సంగీతం—నాదవేదం—3

18—07—2020; శనివారం.

వేదం“:— సంగీతానికి ప్రాచీన భారతదేశంలో “గాంధర్వవేదం” అనే పేరు బాగా ప్రచార-వ్యవహారాలలో ఉండేది. గాంధర్వం అనబడే విద్యాశాస్త్రం శ్రీ దత్తిలాచార్యుల వారిచేత ఈ విధంగా నిర్వచించబడింది.

పదస్య స్వరసంఘాతః తాలే(ళే)న సంగతః తథా|
ప్రయుక్తః చావధానేన గాన్ధర్వం అభిధీయతే||

“స్వరసహితపదం తాళానికి అనుగుణంగా కూర్చబడి, శ్రద్ధాత్మకమైన జాగ్రత్తతో గాన(వాద్య)సంగీతరూపంలో ప్రయోగించబడితే, అటువంటి (ప్రయోగప్రధాన) కలా(ళా)త్మక దివ్యవిద్యా కౌశలానికి గాన్ధర్వం అని పేరు”.

గంధర్వో దేవగాయకః (A Gandharva is a celestial singer or a musician of Gods) అంటోంది నిఘంటువు. దేవతలకి సంతోషాన్ని, ప్రసన్నతని కలిగించడానికి మధురమైన గానం చేసేవాడు లేక హృదయాహ్లాదకరమైన సంగీతాన్ని అందించేవాడు *గంధర్వుడు అని భావం. గంధర్వస్య ఇదం గాంధర్వం అటువంటి దేవగాయకునికి
సంబంధించిన దివ్యవిద్యయే గాంధర్వం అని వ్యుత్పత్తి.

శ్రీవేదవ్యాసభగవానులు అనుగ్రహించిన శ్రీమన్మహాభారత మహేతిహాసం లో, అనుశాసనపర్వం, 19-వ అధ్యాయంలో, 46/47 శ్లోకంలో ఈ గంధర్వులు, గాంధర్వం యొక్క ప్రస్తావన ఉంది.

అవాదయన్ చ గన్ధర్వాః వాద్యాని వివిధాని చ||
అథ ప్రవృత్తే గాన్ధర్వే దివ్యే ఋషిః ఉపావిశత్ |

“(దేవలోకంలో) గంధర్వులు వివిధ వాద్యాలను వాయించిరి. ఆ విధంగా అక్కడ ఆరంభించబడిన దివ్య(నృత్య)గీతగానంలో మహర్షి(అష్టావక్ర మహాత్ములు) వేంచేసి కూర్చుండెను”.

విదజ్ఞానే అను ధాతువునుండి వేదః అంటే వేదము అనే పదం ఏర్పడింది. వేదానికే శ్రుతి అనిపేరు. అపౌరుషేయ పరమాత్మ వచనానికే, అంటే మానవబుద్ధిచేత రచింపబడని పలుకులు, తొలి పలుకులు, తొలి ౘదువు నకే వేదం అని పేరు. సకల భారతీయ విద్యలకి, కళలకి, శాస్త్రాలకి వేదమే పుట్టిల్లు. అందువలన వేదం లౌకిక – అలౌకిక జ్ఞాన భాండాగారం. అటువంటి వేదానికి ఆరు వేదాంగాలు, ఆరు ఉపాంగాలు,నాలుగు ఉపవేదాలు మొదలైన ప్రధాన శాఖోపశాఖలు ఏర్పడడం జరిగింది.ఆ నాలుగు ఉపవేదాలు యివి:—

(1) ఆయుర్వేదం, (2) గాంధర్వవేదం, (3) ధనుర్వేదం, (4) శిల్పవేదం.
అందువలన సంగీతం నాదవేదం గాను, కొన్నిసందర్భాలలో నాదయోగం గాను అభివర్ణితమౌతోంది.

ప్రాచీనకాలంలో గాత్ర/వాద్య సంగీతం, నృత్యం, నాట్యం, నాటకం మొదలైన వైదిక కలా(ళా)స్వరూపాలు, యజ్ఞ – యాగాది క్రతువులలో భాగంగా దేవతాసంప్రీతి కోసం, ఋషువరులు, మునిశ్రేష్ఠుల ప్రసన్నతాప్రాప్తి కోసం ప్రయోగంలో ఉన్నాయి. అవి క్రమంగా దేవాలయాల సంస్కృతిలో అవిభాజ్యవిధిగా రూపాన్ని సంతరించుకున్నాయి. ఆ తరువాత రాజాస్థానాలలోకి, భూస్వామ్య, ధనస్వామ్య, వ్యాపారస్వామ్య వ్యవస్థలలోకి, ప్రజాతంత్రవ్యవస్థలో సామాన్య ప్రజలలోకి, వారి వినోదదాయక నాటకరంగ, చలనచిత్రరంగంలోకి క్రమంగా సంగీతం ప్రవేశించడం జరిగిందని భావించవచ్చు.

ఇటువంటి లౌకిక ప్రయాణ అనుక్రమణికలో పయనించే సంగీతం తన మౌలిక పరమగమ్యస్థానప్రాప్తి(In the attainment of the fundamentally supreme and sublime goal) విషయంలో తన ధ్యేయాన్ని ఏ మాత్రమూ కోల్పోలేదు. అందువలన సంగీతం యొక్క అసలు సాఫల్యస్వరూపాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి.

రాగ తాల(ళ) లయాధీనం శ్రుతి సుస్వర సంయుతమ్ |
స్వాత్మానంద భవం దివ్యం సంగీతం మోక్షదాయకమ్ ||

(శ్రీశారదాదేవ్యుపనిషత్ )

“శ్రుతిశుద్ధమై, సుస్వరశోభితమై, రాగ-తాల(ళ)-లయలతో సుసజ్జితమై (నాదయోగులైనవారియొక్క) అంతరాత్మానందంనుండి ఆవిర్భవించే దివ్యసంగీతం మోక్షప్రదమైనది” అని దీని భావం.

అంటే, సంగీత సరస్వతీదేవి ని పరాభక్తి తత్పరతతో సర్వదా అర్చించి, ఆరాధించిన గాన(వాద్య)సంగీతయోగినీ/యోగులు, ఆ నాదపరబ్రహ్మోపాసనాయోగం అనుష్ఠించడంవలన తాము తరించడమేకాక, దీనియందు అపార రక్తిభావం కలిగిన భక్త శ్రోతృగణాన్ని కూడా తరింపజేయగలుగుతారు.

గతంలో త్యాగరాజాది సంగీతమూర్తిత్రయాదులేకాక, ఈ కాలంలోని అనేక సుప్రసిద్ధ సంగీతకారులు కూడా ఈ విషయానికి ఆదర్శప్రాయమైన రీతిలో వారి జీవితాలు నిర్వహించుకుని పరమపదాన్ని పొంది, మనందరినీ కూడా తరింపజేయ సమర్ధులై ఉన్నారు.

ఉత్తర – దక్షిణ భారతీయ సంగీతరంగాలలో నాదయోగినీ/యోగులు గా తమ తమ జీవితాలను ధన్యంచేసుకుని, మనలనందరినీ సంగీతశారదాదేవి పరిపూర్ణానుగ్రహానికి యోగ్యులను చేయజాలిన ఎందరో మహానుభావులు ఉన్నారు. వారి అందరికీ వందనములు హృదయపూర్వకంగా సమర్పించుకుంటున్నాం.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *