సంగీతం—నాదవేదం—14
03—10—2020; శనివారము.
ఇప్పుడు రసజ్ఞలోకంలో బాగా ప్రచారంలో ఉన్న సుప్రసిద్ధ రాగాలని గురించి సంక్షిప్తంగా పరిచయం చేసుకుందాం!
నేను ఈ సందర్భానికి త్యాగయ్య-దీక్షితులు-శ్యామాశాస్త్రి వర్యుల కృతులని — అంటే సంగీత త్రిమూర్తులు రచనలని మన అధ్యయనానికి ప్రధాన ఆధారంగా తీసుకుంటున్నాను. ముగ్గురిలోను త్యాగయ్యగారి రచనలకి ఉన్న లోకాదరణ దృష్ట్యా వారి కృతులు – కీర్తనలు వివిధరాగాల లోకప్రశస్తి, బహుళజనాదరణ అనుసరించి ప్రధాన రాగాలని ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. మిగిలిన వాగ్గేయకారులగురించి సందర్భానుసారంగా ప్రస్తావించడం ఉంటుంది. త్యాగరాగస్వామి కృతులకి అయ్యవారు కూర్చిన రాగాలని అకారాది క్రమం Alphabetical Index లో ఇక్కడ ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. అటువంటి క్రమంలో జనక(మేళకర్త)రాగ క్రమం పాటించడం శాస్త్రమర్యాదని అనుసరించి అనివార్యం కదా! మొదటి రెండు జనకరాగాలైన కనకాంగి, రత్నాంగి రాగాలలో త్యాగయ్యగారి రచనలు లభ్యం కావడంలేదు. ఇంక రత్నాంగి రాగం నుండి జన్యరాగమైన శ్రీమణి రాగం—దేశాది తాళం లో కూర్చబడిన ఏమందునే విచిత్రము అనే కృతిని గురించి ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం!
త్యాగయ్యగారు కృతిని కూర్చిన మొదటి జనకరాగం 3 వ మేళకర్త ఐన గానమూర్తి రాగం అని ఇప్పుడు మనకి లభిస్తూన్న ఆధారాలని అనుసరించి చెప్పవచ్చు. ఈ గానమూర్తి రాగం లో ఆదితాళంలో కూర్చబడిన గానమూర్తే! శ్రీకృష్ణవేణుగానమూర్తే! అనే కృతి కర్ణాటక సంగీతంలో సువిఖ్యాతమైన రచన అని చెప్పవచ్చు. 4 వ మేళకర్తరాగం ఐన వనస్పతి రాగం లో, రూపకతాళంలో పరియాచకమా అనే కృతిని త్యాగయ్యగారు రచించేరు. అదే రాగం నుండి జన్యరాగమైన రసా(వ)ళి రాగం, ఆదితాళంలో, అపరాధమును అనే కృతి ఉంది. 5వ మేళకర్త ఐన మానవతి రాగం లో, దేశాది తాళంలో ఎవరితో నేదెల్పుదు అనే కృతి రచించబడింది. అదే రాగజన్యం ఐన మనోరంజని రాగం లో, ఆది తాళంలో చేయబడిన అటు కారాదని ప్రసిద్ధమైన రచనే! 6, 7 మేళకర్తలలో కృతులు లభ్యం కావడం లేదనుకుంటాను. సుప్రసిద్ధమైన 8 వ మేళకర్త రాగం హనుమతోడి లేక తోడి రాగం లో త్యాగయ్యగారు సుమారు 30 కృతులు రచించి ఉంటారు. అన్నీ ఇక్కడ ప్రస్తావించడం వీలు కాదు. బాగా లోకప్రశస్తి పొందిన కొన్ని కృతులు ఇక్కడ ప్రస్తావించుకుందాం.
ఆరగింపవే; ఎందుకు దయరాదు; ఎందు దాగినాడో; ఏమి జేసితేనేమి; కద్దనువారికి; కొలువమరెగదా!; కోటినదులు; చేసినదెల్ల; రే! మానస మొదలైన అమోఘమైన అద్భుతకృతులను త్యాగయ్యగారు తోడి రాగంలో స్వరపరిచేరు. తోడిరాగజన్యమైన అసావేరి; ఆహిరి; ఘంటా; దేశికతోడి; ధన్యాసి; పున్నాగవరాళి; భూపాలం; శుద్ధసీమంతిని రాగాలలో కూడా ఆయన రమణీయమైన కృతులు రచించేరు. 9 వ మేళకర్త ఐన ధేనుక—జనకరాగం లో, దేశాది తాళంలో, తెలియలేరు రామా! భక్తి మార్గమును అనే లోకప్రశస్తి పొందిన గొప్ప రచన ఉంది. దీనినుండి జన్యరాగమైన భిన్నషడ్జం రాగం లో, దేశాది తాళంలో, సరివారిలోన అనే కృతి సుప్రసిద్ధమైనదే! 10 వ మేళకర్త నాటకప్రియ రాగం లో కాని, దాని జన్యరాగాలలో కాని కృతులు ఏవీ లేవు. 11వ మేళకర్త కోకిలప్రియ రాగం లో, దేశాది తాళంలో, దాశరథే! దయా శరథే! కృతి లోకప్రియమైనది. దాని జన్యరాగమైన వర్ధని రాగం లో, రూపకతాళంలో, మనసా! మన సామర్థ్యమేమే! అనే కృతి రచించబడింది. 12 వ మేళకర్త అయిన రూపవతి రాగం లో, త్రిపుటతాళంలో, నే మొరబెట్టితే మదిలోన నీకాయాసమేలరా? అనే ఒక కృతి ఉంది.
(సశేషం)