సంగీతం—నాదవేదం—21
21—11—2020; శనివారం.
ఈ వారం కూడా 22~జనకరాగం~ఖరహరప్రియ నుండి జన్యరాగాల పరిచయం కొనసాగిస్తున్నాం!
జయనారాయణి రాగం/ఆదితాళం లోకూర్చబడిన మనవిని వినుమా! మరవ సమయమా! అనే కృతి జనప్రియమైనదే!
జయమనోహరి రాగంలో నీ భక్తిభాగ్యసుధానిధి—రూపకతాళం లోని కృతి అరుదుగా వింటాం! ఇదే రాగంలో, ఆదితాళంలో రచించబడిన కృతి యజ్ఞాదులు సుఖమనువారికి, సము—లజ్ఞానులు గలరా ఓ మనసా! లోకప్రసిద్ధమైనది. ఇదే రాగంలో, ఆదితాళంలోనే శ్రీరమ్యచిత్తాలంకార స్వరూప! బ్రోవుము అనే కృతిని కూడా అయ్యవారు రచన చేసేరు.
శ్రావ్యమైన మరొక జనప్రియరాగం గురించి ఇప్పుడు ప్రస్తావించుకో బోతున్నాం! కాని ఇది ఒక అపూర్వరాగం అనే చెప్పాలి. అయితే ఈ రాగంలోని త్యాగయ్యగారి కృతి (రాగం అపూర్వమైనా) రసికజన హృదయరంజకంగా ఉండడం వలన బాగా ప్రాచుర్యాన్ని పొందింది. అది— జయంతసేన రాగంలో,ఆదితాళంలో కూర్చబడిన “వినతాసుతవాహన! శ్రీరమణ!–మనసారగ సేవించెద రామ!” అనే కమనీయ కృతి.
ఆ తరువాత జన్యరాగమైన దర్బారు లో పరమరమణీయకృతులని వివిధతాళాలలో అయ్యవారు రచించేరు. అపరాధములను మాన్పి- ఆదుకోవయ్య (ఝంపతాళం); ఎందుండి వెడలితివో-ఏ ఊరో నే తెలియ నయ్య (త్రిపుటతాళం); ఏది నీ బాహుబల పరాక్రమమెన్నాళ్ళకెన్నాళ్ళు (ఆదితాళం)(ఇది కాపీరాగకృతిగా కూడా కొన్ని గ్రంథాలలో ఉంది); ఏల తెలియలేరు? పూర్వమేలాగు జేసిరో రామయ్య! (చాపుతాళం); నారద గురుస్వామి! ఇకనైన న–న్నాదరింపవేమి? ఈ కరవేమి?(ఆదితాళం); పరిపాలయ! దాశరథే! రామ! మాం (చాపుతాళం); ముందు వెనుక ఇరుప్రక్కల తోడై—ముర-ఖర హర! రారా! రారా! (ఆదితాళం); యోచనా? కమల లోచన! నను బ్రోవ (ఆదితాళం); రామ! లోభమేల? నను – రక్షించు పట్ల నీకింత శ్రీ (ఆదితాళం); రామాభిరామ! రమణీయనామ! సామజరిపుభీమ! (చాపుతాళం)
దీక్షితులవారి రెండు కృతులు త్యాగరాజాదన్యం న జానే గురుగుహాది సమస్త దేవతా స్వరూపిణః శ్రీ (ఆదితాళం); హాలాస్యనాథం స్మరామి కోలాహల మీనాక్షీ సమేతం (ఆదితాళం) ఈ రమ్యమైన దర్బారురాగంలో రచించ బడినాయి.
సంగీతమూర్తిత్రయానంతరకాలంలో వచ్చిన అనేక ప్రధాన కృతికర్తల హృదయాలని ఈ దర్బారురాగంలోని రంజకత్వలక్షణం ప్రేరేపింపజేసి అనేకకృతుల ఆవిర్భావానికి కారణ మయ్యింది. ఉదాహరణకి చెంగల్వరాయ శాస్త్రి, ఘనం కృష్ణయ్యర్, కోటీశ్వర అయ్యర్, కవికుంజర భారతి, లక్ష్మణన్ పిళ్ళై, ముత్తయ్య భాగవతర్, నీలకంఠ శివన్, పట్టాభిరామయ్య, పట్ణం సుబ్రమణ్య అయ్యర్, పల్లవి శేషయ్యర్, పాపనాశం శివన్, పెరియసామి తూరన్, సుబ్బరాయ శాస్త్రి, శుద్ధానంద భారతి, రామస్వామి శివన్, స్వాతి తిరునాళ్ మహారాజా, తిరువొత్తియూర్ త్యాగయ్యర్, ఉపనిషద్బ్రహ్మేంద్రయోగి, వెంకటరమణభాగవతర్, వేదనాయకం పిళ్ళై, వీణ కుప్పయ్యర్ మొదలైనవారు దర్బారురాగంలో మహనీయమైన రచనలు చేసిన వాగ్గేయకారులలో కొందరు.
(సశేషం)