సంగీతం—నాదవేదం—20
07—11—2020; శనివారము.
22 వ జనకరాగం—ఖరహరప్రియ నుండి జన్యరాగాలని అకారాదిగా పరికిస్తే వచ్చే మొట్టమొదటి రాగం మహామధురమైన ఆభోగి రాగం. ఈ ఆభోగిరాగంలో త్యాగయ్యగారు—నన్ను బ్రోవ నీకింత తామసమా! నా పై నేరమేమి? బల్కుమా! (దేశాదితాళం); మనసు నిల్ప శక్తి లేకపోతే (ఆదితాళం); నీలకంఠ! నిరంజన! (రూపకతాళం) అనే మూడు కృతులు కూర్చినట్లు తెలుస్తోంది. దీక్షితులవారు—శ్రీలక్ష్మీవరాహం భజేsహం / శ్రీలక్ష్మీసహితం శ్రితజనశుభప్రదం (ఆదితాళం) అనే కృతిని ఆభోగిరాగంలో రచించేరు. ఇది మహారక్తిరాగం కావడంవలన త్యాగయ్యగారి అనంతరం వచ్చిన వాగ్గేయకారులెందరో ఈ ఆభోగిరాగంలో కృతులను కూర్చేరు. ఉదాహరణకి వాలాజాపేట వెంకటరమణభాగవతులు, మైసూర్ సదాశివరావు, మైసూర్ వాసుదేవాచార్, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్, ముత్తయ్య భాగవతులు, పాపనాశం శివన్, గోపాలకృష్ణ భారతి, జి.ఎన్.బి., లలితదాసర్, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్, పెరియసామి తూరన్ మొదలైన మహామహులెందరో ఈ మనోరంజకరాగంలో కృతులు వ్రాసేరు. పట్టణం సుబ్రహ్మణ్యయ్యర్ గారి “ఎవ్వరి బోధన విని ఈ లాగు జేసేవురా?” (ఆదితాళం) లోకప్రసిద్ధమైన, సర్వజనప్రియమైన వర్ణం!
తరువాత జన్యరాగం కన్నడగౌళరాగం. ఈ రాగంలో ఓరజూపుజూచేదిన్యాయమా! ఓ రఘూత్తమా! నీ వంటివానికి (ఆదితాళం); సొగసు జూడ తరమా? నీ సొగసుజూడ తరమా! (రూపకతాళం) అనే రెండూ త్యాగయ్యగారి లోకప్రియకృతులు. దీక్షితులవారు నీలోత్పలాంబికయా నిర్వాణ సుఖప్రదయా రక్షితోsహం (ఆదితాళం) అనే కృతి కన్నడగౌళరాగంలో రచించేరు.
అపురూపమైన కలా(ళా)నిధిరాగం, దేశాదితాళంలో, చిన్ననాడె నా చేయిబట్టితివి అనే కృతి త్యాగయ్యగారిది తరచుగా వినిపిస్తూ ఉంటుంది.
మరొక జన్యరాగం— కానడలో – శ్రీనారద నాదసరసీరుహభృంగ శుభాంగ (రూపకతాళం); సుఖి యెవ(వ్వ)రో రామనామ (దేశాదితాళం) అనే రెండు కృతులు లభ్యమౌతున్నాయి. దీక్షితులవారి రెండు కృతులు కానడ రాగం లో — బాలాంబికాయాః పరం నహి రే రే చిత్త! (ఆది తాళం); విశ్వేశ్వరో రక్షతు మాం (ఆది తాళం) ఉన్నాయి. ౘాలామంది తరువాత కాలానికి చెందిన సుప్రసిద్ధ వాగ్గేయకారులు ఈ రాగంలో కృతులను రచించేరు.
జనకరాగం ఖరహరప్రియ నుండి జన్యరాగాలలో మంచి జనాదరణ పొందిన మరొక రాగం, కాపీరాగం. ఈ రాగంలో త్యాగరాజస్వామివారు అతడే ధన్యుడురా (చాపుతాళం); అన్యాయము సేయక (ఆదితాళం); ఇంత సౌఖ్యమని (ఆదితాళం); ఎన్నాళ్ళు నీ దోవ జూతు!-రామ-ఏమని నే ప్రొద్దు త్రోతు! (చాపుతాళం); చూతాము రారె! యీ వేడ్కను సుదతులార! నేడు (చాపుతాళం); పాహి కల్యాణ రామ! – పావనగుణ రామ! (ఆదితాళం); పాహి మాం శ్రీరామచంద్ర (చాపుతాళం); మీవల్ల గుణదోషమేమి? (ఝంపతాళం); రామ! పాహి, మేఘశ్యామ! పాహి (చాపుతాళం); రామ! రఘుకుల జలనిధి సోమ! (చాపు/రూపక తాళం); సుందర దశరథ నందన – వందనమొనరించెదరా! (ఆది/రూపక తాళం) మొదలైన అందమైన కృతులను రచించేరు.
దీక్షితులవారు — వేంకటాచలపతే! (ఆదితాళం); వీరహనుమతే! (రూపకతాళం) అనే రెండు కృతులని కాపీరాగం లో రచించేరు.
తరువాత కాలంలోని సుప్రసిద్ధ వాగ్గేయకారులు ౘాలామంది కాపీరాగ కృతులని కూర్చేరు. వారందరిలో వానమామలై జీయరుస్వామి వారి సకలజన హృదయరంజకమైన కృతి జానకీరమణ! దశరథ నందన! శర్వరీశవదన! (ఆదితాళం) సుప్రసిద్ధమైనది. ఆ కృతికి అంతటి ప్రశస్తి రావడానికి ప్రధానకారకులు సంగీతకళానిధి, గానచక్రవర్తి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి వర్యుల అపురూపమైన గానమాధుర్యమహిమే!.
(సశేషం)