శారదా సంతతి ~ 61 : ప్రాచ్య-పాశ్చాత్య అధ్యాత్మ విద్యా విపశ్చిద్వరిష్ఠుడు~శ్రీ ఆనందకుమారస్వామి”| (Ananda Kentish Muthu Coomaraswamy
ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః|
23—09—2018; ఆదిత్యవాసరము|
“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|
“శారదా సంతతి ~ 61″| “ప్రాచ్య-పాశ్చాత్య అధ్యాత్మ విద్యా విపశ్చిద్వరిష్ఠుడు~శ్రీ ఆనందకుమారస్వామి”| (Ananda Kentish Muthu Coomaraswamy—22-8-1877 నుండి 9-9-1947 వరకు)|
“విశేషేణ పశ్యన్ చేతతి ఇతి విపశ్చిత్ “, ‘విశేషంగా (బాహ్య-అభ్యంతరాలని, లేక, దృశ్య-అదృశ్య విషయాలని) పరికిస్తూ తెలుసుకునేవాడు’ అని “విపశ్చిత్ ” అనే మాటకి వ్యుత్పత్తి అర్థం. ఈ “విపశ్చిత్ ” వంటి శబ్దాలు వాఙ్మయంలో ఆనందకుమారస్వామివర్యులవంటి మహానుభావుల కోసమే పుట్టేయి.
సునిశిత సుశిక్షిత ఆలోచనాదక్షత, గాఢ భావనా పౌష్కల్యం, తపోమయ చింతనానైజం, సకలవైరుధ్ధ్య సమన్వయశక్తి, ఆర్షచైతన్యస్ఫూర్తి, యౌగిక దర్శన ఆర్జవం వంటి అనేక పరమేశ్వరీ ప్రసాదిత దివ్యదీప్తిమయ వ్యక్తిగత సుగుణాలు సహజశోభతో ఆనందకుమారస్వామివర్యులని అలౌకిక పూర్ణపురుషునిగా దిద్ది తీర్చేయి.
ఆయన సింహళదేశ తమిళవంశపరంపరకిచెందిన అమెరికా దేశీయులుగా చరిత్ర చెప్తోంది. అంటే ఆయన అంతర్జాతీయ, అంతర్దేశీయ, అంతర్భాషీయ, అంతర్ఖండీయ, సర్వభౌగోళిక సాంస్కృతిక సమైక్యచైతన్యస్వభావుడు-స్వరూపుడు అని మనం మన మాటలలో చెప్పుకోవచ్చు. ఆనందకుమారస్వామివర్యుల జీవనమందాకినీప్రవాహవైభవం పరిశీలిస్తే, మన మాటలలోని పరమార్థం మనకి బోధపడుతుంది. ఈ వ్యాసరచనకి ప్రేరణనిచ్చి, ప్రోద్బలంచేసిన మహనీయులు, నాకు పుత్రసమానులైన శ్రీ జి.వి.కృష్ణయ్యగారు. వారికి నా హార్దకృతజ్ఞతలు. ఆయన అడిగివుండకపోతే ఇంతటి హిమవన్నగ తుల్యమైన మహామహుడు, శ్రీశారదామాత ముద్దుబిడ్డ, కారణజన్ముడు అయిన ఆనందకుమారస్వామివరిష్ఠులగురించిన ఈ వ్యాసం వ్రాసేటంత సాహసంచేసేవాడినికాదు.
శ్రీ ఆనందకుమారస్వామివర్యులు 1877వ సంవత్సరం, ఆగస్టునెల, 22వ తేదీన ఇప్పటి శ్రీలంకలోని కొలంబోమహానగరంలో జన్మించేరు. పొన్నాంబళం కుమారస్వామి కుటుంబపరంపరకి చెందిన, శ్రీలంకదేశ తమిళ శాసనసభ సభ్యులైన తత్త్వవేత్త, శ్రీ ముత్తుకుమారస్వామిగారు, ఆనందకుమారస్వామి తండ్రిగారు. ఆంగ్లదేశ మహిళ ఐన ఎలిౙబెత్ బీబీ ఆయన తల్లి. ఆయనకి రెండేళ్ళప్రాయంలో దురదృష్టవశాత్తు తండ్రిగారు పరమపదించేరు. అందువలన ఆయన తల్లి, Elizabeth Beeby, ఆయనని తన దేశమైన ఇంగ్లండుకి తీసుకువెళ్ళడంవలన, ఆయన బాల్యం విదేశంలోనే గడిచింది.
ఆయనకి పన్నిండు సంవత్సరాల వయస్సుండగా, అంటే, 1879లో, గ్లౌసెస్టర్ షైర్ (Gloucestershire) కౌంటీలోని, స్ట్రౌడ్ (Stroud)లో గల Wycliff College (వైక్లిఫ్ కళాశాల) లో ఆయన విద్యాభ్యాసం చేసేరు. 1900లో, లండన్లోని విశ్వవిద్యాలయ కళాశాల (University College) నుంచి భూగర్భశాస్త్రం(Geology), వృక్షశాస్త్రం(Botany), ప్రధాన విషయాలు (Main subjects)గా పట్టభద్రులయ్యేరు.
1902వ సంవత్సరం, జూన్ 19వ తేదీన ఆనందకుమారస్వామిగారు ఈథెల్ మేరీ పార్ట్రిడ్జ్ (Ethel Mary Partridge) అనే ఆంగ్ల యువతిని వివాహంచేసుకున్నారు. ఆమె ౘక్కని ఛాయాగ్రాహకురాలు(Photographer). వివాహానంతరం భార్యాభర్తలిద్దరూ శ్రీలంకదేశానికి వెళ్ళేరు. 1902 నుండి 1906 వరకు శ్రీలంక ఖనిజశాస్త్రంలో (Ceylonese Mineralogy) ఆయన చేసిన పరిశోధనలకి ఆయనకి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చెయ్యబడింది. ఆ పరిశోధన జియలాజికల్ సర్వే ఆఫ్ సిలోన్ (Geological Survey of Ceylone) అనే జాతీయసంస్థ ఆవిర్భావానికి బీజప్రాయమయ్యింది. ఆ సంస్థకి మొట్టమొదటి డైరెక్టరుగా ఆనందకుమారస్వామి పనిచేసేరు.
శ్రీలంకలో ఉండగా ఆ భార్యాభర్తలు ఇరువురూ “శ్రీలంక మధ్యయుగాల కళలు” (Mediaeval Sinhalese Art) గురించి సప్రమాణ పరిశోధనలు చేసేరు. ఆ పరిశోధనలకి అవసరమైన ౘక్కని ఛాయాచిత్రాలని శ్రీమతి ఈథెల్ సమకూర్చేరు. ఆ పరిశోధనలకి ప్రామాణిక వ్యాసరచనని ఆనందకుమారస్వామి అందించేరు. శ్రీలంకలోవుండగా ఆయన చేసిన పరిశోధనాకాలంలో ఆధునిక పాశ్చాత్య సంస్కృతి, ప్రాచీన ప్రాచ్యసంస్కృతిని ప్రభావితంచెయ్యడం అనే విషయం వారికి ఏ మాత్రమూ నచ్చలేదు. ఆ విషయంలో భార్యాభర్తలకి భేదాభిప్రాయాలు ఏర్పడి, అవి వారి వివాహబంధాన్ని విచ్ఛేదం చేసి, విడాకులవరకూ దారితీసేయి. అందువలన వారిరువురు 1913లో విడిపోయేరు.
1906 నాటికే ఆనందకుమారస్వామి పశ్చిమదేశాలకి భారతీయకళలని గురించిన జ్ఞానాన్ని నేర్పడం ఒక ఆవశ్యక ఉద్యమంగా తీసుకున్నారు. ఆయన అనేక భారతీయ కళారూపాల ఛాయాచిత్రాలతో లండనునగరంచేరుకున్నారు. ఆ ఛాయాచిత్రాలని స్థానిక కళాకారులకి చూపించి వాటిద్వారా వారిని ప్రభావితులని చేసే ప్రయత్నం చేసేరు. చిత్రకళాప్రదర్శనశాల అధికారులు(Curators), లేక అటువంటి సాంస్కృతిక వ్యవస్థలలోని సభ్యులు వంటి వారిపై ఆయన ఏమాత్రమూ ఆధారపడదలచుకోలేదు. 1908లో వారు ఈ విధంగా వ్రాసేరు:—
“భారతీయకళలని ఇంతవరకు అధ్యయనం చేసినవారు పురావస్తుశాఖాధికారులే! ఇది ౘాలా అసమంజసమైన దయనీయసత్యం! కళాఖండాలని అధ్యయనంచేసి స్పందించడానికి కళాకారులు, కళాశాస్త్రమర్మజ్ఞులు ఐనవారికే అధికారంవుందికాని, ఇతరులకి కాదు! కళగా గుర్తింపబడిన కళాఖండాల కళాత్మకత విషయంలో తీర్పు చెప్పడానికి కళాకారులే సర్వసమర్థులు. ఇతరులు కాలేరు!”
1909వ సంవత్సరానికి Jacob Epstein, Eric Gill అనే లండనునగర ఆధునిక కళాకారులతో ఆయనకి గాఢమైత్రి ఏర్పడింది. వారిద్దరూ అనతికాలంలోనే తమ-తమ కళాఖండాలలో భారతీయకళాత్మకశైలిని పొందుపరచి అత్యాధునిక రూపాన్ని తమ ఆంగ్లేయకళలోకి సృజనాత్మకంగా ప్రవేశపెట్టగలిగేరు. ఈ నాడు “బ్రిటిష్ మోడర్నిజం“గా స్థిరపడిన కళాత్మకశైలిలో ఆ నాటి ఆనందకుమారస్వామి చేసిన సాంస్కృతికమైత్రి ఉద్యమంయొక్క బీజాలు స్పష్టంగా విదితమౌతాయి.
1913లో ఆనందకుమారస్వామిగారు Alice Ethel Richardson అనే బ్రిటిషు వనితని ద్వితీయవివాహం చేసుకున్నారు. వారిద్దరూ వివాహానంతరం భారతదేశం వచ్చేరు. కాశ్మీరులోని శ్రీనగరంలో నౌకాగృహం లేక పడవయిల్లు లేక houseboatలో నివసించేరు. అక్కడవుండగా ఆనందకుమారస్వామి రాజపుత్రకళారీతులని గాఢంగా అధ్యయనంచేసేరు. ఆ సమయంలో ఆయన భార్య కపూర్తలాకి చెందిన అబ్దుల్ రహీం వద్ద ఉత్తర భారత శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ఇంగ్లండు దేశానికి తిరిగి వచ్చినతరువాత, ఆమె భారతీయసంగీతాన్ని “రత్న దేవి కుమారస్వామి” అనే రంగస్థలనామధేయంతో పాడి శ్రోతలకి అమేయ ఆనందం కలిగించేవారు. రత్నదేవి బ్రిటనుసామ్రాజ్యంలోను, అమెరికాలోను భారతీయ గీతాలని, పద్యాలని పాడి సభాసదులని పరవశింపచేసేవారని మార్టిన్ క్లేటన్ (Martin Clayton) వంటి సంగీతపండితులు వ్రాసేరు. భార్యాభర్తలిద్దరూ రత్నదేవి సంగీతసభలకోసం అమెరికా వెళ్ళినప్పుడు, 1917లో, బోస్టన్ కళా ప్రదర్శనశాల (Boston Museum of Fine Arts) అధికారులు, ఆనందకుమారస్వామిని, బోస్టన్ మ్యూజియంలోని “భారతీయకళావిభాగం” మొదటి పాలకుడు(Keeper) గా ఉండవలసినదిగా ఆహ్వానించేరు. అందుకు ఆయన అంగీకరించి, ఆ బాధ్యతలు చేపట్టి, బోస్టన్ నగరంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. ఆయనకి, రత్నదేవికి “నారద కుమారస్వామి” అనే కుమారుడు, “రోహిణి కుమారస్వామి” అనే కుమార్తె కలిగేరు. ఆ తరవాత వారిరువురూ విడాకులు తీసుకున్నారు.
1922వ సంవత్సరం, నవంబరునెలలో, ఆయన, తనకంటే 29 సంవత్సరాలు చిన్నదైన Stella Bloch అనే అమెరికన్ కళాకారిణిని తృతీయవివాహం చేసుకున్నారు. ఆయన భార్యతోకలిసి న్యూయార్కులోని “బొహీమియన్ ” కళాబృందాలలో చురుకుగా పాల్గొనేవారు. అక్కడవుండగానే అమెరికను ఆధునికఛాయాగ్రహణకళాకారుడు, ఆధునిక కళలకి ప్రోత్సాహకుడు అయిన Alfred Stieglitz తో ఆయనకి గాఢమైత్రి ఏర్పడింది.
ఆ సమయంలోనే ఆయన సంస్కృతభాషని, పాలీభాషని ౘక్కగా అధ్యయనం చేసేరు. ఆ తరువాత ఆయన సంస్కృత-పాలీ భాషలలోని వైదిక బౌద్ధ-జైనాది వివిధ మత సంప్రదాయాలకి సంబంధించిన అనేక గ్రంథాలని శ్రద్ధాసక్తులతో అధ్యయనం చేసేరు. వాటితోబాటు పశ్చిమదేశాల మతగ్రంథాలనికూడా పూర్తిగా అధ్యయనం చేసేరు. బోస్టను చిత్రకళాశాలకి సంబంధించిన కేటలాగుని తయారుచేసేరు.
1927లో “History of Indian and Indonesian Art” (భారతీయ- ఇండోనీషియా కళల చరిత్ర) అనే గ్రంథాన్ని ప్రకటించేరు. ఆ తరువాత భార్యాభర్తలు 1930లో విడాకులు తీసుకుని విడిపోయేరు. ఆ పైన వారిద్దరూ జీవితాంతం స్నేహితులుగానేవున్నారు.
1930వ సంవత్సరం, నవంబరునెల, 18వ తేదీన ఆయన, తనకన్న వయస్సులో 28 సంవత్సరాలు చిన్నైన, అర్జెంటీనా దేశానికిచెందిన, Luisa Runstein ని, చతుర్థవివాహం చేసుకున్నారు. ఆమె Xlata Llamas అనే మారుపేరుతో సామాజిక ఛాయాగ్రాహకురాలిగా పనిచేసేవారు. వారిద్దరికి, ఆనందకుమారస్వామి మూడవ సంతానమైన రామ పొన్నాంబళం (1929 — 2006), అనే కొడుకు కలిగేడు.
1933లో ఆనందకుమారస్వామి పనిచేసే బోస్టను మ్యూజియంలో వారి పదవిని Curator నుంచి “Fellow for Research in Indian, Persian and Mohammedan Art” గా మార్చడం జరిగింది. 1947వ సంవత్సరంలో, సెప్టెంబరు, 9వ తేదీన Massachusettes రాష్ట్రంలోని, Needhamలో ఆయన పరమపదించేవరకు బోస్టను ఫైనార్ట్సు మ్యూజియం క్యూరేటరుగా వారు తమ విధులని నిర్వహిస్తూనే వున్నారు.
Washington D.C., లోని “Freer Gallery of Art” వారికి Persian Artని సేకరించడంలో ఆయన చేసిన సహాయం మరువలేనిది. ఆయన స్వర్గస్థులైన తరవాత వారి సతీమణి Dona Luisa Rustein, ఆనందకుమారస్వామి గారి రచనలు మొదలైనవాటిమీద పరిశోధనచేసే విద్యార్థులకి మార్గదర్శకురాలిగాను, విషయవివరణకర్త్రి(resource-person) గాను సమర్థవంతంగా పనిచేసేరు.
ఆనందకుమారస్వామిగారు సాహిత్యతత్త్వ, మతతత్త్వ, కళాతత్త్వ దర్శనశాస్త్రం (Philosophy of Literature, Religion and Art) రంగాలలో అపూర్వమైన, అనితరసాధ్యమైన, అకలంకమైన మౌలిక రచనలు చేసి, తమ తరవాత తరాలవారికి క్రొంగ్రొత్త చూపుని, అవగాహన సామర్థ్యాన్ని, పరిభాషని నేర్పించేరు. భారతదేశంలోవుండగా రవీంద్రనాథుని మిత్రమండలిలో ప్రముఖస్థానాన్ని పొందేరు. భారతీయ స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభ ఉద్యమంలో భాగమైన “స్వదేశీ ఉద్యమం“లో పాలుపంచుకున్నారు.
1920 దశకంలో రాజపుత్ర – మొగలాయి చిత్రరచనలలోని మౌలిక శైలి భేదాలు గురించి రసజ్ఞలోకానికి మొదటిసారి ఎరుకపరచినది ఆయనే! ఆ సందర్భంలోనే అపురూపమైన అనేక రాజపుత్ర – మొగలాయి సంప్రదాయాలకి చెందిన అద్భుతకళాఖండాలని సేకరించి, బోస్టనులోని చిత్రకళాప్రదర్శనశాలలో జాగ్రత్తగా భద్రపరిచేరు.
1932 నుండి, తమ బోస్టన్ నివాసంనుంచి, రెండు రంగాలలో ౘాలా ప్రముఖ భాగదానం ఆయన చేసేరు. ఆయన చిత్రశాలాధికారిగా చేసిన సర్వంకష పాండిత్యంతోకూడిన రచనలు ఒక రంగానికి చెందినవి. భారతీయ – ఆసియా కళలు, సంస్కృతులుకి సంబంధించిన పరమ రమణీయపరిచయవ్యాసాలు మరొక రంగానికి చెందినవి. ఉదాహరణకి, “The Dance of Shiva” (నటరాజ నాట్యవైభవం) అనే గ్రంథసంపుటిలోని అనేకవ్యాసాలు ప్రపంచకళారంగచరిత్రలో శాశ్వతస్థానాన్ని కలిగివున్నాయి. కళ, సంస్కృతి, గుప్తసంకేతశాస్త్రం, అధ్యాత్మవిద్య, ప్రాచీనమతబోధకగ్రంథాలు, ప్రాచీనజానపదసంస్కృతి, పురాణతత్త్వ అధ్యయనం మొదలైన అనేక రంగాలకిచెందిన వివిధ విద్యల దార్శనిక అంతర్దృష్టి ద్వారా ఆనందకుమారస్వామి మనకి అందించే అద్భుతరచనలలోని సూక్ష్మగ్రాహ్యసమన్వయాలు నిత్యనూతన నిర్మలకాంతిమయ రమ్యలోకాలలోకి మహాద్వారాలని తెరిచి, మన మస్తిష్కాలకి అబ్బురమైన లోచూపుని ప్రసాదిస్తాయి. మన ప్రాచీన పరంపరలకి చెందిన మూలాలని దర్శింపజేస్తాయి. ఆయన ఒక సందర్భంలో ఇలాగ అన్నారు:—
“నేను ప్రాచ్యదృష్టితోనూ ఆలోచిస్తాను. పశ్చిమక్రైస్తవ అవగాహనతోకూడా ఆలోచిస్తాను. గ్రీకు, లాటిను, సంస్కృతం, పాలీ, కొంతవరకు పార్సీ, చైనీస్ భాషలతోకూడిన భావనలలో నా ఆలోచనలు సాగుతూంటాయి”.
హెన్రిక్ రాబర్ట్ జిమ్మర్ విశ్వవిఖ్యాత భారతీయ సంస్కృతి అధ్యయనవేత్త. ఈయన దక్షిణ ఆసియాఖండ కళా చరిత్రకారుడు. “Myths and Symbols in Indian Art and Civilization”, “Philosophies of India” వంటి ప్రామాణిక గ్రంథాలని రచించిన మహాపండితుడు. ఆనందకుమారస్వామి గురించి వర్ణిస్తూ Heinrich Zimmer ఇలాగ అన్నారు:—
“ఆనందకుమారస్వామి పండితోత్తముడు. మేమందరమూ ఇప్పటికీ ఆయన భుజస్కంధాలమీద నిలబడి ఉన్నాం”.
ఆయన బోస్టన్ లోని చిత్రప్రదర్శనశాలాధికారిగావున్న ఉత్తరార్థకాలవ్యవధిలో సంప్రదాయ అధ్యాత్మవిద్య, గుప్తసంకేతశాస్త్రం మొదలైన గహనవిషయాలని సాధికారంగాను, సప్రమాణంగాను వివరించే వ్యాసాలని విపులంగా రచించేరు. ఈ కాలంలో ఆయన చేసిన రచనలు – ప్లేటో, ప్లోటినస్ , క్లిమెంట్ , ఫైలో, అగస్టిన్ , యాక్వినాస్ , ఆదిశంకరాచార్య, ఇక్హార్ట్ , రూమీ వంటి మహాయోగులకి సంబంధించిన అనేక అనుసంధానాలు, అన్వయాలుతో కూడిన సమన్వయాలతో నిండివున్నాయి. “మీగురించి మీరు ప్రధానంగా ఏమని లోకానికి అభివర్ణిస్తారు?” అనే ఒక ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం యిది. “నన్ను నేను ముఖ్యంగా అధ్యాత్మవిద్యావాది/వేదిగా పరిగణిస్తాను” అని ఆయన వివరించేరు. ఆ కాలంలో “అనవరత తత్త్వదర్శనశాస్త్రం” లేక Perennial Philosophy/Perennialism/Perennial Wisdom/Sophia Perennis అనే పేరుతో పిలవబడే ఒక సిద్ధాంతం పండితప్రపంచంలో ౘాలా ప్రభావవంతంగా ప్రచారంలో ఉండేది. ప్రపంచంలోని వివిధమతాలన్నీ ఒకే ఒక మౌలిక ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తున్నాయి. ఆ మూల ఏకైక సత్యంనుంచే వివిధమత సంప్రదాయాలలోను వివిధ గుప్తవిద్యలు, వివిధ బహిరంగ సాధనావిద్యలు వెల్లివిరిసేయని పెరెన్నియల్ ఫిలాసఫీ వేత్తల అభిప్రాయం. ఆనందకుమారస్వామి, Rene Guenon(ఫ్రెంచి దేశానికిచెందిన అధ్యాత్మవిద్యాతత్త్వవేత్త, రచయిత) Frithjof Schuon(అద్వైతవేదాంతం, సూఫిజంల సమన్వయ సిద్ధాంతాలచేత ప్రభావితుడైన జర్మను మూలాలకిచెందిన స్విట్జర్లాండు తత్త్వవేత్త, రచయిత, చిత్రకారుడు, కవి), ఈ ముగ్గురూ కలిసి “పెరెన్నియలిజం“ని స్థాపించేరని చరిత్రకారుల అభిప్రాయం.
ఆనందకుమారస్వామివారి వ్యాసాలు “అనవరత తత్త్వదర్శనం” స్థాపించిన మూర్తిత్రయంలోని మిగిలిన ఇద్దరి రచనలకన్న భిన్నంగావుండేవి. ఆయన తమ జీవితంలోని చివరి దశకాన్ని(last decade) ప్రాచీన మూల మత గ్రంథాల గాఢ అధ్యయనానికి అంకింతంచేయడంవలన వారి వ్యాసాలు, సూటిగా హృదయాన్ని స్పృశించే సునిశిత సుపక్వ పాండితీవైభవంతో విరాజిల్లుతూవుండేవి. సనాతన నిగమాగమ ఆమ్నాయాది మూలగ్రంథాలలోని జటిలవిషయాలని అంతర్దృష్టితో అధ్యయనంచేసి, ఆధునికుల భావనాస్థాయికి అనుగుణంగా వాటిని సరిక్రొత్త సమంజసపరిభాషలో వివరించగలగడంలో ఆయనకి ఆయనే సరిసాటి! “చిదంబరం“లోని “నటరాజస్వామి“ని గురించి ఆయన రచించిన వ్యాసం “The Dance of Shiva” దీనికి ఒక అద్భుత ఉదాహరణ! నటరాజస్వామివారి విశ్వమయనృత్యవైభవంయొక్క అంతరార్థాన్ని ఆనందకుమారస్వామి వారి వ్యాసంలో ఈ విధంగా సంక్షిప్తీకరించేరు:—
“శివుడి నాట్యంయొక్క మౌలిక అంతరార్థం త్రిలక్షణాత్మకమైనది. నటరాజు చుట్టూవున్న నాట్యమండలం విశ్వానికి సంకేతం. దానిలో ఆయనచేసే లయాత్మకనృత్యం విశ్వంలోని నిరంతరచలనప్రక్రియకి మూలసంకేతం. ఇది మొదటిది. ఇంక రెండవది నటరాజనృత్యధ్యేయం! అగణనీయ జీవాత్మలకి సాంసారిక మాయాజాలంనుంచి విముక్తిని కలిగించడమే ఆ నాట్యధ్యేయం! చివరిగా, మూడవ విషయం ఏమిటంటే నటరాజ నాట్యరంగమైన “చిదంబరం”! ఆ చిదంబరం విశ్వానికంతటికీ కేంద్రబిందువు. మన హృదయమే ఆ చిదంబర కేంద్రస్థానం”!
చివరికి నటరాజస్వామి నృత్యాన్ని, ఆనందకుమారస్వామి, మానవలోకంలోని శాస్త్రసమూహాల, మతగణాల, కళానివహాల సమగ్రసాముదాయక చైతన్య స్వరూపంగా సంభావన చేసేరు.
విశ్వకవి రవీంద్రనాథ టాగోర్ , వారి మిత్రులైన ఆనందకుమారస్వామివరుల గురించి ఇలాగ అన్నారు:—
“ఆయనని కళావిమర్శకుడు లేక చరిత్రకారుడు, లేక పండితుడని ఎలాగ మనం వర్ణించినా ఎంతోకొంత మన వర్ణనకి అతీతంగా మిగిలిపోతూ ఉంటుంది. ఆయనగురించిన మన విషయవిశ్లేషణ చివరకి అనిర్వచనీయంగా ఉండిపోతుంది. కుమారస్వామివర్యులు మన అన్ని నిర్వచనాలకీ అతీతంగా ఉంటారు. మన నిర్వచనాలన్నీ ఆయనచేసిన అపార-అమేయ క్రియాకలాపాలకి, రచనలకి సుదూరంగానే నిలిచిపోయి, అశక్తమైపోతాయి. ఆయన ఎప్పుడూ మనం వివరించినదానికంటె వేరేగానే ఉంటారు”.
అపూర్వ ఆర్షచైతన్యస్వరూపులైన ఆనందకుమారస్వామివారికి సాష్టాంగ దండప్రణామం సమర్పించుకుందాం!
స్వస్తి|
మహా పండితుల, మహావిద్వాంసుల లౌకిక వ్యక్తిగత జీవితాలు చాలా భిన్నంగా ఉంటాయి. వాటిని పక్కన పెడితే ఆర్షచైతన్య స్వరూపులైన ఆనంద కుమార స్వామి జీవితం ప్రాత్హంస్మరణీయం. ప్రాక్ పశ్చిమ సంస్కృతుల మేలు కలయికను అసాధారణ ప్రజ్ఞాశాలిని పరిచయం చేసిన మీకు సూచించిన శ్రీ మాన్ క్రిష్ణయ్య గార్కి అభినందనలు.
ఆనందకుమారస్వామివర్యుల రచనల జాబితాని ఈ వ్యాసంలో
పొందుపరచలేదు. ఆ జాబితాలో కొంతలో కొంతైనా ఇక్కడ
చేర్చాలని నేను చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఏది చేర్చాలో ఏది విడిచిపెట్టాలో నాకు ఎంత ఆలోచించినా
నిశ్చయంకాలేదు. అందుకని అవసరమైనవారు అంతర్జాలాన్ని
ఆశ్రయించవలసినదిగా మనవిచేసుకుంటున్నాను.
మూడువిడాకుల కథలో
జాడకి అధ్యాత్మ మేది? సంస్కృతి యేదీ?
పాడియగు ఆర్ష మేదీ?
బాడుగ పాండితియె తప్ప బాలాంత్రపురే!
ఆనంద కుమారస్వామి వంటి అసమాన
ప్రతిభాసంపన్నులని అరుదుగానే చూస్తాం.
అన్ని రంగాలలో అంతటి కృషి చెయ్యగలగడం
పురాకృత విశేష పుణ్యఫలం వల్లే సిద్ధిస్తుందని నా
నమ్మకం.
వారు చదివింది– భూగర్భ శాస్త్రం, వృక్ష శాస్త్రమూను.
పరిశోధన– ఖనిజ శాస్త్రంలో.
మరి సంగీత, సాహిత్య, అధ్యాత్మ, కళా రంగాలలో అంతటి
లోతైన అధ్యయనం ఏమిటీ, గ్రంథ రచనలేమిటీ?
ఒక దార్శనికునిగా, తత్త్వవేత్తగా, బహుభాషా కోవిదునిగా
అన్ని అంశాలలో ఆ ప్రజ్ఞా పాటవాలేమిటి…!
భారతీయ కళారూపాల్ని ప్రపంచానికి తెలియచేయడం
ఒక ఉద్యమంగా వారు చేపట్టడం… అదృష్టం!
పొట్టకూటికోసం ఉద్యోగం చేసే పురావస్తుశాఖాధికారులు
భారతీయకళలని అధ్యయనం చెయ్యడానికి సమర్థులు కారని
వారు చెప్పింది నిజం…
పూర్ణపురుషుడైన ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి
జీవితం అందమైన రంగుల చిత్రంలా ఉంది.