సంగీతం—నాదవేదం—39

27—03—2021; శనివారం.

త్యాగరాజస్వామి “మోహనరాగం” లో స్వరపరచిన కృతుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం! “ఎందుకో బాగ తెలియదు—ఆదితాళం; ఎవరురా నినువినా గతి మాకు — చాపుతాళం; దయ రానీ, దయ రానీ, దయ రానీ, దాశరథీ!—ఆదితాళం; నను పాలింప నడచి వచ్చితివో, నా ప్రాణనాథా!—దేశాదితాళం; భవనుత! నా హృదయమున రమింపుము, బడలిక దీర—ఆదితాళం; మాటిమాటికి తెల్పవలెనా? ముని / మానసార్చితచరణ! రామయ్య! నీతో—త్రిపుటతాళం; మోహనరామ! ముఖజితసోమ! ముద్దుగ పల్కుమా!—ఆదితాళం; రామా! నిను నమ్మినవారము / గామా సకలలోకాభి ॥రామా! ॥ — ఆదితాళం; రామ! రామ! రామ! రామా! యనినంత / రాజపు చూపేలరా? ఓ రామ! — చాపుతాళం; వేదవాక్యమని యెంచిరి యీ / వెలదులెల్ల సమ్మతించిరి — చాపుతాళం; జయమంగళం నిత్యశుభమంగళం — ఝంపతాళం” అనే రచనలు “మోహనరాగం” లో లభ్యం అవుతున్నాయి.

దీక్షితస్వామివారు “కాదంబరీప్రియాయై కదంబ – కాననాయై నమస్తే, నమస్తే! (మిశ్రచాపు); నరసింహాssగచ్ఛ, పరబ్రహ్మపుచ్ఛ! స్వేచ్ఛ స్వచ్ఛ! (మిశ్రచాపు); నాగలింగం నమామి సతతం / నామరూపప్రపంచాతీతలింగం ॥నాగలింగం॥ (ఆదితాళం); పాహిమాం పార్వతి / పరమేశ్వరి శ్రీ ॥పాహిమాం॥ (రూపకతాళం); రక్తగణపతిం భజేsహం / రత్నసింహాసనపతిం సురపతిం ॥రక్తగణపతిం॥ (ఆదితాళం); రాజగోపాలం భజేsహం / రమాలీలం ॥రాజగోపాలం॥ (రూపకతాళం)” అనే కృతులని మోహనరాగంలో కూర్పు చేసేరు.

మోహనరాగంలో విపులమైన, విస్తారమైన నవరసభరిత సంచారాలు సహజంగానే ఉండడంవలన ఈ రాగంలో వివిధ సంగీతప్రక్రియలు విభవంతో వెల్లివిరిసేయి. కేవలం వర్ణాలు, కృతులు, సంకీర్తనలేకాక, రాగం—తానం—పల్లవిలు, పదాలు, జావళీలు, దరువులు, తిల్లానాలు, రాగమాలికలు, పద్యాలు, శ్లోకాలు, విరుత్తాలు, సంవాదరూప సంగీతరచనలు, తరంగాలు, అష్టపదులు, భజనలు, గౙల్స్, యక్షగాన-నాటక-సంగీతరూపకాదులలో పాటలు, చలనచిత్రాలలో వివిధసన్నివేశాలలోని పాటలు మొదలైన అనేక రంగాలలోని గీతప్రక్రియలన్నింటికీ ఈ మోహనరాగం అనువుగాను, అనుకూలంగాను ఉండి, సర్వసులక్షణశోభితమై, రసికజన మనోజ్ఞమై అలరారుతూ ఉంటుంది.

అందువలననే క్షేత్రయ్యగారి పదాలు, జయదేవుల అష్టపదులు, నారాయణతీర్థయతివరుల తరంగాలు, మరాఠీ అభంగాలు మొదలైనవన్నీ మోహనరాగంలో తరచుగా సంగీతవిద్వాంసులు రసజ్ఞశ్రోతలకి వినిపించి, వారియొక్క హృదయపూర్వకమైన మన్ననలు ఆదరణతో పుష్కలంగా అందుకోవడం జరుగుతూ ఉంటుంది.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *