సంగీతం—నాదవేదం—22
28—11—2020; శనివారము.
22వ జనకరాగం అయిన ఖరహరప్రియ నుండి జన్యరాగం దర్బారు గురించి, దర్బారు రాగ కృతులు గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు మరొక జన్యరాగం ఐన దేవమనోహరి లో త్యాగరాజస్వామివారు కూర్చిన ఎవరికై యవతారమెత్తితివో (చాపుతాళం); కన్నతండ్రి! నా పై కరుణ మానకే, గాసి తాళనే (దేశాదితాళం); కులబిరుదును బ్రోచుకొమ్ము, రమ్ము (రూపకతాళం); మృత్యుంజయ! కృపాకర! (రూపకతాళం) అనే రచనలు లభ్యం ఔతున్నాయి.
ముద్దు(త్తు)స్వామి దీక్షితులవారి కృతులు భారతీ! మద్ధిషణా జాడ్యాపహే! త్వద్భక్త కల్పక మహీరుహే! ముఖాంబురుహే! శ్రీ (రూపకతాళం); మహాదేవేన పాలితోస్మ్యహం (ఆదితాళం); త్రిపురసుందరి! నమోస్తు తే (ఆదితాళం) అనేవి దేవమనోహరిరాగంలో రచించబడినాయి.
మూర్తిత్రయంవారి తరువాతకాలంలో వచ్చిన సుప్రసిద్ధవాగ్గేయకారులు ౘాలామంది దేవమనోహరి రాగం లో కృతులు రచించేరు.
త్యాగయ్యగారు అపూర్వరాగమైన నాదవరాంగిణి లేక నాదతరంగిణి రాగం లో, ఆదితాళంలో కృపాలవాల! కళాధరశేఖర! కృతాభివందన! శ్రీరామ! అనే ౘాలా అందమైన కృతిని చేసేరు.
తరువాత జన్యరాగం నాయకి లో త్యాగరాజుగారు కనుగొను సౌఖ్యము – కమలజుకైన కల్గునా? (రూపకతాళం); దయలేని బ్రతుకేమి? దాశరథీ! రామ! (ఝంపతాళం); నీ భజన గాన రసికుల నే – నెందు గానరా, రామ! (ఆదితాళం) అనే మూడు కృతులు రచింౌచేరు.
దీక్షితులవారు నాయకిరాగం లో రచించిన కృతులు — పాలయ మాం బృహదీశ్వర! (రూపకతాళం); ప్రణతార్తిహరం నమామి సతతం పంచనదక్షేత్ర ప్రకాశితం (ఆదితాళం); రంగనాయకం భావయే శ్రీ – రంగనాయకీసమేతం శ్రీ (ఆదితాళం) అనేవి మూడు లభ్యం ఔతున్నాయి.
మూర్తిత్రయంవారి తరువాతకాలంలోని కొందరు సువిఖ్యాత వాగ్గేయకారులు నాయకిరాగం లో కొన్ని కృతులు రచించేరు.
త్యాగరాజుగారు, పూర్ణషడ్జం రాగంలో లావణ్యరామ! (రూపకతాళం); శ్రీమానినీ మనోహర! (దేశాదితాళం); ఫలమంజరి రాగంలో సనాతన! పరమపావన! ఘనాఘనవర్ణ! కమలానన! (దేశాదితాళం); బృందావనసారంగ రాగంలో కమలాప్తకుల! కలశాబ్ధిచంద్ర! (దేశాదితాళం); మణిరంగు రాగంలో రానిది రాదు సురాసురులకైన (ఆదితాళం) కృతులని రచించేరు.
దీక్షితులవారి బృందావన సారంగ రాగంలో “రంగపుర విహార! జయ – కోదండరామావతార! రఘువీర! శ్రీ” (రూపకతాళం); మణిరంగు రాగంలో “మామవ పట్టాభిరామ! జయ మారుతి సన్నుతనామ! రామ!” (మిశ్ర ఏక తాళం) రచనలు లభ్యం ఔతున్నాయి.
(సశేషం)