సంగీతం—నాదవేదం—38

20—03—2021; శనివారము.

తరువాత, హరికాంభోజికి జన్యరాగం — మోహనరాగం. మోహనరాగం గురించి చెప్పాలంటే తల్లిని మించిన తనయ అని వర్ణించాలి. ఇది అత్యంత ప్రాచీనతమరాగాలలో ఒకటి! అంతేకాదు. ఇది సర్వేశ్వరుడికి వలెనే సార్వకాలిక సార్వదేశిక రాగం. ఈ రాగం వివిధదేశాలలో, వివిధజాతులలో, వివిధసంస్కృతులలో, వివిధకాలాలలో వర్ధిల్లుతూ వస్తూన్న రాగం. ప్రాచీన జానపదగీతాలలో కూడా ఇది తరచుగా వినిపిస్తుంది. మానవజాతి జనజీవితాలలో సంభవించే అనేక సంఘటనలు, సందర్భాలు, సన్నివేశాలు మోహనరాగంలో పాటలుగా చిరంతనరూపాన్ని ధరించి కొనసాగుతున్నాయి. ఆధునికమైన నాటకరంగం, వివిధభాషల చిత్రాలు కలిగిన భారతీయ చలనచిత్రసీమ కూడా మోహనరాగం యొక్క మహామహిమాన్వితమైన ప్రభావానికి అతీతమైనవి కావు అనే వాస్తవం మనం గుర్తిస్తే “మోహనం సంపూర్ణమనోహరం” అని గ్రహించగలుగుతాం!

మోహనరాగం “ఔడవ—ఔడవ” రాగం. అంటే ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఐదు స్వరాలు ఉంటాయి. “మధ్యమం—నిషాదం” అంటే, “మ—ని” రెండూ వర్జ్యస్వరాలు. మిగిలినవి “షడ్జం—చతుశ్శ్రుతి రిషభం—అంతర గాంధారం—పంచమం—చతుశ్శ్రుతి ధైవతం” అనే స్వరాలు మోహనంలో ఉంటాయి. ఇది ఉపాంగరాగం. అంతేకాక “సంపూర్ణమూర్ఛనకారకరాగం” గా ఇది భాసిస్తోంది. అంటే “గ్రహభేద ప్రక్రియ (Shift of the Tonic Note)” ద్వారా మోహనరాగం నుండి (1) మధ్యమావతి; (2) హిందోళం; (3) శుద్ధసావేరి; (4) ఉదయరవిచంద్రిక అనే రాగాలు వరుసగా ఏర్పడతాయి.

ప్రాచీన భారతీయ సంగీతశాస్త్రగ్రంథాలలో ఒకటైన “రాగసాగరః” అనే గ్రంథంలో “మోహనరాగాధిదేవతాధ్యానమ్” ఈ విధంగా చేయబడింది:—

శ్లో॥ పరిగలితశిఖాగ్రాం పారిజాతప్రసూన / స్రగవిరలభుజాన్తాం శ్యామలాం శ్వేతచేలామ్|చికురవిచికిలాగ్రవ్యాప్తిలీలాం సుశీలాం / ముకురసహితహస్తాం మోహనాం చిన్తయామి॥

భావం:— అందమైన కేశపాశంనుండి సొగసుగా భుజాల చివరలవరకు వ్రేలాడుతూన్న పరిమళభరిత పారిజాతప్రసూనమాలని అలంకరించుకుని, స్వచ్ఛమైన తెల్లని చీరని ధరించి, చామనచాయ దేహకాంతితో ప్రకాశిస్తూ, శిరోజాలలో గుమగుమలతో గుబాళించే దవనం తురుముకుని, చేతిలో అద్దం పట్టుకున్న సౌందర్యరాశి అయిన చారుశీలవతి మోహనాంబికాదేవిని ధ్యానిస్తున్నాను అని పై శ్లోకానికి తెలుగులో తాత్పర్యం చెప్పవచ్చు.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *