్ప మిగిలిన ప్రాచీన – ఆధునిక వాగ్గేయకారులు ఎవ్వరూ ఏ విధమైన ప్రక్రియలలోను సంగీత రచనలు చేసిన దాఖలాలు లభ్యం కావడం లేదు.
(సశేషం)