సంగీతం—నాదవేదం—34
20—02—2021; శనివారము.
ॐ
కోకిలధ్వని రాగం హరికాంభోజికి జన్యరాగమే! ఈ రాగంలో కొనియాడే నా యెడ దయ వెలకు / గొనియాడేవు సుమీ రామ! నిను ॥కొనియాడే॥ (ఆదితాళం); తొలి నేను చేసిన పూజా / ఫలమీలాగే ॥తొలి నేను॥ (ఆదితాళం) అనే రెండు కీర్తనలు త్యాగరాజస్వామి వారివి లభ్యం ఔతున్నాయి. అయ్యవారి తరువాత ముత్తయ్య భాగవతులు, అరుణగిరి నాథులు ఈ రాగంలో రచనలు చేసేరు.
ఆ పిదప చెంచుకాభోజి రాగం, దేశాది తాళం లోని “వరరాగ లయజ్ఞులు తామనుచు / వదరేరయా” అనే ఏకైకకృతి కలిగిన రాగం హరికాంభోజి జన్యరాగమే! చెంచుకాంభోజి రాగంలో ముత్తయ్య భాగవతులవారు; జి.ఎన్. బాలసబ్రమణియం గారు కృతులను కూర్చేరు.
తరువాత, ఛాయాతరంగిణి అనే జన్యరాగంలో, “ఇతర దైవములవల్ల ఇలను సౌఖ్యమా? రామ! (రూపక తాళం); కృపజూచుటకు వేళరా, రామ! (ఆది తాళం)” అనే రెండు కృతులు త్యాగయ్యగారివి ఉన్నాయి.
శ్రీ ముద్దు(త్తు)స్వామి దీక్షితులవారి కృతి “సరస్వతీ! ఛాయాతరంగిణీ! సకలకళాస్వరూపిణీ (ఆదితాళం)” ఛాయాతరంగిణి రాగంలో రచించబడింది.
ఆ పిమ్మట తెలుసుకోవలసిన హరికాంభోజికి జన్యరాగం బహుళజనాదరణ పొందిన “నవరసకన్నడ రాగం” లో త్యాగరాజస్వామివారి కృతులు “నిను వినా నా మదెందు నిలువదే శ్రీ హరి హరి (రూపకతాళం); పలుకు కండౘక్కెరను గేరునే / పణతులార! చూడరే! (దేశాదితాళం)” అనే రెండు కృతులు లభ్యం ఔతున్నాయి.
నవరసకన్నడ రాగంలో ముత్తయ్య భాగవతులు, పాపానాశం శివన్ వర్యులు, పూచ్చి శ్రీనివాస అయ్యంగార్, మైసూర్ వాసుదేవేచార్య మొదలైన మహనీయులు రచనలు చేసేరు.
ఆ తరువాయి, నాగస్వరా(వ)ళి రాగంలో, ఆది(దేశాది) తాళంలో “శ్రీపతే! నీ పదచింతనే జీవనము” అనే కృతిని త్యాగరాజులవారు రచించేరు.
ఈ నాగస్వరావళి రాగంలో జయచామరాజవడయారు, కృష్ణమాచారియర్, మహావైద్యనాథ అయ్యరు, మీనాక్షీసుందరం పిళ్ళై, ముత్తయ్యభాగవతులు, పల్లవి శేషయ్యరు, పాపనాశం శివన్, పట్ణం సుబ్రమణ్య అయ్యరు, పెరియసామి తూరన్, సుబ్బరామదీక్షితులు, మైసూరు వాసుదేవాచార్య, స్పెన్సర్ వేణుగోపాల్ జీ మొదలైన వాగ్గేయకార వరిష్ఠులు అనేక కృతులని రచించేరు.
(సశేషము)