సంగీతం—నాదవేదం—4
25-07-2020; శనివారం.
మూడువారాలనుండి కేవలం సంగీతశాస్త్రం పరిధిని అనుసరించి శాస్త్రవిషయాలని జాగ్రత్తగా
అధ్యయనం చేయడంలో తలమునకలుగా ఉన్నాం. సాంకేతికవిషయవివరణలో పాలుపంచుకున్నాం. మెదడుకి తగినంత బలవర్ధక ఆహారం ఔషధప్రాయంగా అందించడానికి ప్రయత్నించేం. ఈ వారం కాస్తంత విరామం తీసుకుని మన సంగీత విద్యకి దోహదకరమైన వేడుకని కలిగించే మంచి పసందైన కథ ఒకటి చెప్పుకుందాం! ఇది పూర్వంనుంచి మన పెద్దలు చెప్పే కథే!
అనగనగా ప్రాచీన భారతదేశంలో కైవల్యసామ్రాజ్యం అనే ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి కాశీనగరం ముఖ్యపట్టణంగా ఉండేది. ఆ రాజ్యానికి విశ్వనాథచక్రవర్తి మహారాజుగా ఉండేవాడు. ఆయన సర్వశుభలక్షణశోభితుడై, సకలజనమనోరంజకంగా దక్షతతో రాజ్యపరిపాలనచేసేవాడు. ఆయన భార్య స్వస్తిమతీదేవి పట్టపురాణి. హేరంబదేవుడు
ఆ పుణ్యదంపతుల పెద్దకొడుకు. హేరంబదేవుడు పరిపాలనా దక్షతలో పరిణతిపొందినవాడు. ఎల్లప్పుడు తండ్రిని విడవక రాజ్యపాలనలో విశ్వనాథచక్రవర్తికి చేదోడు-వాదోడు
గా ఉండేవాడు. రెండవ కొడుకైన కార్తికేయుడు పుట్టుకతోనే బాలమేధావి. సర్వవిద్యలని కూలంకషంగా నేర్చుకోవాలని ఆరాటం పడేవాడు. విద్యాభ్యాసం విషయంలో అపారకుతూహలం కలవాడు. తల్లితండ్రులవద్ద, అన్నగారైన హేరంబదేవునివద్ద చిన్నతనంనుంచి బాలకార్తికేయుడు అనేకవిద్యలు అలవోకగా
నేర్చుకుని అందరిని అబ్బురపరిచేవాడు. తగిన సమయం రాగానే ఉపనయనానంతరం కార్తికేయకుమారుడు, తల్లి-తండ్రుల పర్యవేక్షణలో, తమ రాజాస్థాన కులాచార్యులవారి సన్నిధానంలో వేద, వేదాంగాల అధ్యయనాన్ని అవలీలగా అనతికాలంలోనే పూర్తిచేసి ఆచార్యవర్యుల ప్రత్యేక ఆశీర్వచనాలకి, విశేష అనుగ్రహానికి పాత్రుడయ్యేడు.
ఆ తరువాత, కార్తికేయకుమారుడు, తన రాజ్యంలోను, పరిసరనగరాలలోను ఉన్న మహావిద్వాంసులందరి వద్ద వివిధవిద్యలని ఆపోశనం పట్టి తల్లి-తండ్రులకి, అన్నగారికి విశేషప్రీతిని కలిగించేడు.
తన విద్యాసముపార్జన సందర్భంలో వివిధ ప్రాంతాల లో ఉన్న క్షేత్రాలని, తీర్థాలని, దేవాలయాలని, ప్రాచీన శిల్పకళావైభవయుత నిర్మాణాలని విడవకుండా
యువకార్తికేయుడు దర్శించుకుంటూ ఉండేవాడు. ఆ సందర్భంలో అతడు చూచిన ఆలయాలలోని వివిధ గోపుర, మండపాది నిర్మాణ కౌశలం, శిల్పరచనా చారిమ మొదలైన మహా ఆకర్షణీయమైన దృశ్యాలు యువకార్తికేయుని మనస్సులో శిల్పవిద్య ని
నేర్చుకోవడానికి గాఢమైన ప్రేరణని కలిగించేయి. ఆ ప్రేరణ దినదినప్రవర్ధమానమయ్యింది. దానితో ఆయన తన తండ్రి, అన్నగారల సహాయంతో సరైన శిల్పాచార్యులవారి గురించి బాగా భోగట్టా చేయించారు. తన నగరానికి ఈశాన్యంలో ఉన్న సుందర మహారణ్యమధ్యంలో మహర్షి అయిన సర్వదర్శనాచార్య అనే పేరుగల శిల్పవిద్యాపారంగతుడు గురుకులపద్ధతిలో
శిల్పవిద్యని నేర్పుతున్నాడని కార్తికేయుడికి తెలిసింది. వెంటనే కార్తికేయుడు తన పెద్దల ఆశీస్సులు, అనుజ్ఞ తీసుకుని ఏ పటాటోపమూ లేకుండా ఒక్కడూ సర్వదర్శనాచార్యులవారి సన్నిధికి వెళ్ళేడు. అక్కడ ఆచార్యులవారికి సాష్టాంగంగా దండనమస్కారం
చేసి వారి ఆశీస్సులు గ్రహించేడు. ఆచార్యులవారు తమ ఆసనంలో కూర్చుని, కార్తికేయునికూడా
తగిన చోట కూర్చొనడానికి ఏర్పాటు చేసేరు. ఆ పైన వారిద్దరిమధ్య సంభాషణ ఇలాగ జరిగింది:—
ఆచార్యులు:- నాయనా! నీవెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చేవు?
కార్తికేయ:— ఆచార్యవర్యా! నేను మొట్టమొదటగా విద్యార్థిని. తమవద్ద శిల్పవిద్యని అభ్యసించడానికి ఇక్కడికి వచ్చేను. కాశీరాజుగారైన విశ్వనాథచక్రవర్తి గారికి నేను రెండవ కొడుకుని. ప్రధానంగా విద్యాభిక్షకై తమరిని ఆశ్రయించుకున్న తమ సేవకుడిని.
ఆ:—శిల్పవిద్య నేర్చుకోవడానికి వచ్చావా నాయనా! మంచిది. నీకు ఈ విద్యని నేర్పడానికి, నాకు, శిల్పశాస్త్రశారద అనుజ్ఞ ఇచ్చేరు. నీ ముఖవర్చస్సు నీవు సర్వవిద్యావిశారదుడవు గా పరిణతి పొందగల ధన్యవిద్యార్థివి అని సూచిస్తోంది. అయితే ఒక వివరం చెప్పు. ఈ విద్య నేర్చుకోవడానికి, చిత్రకళావిద్య లో సంపూర్ణవిద్వత్తు ఉండాలి కదా! మరి చిత్రకళని అభ్యసించేవా, కార్తికేయా?
కా:—ఆచార్యవర్యా! నాకు చిత్రకళ రాదు. అందువలన ముందు చిత్రకళని నేర్పించండి ఆర్యా!
ఆ:—సరే, వత్సా! చిత్రకళాభ్యాసానికి తప్పనిసరిగా నృత్యవిద్య పూర్తిగా నేర్చుకుని
ఉండాలి. మరి నృత్యవిద్యలో ౘక్కగా కృషి చేసేవా, నాయనా?
కా:—అయ్యో, స్వామీ! నృత్యవిద్యని నేను ఏమాత్రమూ నేర్చుకోలేదండీ! అయితే నృత్యవిద్యని
కూడా తమ వద్దే అభ్యసించడానికి అనుమతిని ఇప్పించండి ఆచార్యదేవా!
ఆ:—అలాగే కుమారా! నృత్యవిద్యాభ్యాసానికి వాద్యసంగీతవిద్యాశిక్షణ తప్పనిసరి మరి!
దాని మాటేమిటి నాయనా?
కా:—అయ్యయ్యో, అది అసలేమీ రాదు మహానుభావా! అందువలన వాద్యసంగీతంతోనే
తమ వద్ద నా ౘదువును ప్రారంభించడానికి తమ అనుమతిని ఇవ్వండి, ప్రభూ!
ఆ:—తప్పకండా అలాగే చేయవచ్చు పుత్రా! కాని, రాగ-తాళవాద్యవిద్యని సమగ్రంగా గ్రహించడానికి గానం, అంటే, గాత్రసంగీతవిద్య పరిపూర్ణంగా అభ్యసించి ఉండాలి, తండ్రీ! మరి, గానవిద్య పూర్తి చేసుకున్నావా, చిన్నారీ?
కా:— అదీలేదు, ఆర్యఆచార్యవరిష్ఠా!గాత్రసంగీతం ఈ విద్యల కల్పతరువుకి తల్లివేరు
ఐతే గాత్రసంగీతమే నేర్పించండి అయ్యవారూ!
అని కార్తికేయకుమారుడు, సర్వదర్శనాచార్యుల పాదాలపై వాలిపోయేడు. ఆచార్యులవారు శిష్యుని లేవనెత్తి, అక్కున చేర్చుకుని, మూర్ధాన్ని ఆఘ్రాణించి ఆశీర్వదించేరు. మంచి ముహూర్తం చూసి, గాత్రసంగీతంతో కార్తికేయకుమారుడికి, సర్వదర్శనాచార్యులవారు తమ ఆశ్రమంలో
ౘదువుని నేర్పించడం మొదలుపెట్టేరు.
గాత్రసంగీతం యొక్క ప్రాముఖ్యతని చెప్పడానికి పెద్దలు ఈ కథని చెప్పడం కద్దు.
(సశేషం)