భీష్మాష్టమీపర్వదినము
ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః|
12—02—2019; మంగళవారము.
శ్రీశారదాంబికా దయాచంద్రికా|
“ఇతరములు—భీష్మాష్టమీపర్వదినము”|
మాఘశుక్ల అష్టమిని భీష్మాష్టమిగా పెద్దలు నిర్దేశించేరు. ఈ పర్వదినాన భీష్ములవారికి శ్రాద్ధకర్మనిర్వహించడంవలన సంతానప్రాప్తి ఉంటుందని శాస్త్రవచనం. అందువలన ఈ శ్రాద్ధక్రియ కామ్యకర్మగా వర్గీకరించబడింది. ఈ రోజు భీష్ములవారికి తర్పణసమర్పణం నిత్యకర్మ అని విధించబడింది. ఈ తర్పణసమర్పణంవలన సంవత్సరకాలంలో జరిగిన పాపఫలం నశిస్తుందని, దీనిని ఆచరించకపోవడం పుణ్యనాశనం సంభవిస్తుందని శాస్త్రకారులు చెప్పేరు. అష్టమికి మధ్యాహ్నవ్యాప్తి ఉండాలి అంటే మధ్యాహ్నసమయానికి అష్టమి ఉండాలి అని వివరించబడింది. అంటే 12—02 2019, మంగళవారమే భీష్మాష్టమిగా పంచాంగాలు సూచిస్తున్నాయి.
ఈ రోజు భీష్ములవారికి తర్పణము, అర్ఘ్యము రెండూ సమర్పించాలి. అపసవ్యంగా తర్పణాన్ని యిచ్చి, ఆచమించి సవ్యంగా అర్ఘ్యమివ్వాలి.
“తర్పణ మంత్రము”:—
“వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్యప్రవరాయ చ|
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే||
అపుత్రాయ జలం దద్మి నమో భీష్మాయ వర్మణే”|
“వైయాఘ్రపద్గోత్రుడు, సాంకృత్యప్రవరుడు,గంగానందనుడు, ఆజన్మబ్రహ్మచారి, పుత్రరహితుడు అయిన భీష్మవర్మగారికి జలతర్పణమును సమర్పించుచున్నాను” అని తర్పణము విడిచిపెట్టాలి.
“అర్ఘ్య మంత్రము”:—
“వసూనాం అవతారాయ శంతనోః ఆత్మజాయ చ|
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల్యబ్రహ్మచారిణే”||
“అష్టవసువులకి సారభూతుడైన అవతారుడు, శంతనుపుత్రుడు, బాల్యంనుండి బ్రహ్మచారి అయిన భీష్మాచార్యులవారికి అర్ఘ్యమును సమర్పించుచున్నాను” అని అర్ఘ్యము ఇవ్వాలి.
వ్యాసమహాభారతాన్ని అనుసరించి, భీష్మాచార్యులవారు మాఘశుక్ల అష్టమి రోజున దేహపరిత్యాగం చేసేరు.
కాని, కొన్ని ప్రాంతీయభారతకథలనిబట్టి భీష్ములవారు మాఘశుద్ధ సప్తమి మొదలు ఏకాదశివరకు, ఐదు రోజులు, రోజుకి ఒక ప్రాణం చొప్పున వరుసగా ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన నామములుగల పంచప్రాణాలని విడిచి పెట్టినట్లు ఉదంతాలు ప్రచారంలో ఉన్నట్లు కొన్ని గ్రంథాలలో ప్రస్తావించబడింది.
స్వస్తి||