సంగీతం—నాదవేదం—40

03—04—2021; శనివారము.

హరికాంభోజి జన్యరాగాలలో మోహనరాగం తరువాత ముఖ్యమైన రసిజనరంజకమైనది, యదుకులకాంభోజిరాగం. యదుకులకాంభోజిరాగం ఔడవ—సంపూర్ణ రాగం. ఆరోహణలో గాంధారం—నిషాదం వర్జనీయస్వరాలు. అవరోహణలో అన్ని స్వరాలు ఉంటాయి. అవరోహణలో కైశికినిషాదంతోబాటు, అన్యస్వరమైన “కాకలినిషాదం” కూడా కొన్ని ప్రత్యేకప్రయోగాలలో చోటుచేసుకుని, ఈ రాగంయొక్క రంజకత్వధర్మాన్ని ఇనుమడింపజేస్తుంది. ఈ విధమైన అన్యస్వరప్రయోగం ఉండడంవలన

యదుకులకాంభోజి “భాషాంగరాగం” గా పరిగణింపబడుతోంది.యదుకులకాంభోజిరాగం ప్రాచీనతమమైన సంప్రదాయబద్ధరాగాలలో ఒకటి. ఈ రాగంలో “చౌకకాలప్రయోగాలు” రాగరంజకత్వలక్షణాలని రసహృదయజనరంజకంగా ఆవిష్కరిస్తాయి. ఇది ఏకస్వరమూర్ఛనకారకరాగం. అంటే గ్రహభేదప్రక్రియద్వారా ఈ రాగంలోని మధ్యమాన్ని, షడ్జంగా మార్చి రాగప్రస్తారంచేస్తే, ఇది, “బిలహరిరాగం” గా రూపాంతరం చెందుతుంది.

త్యాగరాజస్వామివారు “అదికాదు భజన మనసా (ఆదితాళం); ఆడవారినెల్లగూడి మన – మాడుదాము హరిని వేడి (చాపుతాళం); ఎంతనుచు సైరింతును సీతాకాంతు దయరాదు (ఆదితాళం); ఏ తావున నేర్చితివో రామ! ఎందుకింత గాసి (ఆదితాళం); చెలిమిని జలజాక్షు గంటే చెప్పరయ్య మీరు / పలుమారు మ్రొక్కెదను దయతో బలుకరయ్య – ఎంతో ॥చెలిమిని॥ (ఆదితాళం); దయసేయవయ్యా సదయ! రామచంద్ర! (ఆదితాళం); నీ దయచే రామ! నిత్యానందుడైతి (దేశాదితాళం); పాహి రామచంద్ర! రాఘవ! హరే! మాం / పాహి రామచంద్ర! రాఘవ! (త్రిశ్రలఘు తాళం); శ్రీరామ! జయరామ! శృంగారరామ యని / చింతింపరాదె! ఓ మనసా! (ఝంపతాళం); హెచ్చరికగా రార! హే రామచంద్ర! / హెచ్చరికగారార హే సుగుణసాంద్ర! (ఝంపతాళం)” అనే లోకోత్తరమైన వివిధకృతులని రచించేరు.

దీక్షితస్వామివారు “అభయాంబికాయై అశ్వారూఢాయై / అభయవరప్రదాయై నమస్తే నమస్తే ॥అభయాంబికాయై॥ (రూపకతాళం); దివాకరతనూజం శనైశ్చరం ధీరతరం సంతతం చింతయేsహం ॥దివాకరతనూజం॥ (ఆదితాళం); త్యాగరాజం భజరే! రే చిత్త! తాపత్రయం త్యజరే! రేచిత్త! ॥త్యాగరాజం॥ (మిశ్ర ఏకతాళం)” అనే కృతులని యదుకులకాంభోజిరాగంలో రచించేరు.

శ్యామాశాస్త్రివర్యులు యదుకులకాంభోజిరాగంలో, త్రిపుటతాళంలో, సకలసంగీతప్రపంచంలో,శాశ్వతసభారంజకత్వప్రదాయమైన “కామాక్షీ! నీదు పదయుగమే స్థిరమని నే / నమ్మియున్నానునా చింతలన్నిదీర్చమ్మ ॥కామాక్షి!॥ అనే పరమరమణీయస్వరజతిని కూర్చేరు.

తరువాతి కాలంలోని అనేకవాగ్గేయకారులు, వారి-వారి సంగీతసృజనాత్మకశక్తిని అనుసరించి, యదుకులకాభోజిరాగంలో అనేక మహనీయమైన సంగీతరచనలు చేసేరు.

సభాసంగీతంలో యదుకులకాంభోజిరాగం ప్రధానరాగంగాను, రాగం-తానం-పల్లవి లోను, రాగమాలికలలోను. కృతులు, సంకీర్తనలు, పదములు, జావళీలు, దరువులు, తరంగాలు, భజనలు మొదలైన అనేక సంగీతప్రక్రియలలో రసమయస్థానాన్ని పొందుతూ వస్తోంది.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *