సాహిత్యము—సౌహిత్యము ~ 69 | భక్తి — భావనాత్మక వైభవము : రసాత్మక వైభవము
ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః|
08—09—2018; శనివారము|
“శారదాంబికా దయాచంద్రికా”|
“సాహిత్యము—సౌహిత్యము ~ 69” | “భక్తి — భావనాత్మక వైభవము : రసాత్మక వైభవము”|
“శ్రీమద్భాగవతమహాపురాణమ్ “లో, మొదటి స్కంధం, మొదటి అధ్యాయంలోని ప్రారంభశ్లోకాలలోని మూడవ శ్లోకంలో ఉత్తరార్థం ఇలాగ అంటుంది:—
“పిబత! భాగవతం రసమాలయం|
ముహురహో! రసికాః భువి భావుకాః!”||
“భక్తిభావనాపునీతహృదయులైన రసజ్ఞులారా! (లేక) భక్తిరసపిపాసువులైన భావుకులారా! భాగవతరసాన్ని మీరు మూలతత్త్వంలో లయం ఐపోయేవరకు (మోక్షంపొందేవరకు) మాటిమాటికీ సేవిస్తూనేవుండండి”.
పై శ్లోకతాత్పర్యనిర్ణయంలో “రసిక-భావుక” శబ్దాలు విశేషణ-విశేష్యాలుగానే శ్రీధరస్వామివారి “భావార్థదీపికా“, శ్రీ వీర రాఘవాచార్యులవారి “భాగవత చంద్రచంద్రికా“, శ్రీ విజయధ్వజ తీర్థులవారి “పదరత్నావళీ“, శ్రీ రాధాకృష్ణులవారి “సుధీసుధా“లలో వ్యాఖ్యానించబడ్డాయి. అయినా ఈ “రస-భావనా” శబ్దాల ప్రయోగంపట్ల కొంత స్పష్టత అవసరమూ, అనివార్యమూ అనిపించి ఈ చర్చని మన రసజ్ఞభావుకుల సమక్షంలో ఉంచబడుతోంది.
మిగిలిన భక్తి గ్రంథాల అధ్యయనం, శ్రవణం విషయంలో “భక్తిభావం” అనే ప్రస్తావనవుంటుందికాని, ఈ “రసం” గురించిన మాట కనబడదు. భాగవతం భక్తిరసశాస్త్ర గ్రంథం. అందుకనే పెద్దలు మనకి భాగవత అధ్యయన, శ్రవణ, పఠన, పాఠన, పారాయణాదులలో మార్గదర్శకమైన “భక్త్యా భాగవతం శాస్త్రం” అని సూచనచేసినవిషయం ఇంతకిముందు తెలుసుకున్నాంకదా! భక్తిభావనాసిద్ధి, భక్తిరసస్ఫూర్తి హృదయాశ్రయజన్యమైనవి. బుద్ధిప్రమేయదూరమైనవి. ఈ సన్నివేశంలో బుద్ధిప్రమేయానికి పాత్ర ఉన్నా అది హృదయసార్వభౌమత్వానికి లోబడి, హృదయభావితభావనానికి దోహదకారిగావుంటుంది.
అసలు “రసం” అనే విషయం కేవలం కృష్ణావతారంతోనే ముడిపడివుంది. రామావతారంలో ఋషులు చేసిన “రస”
ప్రస్తావనకి స్పందించిన రాముడు, కృష్ణావతారంలో “రాసలీల” ప్రదర్శించబడుతుందని అని వరమిచ్చినట్లు “గర్గసంహిత“లో విపులవివరణవుంది. ఆ వివరణలో వివిధప్రకారాలైన గోపికల అవతరణకి సంబంధించిన ప్రస్తావన విస్తృతంగా ఉంది. ద్వాపరయుగంలో కృష్ణావతారం ప్రకటం అయ్యేపర్యంతమూ భావనాత్మక భక్తివైభవం కృతయుగం నుంచీ భక్తజనుల నిత్యజీవితంలో అంతర్వాహినిగా ఉంటూనేవుంది. “రసో వై సః” అని వేదంచేత ప్రతిపాదితుడైన రసస్వరూపుడైన పరబ్రహ్మ సాక్షాత్తుగా శ్రీకృష్ణుడై అవతరించేడని “కృష్ణస్తు భగవాన్ స్వయమ్ ” అని భాగవతం స్పష్టంగాను, స్ఫుటంగాను ప్రకటించింది. కృష్ణావతారంలోనే ఆయన రసస్వరూపతత్త్వం భాగవతంలోని “రాసపంచాధ్యాయి“లో గోపికల అనుభవంలోకి ప్రసరించింది. భాగవతంలోని దశమస్కంధంలోని 29వ అధ్యాయం నుండి 33వ అధ్యాయంవరకుగల ఐదు అధ్యాయాలని “రాసపంచాధ్యాయి” అంటారు. కొంచెం లోతుగా పరిశీలిస్తే శ్రీకృష్ణుడు చతుర్ముఖ బ్రహ్మగారు చేసిన “గోవత్సాపహారఘట్టం“లోనే ఒక రాసలీలని ప్రదర్శించేడు. అది పరమాద్భుతమైన మహాలీల! భక్తి-జ్ఞానం-రాజయోగం మొదలైన అన్ని అధ్యాత్మవిద్యాబోధకమైన యోగాలకి సమన్వయస్వరూపమైన సంగమస్థానమే ఆ రాసలీల! అది 13వ అధ్యాయంలో వర్ణించబడింది. బ్రహ్మగారు, “అఘాసుర వృత్తాంతం” చూసి, ఆశ్చర్యపడి, ఐదేళ్ళ ప్రాయమున్న బాలకృష్ణుడు అంతకంటె గొప్పలీలని ఏమి ప్రదర్శించగలడో చూడాలనే కుతూహలంతో, ఆవుదూడలని, గోపబాలురని (మానవలోక పరిగణనప్రకారం) ఒక ఏడాదిపాటు దాచివేస్తాడు. ఆ రహస్యం గ్రహించిన ఐదేళ్ళ బాలకృష్ణుడు, తనలో ఇలాగ అనుకుంటాడు:—
“తతః కృష్ణః ముదం కర్తుం తత్ మాతౄణాం చ కస్య చ|
ఉభయాయితమాత్మానం చక్రే విశ్వకృదీశ్వరః”||
“అప్పుడు విశ్వకర్త ఐన శ్రీకృష్ణపరమాత్మ, ఆవుదూడల-గోపబాలుర తల్లులకి, బ్రహ్మదేవుడికి, ఆనందం కలిగించడంకోసం తానే ఆవుదూడలూ-గోపాల బాలురూ ఉభయులగాను వ్యక్తమయ్యెను”. (వ్యాసభగవానులవారి భాగవతంలో ఆవుదూడలు- గొల్లపిల్లలు మాత్రమే బ్రహ్మగారిచేత దాౘబడ్డారు. పోతనగారిభాగవతంలోని ఈ వృత్తాంతం మూలానికి భిన్నంగావున్నట్లు కనిపిస్తుంది).
33వ అధ్యాయంలోని “మహారాసం” ప్రధానలక్షణాలలో ఒకటి, ఎంతమంది గోపికలు ఉన్నారో అంతమంది కృష్ణులు ఉండడంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే అవిభాజ్యమైన ఏకైకతత్త్వం, “సోsకామయత| బహు స్యాం ప్రజాయేయేతి” అని వేదంలో చెప్పబడినట్లు ఒకే కృష్ణుడు అనేకృష్ణులుగానో, లేక, అనేక ఇతర రూపాలుగానో వ్యక్తంకావడం అన్నమాట!
“కృత్వా తావంతమాత్మానం యావతీః గోపయోషితాః|
రేమే సః భగవాన్ తాభిః ఆత్మారామోsపి లీలయా”||
(శ్రీమద్భాగవత మహాపురాణమ్ | X : 33 : 20)
“తనకంటె వేరే బాహ్యవస్తుప్రపంచంలేనందున తన ఆత్మయందే సర్వదా ఆనందమయుడై ఉండే శ్రీకృష్ణపరమాత్మ, గోపికలు ఎంతమంది ఉన్నారో, అంతమంది శ్రీకృష్ణులుగా తనను తాను వ్యక్తంచేసుకుని వారందరితో కలిసి రమ్యభావంతో సంచరించెను”.
ఈ అంశాన్నే లీలాశుకులవారు,
“అంగనాం అంగనాం అంతరే మాధవః|
మాధవం మాధవం చాంతరే చాంగనా”||
“గోపికకి, గోపికకి మధ్య మాధవుడు, మాధవుడికి, మాధవుడికి మధ్య గోపిక” అని కన్నులకి కట్టినట్లు మహారాసమండలాన్ని వర్ణించేరు. (ఈ వర్ణనకికూడా వ్యాసభాగవతంలో మూలభావం ఉంది:— “యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోః ద్వయోః“| “ఇద్దరిద్దరు గోపికలమధ్య యోగ(మాయా)ప్రభువైన శ్రీకృష్ణుడు ఉండెను”.)
ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృష్ణుడు ఉండడం, ఒక్కొక్క గోమాతకి ఒక్కొక్క దూడగాను, ఒక్కొక్క గోపమాతకి ఒక్కొక్క బాలకుడుగాను వైష్ణవమాయచేత కృష్ణుడు తనని తాను చేసుకుని 13వ అధ్యాయంలోని “గోవత్స-గోపబాలక అపహరణ ఘట్టం“లో “మహారాసలీల“ని ఒక ప్రత్యేకస్థాయిలో ప్రదర్శించేడు. అందువలన ఆ ఘట్టంలో ఆవులు తమ లేగలని, గోపమాతలు తమ కుమారులని ఎన్నడూలేనంత ఆనందభావంతో మాతృప్రేమని అనుభవించినట్లు భాగవతంలో స్పష్టవర్ణనవుంది. ఇది శ్రీకృష్ణావతార వైలక్షణ్యం! “రసానాం సంపూర్ణ సమూహః – రాసః” అని పెద్దలుచెపుతారు. ఆ సంపూర్ణరసస్వరూపుడు, శ్రీకృష్ణభగవానుడు. ఆయనలోని ఆ రసనిధానమే మహారాసేశ్వరి అయిన రాధామాత! “రాధా రాసేశ్వరీ రమ్యా కృష్ణమంత్రాధిదేవతా” అని శ్రీరాధామాత వర్ణించబడుతోంది. అంతేకాదు. యోగరహస్యదార్శనికులు, “శ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ” అనే వేద మంత్రంలోని శ్రీదేవి-లక్ష్మీదేవి అనే ఇద్దరు భార్యలు కలిగినవాడు శ్రీకృష్ణుడే! ఇక్కడ శ్రీదేవి అంటే రాధాదేవి. శ్రీరాధాకృష్ణరసభావోపాసనాయోగమే “వ్రజధామయోగం“!
ఈ యోగంలో ప్రయోగించబడే శబ్దాలకి ఈ యోగమార్గ పరమైన అర్థాలు ఉంటాయి. ఉదాహరణకి వ్రజధామయోగోపాసనలో, “శ్రీ” అంటే రాధ అని, కృష్ణుడని రెండు అర్థాలు ఉంటాయి. “శ్రీకృష్ణ” అంటే రాధాకృష్ణ అని అర్థం. “శ్రీరాధ” అంటే కృష్ణరాధ అని భావం. అంతేకాదు. శ్రీరాధ, శ్రీకృష్ణ అని శ్రీ తరవాత వచ్చే రాధ లేక కృష్ణ శబ్దాల మధ్య వ్యవధానం అంటే, space ఉండదు. అవి ఎప్పుడూ ఏకశబ్దంగా కలిసే ఉంటాయి. అంటే గోలోకధామంలోను, వ్రజధామంలోనిమూర్తులరూపంలోను, శబ్దస్వరూపంలోను, భక్తుల రసమయహృదయాలలోను రాధాకృష్ణులు అవిభాజ్య ఐక్యరూపంలోనే ఉంటారు. ఈ యోగానికి సంబంధించిన పరిభాషకి ప్రత్యేక నిఘంటువు ఉండవలసినంత గ్రంథం ఉంది.
శ్రీకృష్ణుడు ఏకైక వైదికప్రణవమైన ఓంకారస్వరూపుడు. పంచతాంత్రికప్రణవాలైన ఐం-హ్రీం-శ్రీం-క్లీం-సౌః రాధాదేవియొక్క పంచదివ్యనాదవిభూతులు. భాగవతమంతా వెల్లివిరిసిన శ్రీకృష్ణవైభవమంతా రాధాదేవి దివ్యమంగళరసస్వరూపమే! శ్రీమద్భాగవత రసోపాసనాపూర్ణఫలస్వరూపిణి శ్రీరాధామాత కాక అన్యమైనదిలేదు! భాగవతరసపీయూష పిపాసువులకి అది అనుభవైకవేద్యం. ఈ భాగవతరసోపాసనాయోగభూమికలోనికి రాధానుగ్రహంద్వారా అడుగిడిన రసికసాధువుకి ఆ మణిమయమంత్రలోకమహిమలు అనుభవంలోకి వస్తాయి. అప్పుడు శ్రీరాధోపాసనా ఆచార్యవరిష్ఠులు చెప్పిన ఈ రహస్యం బోధపడుతుంది:—
“యథా ప్రియంగుపత్రేషు గూఢమారుణ్యమిష్యతే|
శ్రీమద్భాగవతే శాస్త్రే రాధికా తత్త్వమీదృశమ్ “||
“గోరింటాకులో పైకి ఎర్రదనం ఏమాత్రమూ కనిపించకుండానే, ఆ ఆకుని మెత్తగా రుబ్బి, ౘక్కగాపెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. అదేవిధంగా భాగవతభక్తిదర్శన శాస్త్రాన్ని రసమయభావంతో ఉపాసించిన భక్తిరసాత్మక ఉపాసకుడి హృదయం భాగవత అంతర్వాహిని అయిన రాధికారాగ రసధునిస్పర్శతో ఎర్రగా పండి భక్తిరసభరిత ఫలమౌతుంది”.
అటువంటి భాగవతరసోపాసనచేసిన భక్తవరులైన శ్రీ సార్వభౌమభట్టాచార్యులు ఇలాగ అన్నారు:—
“జ్ఞాతం కాణభుజం మతం, పరిచితైవాన్వీక్షకీ, శిక్షితా
మీమాంసా, విదితైవ సాంఖ్యసరణిః, యోగే వితీర్ణా మతిః|
వేదాంతాః పరిశీలితాః సరభసం కిం తు స్ఫురన్ మాధురీ
ధారా కాచన నందసూనుమురళీ మచ్చిత్తమాకర్షతి”||
“కణాదమహర్షి కృతమైన వైశేషికదర్శనశాస్త్రం తెలుసుకున్నాను. గౌతముడి న్యాయశాస్త్రం ౘదువుకున్నాను. జైమిని రచించిన పూర్వమీమాంసాశాస్త్రం అధ్యయనంచేసేను. కపిలమహాముని సాంఖ్యదర్శనం తీరు-తెన్నులు అవగాహనచేసుకున్నాను. పతంజలిమహర్షి యోగశాస్త్రం ౘక్కగా నేర్చుకున్నాను. బాదరాయణమహామునికృత వేదాంతశాస్త్రం పూర్తిగా శోధించేను. ఇన్ని చేసినా వీటినన్నింటినీ విడనాడి నా మనస్సు మాధవుడి ముగ్ధమోహనమురళీగానం వినేసరికి ఆ మురళీనాదమాధుర్యానికి పరవశమైపోయి ఆ వైపుకే వెళ్ళిపోతోంది”. ఇది భక్తుడి రసాత్మకహృదయనైజం.
