శారదా సంతతి ~ 62 : నృత్యనాటక (యక్షగాన ప్రక్రియ) ప్రయోగ తత్త్వ దర్శనాచార్యులు —  శ్రీ మేలట్టూరు వెంకట రామ శాస్త్రి వర్యులు

ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః|
30—09—2018; ఆదిత్యవాసరము|

“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|

“శారదా సంతతి ~ 62″| నృత్యనాటక (యక్షగాన ప్రక్రియ) ప్రయోగ తత్త్వ దర్శనాచార్యులు —  శ్రీ మేలట్టూరు వెంకట రామ శాస్త్రి వర్యులు|( 1743 నుండి 1809 వరకు )

“దేవానాం ఇదమామనంతి మునయః కాంతం క్రతుం చాక్షుషమ్ |
రుద్రేణేదముమాకృత వ్యతికరే స్వాంగే విభక్తం ద్విధా|
త్రైగుణ్యోద్భవమత్ర లోకచరితం నానారసం దృశ్యతే|
నాట్యం భిన్నరుచేః జనస్య బహుధాప్యేకం సమారాధనమ్ “||
(కాలిదాస విరచిత “మాలవికాగ్నిమిత్రమ్ ” I : 4)|

“మునులు నాట్యాన్ని దేవతలని ప్రసన్నం చేసే మనోహరమైన చాక్షుషక్రతువు (నయనానందకర యజ్ఞం లేక spectacular sacrifice)గా ప్రశంసిస్తారు. అర్థనారీశ్వరుడైన శంకరమహదేవుడు తనలోనే రెండురూపాలైన రుద్రుడు-ఉమల ద్వారా, తాండవమూ-లాస్యమూగా నాట్యక్రతువుని ప్రదర్శిస్తున్నాడు.  సత్త్వరజస్తమోగుణాలనుంచి పుడుతున్న సర్వరసభరితమైన లోకంయొక్క వ్యాపార-వ్యవహార రూపమైన చరితం ఈ నాట్యకళద్వారా వ్యక్తంచేయబడి దృశ్యమానం అవుతోంది. విభిన్న అభిరుచులు కలిగిన రసజ్ఞమానవులలో నాట్యక్రతుప్రదర్శన ఏకైకమూలంనుంచి ఆవిర్భవించి అనేకవిధాలైన రసమయ భావాలని ఆవిష్కరింపచేస్తోంది”.

ఇటువంటి నయనానందకరమైన నాట్యక్రతువుని నాట్యపరబ్రహ్మస్వరూపుడైన నటరాజస్వామిగా ఉపాసించిన నాట్యోపాసనాపరమాచార్యులైన మహానుభావులు శ్రీ మేలట్టూరు వెంకటరామశాస్త్రిగారు. వారు నాకు లభించిన ఆధారాలని అనుసరించి 1743వ సంవత్సరంలో తమిళదేశంలోని, తంజావూరుకి సమీపంలోవున్న మేలట్టూరుగ్రామంలో జన్మించేరు. వారి తండ్రిగారిపేరు గోపాలకృష్ణశాస్త్రి గారు. వారిది “శ్రీవత్స” గోత్రం. వారికుటుంబాలవారందరూ కొన్నితరాలక్రితమే ఆంధ్రదేశంలోని వెలనాటిబ్రాహ్మణకుటంబశాఖనుండి నాయకరాజులు, మరాఠారాజుల పరిపాలనకాలంలో తంజావూరు రాజ్యసంస్థాన పండిత-కళాకారులుగా వలస వెళ్ళిపోయేరు. ఆ కాలంలో సంగీత-సాహిత్య-నాట్య శాస్త్రాలలో మహాపండితులుగా మన్ననలందుకుంటున్న మేలట్టూరు వీరభద్రయ్యగారి ప్రముఖశిష్యులైన మేలట్టూరు లక్ష్మణయ్యగారు వెంకటరామశాస్త్రిగారికి గురువుగారు. (శాస్త్రివర్యులు వారి నృత్యనాటక పరిచయ ప్రస్తావనలలో ఈ విధంగా విశదంచేసేరు:— “శ్రీవత్సగోత్ర తిలకులౌ లక్ష్మణార్యుల కృపవల్ల గోపాలకృష్ణార్య కుమారుడైనట్టి వేంకటరాముడు విశదంబుగనీ – – – – – ).

వెంకటరామశాస్త్రిగారు ముందుగా తండ్రిగారివద్ద వేదవిద్యని పూర్తిగా నేర్చుకున్నారు. ఆ తరవాత తండ్రిగారివద్దే శాస్త్రవిద్యని, ఇతిహాస పురాణాలని, ఉపనిషత్తులని కూలంకషంగా నేర్చుకున్నారు. ఆ తరవాత మేలట్టూరు లక్ష్మణార్యులవద్ద కావ్యాలు, నాటకాలు, అలంకారశాస్త్రం, సంగీతం, నాట్యం క్షుణ్ణంగా అభ్యసించేరు. సంస్కృతం, తెలుగు భాషలలో అపారపాండిత్యం స్వంతం చేసుకున్నారు.

వెంకటరామశాస్త్రిగారు శ్రీనృసింహస్వామివారికి పరమభక్తులేకాక, శ్రీనరహరి మహామంత్రోపాసనాదీక్షితులు కూడాను! “శ్రీనృసింహవరప్రసాదప్రాప్తి” లేనివారికి “శ్రీమద్భాగవతమహాపురాణమ్ “లోని “ప్రహ్లాదచరిత్రం“వంటి భాగవతఘట్టాలు సంగీతనాటకాలుగా భక్తిశక్తిదీప్తితో రచించగలగడం అసాధ్యం అని సంప్రదాయజ్ఞుల ఇంగితం కదా!

శాస్త్రిగారు సంగీతరూపకాలుగావున్న యక్షగానప్రక్రియగల 12 నృత్యనాటకాలు రచించేరు. వాటిలో 11 నృత్య నాటకాలు వారి రచనలుగానే సప్రమాణంగా విమర్శకులచేత నిర్ణయించబడ్డాయి. వారి పదకొండు రచనలని ఈ దిగువ పొందుపరచడం జరిగింది:—

(1) మార్కండేయ నాటకము.
(2) హరిశ్చంద్ర నాటకము.
(3) రుక్మాంగద.
(4) ధ్రువ చరిత్రము.
(5) ఉషా పరిణయము.
(6) సీతా పరిణయము.
(7) రుక్మిణీ కల్యాణము.
(8) కంసవధ నాటకము.
(9) హరిహర లీలా విలాస నాటకము.
(10) ప్రహ్లాద చరితం.
(11) సతీసావిత్రి నాటకము.

పై నృత్యనాటకాలన్నీ మేలట్టూరుగ్రామంలో వేంచేసివున్న ప్రధానదైవతం అయిన “వరదరాజస్వామి” పెరుమాళ్ళు వారికి అంకితం చేయబడ్డాయి. భరతముని “నాట్యశాస్త్రం“లో ప్రస్తావనచేసిన ఆదర్శాలకి, నిర్వచనాలకి అనుగుణంగా శాస్త్రిగారి నృత్యనాటకరచనలు నిర్మించబడ్డాయి. అయితే శాస్త్రిగారికాలంనాటికి ఆయన సమకాలీనసమాజంలో, తంజావూరును ఏలిన నాయకరాజులు, మరాఠా పరిపాలకులు యొక్క పాలనావ్యవస్థ వలన ఆనాటి ప్రజాజీవితం ప్రభావితం అయిన లక్షణాలని వారు తమ నాటకాలలో పొందుపరచేరు. ఆ విధంగా చేస్తూనే, భాగవతభక్తిసంప్రదాయ పరమాదర్శంయొక్క ఆవశ్యకతని తమ నృత్యనాటకాల ద్వారా ప్రజలకి ౘక్కని సందేశరూపంలో ఆయన అద్భుతంగా అందించేరు.

వారి తెలుగు నృత్యనాటకాలలో సంస్కృతవృత్తచ్ఛందస్సులతోబాటు, తెలుగు ఛందస్సులోని జాతులు, ఉపజాతులు, వచనాలు, చూర్ణికలు, దండకాలు వంటి ప్రక్రియలని యథోచితంగా వాడేరు. శార్దూలం, మత్తేభం, ఉత్పలమాల, చంపకమాల వంటి వృత్తాలని సమయోచితంగా ఉపయోగించేరు. కందపద్యాలు, సీసపద్యాలు, తేటగీతులు, ఆటవెలదులు, ద్విపదలు మొదలైన అచ్చతెలుగు ఛందస్సులని విరివిగా ఉపయోగించేరు.

ఇంక సంగీతవిభాగంలో పరిశీలిస్తే, అత్యంతప్రజాదరణని పొందిన రక్తిరాగాలని ప్రధానంగా ఉపయోగించేరు. అవసరమైనచోట అపూర్వరాగాలనికూడా వారు అదే ఆదరణభావంతో ఉపయోగించేరు. ఫరజు, ఆహిరి, ఘంటా, మాంజి, గౌళిపంతు వంటి రాగాలాని సందర్భానుసారంగా వాడేరు. అలాగే నాదనామక్రియ, అఠానా, పంతువరాళి, పున్నాగవరాళి, ముఖారి, భైరవి, పూర్వికల్యాణి, వరాళి, కాపీ, ఆనందభైరవి, యదుకులకాంభోజి, ఖమాసు, నీలాంబరి, ఝంఝూటీ మొదలైన ఆ రోజులలో జనాదరణకలిగిన రాగాలని సందర్భశుద్ధితో వారు ఉపయోగించేరు. ఎక్కువగా చాపు, ఆది తాళాలని ఉపయోగించినా, అవసరాన్నిబట్టి కొన్ని సందర్భాలలో రూపకతాళం, ఝంపతాళం కూడా శాస్త్రిగారు వాడేరు.

ఇంక నృత్యనాటకాలలోని సంగీత ప్రక్రియాపరమైన రచనల విషయానికివస్తే, నృత్యనాటకాలలో వివిధ దరువులని వినియోగించేరు. ఆయా సందర్భాలని అనుసరించి ప్రవేశదరువులు, సంవాద దరువులు, ఉత్తర-ప్రత్యుత్తరదరువులు, స్వగత దరువులు, వర్ణన దరువులు, ప్రలాప దరువులు, ఏలా పదాంశాలు మొదలైన భరతముని నాట్యశాస్త్రంలో ప్రస్తావించబడిన అనేకానేక నాటకరంగ సంప్రదాయసబంధమైన ప్రక్రియలని సన్నివేశానుకూలంగా శాస్త్రివర్యులు వినియోగించేరు. ఒక ప్రవేశదరువులో ప్రాదేశికమైన “చిందు” అనే జానపదప్రక్రియ యొక్క ప్రయోగంకూడావుండడం గమనార్హం.

మూలవిషయాన్నిబట్టేకాక, ఆదర్శప్రాయమైన అపూర్వనిర్మాణ ఔత్కృష్ట్యం వలనకూడా “ప్రహ్లాద చరితం” సర్వశోభావిలక్షణయుతమై విరాజిల్లుతోంది.

ప్రహ్లాద చరిత నాటకం” కోసం వారు నిర్మించిన పూర్వరంగం సుప్రసిద్ధమైనది. పూర్వరంగంలో గణేశ్వరుడు, సూత్రధారుడు, కోణంగి ప్రవేశిస్తారు. గణేశ్వరుడు శివకుటుంబానికి చెందినవాడుకనుక మహేశ్వరుడి ప్రతినిధి. సూత్రధారుడు చతుర్ముఖబ్రహ్మగారి ప్రతినిధి. కోణంగి విష్ణ్వంశ కలిగినవాడుకనుక, అతడు శ్రీమహావిష్ణువు ప్రతినిధి. ఈ కోణంగి పాత్ర మేలట్టూరుసంప్రదాయం ప్రకారం ఒక పురాణగాథతో ముడిపడివుంది. ఒకసారి గణపతి శ్రీహరియొక్క సుదర్శన చక్రాయుధాన్ని మింగేసేడుట! ఆయన కడుపులోనుంచి తన సుదర్శనాన్ని బయటకి రప్పించడానికి విష్ణుమూర్తి కోణంగిగా అవతరించి గణపతిముందు మహాపరిహాస జనకమైన హాస్యరసచేష్టలుచేసి గణపతిని అసాధారణంగా నవ్వించేసరికి, గణపతి పొట్టలోనుంచి సుదర్శనం ఒక్కసారిగా బయటపడిందిట! ఆ విష్ణ్వంశసంభూతుడైన “కోణంగి” ప్రత్యేక హాస్యరసభరితచేష్టాయుతమైన వాచకాభినయంద్వారాను, మౌఖిక-ఆంగిక అభినయంద్వారాను మేలట్టూరు నృత్యనాటకాలలో తన పాత్రని పోషిస్తాడు. ఈ విధంగా సృష్టి-స్థితి లయకారకులైన బ్రహ్మ-విష్ణు-మహేశ్వర ప్రతినిధులు ఈ నాటకాలలో ప్రసక్తమయ్యి, నాటకరంగం, మానవ(జీవ) జనన-జీవన-మరణాలనే అనుల్లంఘనీయ నిత్యసత్యాలకి ఇహలోకప్రతీకాత్మకమైన వేదికగా సరసులైన ప్రేక్షకులకి స్ఫురింపజేస్తారు.

ఆ తరువాత ఒక క్రమంలో “ప్రవేశదరుప్రక్రియ“ద్వారా నృత్యనాటకంలోని వివిధపాత్రలని ప్రేక్షకులకి పరిచయం చేయడం జరుగుతుంది. “దేవగాంధారి” రాగదరువుతో, తమోగుణభరితరజోగుణస్ఫోరకంగా, రాక్షసరాజైన త్రిలోకాధిపతి హిరణ్యకశిపుడు, మహా అట్టహాసంగా నాటకరంగప్రవేశం చేస్తాడు. “అఠానా” రాగదరువుతో మహాపతివ్రత, త్రిలోకాధిపతి హిరణ్యకశిపు మహారాజు పట్టమహిషి అయిన, రజోగుణప్రేరిత సత్త్వగుణ ప్రధానంగా లీలావతీదేవి (వ్యాసప్రోక్త సంస్కృతభాగవతంలో ఆమె అసలుపేరు “కయాధువు“. తెలుగు భాగవతంలో ఆమె పేరు ‘లీలావతి’), రంగప్రవేశం చేస్తుంది. ఆ పిమ్మట, సత్త్వగుణప్రధానమైన భక్తిరసమయంగా లలితసుకుమారప్రయోగబంధురమైన “భైరవి” రాగదరవుతో  సర్వవ్యాపిత శ్రీహరితత్త్వాన్ని దర్శిస్తూ, స్తుతిస్తూ బాలప్రహ్లాదస్వామివారు నాటకరంగప్రవేశంచేసి భక్తిరసభావుకమహాశయులైన ప్రేక్షకులకి మనోరంజనం చేస్తారు. ప్రహ్లాదులవారి ఆ ప్రవేశదరువు ఇలాగ ప్రారంభం ఔతుంది:—

“హరి హరి యని పలుకుచు తా
ధరలో నిఖిలము హరిమయమని
మిగుల తెలుపుచు ముదమున
సారసాక్ష! హరి నామమె
తారకమని మదిలో స్మరియింపుచు, తా – – – “

ఈ తెలుగు సుబోధకమైన సుందరభాష. పోతనమహాకవి భక్తజనులకి నేర్పిన మృదుమధుర భాగవతభాష. వారి తరువాత వచ్చిన వాగ్గేయకారులందరికీ కృతి/కీర్తనాదుల నిర్మాణానికి సహజానుకూలమైన భాష.

ఆ పిదప “ఆనందభైరవి” రాగంలోని ప్రవేశదరువుతో రాక్షసగురువు శుక్రాచిర్యులవారి రంగప్రవేశాన్ని అనుసరించి అసలైన నృత్యనాటకం “ప్రహ్లాదచరితం” ప్రారంభం ఔతుంది.

ఆ తరువాత “ఫరజు” రాగంలో, “ఎంతకోపమే“, “తరళాక్షిరో వినవే” అనే  భార్యాభర్తలైన లీలావతీదేవి- హిరణ్యకశిపు మహారాజు మధ్య గానంచెయ్యబడే యుగళగీత దరువు, లీలావతీదేవి హిరణ్యకశిపుని శ్రీహరివైరభావంనుంచి మనసుమళ్ళించే ప్రయత్నరూపంలోవుంటుంది. ఈ దరువు కొన్ని ప్రదర్శనలలో “నాదనామక్రియ” రాగంలో పాడబడడంకూడా కద్దు! దాని పిదప లీలావతీదేవి “ఘంటా” రాగంలో పాడే దరువు, “హరిమీద వైరమా“మొదలైనవన్నీ ప్రేక్షకుల హృదయాలని కదిలించి, కరిగించేవే! ప్రహ్లాదస్వామివారి ఆచార్యులైన చండామర్కులుగౌళిపంతు” రాగదరువు, ఆ తరువాత రాక్షసబాలుడైన తన సహాధ్యాయికి ప్రహ్లాదస్వామి హరిభక్తిని బోధించే “మాంజి” రాగంలోని దరువు అపురూపమైన సాహిత్య-సంగీతరాగ రసభావంతో తొణికిసలాడుతూ ఉంటాయి.

ఆ తరువాత, లీలావతీదేవి తనభర్తతో చేసే సంవాదదరువైన “చిన్నబాలుడు” అనే పాట “గుమ్మకాంభోజి“లో పాడబడేడట. అది నా దురదృష్టంవలన నేను వినలేకపోయేను. భర్తగారికి తమ పుత్రుడైన బాలప్రహ్లాదుడిపైన కలిగిన భరించలేని  క్రోధాగ్నిని కని, మాతృమూర్తి లీలావతీదేవి కరుణరసభరితమైన “ఆహిరి” రాగంలోని “ఏమని నే తాళుదునే” అనే విషాదభావదరువు పాడతారు. దానితరవాత బాలప్రహ్లాదస్వామి – తల్లి లీలావతీదేవిమధ్య ప్రదర్శించబడే సంవాదదరువుకూడా ఆహిరిరాగంలోనే కూర్చబడింది. ఆ దరువులో ప్రహ్లాదస్వామి తమ తల్లిని “ఎందుకు పలుమారు నీకీ క్లేశములు, ఇకను విడువమ్మా!” అని సముదాయిస్తారు.

తరువాతి ఘట్టంలో హిరణ్యకశిపుడు – బాలప్రహ్లాదస్వామి వారలమధ్య జరిగిన “ఏర ఓరి బాలకా!” అనే వాదోపవాద దరువు “పంతువరాళి ఖమాసు” రాగాలలో కొనసాగుతుంది. ఆ సందర్భానికి జవాబుగా బాలప్రహ్లాదస్వామి “దేవ! దేవ” అనే ప్రార్థనదరువుని “పూర్వీకల్యాణి” రాగంలో భక్తిపారవశ్యంతో పాడడం జరుగుతుంది. బాలప్రహ్లాదస్వామి అపారభక్తికి నరసింహస్వామివారు రాజసభాస్తంభంనుంచి తమని తాము వ్యక్తంచేసుకుని హిరణ్యకశిపుసముద్ధరణం చేసి, ప్రహ్లాదస్వామివారి భక్తిపూరిత ప్రార్థనలకి పరిపూర్ణంగా ప్రసన్నులై ప్రహ్లాదుని అనుగ్రహిస్తారు.

