సంగీతం—నాదవేదం—13
26—09—2020; శనివారం.
దక్షిణభారత శాస్త్రీయసంగీత సిద్ధాంత ప్రవర్తకులు 72~మేళకర్త రాగాలు అనే వ్యవస్థని ఏర్పాటు చేసేరు అని తెలుసుకున్నాం! ఈ మేళకర్త రాగాలనే జనక రాగాలు అనికూడా పిలుస్తారు. కర్ణాటక సంగీత మూర్తిత్రయంగా పిలువబడే త్యాగరాజస్వామి-ముద్దు(త్తు)స్వామి దీక్షితులు శ్యామాశాస్త్రి అని చరిత్రప్రసిద్ధులైన ముగ్గురు వాగ్గేయకారులగురించి సంగీతప్రియులు అందరూ వినే ఉంటారు. సంగీతంలో పాడబడే కృతులు లేక కీర్తనలలోని సాహిత్యరచన సంగీతసంబంధమైన రాగస్వర, తాళ రచన రెండింటిని కూర్పు చేసిన సమర్ధులను వాగ్గేయకారులు అని పిలుస్తారు. కర్ణాటక సంగీతసంప్రదాయంలో అటువంటి సుప్రసిద్ధ వాగ్గేయకారులు అనేకులు ఉన్నారు. వారిలో త్యాగరాజస్వామివారు మహోత్కృష్టస్థానంలో ఉంటారు. వారికి అనేక ప్రత్యక్షశిష్యులు ఉన్నారు. వారందరిలోను ప్రముఖమైనవారు మానాంబుౘావడి వెంకట సుబ్బయ్యగారు. వెంకట సుబ్బయ్యగారి ప్రత్యక్ష శిష్యులలో దివిసీమకి చెందిన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు ప్రముఖస్థానీయులు. సుసర్లవారి ప్రత్యక్ష శిష్యవర్గంలో ప్రముఖులు, గాయకశిఖామణి పారుపల్లి రామకృష్ణయ్యపంతులు గారు. పారుపల్లివారి ప్రముఖశిష్యాగ్రగణ్యులు పద్మవిభూషణ్ డా.॥ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు. బాలమురళీకృష్ణ గారు జనకరాగ కృతిమంజరి అనే తమ గ్రంథంలో ఈ 72 మేళకర్త రాగాలలో కృతులని రచించి ఈ జనకరాగాలకి సంగీతశాస్త్రపరమైన సంపూర్ణ ప్రామాణిక సంగీత-సాహిత్య పరమైన కూర్పుని వ్యవస్థీకరించి సంగీతలోకానికి అందించేరు. మానాంబుౘావడి వెంకటసుబ్బయ్య గారి మరొక ప్రత్యక్ష శిష్యుడైన మహావైద్యనాథ అయ్యరు గారు ఈ 72 మేళకర్తరాగాల రాగమాలికని రచించి, సంగీతలోకానికే తలమానికమైన కృతిని మనలకు అందించి, శాశ్వత యశస్సు ఆర్జించేరు. ఈ 72 మేళకర్త రాగమాలిక ఆకాశవాణి వారి వద్ద సుమారు మూడుగంటలవ్యవధిలో బృందగానరూపంలో ఉండేవి. అవి నేను స్వయంగా రెండు పర్యాయాలు విన్నాను. భారతరత్న శ్రీమతి M.S.సుబ్బులక్ష్మి గారు పాడిన ఈ రాగమాలికని ఒక గంట కాలవ్యవధి కలిగిన కేసెట్ రూపంలో H.M.V. వారు 1989 లో విడుదల చేసేరు.
