సంగీతం—నాదవేదం—24
12—12—2020; శనివారం.
సంగీతమూర్తిత్రయంలో త్యాగరాజస్వామివారి తరువాత ముద్దు(త్తు)స్వామి దీక్షితులవారు మధ్యమావతిరాగం లో రచించిన కృతులనిగురించి తెలుసుకుందాం!
ధర్మసంవర్ధని! దనుజసంమర్దని! ధరాధరాత్మజే! అజే! దయయా మాం పాహి పాహి (రూపకం);మహాత్రిపురసుందరి! మామవ! జగదీశ్వరి! (రూపకతాళం);పన్నగశయన! పద్మనాభ! పరిపాలయ మాం పఙ్కజనాభ! (ఆదితాళం);శ్రీరాజరాజేశ్వరీ! త్రిపురసుందరీ! లలితా భట్టారికాం – భజేsహం భజే విదేహకైవల్యం ఆశు ఏహి! దేహి! మాం పాహి! శ్రీరాజరాజేశ్వరీం (రూపకతాళం) అనే నాలుగు కృతులు మధ్యమావతిలో దీక్షితస్వామివి లభ్యమౌతున్నాయి.
శ్రామాశాస్త్రులవారు కామాక్షి! లోకసాక్షిణీ! కామారి మనోహారిణీ! – కామాక్షి! కంచికామాక్షి! పాహి మాం (త్రిపుటతాళం); అనేగీతం; * *పాలించు కామాక్షీ! పావనీ! పాపశమనీ! అంబ! (ఆదితాళం);బృహన్నాయకీ! నన్ను బ్రోవు వేగమే (తిస్రమఠ్యతాళం) అనే రెండు కృతులు మధ్యమావతిలో కూర్చేరు. శ్రామాశాస్త్రిగారి మనుమడైన అణ్ణాస్వామి శాస్త్రిగారి వాంఛితవరదే! పరదేవతే! త్వాం భవ! మా ముదే శారదే! (ఆదితాళం) కూడా మధ్యమావతిలోనే కూర్చబడింది.
మహారాజా స్వాతితిరునాళ్ వారి రచనలలో కొన్నింటికి మహనీయమైన మధ్యమావతిరాగం యొక్క స్వరసంపుటి కూర్చబడింది. భావయే పద్మనాభమిహానిశం భవ్యగుణనిలయం (ఆదితాళం); దేవకీసుత! పాహి మాం హరే! ముకుంద! (ఆదితాళం); ధ్యాయామి శ్రీరఘురామమనిశం లోకాభిరామం (ఖండచాపుతాళం); కోసలేంద్ర! మామవామితగుణనివాస! భగమన్ (ఆదితాళం); శ్రీపద్మనాభ! కలయితుం త్వాం మమ చిత్తముత్కంఠతే (మిశ్రచాపుతాళం); సాదరమిహ భజే (ఆదితాళం); సారసముఖ! సరసిజనాభ! కురు ముదమయి దినమను (ఆదితాళం); స్మరతి ను మాం సదయం యదుపతి (ఆదితాళం); వనజాక్షం చింతయే^హం జితదనుజం పర్వభిదనుజం ముకుందం (ఆదితాళం) అనేవి ఆ కృతులు.
తదుపరికాలంలో వచ్చిన అనేకసుప్రసిద్ధ వాగ్గేయకారులు మధ్యమావతిరాగంలో కృతిని కూర్చనివారు ఎవ్వరూలేరు అంటే అతిశయోక్తి కాదు.
జానపదగీతాలలోను, లలితసంగీతంలోను, స్త్రీలపాటలలోను, హరికథలలోను, నాటకరంగంలోను, చలనచిత్రసీమలోను మధ్యమావతిరాగం విరివిగా వినియోగించబడింది అంటే మహారాగమైన మధ్యమావతి యొక్క విరాట్ స్వరూపం యొక్క మహనీయవైభవం మనకి అంతో – ఇంతో తెలియక మానదు.
(సశేషం)