భక్తియొక్క భావనాత్మకవైభవం బాలప్రహ్లాద ఆళ్వారులో పరాకాష్ఠని పొందింది. శ్రీరాధామాత హ్లాదినీశక్తి విభూతికిరణుడే ప్రహ్లాదుడు కావడమే అందుకు కారణం! భక్తియొక్క రసాత్మకవైభవం గోవులలోను, గోపికలలోను పూర్ణతని పొందింది. ఈ రెండింటిలో తర-తమభేదాలు ఏమీలేవు. శ్రీకృష్ణులవారి (ఆ)హ్లాదినీశక్తి స్వరూపిణి, రాసేశ్వరి అయిన శ్రీరాధాదేవి అనుగ్రహం వలన గోపికలకి భక్తియొక్క రసాత్మకవైభవం అనుభవంలోకి వచ్చింది. కోమలస్త్రీహృదయ యుతులైన భక్తులకి శ్రీరాధాదేవి అనుగ్రహప్రాప్తివలన పురుషోత్తముడు, వేదవేద్యుడు, నృత్య గానవిలాసప్రియుడు ఐన శ్రీకృష్ణస్వామితో రాసలీలారసానుభవం కలుగుతుంది. దైహికపురుషత్వం లేక స్త్రీత్వంతో ఆ దివ్యానుభవస్పర్శకి సంబంధంలేదు (It has nothing to do with biological masculinity or femeninity). సర్వసంగపరిత్యాగులైన ఆర్షయతీశ్వరులు ఆ మహారాసానుభవస్థితిలోనే నిత్యమూ ఉంటారు. వ్రజధామంలో క్రిమికీటకాలనుంచి మహామునులవరకు అందరూ ఆ రసానుభూతిలోనే నిమగ్నులైవుంటారు.
స్వస్తి|
రసరమ్య భాగవతమున
రసమే తానై ఫలించి రాధారుణిమన్
రసికాశయాంబరమ్మున
ప్రసరించును కృష్ణమూర్తి బాలాంత్రపురే!
(భక్తి) రస ప్రాధాన్యంగా ఈ వారం ప్రస్తావించిన శ్రీమద్భాగవత
శాస్త్ర ప్రాశస్త్యం…. ఆ గ్రంథాన్ని పారాయణం లేదా
అధ్యయనం చేసేవారికి ఒక విశిష్టమైన మార్గ నిర్దేశం
చేయగలదు.
భాగవతం అనే ఫలం మహా మధుర రస పూరితమైనదనీ,
భావుకులైన భక్తిరస పిపాసువులు మాటిమాటికీ ఆ ఫల
రసాస్వాదన చేయాలనీ… తద్వారా మాత్రమే మోక్షం లభిస్తుందని
ఉపయుక్తమైన ఉపదేశాన్ని అందించింది.
రసమయమైన శ్రీమద్భాగవతంలో వివిధ సందర్భాలలో
శ్రీకృష్ణులవారు ప్రదర్శించిన రాసలీలా వైభవాన్ని తెలియచెప్తూ
ఉదహరించిన ఘట్టాలన్నీ అత్యద్భతంగా ఉన్నాయి.
చాలామందికి సరైన అవగాహన లేని…, భాగవతంలో
ప్రత్యక్షంగా ప్రస్తావించని రాధా తత్త్వానికి మూలం ఇందులో
తెలిసికోగలము.
అలాగే శ్రీ సార్వభౌమ భట్టాచార్య వారి పలుకులు
భక్తి రసాస్వాదనా పరులకి పరమ గమ్యం!
🙏🙏🙏🙏🙏
“భక్త్యా భాగవతం గ్రాహ్యం” అనుండాలేమో.