ఈ 72 మేళకర్త రాగాలు లేక జనకరాగాలు కాక మిగిలిన లోకంలో బాగా ప్రచారంలో ఉన్న రాగాలనన్నింటినీ జన్యరాగాలుగా పరిగణించి, వాటి-వాటి లక్షణాలని అనుసరించి ఆయారాగాలని వివిధ జనకరాగాలకి చెందిన జన్యరాగాలుగా వర్గీకరించడం జరిగింది. 72 జనకరాగాలు ఉన్నా సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు రాగాలు మాత్రమే బాగా జనాదరణని పొందిన రాగాలు ఉంటాయి. మిగిలిన జనుల మనసులని దోచుకున్న రాగాలన్నీ జన్యరాగాలనే చెప్పాలి. శ్రీమణి అనే రాగంలో త్యాగయ్యగారి కృతి ఏమందునే విచిత్రము బాగా ప్రచారంలో ఉంది. ఇది రెండవ మేళకర్త రాగం ఐన రత్నాంగి జన్యం. రత్నాంగిలో త్యాగరాజాది సంగీత మూర్తి త్రయం వారు కృతులని రచించలేదు. జనకరాగమైన రత్నాంగినుండి వచ్చిన జన్యరాగం రేవతి ఆధునికకాలంలో బహుళజనాదరణని పొందింది. దీనికి కారణం అన్నమాచార్యులవారు రచించిన నానాటి బ్రతుకు నాటకము అనే కృతికి లభించిన ప్రశస్తి అనే చెప్పాలి. ఈ కృతిని రేవతిరాగంలో అన్నమయ్యగారు కూర్చలేదు. నానాటి బ్రతుకు నాటకము అనే కృతికి రేవతిరాగం లో వరస కట్టిన వారు సుప్రసిద్ధ కర్ణాటక సంగీత గాయకులైన నేదునూరి కృష్ణమూర్తి గారు. నేదునూరి వారు అన్నమయ్యకి చెందిన ఒకపరికొకపరి ఒయ్యారమై అనే పరమసుకుమార రమ్యకృతిని ఆ కృతియొక్క సాహిత్యభావానికి అనుగుణమైన సంగీతభావాన్ని ఆవిష్కరించగలిగిన 22 వ మేళకర్త ఐన ఖరహరప్రియ రాగం లో వరస కట్టడం నేదునూరివారి సంగీత-సాహిత్య భావ సమన్వయ సంసిద్ధికి సమగ్ర సంకేతంగా అవగాహనచేసుకోగలగాలి. ఈ విధంగా నేదునూరి కృష్ణమూర్తివర్యులు అనేక అన్నమాచార్యకృతులకి సార్థకమైన స్వర-తాళ రచనని చేసి సంగీతసరస్వతికి అలంకరణలు సమకూర్చేరరు.
కర్ణాటక సంగీతంలోని రేవతి రాగమే హిందుస్థానీ సంగీతంలోకి వెళ్ళి అక్కడ అపురూపమైన ఖ్యాతిని ఆర్జించుకుంది. రెండవ మేళకర్త జన్యమైన రేవతి రాగం ఔఢవ – ఔఢవ రాగం. అంటే ఆరోహణ – అవరోహణలు రెండింటిలోను ఐదేసి స్వరాలు ఉన్న కూర్పుతో ఈ రాగం ఉంటుంది. ఈ రాగంలో గాంధారం(గ)—ధైవతం(ధ) వర్జితస్వరాలు. అంటే మిగిలిన ఐదు స్వరాల కూర్పుతో ఈ రాగం ఏర్పడింది. (రేవతి లేక రేవతి కానడ పేరుతో హిందూస్థానీ సంగీతంలో పూర్వం నుండి ఒక రాగం ఉంది. అది కాఫీ ఠా(థా)ట్ — అంటే ద.భా.సం. లోని ఖరహరప్రియరాగం యొక్క ఉ.భా.సం. పద్ధతిలోని కాఫీ థాట్ రూపం అని గ్రహించాలి. అంతకి ముందే ఉ.భా.సం. లో రేవతి అనే పేరుతో వేరే రాగం ఉంది కనుక ఇక్కడనుండి వలస వెళ్ళి అక్కడ స్థిరపడిపోయిన ద.భా.సం. లోని రేవతి బైరాగీ భైరవ్ లేక బైరాగీ అనే పేరుతో అక్కడ చలామణీ ఔతోంది). ద.భా.సం. సంప్రదాయంలో రేవతి రాగం కచేరీలలో ప్రథమ ప్రధాన రాగంగా కాని, ద్వితీయ ప్రధాన రాగంగా కాని పాడరు. సాధారణంగా తనియావర్తనం తదుపరి, ద్వితీయసభావిభాగం (second part of the concert) లోని ఉపశాస్త్రీయసంగీతాంశాలు లేక టుక్డాస్ (semi classical or light classical compositions) లో మాత్రమే ఒక పాట రూపంలోనో లేక రాగమాలికలలో ఒకానొక రాగ రూపంలోనో రేవతిరాగప్రయోగం చోటుచేసుకుంటోంది. యూట్యూబులో శ్రీమతి ఎం.ఎల్. వసంతకుమారి పాడిన రాగం-తానం-పల్లవి, డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన రాగం-తానం-పల్లవి రెండూ రేవతి రాగం లో ఉన్నాయి. కాని ఉ.భా.సం. లోని సంగీతసభలలో బైరాగీ రాగం తరుచు వినబడుతూ ఉంటుంది. యూట్యూబులోకూడా అనేక సువిఖ్యాత గాయనీ-గాయకులు పాడిన రేవతిరాగంలోని బడా ఖయాల్ లు అనేకం ఉన్నాయి. ఆ కాలం నాటి శ్యాం చౌరసియా ఘరానా కి చెందిన ఉస్తాద్ నజాకత్ ఆలీ ఖాc & ఉస్తాద్ సలామత్ ఆలీ ఖాc; గ్వాలియర్ ఘరానా కి చెందిన శ్రీమతి మాలినీ రాజూర్కర్ నుండి నేటి మహాగాయకుడైన మేవాటీ ఘరానా కి చెందిన సుప్రసిద్ధ పండిత్ జస్ రాజ్ వరకు అనేక అమర గాయనీ-గాయకుల రేవతి రాగం ఖయాల్ గానరూపంలో మనకి యూట్యూబులో లభ్యం అవుతూంది.
అలాగే మరొక ఔఢవ-ఔఢవ రాగం ఐన ద.భా.సం. సంప్రదాయంలోని భూపాలం రాగం లో ముద్దుస్వామి దీక్షితులవారి తిరువారూరు శివలింగ కీర్తనలు లో ఒకటైన కృతి సదాచలేశ్వరం భావయే అరుదుగా సంగీత సభలలో వింటాం. అదికూడా ప్రధానరాగ కృతిగా కాకపోవచ్చు. కాని ఇదే రాగం భూపాల్ తోడి పేరుతో సుప్రసిద్ధ ఉ.భా.సం. సంప్రదాయ గాయకులు బడా ఖయాల్ గా పాడతారు. యూట్యూబులో చూస్తే శ్రీమతి మాలినీ రాజూర్కర్, శ్రీమతి వీణా సహస్రబుద్ధే, ఉస్తాద్ అస్లం ఖాc పండిత్ ఉదయ్ భావల్కర్(ధ్రుపద్-గానం), పండిత్ రసిక్లా ల్ అంధేరియా వంటి హేమా-హేమీల బడా ఖయాల్ – ఛోటా ఖయాల్ – తరానా గానం మనకి పుష్కలంగా లభిస్తోంది. రసజ్ఞులు సంతృప్తిగా ఆస్వాదించి ఆనందమగ్నులు కావచ్చు.
మరికొన్ని కుతూహలజనకమైన ముఖ్యవివరాలు రాబోయే వారాలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! అంతవరకు స్వస్తి.
(సశేషం)