సంగీతం—నాదవేదం—9
29—08—2020; శనివారం.
క్రితం వారం క-ట-ప-యాది సంజ్ఞ గురించి చర్చించుకున్నాం. ఆ పై వారం, అంటే సంగీతం-నాదవేదం—7 లో మూడు రిషభాలు, మూడు గాంధారాలు, మూడు ధైవతాలు, మూడు నిషాదాలు గురించి తెలుసుకున్నాం. వాటి పరిభాషని కూడా పరిచయం చేసుకున్నాం. మూడేసి స్వరాల రూపాలు ర—రి—రు; గ—గి—గు; ధ—ధి—ధు; న—ని—ను అనే సంకేతాలద్వారా శాస్త్రంలో సూచించబడడం గురించి కూడా వివరించుకున్నాం.
ఇప్పుడు మరొక ముఖ్య విషయం తెలుసుకుందాం. సప్తస్వరాలలో, మధ్యమం (మ) కి ఇటువైపు రిషభం, గాంధారం ఉంటే — మ కి అటువైపు ధైవతం, నిషాదం ఉంటాయి అని గమనించాలి. ఈ వివరాలని గ్రహించి, గుర్తుంచుకుని గమనించడం వలన గణితశాస్త్రపరంగా ఏర్పడే వేరు-వేరు కూర్పులు(various mathematical combinations) ఈ దిగువ ఇవ్వబడిన విధంగా ఉంటాయి.
మ కి ఇటువైపు:—
ర—గ; ర—గి; ర—గు; రి—గి; రి—గు; రు—గు|
అంటే ఇవి ఆరు విధాలైన కూర్పులు లేక కాంబినేషన్స్ గా ఉంటాయి.
అలాగే మ కి అటువైపు:—
ధ—న; ధ—ని; ధ—ను; ధి—ని; ధి—ను; ధు—ను|
అంటే ఇవి మరొక ఆరు రకాలైన కాంబినేషన్స్ గా కూడా ఉంటాయి.
ఈ పై స్వరసంపుటీకరణాలతో వచ్చే రాగాల సంఖ్యని శుద్ధమధ్యమం తోను, ప్రతిమధ్యమం తోను కలపగా ఏ విధంగా ఎన్ని రాగాలు ఏర్పడతాయో ఇప్పుడు పరిశీలించవలసిన సందర్భం వచ్చింది.
ఈ విధమైన దక్షిణభారత సంగీత సిద్ధాంత పరమైన శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిని క్రీ.శ. 17వ శతాబ్దికి చెందిన శ్రీ వేంకటమఖి అనే సంగీతశాస్త్ర విద్వాంసుడు, వారు రచించిన సంగీత శాస్త్ర ప్రామాణిక సంస్కృత గ్రంథమైన చతుర్దండిప్రకాశిక లో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించేరు. ఆ విధంగా సంగీతశాస్త్రంలో ప్రయోగించబడే వివిధ స్వరాలపైన ఆధారపడి సువ్యవస్థితం చేయబడిన సలక్షణమైన 72—మేళకర్తరాగరీతి లో సమగ్రరాగవర్గీకరణని మనం వివరించుకోబోయే విధంగా విపులీకరించేరు.
షడ్జం—స; పంచమం—ప మేళకర్త రాగాలు అన్నింటిలోనూ ఉంటాయి. అవి రెండూ ఏ వికృతీలేని స్థిరమైన స్వరాలు అని మనం ముందే తెలుసుకున్నాం! అలాగే ముందుగా శుద్ధమధ్యమం ఉండే మేళకర్త రాగాలని పరిచయం చేసుకుందామనికూడా అనుకున్నాం. అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే మేళకర్తరాగాలలో స—మ—ప అనే మూడు స్వరాలూ ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. ఇంక మిగిలిన
రి (రిషభం)—గ (గాంధారం)—ధ (ధైవతం)—ని (నిషాదం)
అనే నాలుగు స్వరాల స్వరూప-స్వభావాలు మేళకర్త రాగాలలో ఏ విధంగా మారుతాయో, ఆ స్వరాలలోని మార్పులవలన ఏ మేళకర్త రాగానికి ఏ విధమైన ప్రత్యేకలక్షణం ఏర్పడుతుందో మనం స్పష్టంగా తెలుసుకోవాలి.
అలాగ తెలుసుకోవడానికి కొన్ని మౌలిక భావనలు(concepts) పరిచయం చేసుకోవాలి. ఆ పరిచయంలో భాగంగా ముందుగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ విధానంలో ఆరేసి రాగాలు చొప్పున ఒక మేళకర్త రాగ సముదాయం ఏర్పడుతుంది అని! ఈ ఆరు రాగాలని కలిపి ఒక చక్రంగా వర్గీకరించేరు. ఒక్కొక్క వర్గానికి ప్రత్యేకంగా ఒక్కొక్క పేరు పెట్టేరు. ఆ పేరు వినగానే అది ఏ వర్గం లేక తరగతికి చెందినదో తెలిసిపోతుంది. అటువంటి సౌలభ్యం కోసమే ఈ పద్ధతి ఏర్పాటు చేయబడింది.
(సశేషం)