నేను “ప్రహ్లాద చరితం” నృత్యనాటకం రెండు-మూడు మారులు మాత్రమే చూడగలిగేను. అదికూడా చెన్నైలోనే. ఒకసారి చెన్నై త్యాగరాయనగర్ లోని  డా. యు. రామారావుగారి కర్ణాటక ఆడిటోరియంలో చివరిసారి చూసినగుర్తు. మామూలుగానే నాకు జ్ఞాపకశక్తి తక్కువ. నాకు జ్ఞప్తివున్నంతమేరకి, పుస్తకాలలో పూర్వం చదివినది జ్ఞాపకంవున్నంతవరకు ఇక్కడ ప్రస్తావనచేసేను. మతిమరపువల్ల, ఇతరకారణాల వల్ల తేడా పాడాలుండవచ్చు. మన్నించమనవి.

మేలట్టూరు వేంకటరామశాస్త్రివర్యులు రచించిన దరువులు సాహిత్యపరంగా రసనిధానాలు. సంగీతపరంగా ఇంచుమించు కృతినిర్మాణశైలిలోనేవుంటాయని చెప్పవచ్చు.

త్యాగరాజస్వామి(1767—1847)వారు వేంకటరామశాస్త్రివర్యులకంటె 24 సంవత్సరాలుచిన్న. ఆయన తమ బాల్యంలోను, యౌవనంలోను మేలట్టూరు నృత్యనాటకాలని బాగా చూసివుంటారు. ఆ నృత్యనాటకాలలో ముఖ్యంగా “ప్రహ్లాద చరిత నాటకం” త్యాగరాజుగారి హృదయాన్ని పూర్తిగా దోచుకుని ఉంటుంది. ఆ నృత్యనాటికయొక్క గాఢప్రభావంవలన “ప్రహ్లాద భక్తి విజయము” అనే సంగీత ప్రబంధాన్ని వారు రచించేరు. ఐతే ఆయన కొన్ని మార్పులని, చేర్పులని చేసుకున్నారు. తన నాటకంలోని భక్తిసందేశంయొక్క సాంద్రతని పలచనచేయకుండా “కోణంగి” పాత్రని తొలగించివేసేరు. గణపతిని యథాతథంగా ఉంచేరు. సూత్రధారుడిబదులు దౌవారికుడిపాత్రని ప్రవేశపెట్టేరు.

ఈ “ప్రహ్లాద భక్తి విజయము” అనే సంగీతప్రబంధంలోని అనేక కృతులు సంగీతసభలలో విరివిగా గానంచేయబడుతూ, సంపూర్ణ ప్రజాదరణని చూరగొన్నాయి. అందువలన ఈ సంగీతప్రబంధం మన మామూలు చలనచిత్ర పరిభాషలో చెప్పుకోవాలంటే, “సూపర్ డూపర్ ఆల్ టైం మ్యూజికల్ హిట్ ” అంటే అందరికీ బాగా అర్థం ఔతుంది. నేను అంటున్న ఈ మాటలలోని విషయం విశదంకావడానికి “ప్రహ్లాద భక్తి విజయము” లోని కొన్ని కృతులని ఇక్కడ ప్రస్తావించుకుందాం:—

