సంగీతం—నాదవేదం—25
19—12—2020; శనివారం.
ॐ
22వ జనకరాగం—ఖరహరప్రియ ఎంత జనాదరణ, ప్రసిద్ధి కలిగిన రాగమో ఆ రాగజన్యరాగమైన మధ్యమావతి కూడా అంతటి మహాప్రశస్తి కలిగిన రాగమే అని గ్రహించాం!
ఇప్పుడు, ఖరహరప్రియరాగం యొక్క వర్గీకరణకి చెంది, మూర్తిత్రయంవారిచేత, ఇతరులచేత ప్రయోగసౌభాగ్యం పొందిన ప్రధాన రాగాలు పరికిద్దాం!
ముందు త్యాగయ్యగారు ఉపయోగించిన రాగాలు విస్తారంగా ఉన్నాయి కనుక వారు ఎంపిక చేసిన రాగాలనిగురించి తెలుసుకుందాం!
మనోహరి రాగం (పరితాపముగని యాడిన – పలుకుల మరచితివో — రూపకం); మయూరధ్వని రాగం — దీనిని జనబాహుళ్యంలో “ఆందోళిక రాగం” అని పిలుస్తారు (రాగసుధారసపానము చేసి – రాజిల్లవె ఓ మనసా! — దేశాది); మంజరి రాగం (పట్టి విడువరాదు నా చెయి పట్టి విడువరాదు — ఆది); మాళవశ్రీ రాగం (ఎన్నాళ్ళు తిరిగేది — ఎన్నరాని దేహాలెత్తి ఈ సంసార గహనమందు — పన్నుగ చోరుల రీతి పరులను ఏ( వే)గాంచుచును—ఆది); ముఖారి రాగం (ఇందుకా ఈ తనువు – చాపు); (ఎంతని నే వర్ణింతును? – రూపకం); (కారుబారుసేయ – ఆది); (క్షీణమై తిరుగజన్మించే – సిద్ధి మానురా ఓ మనసా! – ఆది); (చింతిస్తున్నాడె – ఆది); (తలచినంతనే – ఆది); (మురిపెము కలిగె – ఆది); (సరసీరుహానన! – దేశాది); శుద్ధధన్యాసి రాగం (ఎంత నేర్చిన ఎంత జూచిన – దేశాది); శుద్ధబంగాళ రాగం (తప్పకనేవచ్చునా – రూపకం); (తొలి నే జేసిన – ఆది); (రామభక్తిసామ్రాజ్యం – ఆది); శ్రీరంజని రాగం (బ్రోచేవారెవరే! – ఆది); (భువిని దాసుడ నే – దేశాది); మారుబల్కకున్నావేమిరా? – ఆది); సరి యెవ్వరే! – దేశాది); (సొగసుగా మృదంగతాళము – రూపకం); శ్రీరాగం (ఎందరోమహానుభావులు – ఆది); (నామకుసుమముల – దేశాది); (యుక్తముగాదు – ఆది); స్వరభూషణి రాగం (వరదరాజ! – రూపకం); సాళగభైరవి రాగం (ఏలావతారమెత్తుకొంటివి? – ఆది); (పదవి నీ సద్భక్తియు – ఆది); (సంగీతశాస్త్ర – దేశాది); సిద్ధసేన రాగం (ఎవరైన లేరా? – దేశాది); హుసేని రాగం (ఏమని వేగింతు నే – ఆది); (భజ! రామం సతతం – ఆది); (రామా! నిన్నే నమ్మినాను నిజముగా – ఆది); (రామ! రామ! రామ! – రూపకం); (వినతాసుత! రార! – ఆది); (సర్వలోకదయానిధే! – త్రిశ్రం) లలో వారి కూర్పులు చేయబడ్డాయి.
త్యాగయ్యగారి తరువాత దీక్షితులవారు మనోహరిరాగం (శంకరం అభిరామీమనోహరం – రూపకం) లో ఒక కృతిని మలిచేరు. వారే మణిరంగురాగం లో (మామవ పట్టాభిరామ! — మిశ్రచాపుతాళం) ఒక కృతిని మనకి అందించేరు. (మణిరంగురాగం ఉపనిషద్బ్రహ్మ యోగీంద్రులవారు ఎక్కువగా వినియోగించినట్లు కనిపిస్తోంది.). ముఖారిరాగం లో దీక్షితులవారు (గోవిందరాజముపాస్మహే! శ్రీ — గురుగుహ వినుత చిదాకాశగృహే — మిశ్రచాపుతాళం); (పాహి మాం రత్నాచలనాయక! భక్తజనశుభప్రదాయక! –ఆదితాళం) రెండు కృతులను చేసేరు. శ్యామాశాస్త్రిగారు (పాలింపవమ్మ! పరమపావనీ! భవానీ! — ఆదితాళం) ఒక కృతిని ఈ రాగంలో రచించేరు. శుద్ధధన్యాసిరాగం లేక ఉదయరవిచంద్రికరాగం లో దీక్షితస్వామి (శ్రీగురుగుహమూర్తే! చిచ్ఛక్తిస్ఫూర్తే! శిష్యజనావనకీర్తే! సుముహూర్తే! జయ! –రూపకం); (సుబ్రహ్మణ్యేన సంరక్షితో~హం అష్టాదశలోచనాఖండేన — ఆది); (శ్రీపార్థసారథినా పాలితోస్మ్యహం సదా — రూపకం) మూడు కృతులను కూర్చేరు. (గమనిక: శుద్ధధన్యాసిరాగం, ఉదయరవిచంద్రికరాగం ఒకటేనని, పేర్లలో తేడా తప్ప మరేమీ లేదని కొందరు శాస్త్రకారుల అభిప్రాయం. మరికొందరు ఉదయరవిచంద్రిక 9వ మేళకర్త ధేనుకరాగజన్యమని, శుద్ధధన్యాసి 22వ మేళకర్త ఖరహరప్రియరాగజన్యమని దానికి అనుగుణమైన భేదాన్ని సూచిస్తూ, తేడాని పాటించేరు.). హుసేనిరాగం లో దీక్షితస్వామి (పరదేవతే! భక్తపూజితే! – భద్రం దేహి! ఆశు మాం పాహి! — ఆది); (శ్రీకాళహస్తీశ! శ్రితజనావన! సమీ – రాకార! మాం పాహి! రాజమౌళే! ఏహి! — ఝంపతాళం) రెండు రచనలని నిబద్ధం చేసేరు.
ఈ విధంగా తరువాతి వాగ్గేయకారులుకూడా ౘాలా రచనలని ఖరహరప్రియ జన్యరాగాలలో కూర్చడం జరిగింది.
(సశేషం)