Fun facts – 4
Fun Facts—4
శ్రీశారదా దయా చన్ద్రికా:—
15—07—2017; శనివారము.
“వాస్తవాలు—వినోదాలు — 4″|
1. ఒకానొకకాలంలో పాశ్చాత్యదేశాలలోని సామాజికనీతి-నియమాల ప్రమాణాలస్థాయి మహోన్నతంగా ఉండేదని చెప్పడానికి ౘక్కని ఉదాహరణ చరిత్ర పుటలలో భద్రంగా ఉంది. వాల్ట్ డిస్నీ కార్టూన్ చలనచిత్రాలలో హీరో ఐన డొనాల్డ్ డక్ సినిమాలు ఫిన్లాండ్ దేశంలో ఒక సమయంలో నిషేధించబడ్డాయి. ఆ నిషేధాజ్ఞలకి కారణం తెలిస్తే ఈ రోజులలో మనకి ఆశ్చర్యం కలుగుతుంది. పెళ్ళికాకుండానే డొనాల్డ్ డక్ , డైజీ డక్ తో సహజీవనం చెయ్యడం పాపహేతువు కనుక అటువంటి ఇతివృత్తం చిన్నపిల్లల మనస్తత్త్వాలమీద దుష్టప్రభావాన్ని కలిగిస్తుందని ఆనాటి ప్రభుత్వంలోని పెద్దలు భావించేరు. ఆ నిషేధాజ్ఞలకి అదే కారణం!
2. ఈ నిజం తెలుసుకుంటే “ఛీ! ఛీ! ఇదొక వినోదమా!” అని ఉమ్ము వెయ్యాలనిపించవచ్చు. ఐనా ఉన్న విషయం అన్న శాస్త్రజ్ఞుల మాటని కాదనరాదు! ప్రతి మానవుడూ రోజుకి సుమారు ఒకలీటరునుంచి ఒకటిన్నర లీటర్లవరకు తన నోటిలో లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాడట! సుమారు డబ్భై ఏళ్ళు బ్రతికే ప్రతిమానవుడూ దాదాపు 32,000 లీటర్ల లాలాజలాన్ని తన జీవితకాలంలో తయారు చేస్తాడుట!
3. జీవులన్నింటిలోను అత్యధికమైన పగటిపూట వెలుతురుని తన జీవితకాలంలో అనుభవించగలిగిన జీవి ఏదో తెలుసా? ది ఆర్క్ టిక్ టెర్న్ —The Arctic Tern— అని పిలువబడే ఒక సముద్రపక్షి, ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి మళ్ళీ అక్కడినుండి మొదటి చోటుకి – మొత్తం ఒక పరిభ్రమణాన్ని ఒక ఏడాదిలో పూర్తిచేసే ప్రయాణాన్ని చేస్తుంది. ఈ వర్తులాకార యానంలో ఇరవైవేల మైళ్ళ ప్రయాణంచేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ ప్రయాణానికి ఆ పక్షికి నాలుగునెలల ఆర్క్ టిక్ వేసవి పగటికాలం, మరొక నాలుగునెలల అంటార్క్ టిక్ వేసవి పగటిసమయం పడుతుంది. అంటే ఎనిమిది నెలలు ఎకాఎకీగా ఎండలో ఎగురుతూ తన పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుందన్నమాట!
స్వస్తి||