సంగీతం—నాదవేదం—5

01-08-2020; శనివారం.

మనం ఈ శీర్షిక మొదటిభాగంలో సంగీతవిద్య కి సంబంధించిన సప్తస్వరాలు గురించి పరిచయం చేసుకున్నాం. వీటిని Musical Alphabet అంటారనికూడా తెలుసుకున్నాం. సంగీతవిద్యాకారులైన నాదశాస్త్రవేత్తలు పరమేశ్వరుడు సృజించిన ప్రకృతి లోని పశుపక్ష్యాదుల కంఠస్వరాలలో సూక్ష్మరూపంలో నిక్షిప్తం చేయబడిన వివిధ విలక్షణ శబ్దాలనుండి ఈ మనోరంజకమైన సప్తస్వరాల మూలద్రవ్యాలని సేకరించి వాటిని సంగీతవిద్యకి అనుగుణమైన నాదాత్మకస్వరాలుగా తీర్చి దిద్దేరు. ఈ వివరం మనకి శార్ఙ్గదేవుడు రచించిన ప్రాచీన ప్రామాణిక సంగీతవిద్యాగ్రంథమైన సంగీతరత్నాకరం లో ఈ విధంగా లభిస్తోంది.

మయూరచాతకచ్ఛాగ క్రౌంచకోకిలదర్దురాః
గజశ్చ సప్తషడ్జాదీన్ * *క్రమాదుచ్చారయంత్యమీ

“నెమలి, వానకోయిల, మేక, క్రౌంచపక్షి, కోకిల, కప్ప, ఏనుగు — ఇవి చేయు ధ్వనులనుండి షడ్జాది సప్తస్వరాలు ఏర్పడడం జరిగింది. నెమలియొక్క క్రేంకారధ్వని నుండి షడ్జం ~ స ఏర్పడింది. వానకోయిల కూతనుండి (ఋ)రిషభం ~ రి పుట్టింది. (కొందరు శాస్త్రకారులు వృషభం లేక ఎద్దు అంబారవం నుండి రి వచ్చిందంటారు). మేక అరపు నుండి గాంధారం ~ గ కలిగింది. క్రౌంచపక్షి కంఠధ్వనినుంచి మధ్యమం ~ మ ఏర్పడింది. కోకిల గళరవం నుండి పంచమం ~ ప జనించింది. కప్ప అరుపులోనుంచి ధైవతం ~ ధ కలిగింది. (కొందరు శాస్త్రకారులు అశ్వఘోష లేక గుర్రం సకిలింపు నుండి ఏర్పడిందని అంటారు). ఏనుగు ఘీంకారం నుండి నిషాదం ~ ని జన్మించింది” అని పై శ్లోకానికి భావం చెప్పవచ్చు.

అంటే ప్రకృతినుంచి సహజంగా లభించిన పైన వివరించబడిన ముడిసరుకు (raw-material) వంటి ప్రాకృతిక స్వరసంపదనుండి సంగీతనాదయోగ్యమైన గాయన/వాదనశైలిద్వారా వ్యక్తీకరింపబడే రాగవిద్యాకళకి మౌలికఅక్షరాలుగా ఉండే మనోహరమైన సప్తస్వరాలు ఆవిర్భవించేయి అని చెప్పవచ్చు.

విషయం సులువుగా అర్థంకావడంకోసం ౘాలా వరకు సాంకేతిక అంశాలని మన ప్రణాళికనుండి తప్పించి, శాస్త్రభావనలని సరళీకరించి సంగీతవిద్యాప్రియులకి అందించే ప్రయత్నం జరుగుతోంది. విషయసౌలభ్యంకోసమే ఈ రాజీలని ఆశ్రయిస్తున్నాం. సప్తస్వరాలలోని షడ్జం ; పంచమం — ఈ రెండు స్వరాలు స్థిరమైనవి. వీటికి ఎటువంటి వికృతులూ లేవు. మిగిలిన ఐదు స్వరాలకి, వాటి సహజ స్వరస్థానాలైన ప్రకృతులతోబాటు, ప్రతిస్వరానికి ఒక్కొక్క వికృతికూడా ఉంది. అంటే, రి-గ-మ-ధ-ని — ఈ ఐదు స్వరాలు 5×2=10గా ప్రకృతి – వికృతి స్వరూపాలని కలిగి ఉంటాయి. ఈ పదిస్వరాలకి స-ప స్వరాలు రెండూ కలిపితే 12 స్వరాలు ఏర్పడుతాయి.

మొత్తం భారతీయ సంగీత విశ్వంలోని రాగజగత్తు సర్వవర్ణ రంజితమై విరాజిల్లడానికి ఈ 12 స్వరాల రకరకాల కూర్పు ఆధారభూతం ఔతూందన్నమాట. అంటే మొత్తం ఏడు స్వరాలకి కలిపి పన్నిండు స్వరస్థానాలు ఉన్నాయన్నమాట.

రాగసంగీతానికి సంబంధించిన ఇతర వివరాలు కొన్ని వచ్చేవారం ముచ్చటించుకుందాం!

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *