సంగీతం—నాదవేదం—2
11—07—2020; శనివారము.
నాదం:— ఈ మంగళమయ పదము, దీని మూలభావనారూపమైన దివ్యతత్త్వము కేవలం ఋషుల రసమయదర్శనానుభవమునుండి వారి అమేయతపఃఫలముగా ఆవిర్భవించేయి.
” ‘న’కారం ప్రాణనామానం ‘ద’కారం అనలో విదుః|
జాతః ప్రాణాగ్ని సంయోగాత్ తేన నాదోsభిధీయతే”||
(సంగీతరత్నాకరం)
‘న’కారం ప్రాణరూపంగాను, ‘ద’కారం అగ్నిరూపంగాను ఆర్షవిదులు దర్శించేరు. (సజీవమైన మానవదేహంనుండి బయలువెడలే) ఈ ప్రాణం (వాయుదేవతా స్వరూపం), అగ్ని (తేజోదేవతా స్వరూపం) రెండింటి సంయోగంనుంచి పుట్టినందువలన ఈ ధ్వనిని “నాదం” అంటారు.
(జీవుడి శరీరాన్ని ప్రాణం విడిచిపెట్టేస్తే, అటువంటి ప్రాణరహిత దేహాన్ని ఉష్ణంకూడా వదిలేస్తుంది. అందువలన ప్రాణాగ్నులు రెండూ మానవదేహంలో లేక జీవదేహంలో విడదీయడానికి వీలులేకుండా ఉంటూ, జీవుల శరీరాలని వివిధక్రియాకలాపనిర్వహణలకి యోగ్యంగా చేస్తున్నాయి. అటువంటి “ప్రాణిగ్ని సంయోగం” నాదయోగులైన మహాపురుషులయొక్క “నాదోపాసనాయోగం“గా పరిణతి పొందడానికి ఉత్తమ గురుపరంపర ద్వారా అంకితభావంతో అభ్యాసమును, ఆత్మసమర్పణతో ఉపాసనను నిర్వహించడం అనే ఈ రెండూ అత్యావశ్యకమైనవి.).
అంతేకాదు. శాస్త్రకారులు ఇలాగ మనకి స్పష్టం చేస్తున్నారు:—
“నాదేన వ్యజతే వర్ణః పదం వర్ణాత్ పదాత్ వచః|
వచసో వ్యవహారోsయం నాదాధీనం అతః జగత్ “||
“నాదం నుండి వర్ణం(మనం నోటితో ఉచ్చరించే అక్షరం) పుడుతుంది. అటువంటి నాదమయవర్ణాల కూర్పుతో పదం(మాట) ఏర్పడుతుంది. మాటల సముదాయంతో వాక్యనిర్మాణం జరుగుతుంది. అటువంటి వాక్యాలద్వారా మనిషి ఈ జగత్తులో వ్యవహారం(లౌకికం+అలౌకికం) నిర్వహిస్తున్నాడు. అందువలన, మొత్తంమీద చూస్తే, ఈ జగత్తు అంతా నాదంయొక్క అధీనంలోనే ఉంటోంది”.
“హఠయోగ ప్రదీపిక“(IV:102)* ఇలాగ విశదం చేస్తోంది:—
“యత్ కించిత్ నాదరూపేణ శ్రూయతే శక్తిరేవ సా|
యః తత్త్వాంతో నిరాకారః స ఏవ పరమేశ్వరః”||
“నాదమయంగా వినబడే ఏ స్వల్పధ్వని ఐనా అది శ్రీమాతస్వరూపమే తప్ప మరేమీ కాదు. అటువంటి నాదతత్త్వంయొక్క పరమధ్యేయం నిరాకార పరమేశ్వర తత్త్వమే“!
అందువలననే నారాయణతీర్థయతివరేణ్యులు, తమ “శ్రీకృష్ణలీలాతరఙ్గిణి“
ఫలశ్రుతిలో ఈ విధంగా అన్నారు:—
“కామదా కామినాం ఏషా ముముక్షూణాం చ మోక్షదా|
శ్రుణ్వతాం గాయతాం భక్త్యా కృష్ణలీలాతరఙ్గిణీ”||
“భక్తితో ‘కృష్ణలీలాతరఙ్గిణి’ లోని గీతాలని వినినా (లేక) పాడినా (ధర్మబద్ధమైన) కోరికలున్నవారికి వారి లౌకికకామాలు నెరవేరుతాయి. అలాగ కాకుండా మోక్షం కావాలనుకుంటే అదే ప్రాప్తిస్తుంది.” (అంటే భారతీయ వైదికసంప్రదాయసిద్ధమైన చతుర్విధ పురుషార్థాలని
కేవలం పూర్ణభక్తితో తీర్థులవారి తరంగాలని వినడంద్వారాకాని, పాడడంద్వారాకాని పొంది సాధకజనులు తమ జీవితాలని పూర్తిగా సఫలం చేసుకోవచ్చు అని అర్థం. ఈ మాటలు దైవభక్తిమయమైన సంగీత కృతులకి, సంకీర్తనలకి —ఏ వాగ్గేయకారులకి చెందినవైనా —
కూడా వర్తింపజేయవచ్చు.).
నాదశాస్త్రానికి సంబంధించిన గహనమూ, గంభీరమూ అయిన అనేక నాదయోగరహస్యవిషయాలు ప్రాచీన భారతీయ సంస్కృత గ్రంథాలలో లెక్కకి మిక్కుటంగా ఉన్నాయి. వాటిలో ప్రధానమైన విషయాలని ఇక్కడ పరిమితంగా ప్రస్తావించినా అది ౘాలా విస్తారంగా ఐపోతుంది. కనుక ఇక్కడితో “నాదం” విషయం ముగిద్దాం.
(సశేషం)
స్వస్తి||