సంగీతం—నాదవేదం—27
02—01—2021; శనివారము.
ॐ
మనం నాలుగవది అయిన వేదచక్రం పూర్తిచేసుకున్నాం. అంటే ఇరవైనాలుగు మేళకర్త లేక జనక రాగాలు పరిచయం చేసుకుని, వాటినుండి ఏర్పడిన ప్రధాన జన్యరాగాలు, ఆయారాగాలలో కూర్చబడిన ప్రధానకృతులు తెలుసుకున్నాం.
ఇప్పుడు ఐదవ చక్రమైన బాణచక్రం లో ఉన్న ఆరు మేళకర్త/జనక రాగాలు, వాటినుండి ఏర్పడిన ముఖ్య జన్యరాగాలు, ఆయారాగాలలో కూర్చబడిన ముఖ్యకృతులు యొక్క పరిచయం చేసుకుందాం. *అంటే, 25, 26, 27, 28, 29, & 30 అను క్రమసంఖ్య కలిగిన ఆరు మేళకర్త/జనక రాగాల గురించి తెలుసుకుందాం!
బాణచక్రం—పంచబాణుడైన మన్మథస్వామి వారిని అనుసరించి వచ్చింది అని తెలుసుకున్నాం! ఈ ఐదవ చక్రంలో ఉన్న అన్ని (ఆరు)రాగాలలోనూ స—రి—గు—శు.మ—పలలో మార్పు ఏమీ ఉండదు. కాని, ధైవతం(ధ)—నిషాదం(ని) ల లోని మార్పుల వలననే ఆరు రాగాలలో వైవిధ్యం ఏర్పడుతుంది. అవి వరుసగా (25) “మారరంజని” ధ—న; (26) “చారుకేశి” ధ—ని;(27) “సరసాంగి” ధ—ను; (28) “హరికాంభోజి” ధి—ని; (29) “ధీరశంకరాభరణం” ధి—ను; (30) “నాగానందిని” ధు—ను అనే రాగాలు. వాటి గురించి రాబోయేవారం నుండి పరిచయం కొనసాగిద్దాం.
(సశేషం)