సంగీతం—నాదవేదం—1
04-07-2020; శనివారం.
మన సంగీతం భారతీయ సంగీతం. ఇది స్వరాలు అని చెప్పబడే స షడ్జం, రి రిషభం, గ గాంధారం, మ మధ్యమం, ప పంచమం, ధ ధైవతం, ని నిషాదం, అంటే, సరిగమపధనిస అనే సప్తస్వరాల(Musical Alphabet) యొక్క వరుసక్రమంలో ఉండే మేళవింపుతో కూర్చబడిన మధుర నాదమయ సరసహృదయరంజక కళ/శాస్త్రం లేక ఒక మహావిద్య.
“యా విద్యా సా విముక్తయే” అని ఆర్ష వచనం. “ఏది మోక్షప్రదాయకమో అది విద్య” అని నిర్వచనం. పరమాత్మమయమైన పరిపూర్ణ భక్తిభావంతో పాడడం, లేక వినడం వలన సంగీతం ముక్తిని లేక ఇష్టదేవత అనుగ్రహాన్ని కలిగిస్తుంది. “స్వతో రంజయతి ఇతి స్వరః”, అంటే “స్వయంగా తనకుతానే శ్రోతలని రంజింపజేసేది స్వరం” అని “స్వరం” అనే మాటకి నిర్వచనం. ఈ సంక్షిప్త భూమికతో విషయంలోకి వెడదాం!
ముందుగా, “సంగీతం”, “నాదం”, “వేదం” అనే పదాలగురించి మన సంగీతశాస్త్రపరిధిని అనుసరించి సంక్షిప్తంగా పరిచయం చేసుకుందాం.
సంగీతం:— శార్ఙ్గదేవుడు తన సంగీతరత్నాకరం లో, సంగీతాన్ని ఇలాగ నిర్వచించేడు:—
“గీతం వాద్యం తథా నృత్తం త్రయం సంగీతముచ్యతే”
“గీతం(మానవునిచే కంఠనాదము ద్వారా పాడబడునది), వాద్యం(సంగీతవాద్యముల నాదముద్వారా వాయించబడునది), నృత్తము(నాట్యకళకు ఆధారభూతమైన మౌలికవిద్య) ఈ మూడింటిని కలిపి సంగీతమని వ్యవహరింతురు” అని సంగీతానికి ప్రాచీనకాలంలో పెద్దలు ఒక నిర్వచనాన్ని మనకి అనుగ్రహించేరు. ఐతే, తరువాత కాలంలో గానం, వాద్యసంగీతం, నృత్యం దేనికి అదిగా ప్రత్యేక కళా/విద్యా విభాగంగా రూపొందేయి. ఈ విభాగాలన్నీ మానవుడికి పారమార్థిక ప్రయోజనం సమకూర్చడానికే ఏర్పడ్డాయి. కేవలం మానవుడి లౌకికపరిమితికి మాత్రమే లోబడిన ఇంద్రియ-మానసిక-బౌద్ధిక వినోదాన్ని కలిగించడం మన భారతీయ కళలు, విద్యలు యొక్క పరమ ప్రయోజనం ఏ మాత్రమూ కాదు.
(సశేషం).