సంగీతం—నాదవేదం—32

06—02—2021; శనివారము.

ఇప్పుడు కాంభోజిరాగం లో కూర్చబడిన త్యాగరాజస్వామివారి కృతులను గురించి తెలుసుకుందాం! ఎవరి మాట విన్నావో రావో యిందు లేవో భళి! భళి! (ఆదితాళం); ఏలరా? శ్రీకష్ణా! నాతో చలము యేలరా? కృష్ణా! నీ (కేలరా? శ్రీకృష్ణా!—రూపకతాళం); ఓ రంగశాయీ! పిలిచితే ఓయనుచు రారాదా? (ఆదితాళం); మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదు (ఆదితాళం); మహిత ప్రవృద్ధ శ్రీమతి! గుహ గణపతి జనని! (తిస్రత్రిపుటతాళం); మా జానకి చెట్ట బట్టగ మహరాజువైతివి (దేశాదితాళం); శ్రీరఘువరాప్రమేయ! మామవ (ఆదితాళం); మార్గము తెలుపవె (ఝంపతాళం) అనెడి ఈ కృతులు కాంభోజి రాగంలో శ్రీ త్యాగరాజు గారివి లభ్యం అవుతున్నాయి.

కైలాసనాథేన సంరక్షితోsహం కైవల్యప్రదనిపుణతరేణ శ్రీ (మిశ్రచాపుతాళం); కమలాంబికాయై కనకాంశుకాయై కర్పూరవీటికాయై నమస్తే నమస్తే (ఖండజాతి అటతాళం); కాశీవిశ్వేశ్వర! ఏహి మాం పాహి, కరుణానిధే! సన్నిధేహి ముదం దేహి (ఖండజాతి అటతాళం); మరకతవల్లీం మనసా స్మరామి, మదనజనకాది దేవపాలినీమ్ (ఆదితాళం); శ్రీ సుబ్రహ్మణ్యాయ నమస్తే నమస్తే, మనసిజ కోటి కోటి లావణ్యాయ దీనశరణ్యాయ (తిస్ర ఏక/రూపక తాళం); శ్రీవల్మీకలింగం చింతయే శివార్ధాంగం చింతయే (ఖణ్డజాతి అటతాళం); సాంబసదాశివాయ నమస్తే సదానందాయ సోమాస్కందాయ (ఆదితాళం); గోపాలకృష్ణాయ నమస్తే (ఆదితాళం) అనే ఈ కృతులనన్నీ దీక్షితస్వామివారు కాంభోజిరాగం లోనే నిర్మించేరు.

శ్రీశ్యామాశాస్త్రులవారు కాంభోజి రాగంలో దేవీ! నీదు పదసారసములే దిక్కు నాకు వేరే గతి ఎవరమ్మా? — (ఆదితాళం) అనే ఒక రసరమ్యకృతిని రచించి శ్రీమాతకి సమర్పించేరు.

కాభోజిరాగంలో అన్నమాచార్యులవారివి నలభైకి పైబడిన సంకీర్తనలు కూర్చబడ్డాయి.

క్షేత్రయ్యగారి పదాలు ముప్ఫైకి పైన కాంభోజిరాగంలో ఉన్నాయి.

భద్రాచలరామదాసుగారు, గోపాలకృష్ణభారతిగారు, కనకదాసరుగారు, లక్ష్మణన్ పిళ్ళైగారు, మునిపల్లె సుబ్రహ్మణ్యకవిగారు, ముత్తయ్య భాగవతులు, మైసూర్ సదాశివరావుగారు, నారాయణతీర్థులవారు, నీలకంఠశివన్ గారు, పాపనాశం శివన్ గారు, పురందరదాసుగారు, పెరియసామి తూరన్ గారు, రామలింగ సేతుపతిగారు, సదాశివబ్రహ్మేంద్రులు, శ్రీపాదరాయరువారు, ఉపనిషద్ బ్రహ్మయోగి గారు, మైసూర్ వాసుదేవాచారిగారు, వేదనాయకం పిళ్ళైగారు, వాలాజాపేట వేంకటరమణ భాగవతులు, వీణ కుప్పయ్యరుగారు, విజయదాసరు గారు, యోగీంద్రదాసుగారు మొదలైన అనేక మహామహులైన వాగ్గేయకారుల రచనలు కాంభోజి రాగం లో కూర్చబడినాయి.

నాట్యప్రదర్శనలలోను, నాటకరంగంలోను, చలనచిత్రరంగంలోను వినియోగించబడే రాగమాలికలు, పాటలు, పద్యాలు, వివిధరసప్రధానమైన గేయాలు మొదలైన అనేక ప్రక్రియలలో కాంభోజిరాగ వినియోగానికి అవధులు లేవు.

ఆధునిక వాగ్గేయకారులు, రాబోయే కాలంలో భవిష్యవాగ్గేయకారవరిష్ఠులు కాంభోజిరాగం లో తమ తమ సంగీతరచనలని నిర్మించనున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇది అంత మహనీయమైన, మహామహిమాన్వితమైన, సర్వజనహృదయరంజకమైన రాగం. ఈ రాగంలో గీతాలు, స్వరజతులు, వివిధ వర్ణాలు, కృతులు, సంకీర్తనలు, పదాలు, భజనలు, తిల్లానాలు, జావళీలు, వివిధ దరువులు వంటి అనేక అభ్యాస సంగీత, సభా సంగీత ప్రక్రియలన్నింటికి ఇంతటి అనువైన, అనుకూలమైన విస్తృత పరిధి కలిగిన రాగాలు అరుదనే అనాలి. రసజ్ఞులైన వాగ్గేయకారులకి, శ్రోతలకి ఈ రాగం మహాప్రీతిపాత్రమైనది అని కాలమే నిరూపిస్తోంది. ఇంతకంటె ఈ రాగప్రశస్తిని గ్రహించడానికి వేరే తార్కాణాల అవసరం లేదు.

(సశేషము)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *