సంగీతం—నాదవేదం—8
22—08—2020; శనివారం.
ముందుగా గంగా—కావేరీ సముదాయ సభ్యులందరికి సకుటుంబ హార్దిక వినాయకచతుర్థి శుభాకాంక్షలు సమర్పించుకుంటున్నాము.
యోగ క్షేమ ప్రదుడగు
నాగాస్యుని ౘవితి రోజు నైజాశీస్సుల్|
భోగాదిక రూపములో
బాగుగ మీకెల్ల స్వాస్థ్య భాగ్యమునిచ్చున్||
మనం క్రితం వారం 72 మేళకర్తరాగాలు కి సంబంధించిన ఆ రాగాల పేర్లు,
వాటికి సంబంధించిన ప్రణాళికలు మొదలైన విషయాలని గురించిన అధ్యయనం ఈ వారం కొనసాగించాలనుకున్నాం. ఆ సందర్భంలో క-ట-ప-యాది సంజ్ఞ గురించిన ప్రస్తావన వచ్చింది. ప్రాచీన సంస్కృత వాఙ్మయంలో మన పెద్దలు ఈ పద్ధతిని ఏర్పాటు చేసేరు. ఏ విద్యాభ్యాస రంగంలోనైనా లెక్కించవలసిన సందర్భం వచ్చినప్పుడు ఈ సంజ్ఞావిధానాన్ని ఉపయోగించడం సర్వసాధారణంగా జరుగుతుంది. భాషలోని అక్షరాలకి, గణితశాస్త్రంలోని అంకెలకి సంబంధం కూర్చబడి, ఆ పద్ధతి ద్వారా సంకేతాలు నిర్ణయించబడి వివిధ విద్యాభ్యాస విధానాలలోను సౌలభ్యంతో ఇది వినియోగించబడేది. ఆ ప్రాచీన సాంకేతికవిధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే దక్షిణభారత సంగీతవిద్యావిధానంలోని 72—మేళకర్త రాగాల పేర్లు తెలుసుకోవడానికి ఈ పద్ధతి వినియోగించబడింది.
క—ఖ—గ—ఘ—ఙ—చ—ఛ—జ—ఝ—ఞ
1—2—3—-4—-5—-6—-7—-8—-9—-0
ట—ఠ—డ—ఢ—ణ—త—థ—ద—ధ—న
1—2—-3—-4—-5—6—-7—8—9—0
ప—ఫ—బ—భ—మ
1—2—-3—-4—-5
య—ర—ల—వ—శ—ష—స—హ
1—-2—-3—-4—-5—6—-7-—8
పైన వివరించబడిన విధంగా అక్షరాలకి అంకెల సంకేతాలు కూర్చబడ్డాయి. పైన కూర్చబడిన సంజ్ఞలు నాలుగు వరసలలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ నాలుగు వరసల మొదటి అక్షరాలని పరికిస్తే, అవి, క-ట-ప-య గా మనం గ్రహించవచ్చు. ఈ నాలుగు అక్షరాలకి ఆది అంటే మొదలైన అనే పదం కలిపితే అది క-ట-ప-య+ఆది = కటపయాది సంజ్ఞ ఏర్పడుతుంది. ఈ సంకేతశాస్త్రం మన అధ్యయనానికి తోడ్పడుతుంది.
వీటి వినియోగం(Practical Application) మన సంగీతశాస్త్ర విద్యాభ్యాసంలో ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం. మన 72 మేళకర్త రాగాలలో మొదటి మేళకర్త రాగం పేరు “కనకాంగి“. ఈ పేరులో ఉన్న మొదటి రెండు అక్షరాలని పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తే అది ఏ మేళకర్తకి చెందిన రాగమో మనకి తెలుస్తుంది. ఈ లెక్క మేళకర్త రాగాలు గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తుంది.
ఉదాహరణలోని కనకాంగి రాగం పేరులో మొదటి రెండు అక్షరాలు క — న కదా. ఇప్పుడు పైన మనకి ఇవ్వబడిన పట్టికలో ఈ రెండు అక్షరాలకి సంకేతంగా ఉన్న అంకెలు తెలుసుకుందాం. క మన కటపయాది సంజ్ఞాశాస్త్రంలోని మొదటి వరుసలోని మొట్టమొదటి అక్షరం. దానికి సంబంధించిన అంకె 1. అలాగే రెండవ అక్షరమైన న రెండవ వరుసలో చివరి అక్షరమై, 0 (సున్న) సంకేతాన్ని కలిగి ఉంది. అంటే క—న అనే రెండక్షరాల అంకెలు రెండూ కలిపితే వరుసగా ఒకటి-సున్న అంటే 10(పది) ఏర్పడుతుంది. అయితే సంస్కృతంలో ఒక సూత్రం ఉంది. అంకానాం వామతో గతిః అని ఆ సూత్రం. అంకెలని మన కుడివైపునుండి ఎడమవైపుకి లెక్కించి పరిగణనలోకి తీసుకోవాలి అని ఈ సంస్కృత సూత్రానికి తెలుగులో భావం. అంటే 1—0 లలో, కుడినుండి ఎడమకి లెక్కిస్తే, ముందు సున్న, తరవాత ఒకటి వస్తాయి. అంటే 10 ~ 01 గా మారుతుంది. 01 అంటే 1 అని అర్థం కదా! ఇప్పుడు మరొక ఉదాహరణని చూద్దాం! మాయా మాళవగౌళరాగం తీసుకుందాం. మొదటి రెండు అక్షరాలు
మాయా కదా! వాటిని అంకెలలోకి మారిస్తే మా మూడవ వరుస అయిన ప వర్గంలో మా ఐదవ అక్షరం. రెండవ అక్షరం ఐన యా నాలుగవ వరుసలోని య వర్గంలో మొదటి అక్షరం. అంటే మాయా=51; దీనిని తిరగవేస్తే 15 వస్తుంది. అంటే మాయా మాళవగౌళరాగం 15 వ మేళకర్త రాగం అన్నమాట! ఈ పరిజ్ఞానంతో వచ్చేవారం 72—మేళకర్త రాగాలు ప్రణాళికని తెలుసుకుందాం!
(సశేషం)