సంగీతం—నాదవేదం—15
X—X—2020; శనివారము.
ఇప్పుడు 13 వ మేళకర్త రాగం అయిన గాయకప్రియ రాగం ప్రస్తావిస్తే, ఈ రాగంలో అయ్యవారు కృతిని ఏదీ చేసినట్లు కానరాదు. ఈ జనకరాగం నుండి వచ్చిన జన్యరాగం అయిన కలకంఠి రాగం లో, ఆదితాళంలో, శ్రీజనకతనయే! శ్రితకమలాలయే అనే మహారమణీయము, మధురము అయిన మహాలక్ష్మీదేవియొక్క శ్రీసీతాంబికా అవతారతత్త్వ నిరూపకమైన ఒక గొప్ప కృతిని అయ్యవారు రచించేరు. ఈ రాగజన్యమైన కలగడరాగంలో, ఆదితాళంలో, సమయము ఏమరకే, మనసా! అనే కృతిని అయ్యవారు చేసేరు. అలాగే ఇదే రాగజన్యమైన జుజాహుళి రాగం లో, ఆదితాళంలో, పరాకు జేసిన నీకు ఏమి ఫలము గలిగెరా, పరాత్పరా! అనే కృతిని త్యాగయ్యగారు కూర్చేరు.
14 వ మేళకర్త రాగం అయిన వకుళాభరణం రాగం లో, త్రిపుట తాళంలో, ఏ రాముని నమ్మితినో నేనే పూల పూజ చేసితినో అనే ఒక విపులమైన కృతిని అయ్యవారు రచించేరు. ఈ జనకరాగజన్యమైన వసంత భైరవి రాగం లో, రూపకతాళంలో నీ దయ రాదా! అనే కృతి, ఆదితాళంలో రమారమణ! భారమా? నన్ను బ్రోవ శ్రీకర! అని మరొక కృతి స్వామివారు వెలయింపజేసేరు.
15 వ మేళకర్త రాగం అయిన మాయామాళవగౌళ రాగం లో అయ్యవారు కూర్చిన నాలుగు కృతులు ఆది, రూపక, దేశాది తాళాలలో లభ్యం ఔతున్నాయి. తులసీదళములచే; దేవి! శ్రీ తులశమ్మ!; మేరుసమాన ధీర!; విదులకు మ్రొక్కెద అనే నాలుగు కృతులు సంగీతలోకంలో అమితజన ఆదరణని, గౌరవాన్ని పొంది ఉన్నాయి. ఈ జనకరాగం నుండి ఏర్పడిన జన్యరాగాలలో సావేరి రాగం; సౌరాష్ట్ర రాగం; గౌళ రాగం; గౌళిపంతు రాగం; వసంత/లలిత రాగం; రేవగుప్తి రాగం; బౌళి రాగం; నాద(థ)నామక్రియ రాగం; ఘూర్జరి(గుజ్జరి) రాగం; మొదలైన వాటిలో అయ్యవారు అనేక కృతులు రచించేరు. అందులో సావేరి రాగం; సౌరాష్ట్ర రాగం బాగా జన హృదయ రంజక రాగాలు కావడం వలన ఈ రెండు రాగాలలో త్యాగయ్యగారు ౘాలా కృతులని రచించేరు.
మాయామాళవగౌళ రాగం లో శ్రీ ముద్దు(త్తు)స్వామి దీక్షితులవారు లోకప్రసిద్ధమైన శ్రీనాథాది గురుగుహో జయతి జయతి (ఆదితాళం) అనే లోకప్రశస్తి పొందిన కృతిని మహామనోహరంగా నిర్మించేరు. అలాగే శ్రీశ్యామాశాస్త్రి వర్యులు ఇదే రాగంలో, త్రిపుటతాళంలో నీలాయతాక్షి!నీవె జగత్సాక్షి అనే రమ్యమైన కృతిని రచించేరు.
16 వ మేళకర్త రాగం అయిన చక్రవాకం రాగం గొప్ప రక్తిరాగం. ఈ రాగంలో త్యాగయ్యగారు కూర్చిన ఎటుల బ్రోతువో తెలియ (త్రిపుట తాళం); సుగుణములే చెప్పుకొంటి (రూపక తాళం) అనే రెండు కృతులు లభ్యం ఔతున్నాయి. దీనినుండి జన్యాలైన కళావతి రాగం; బిందుమాలిని రాగం; మలయమారుతం రాగం; వేగవాహిని రాగం లలో అయ్యవారు కృతులు రచించేరు. వీటిలో— బిందుమాలినిలో ఎంతముద్దో ఎంత సొగసో(ఆది); మలయమారుతంలో మనసా!ఎటులోర్తునే(రూపక) బాగా జనరంజకమైన లోకవిఖ్యాత కృతులు. మలయమారుతరాగంలో — జన్మమెందుకు(ఆదితాళం) అనే కృతిని త్యాగయ్యగారి ప్రముఖ ప్రత్యక్ష శిష్యుడైన మానాంబుౘావడి వెంకట సుబ్బయ్య గారు కూర్చేరు.
17 వ మేళకర్త రాగం — సూర్యకాంతంలో ముద్దుమోము ఏలాగు (ఆది) సుప్రసిద్ధమైనది. అలాగే దీని జన్యాలైన భైరవం రాగంలో (భైరవి కాదు — అది వేరే రాగం)—మరియాద కాదయా–మనుపవదేమయా(దేశాది) అనే కృతిని; సుప్రదీపం రాగంలో —వరశిఖివాహన!- వారిజలోచన!(ఆది) అనే కృతిని అయ్యవారు రచించేరు.
18 వ మేళకర్త ఐన హాటకాంబరి రాగం(ర-గు-ధు-ను)లో కాని, దాని జన్యరాగాలలో కాని అయ్యగారు చేసిన కృతులు ఏవీ లభ్యం కావడం లేదు. (డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు రచించిన *రక్షతు మాం శ్రీలక్ష్మీపతి—తిస్ర త్రిపుట తాళం— సంస్కృత కృతి మనకి రాగలక్షణకృతి గా లభ్యం ఔతోంది).
దీనితో ఇందుచక్రం, నేత్రచక్రం, అగ్నిచక్రం అనే మొదటి మూడు చక్రాలు —అంటే 3×6=18 మేళకర్త రాగాలు పూర్తి అయ్యేయి.
(సశేషం)