(1) శ్రీగణపతిని సేవింప(రా)రే – సౌరాష్ట్రరాగం
(2) వాసుదేవయని వెడలినయీ దౌవారికుని గనరే – కల్యాణిరాగం
(3) వందనము రఘునందనా – శహానరాగం
(4) నారదముని వెడలిన సుగుణాతిశయము వినరే – పంతువరాళిరాగం
(5) ఎన్నగ మనసుకురాని పన్నగశాయి సొగసు – నీలాంబరిరాగం
(6) ఏటిజన్మమిదిహా, ఓ రామ! – వరాళిరాగం
(7) ఏనాటి నోముఫలమో, ఏ దానబలమో – భైరవిరాగం
(8) రామాభిరామ! రఘురామ! ఓ రామ! – సావేరిరాగం
(9) నన్ను విడిచి కదలకురా! రామయ్య! వదలకురా – రీతిగౌళరాగం
(10) రార, మా యింటిదాక, రఘువీర! సుకుమార! – అసావేరిరాగం
(11) ౘల్లరే రామచంద్రునిపైని పూల – ఆహిరిరాగం
(12) (పల్లవి) నీనామ రూపములకు నిత్యజయమంగళం  (అనుపల్లవి) పవమాన సుతుడు పట్టు పాదారవిందమునకు – సౌరాష్ట్రరాగం

1809వ సంవత్సరంలో శ్రీ మేలట్టూరు వెంకటరామశాస్త్రిభాగవతవర్యులు తమ పార్థివదేహాన్ని విడిచిపెట్టి తమ ఉపాస్యదైవమైన నృసింహస్వామివారి సాయుజ్యాన్ని పొందేరు ఆ భాగవతోత్తముల దివ్యపాదారవిందములకు మన సాష్టాంగదండప్రణామం సమర్పించుకుందాం!

స్వస్తి|

 

“sriaim.com”|

From the next week-end onwards, for five consecutive week-ends there will be no postings in the above blog. Thank you all.

 

మనవి:—

బంధుమిత్రులకి హృదయపూర్వక నమస్కారం.

శని-ఆదివారలో ప్రతివారం పంపబడే “blog-links”, ఒకసారి ఐదు(5)గురికంటే పంపడానికి వీలులేని నిబంధన అమలులోకి వచ్చిన సుమారు గత రెండునెలల నుంచీ, శని-ఆదివారాలలో links పంపించడం నాకు తలకి మించిన భారంగా పరిణమించింది. అందువలన ఇంక ఈ వారాంతం 29/30-9-18 నుంచి blog-links పంపలేను.

మహాలయపక్షం రెండవ వారాంతమూ, ఆశ్వయుజమాసమూ blog లో articles(వ్యక్తిగతకారణాలవల్ల) post చెయ్యలేకపోతున్నాను. గమనించమనవి.

You may also like...

1 Response

  1. సి.యస్ says:

    అద్భుతమైన సంగీత నృత్య రూపకాలు రచించి,
    యక్షగాన ప్రక్రియను అత్యున్నతస్థాయికి చేర్చిన
    మహానుభావులు శ్రీ మేలట్టూరు వెంకటరామశాస్త్రి గారి
    జీవిత విశేషాలు చదవడం సంతోషంగా ఉంది.
    వేదోపనిషత్తుల దగ్గర్నుంచి సంగీత, నాట్య, కావ్య, నాటక,
    అలంకారాది శాస్త్రాలలో అపార పాండిత్యం సంపాదించడం,
    సంస్కృతాంధ్ర భాషలలో అంతటి రచనలు చేయడం అటువంటి
    మహానుభావులకే సాధ్యమవుతుంది.
    త్యాగరాజస్వామి వారు రచించిన ‘ప్రహ్లాద భక్తి విజయము’
    లోని కీర్తనలు నిజంగా సూపర్ హిట్టు కృతులు. చాలా కృతులు
    విద్యార్ధులకి సంగీత పాఠాల్లో తప్పకుండా నేర్పుతారు.
    శాస్త్రిగారి నృత్యనాటకాల వివరణ…వాటిలోని దరువులను
    వినియోగించే సంప్రదాయం చక్కగా చెప్పేవు. అంతేకాక
    సంప్రదాయాన్ని అనుసరిస్తునే, సమకాలీన సామాజిక
    అంశాలను ఆ రూపకాల్లో పొందుపరచడం వెంకటరామశాస్త్రి
    గారి దార్శనికతకి నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *