శారదా సంతతి ~ 59 : మహామహోపాధ్యాయ, పద్మవిభూషణ శ్రీ గోపీనాథ కవిరాజ్ మహోదయులు
ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః|
09—09—2018; ఆదిత్యవాసరము|
“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|
“శారదా సంతతి ~ 59″| “మహామహోపాధ్యాయ, పద్మవిభూషణ శ్రీ గోపీనాథ కవిరాజ్ మహోదయులు”| (07—09—1887 నుండి 12—06—1976 వరకు)|
గోపీనాథ కవిరాజ్ జీ, 1887వ సంవత్సరం, సెప్టెంబరునెల, 7వ తేదీన ఆంగ్లేయ పరిపాలనలోని అఖండభారతదేశంలో, అప్పటి తూర్పు బంగాలు రాష్ట్రంలోని ఢాకాజిల్లాలోగల ధమరయి గ్రామంలో జన్మించేరు. ఆయన జన్మించేసరికే వారి తండ్రిగారైన వైకుంఠనాథ్ బాగ్చీ దివంగతులయ్యేరు. వైకుంఠనాథ్జీ అప్పటికి కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ౘదివేవారు. వారిది వంగదేశ సంప్రదాయ బ్రాహ్మణ పరంపరకిచెందిన కుటుంబం. వారి ఇంటిపేరు “బాగ్చీ” అయినా వారి పేరుచివర “కవిరాజు” అనే బిరుదు-నామమే చేరిపోయింది. అందువలన ఆయన లోకంలో “గోపీనాథ కవిరాజు“గా సుప్రసిద్ధులయ్యేరు. వారి కులదైవం శ్రీకృష్ణుడు. అందువలన వారి పేరు “గోపీనాథ్ ” అని పెట్టడం జరిగింది.
ప్రాథమికపాఠశాలవిద్యని వారు ధమరాయి, కంఠలియా గ్రామాలలో ౘదువుకున్నారు. ఆ తరువాత ఆయన ఢాకాలోని K.L.జూబిలీ ఉన్నతపాఠశాలలో 7వ తరగతినుండి 10వ తరగతివరకు ౘదువుకున్నారు.
ఆయనకి 13 సంవత్సరాల ప్రాయంలో, 1910లో, కుసుమకుమారిగారితో వివాహం జరిగింది. ఆయన తండ్రివైపువారు, తల్లివైపువారు, భార్యవైపువారు అందరూ సంస్కృత పండితప్రకాండులే! వారికి జితేంద్రనాథ బాగ్చీ అనే పుత్రుడు, సుధ అనే కుమార్తె కలిగేరు.
1906లో ఆయన జైపూరులోని మహారాజా కళాశాలలోచేరి బి.ఏ. పట్టా తీసుకున్నారు. ఇక్కడ జైపూరులోవుండగానే ఆయన మధుసూదన ఓఝా, శశిధర “తర్కచూడామణి” వంటి మహాపండితులవద్ద తమ ప్రాచీన భారతీయ శాస్త్రవిద్యలని అధ్యయనంచేయడం ఆరంభంచేసేరు
1910లో వారాణసీలోని దేవనాథపురకి వారు తమ నివాసాన్ని మార్చేరు. 1914లో ఎం.ఏ. పట్టాని ప్రథమశ్రేణిలో, ప్రప్రథమస్థానంలో ఉత్తీర్ణతని పొందేరు. అలాహాబాదు విశ్వవిద్యాలయంలో వారి ఉన్నతవిద్య జరిగింది.
వారి ఉన్నతవిద్యాభ్యాసంలోని చరమాంకం ఆర్థర్ వీనిస్ (Arthur Venis) గారి మార్గదర్శకత్వంలో కొనసాగింది. అక్కడవుండగానే గోపీనాథ్జీ, వారాణసీలోని “సరస్వతీ భవన గ్రంథమాల“లో గ్రంథాలయాధికారి అంటే లైబ్రేరియన్ గా మొట్టమొదటి ఉద్యోగంలో నియుక్తులయ్యేరు. ప్రభుత్వ సంస్కృత కళాశాల – వారాణసీ వారికి చెందిన గ్రంథాలయం అది! 1914 నుండి 1920 వరకు వారు లైబ్రేరియన్ గా ఉద్యోగనిర్వహణ చేసేరు. ఇక్కడ ఉండగానే గోపీనాథ కవిరాజుగారు సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, బౌద్ధం, జైనం, శైవాగమశాస్త్రాలు, వైష్ణవాగమశాస్త్రాలు, శాక్తాగమశాస్త్రాలు, తంత్రశాస్త్రం, యూదు-క్రైస్తవ–సూఫీ మిస్టిసిజం, మొదలైన అనేక తత్త్వదర్శనగ్రంథాలు, గుప్తశాస్త్రాలు అధ్యయనం చేసేరు.
గోపీనాథ కవిరాజవరుల జీవితంలో 1918వ సంవత్సరం ౘాలా మహనీయమైనదీ, కీలకమైనదీను! అప్పటికి ఆయన వయస్సు 30 సంవత్సరాలు దాటింది. వారికి ఆ సంవత్సరంలో మహాయోగీశ్వరేశ్వరులైన విశుద్ధానంద పరమహంస తో పరిచయం ఏర్పడింది. విశుద్ధానందజీ యోగ – తంత్ర విద్యాశాస్త్రాలలో ఉత్తీర్ణతనిపొందిన పారంపరిక దేశికోత్తములు. వారు నివసించే ప్రాంతమంతా కొన్ని మీటర్ల పరిధి అంతా మహాపరిమళభరితమైపోయివుండేదట! అందువల్ల ఆయనని అందరూ “గంధ బాబా” అని భక్తిభావంతో పిలిచేవారట! అష్టసిద్ధులతోబాటు అనేకమహిమలని ఆయన ప్రదర్శించేవారట! ఐతే లోకహితంకోసమేతప్ప వేరే సందర్భాలలో వారు మహిమలని ప్రదర్శంచేవారు కాదట!విశుద్ధానంద పరమహంసగారు టిబెట్ (త్రివిష్టపం)కి చెందిన “జ్ఞానగంగ” లేక “Gyanganj” గుప్తయోగమార్గ పరంపరనుండి వచ్చిన యోగిపుంగవులు. గోపీనాథ కవిరాజు విశుద్ధానంద పరమహంసగారి యోగమార్గంలో పయనించే ఆజన్మదీక్షని స్వీకరించేరు.
1924వ సంవత్సరంలో గోపీనాథ్జీ వారాణసీలోని “ప్రభుత్వ సంస్కృత కళాశాల“కి ప్రిన్సిపాలుగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాత సంపూర్ణానంద విశ్వవిద్యాలయం అధికారిగా ఉన్నారు. ఆ కాలంలో “సరస్వతీభవన గ్రంథమాల” వారి పుస్తకప్రచురణలకి ప్రధాన సంపాదకులుగా వారు బాధ్యతలు నిర్వహించేరు.
వారి గురుదేవులైన విశుద్ధానంద పరమహంసగారు దేహాంతమై సిద్ధిపొందిన తరవాత, 1937లో, గోపీనాథ్జీ తమ పరిశోధనలకోసమూ, వ్యక్తిగత అధ్యాత్మ సాధనలకోసము ఉద్యోగబాధ్యతలనుంచి ఐచ్ఛిక విరమణని పొందేరు. (He took voluntary retirement in order to enable himself to dedicate for fully involved spiritual practices and to conduct advanced research in the yogic science of tantra and other allied subjects).
వారు తమ సాధనని, పరిశోధనని, వారాణసీలోని వారి గురువుగారి ఆశ్రమాన్ని నిర్వహించుకుంటూవుండేవారు. వారికి కాశీక్షేత్రం పరమప్రీతిపాత్రమైన ధామం. “పద్మవిభూషణ” బిరుదు స్వీకారానికిమాత్రమే ఒకేఒక్కసారి వారు కాశీని విడిచి వెళ్ళడం జరిగింది.
ఆ తరవాతికాలంలో వారు తమ మిత్రులైన అనిర్వాణ్జీతో కలిసి “కాశ్మీరశివాద్వైతం” గురించి గాఢమైన తపస్సువంటి పరిశోధనని, సాధని చేసేరు. కాలాంతరంలో మా అనందమయి అనుయాయులై ఆమె ఆశ్రమంలో, ఆమె ఆశీర్వచనంతో తమ చివరి కాలాన్ని గడిపేరు.
1934లో మహామహోపాధ్యాయ, 1947లో అలహాబాదు విశ్వవిద్యాలయంవారి డి. లిట్ ., తదుపరి బనారసు; కలకత్తా విశ్వవిద్యాలయాల డి. లిట్ ., పట్టాలు, 1964లో పద్మవిభూషణ, శాంతినికేతనం విశ్వభారతివారి “దేశికోత్తమ” ఉత్తరప్రదేశప్రభుత్వంవారి “సాహిత్యవాచస్పతి”, 1965లో సాహిత్య అకాడమీ అవార్డు, మొదలైనవి వారిని ఏరి-కోరి వరించిన పురస్కారాలు. భారతీయ కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖవారు గోపీనాథ కవిరాజ స్మారకచిహ్నంగా తపాలాబిళ్ళని విడుదలచేసేరు.
గొపీనాథకవిరాజవర్యులు వారికాలంలోని వివిధరంగాలకిచెందిన మహాత్ములతో గాఢపరిచయాలనీ, మైత్రిని కలిగివుండేవారు. ఉదాహరణకి రాం ఠాకూర్ , అవతార్ మెహెర్ బాబా, స్వామి పరమానందతీర్థ, మా ఆనందమయి, సీతారాందాస్ ఓంకారనాథ్ , భారతరత్న భగవాన్దాస్ , దిలీప్ కుమార్ రాయ్ , అరవిందఘోష్ , మొదలైనవారు వారికి సన్నిహితులైవుండేవారు.
1960వ సంవత్సరంలో ఆయన తీవ్రవ్యాధిగ్రస్తులయ్యేరు. వైద్యపరీక్షలలో వారికి పురీషనాళ తనువ్రణం (rectal cancer) ఉన్నట్లు గుర్తించి, బొంబై, టాటా కేన్సర్ చికిత్సాలయంలో వైద్యం చేయించడం జరిగింది. అప్పటి మహారాష్ట్ర గవర్నరు శ్రీప్రకాష్ గారి వ్యక్తిగత పర్యవేక్షణలో వైద్యం అందించబడింది. గోపీనాథ కవిరాజుగారు శస్త్రచికిత్సద్వారా వ్యాధివిముక్తులై, ఆనందమయి అమ్మగారి ఆశ్రమంలో, ఆమె పర్యవేక్షణలో పూర్తిగా కోలుకుని స్వగృహానికి చేరుకున్నారు.
1964వ సంవత్సరంలో ఉత్తరప్రదేశప్రభుత్వంవారు “వారాణసీయ సంస్కృత విశ్వవిద్యాలయం“లో ప్రత్యేకమైన “యోగ – తంత్ర విభాగం” ప్రారంభించేరు. దానికి “విభాగాధిపతి“గా గోపీనాథ్జీని నియమించేరు. వారు ఆ పదవిని సమర్థవంతంగా ఐదు సంవత్సరాలపాటు, అంటే, 1964 నుండి 1969 వరకు నిర్వహించేరు. అనారోగ్యం తిరగబెట్టడంవలన ఆయన తమ పదవినుండి వైదొలగవలసివచ్చింది.
1976వ సంవత్సరం, జూన్ నెల, 12వ తేదీన గోపీనాథకవిరాజవర్యులు తమ భౌతికకాయం విడిచిపెట్టి శివైక్యం చెందేరు.
గోపీనాథకవిరాజవర్యులు బహుముఖ ప్రజ్ఞావంతులుకావడంవలన ఆయన రచించిన గ్రంథాలు అనేకరంగాలలో పరమప్రమాణమైనవిగా రాజిల్లుతున్నాయి. “తాంత్రిక్ వాఙ్మయ్ మేc శాక్తదృష్టి”, “శ్రీకృష్ణ ప్రసంగ”, “తాంత్రిక్ సాధనా ఔర్ సిద్ధాంత్ “, “తాంత్రిక్ సాహిత్య్ “, “భారతీయ సంస్కృతి ఔర్ సాధనా”, “సాధుదర్శన్ ఏవం సత్ప్రసంగ” మొదలైనవి వారి గ్రంథాలలో కొన్ని.
గోపీనాథ కవిరాజవర్యులకి సాష్టాంగ దండప్రణామం సమర్పించుకుందాం!
స్వస్తి||
పూర్ణ పురుషులు శ్రీ గోపీనాథ కవిరాజుల మహోన్నత
వ్యక్తిత్వం, వారి అద్భుత జీవన విధానం అపూర్వం ,
ఎంతో ఆసక్తిదాయకం!
అసలు ఆరోజుల్లో తూర్పు బెంగాల్ దేశం లోమహోన్నత
వ్యక్తులు ఉద్భవించారు. గురుమహరాజ్ కి తంత్రవిద్య
బోధించిన భైరవీ బ్రాహ్మణి , అలాగే ఆయనకి పరమ
శిష్యులై, అత్యంత నిరాడంబర జీవితం గడిపిన నాగమహాశయ్
వంటివారు అక్కడినుంచి వచ్చినవారే.
గోపీనాథ కవిరాజు వారి చదువు, చేసిన ఉద్యోగం, వారి రచనలూ,
పొందిన బిరుదులూ చేసిన సాధనలూ అన్ని పరమోత్కృష్ట మైనవే!
వారు శారదా తనయులే!
చదువు లెన్నొ నతడు చాల పెద్దగ నేర్చె
తత్త్వశాస్త్ర మంత తవ్వి చూసె.
పూజనీయు డతడు పూర్వ జన్మ ఫలము
గోపినాథ కవికి కోటి నుతులు.