శారదా సంతతి ~ 58 : అభినవగుప్తపాదాచార్యులవారి అనుగ్రహ స్వరూపులు ~ దేశికేంద్రులు ఠాకూర్ జయదేవసింగ్ ఆచార్య వరిష్ఠులు
ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః|
02—09—2018; ఆదిత్యవాసరము|
“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|
“శారదా సంతతి ~ 58″| “అభినవగుప్తపాదాచార్యులవారి అనుగ్రహ స్వరూపులు ~ దేశికేంద్రులు ఠాకూర్ జయదేవసింగ్ ఆచార్య వరిష్ఠులు (19-9-1893 నుండి 27-5-1986 వరకు)|
ఉత్తరప్రదేశరాష్ట్రంలోని బస్తీజిల్లాలోగల షొహరతగఢగ్రామంలో దేశభక్తిగల సుక్షత్రియకుటుంబంలో 1893వ సంవత్సరం, సెప్టెంబరునెల, 19వ తేదీన ఠాకూరు జయదేవసింగుజీ జన్మించేరు. ప్రాథమికవిద్య షొహరతగఢగ్రామంలో జరిగింది. ఆ తరువాత గోరఖపూరులో ఆయన విద్యాభ్యాసం కొనసాగించేరు. ఆ తరవాత, బనారసులోని కేంద్రీయ హిందూ పాఠశాలలో ఆయన ౘదువుకున్నారు. అక్కడే వారు మెట్రిక్యులేషను, ఇంటరుమీడియెట్ విద్యని పూర్తిచేసేరు. వారు ఎప్పుడూ తరగతిలో ప్రథమశ్రేణిలోనే ఉత్తీర్ణులౌతూ ఉండేవారు. ఆయన ఇంటరుమీడియేటులోవుండగా “అఖిలభారత మత పరీక్షలు” జరుగగా, వాటిలో ఆయన పాలుపంచుకుని ప్రథమస్థాయి బహుమతిని పొందేరు. ఈ సంఘటనవలన ఆయన డా. అనీబిసెంటు, డా. జార్జి అరండేల్ , డా. రుక్మిణి అరండేల్ మొదలైన “దివ్యజ్ఞాన సమాజం“నకు చెందిన మహామహుల దృష్టిలోకి వెళ్ళేరు. ఆయన వారాణసీలోవుండగానే మదనమోహన మాలవీయ, డా. భగవాన్ దాస్ , ఆచార్య నరేంద్రదేవ, డా. మొహ్మద్ ఇక్బాల్ , నారాయణగురు మొదలైన పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి. విశ్వవిఖ్యాత భారతీయ తంత్ర సంస్కృతి విషయంలో ఆధునిక పండితాగ్రేసరులైన గోపీనాథకవిరాజవర్యులకి జయదేవసింగుజీ తమ శుశ్రూషని ఇక్కడేవుండి నిర్వహించేరు.
జయదేవసింగుజీ 1928లో అలహాబాదు విశ్వవిద్యాలయంనుండి తత్త్వశాస్త్రం (ఫిలాసఫీ)లో ఎం.ఏ. పట్టం తీసుకున్నారు. 1934లో సంస్కృతంలో ఎం.ఏ. పట్టా తీసుకున్నారు. కాన్పూరులోని డి.ఏ.వి. కళాశాలలో తత్త్వశాస్త్ర ఆచార్యులుగా ఉద్యోగం ప్రారంభించేరు.
ఆ సమయంలోనే ఆగ్రా ఘరానా గానచక్రవర్తి ఉస్తాద్ ఫైయాజ్ ఖాc సాహబ్ వద్ద సంగీతవిద్యాభ్యాసం కూలంకషంగా చేసేరు. అంతకిముందు ఆయన గ్వాలియరు ఘరానాకి చెందిన పండిత్ శ్రీకృష్ణ హరిహిర్లేకర్ , పండిత్ నానుభైయా తెలంగ్ ల వద్దకూడా కొంత సంగీతవిద్యాభ్యాసకృషి చేసేరు. ఆ సమయంలో వారు తీవ్రమైన కంఠవ్యాధి (Throat meningitis) బాధితులయ్యేరు. ఆ కారణంగా ఆయన గానసాధనని విడిపెట్టి, సంగీతశాస్త్ర అధ్యయనాన్నీ, అభ్యాసాన్నీ జీవితాంతమూ కొనసాగించేరు.
1939లో ఆయన కాన్పూరులో “సంగీత సమాజ్ “ని స్థాపించి సుమారు 17 సంవత్సరాలు నిరవధికసంగీతసేవ చేసేరు. ఆ సందర్భంలో వారు ప్రతిసంవత్సరమూ “అఖిలభారత సంగీత సభలు” నిర్వహించేరు. ఈ సభలద్వారా వారికి ఆ కాలంలోని విశ్వవిఖ్యాత సంగీతకారులందరితోను గాఢమైన పరిచయాలూ, స్నేహాలూ ఏర్పడ్డాయి. ఆ రకంగా ఉస్తాద్ ఫైయాజ్ ఖాc, ఉస్తాద్ విలాయత్ హుస్సేన్ ఖాc, పండిత్ భాత్ఖండేజీ, పండిత్ రతన్ ఝంకర్జీ మొదలైన మహానుభావులతో జీవితాంతమూ మైత్రి ఏర్పడింది.
1956లో అప్పటి సమాచార-ప్రసారశాఖామంత్రి శ్రీ బి.వి. కేస్కర్ “అఖిలభారత సంగీత అధ్యాపక గోష్ఠిసభలు” లో, ఠాకూరు జయదేవసింగు సాహెబ్ ప్రసంగం వినడం జరిగింది. ఆనాటి వారి ప్రసంగంలోని పాండిత్యానికి, వాగ్ధాటికి, సంగీత శాస్త్రకూలంకషపరిజ్ఞానానికి, అన్నింటినీమించి వారి నిజాయితీతోకూడిన కృషికి కేస్కర్జీ ముగ్ధులైపోయేరు. అందువలన కేస్కర్జీ ఠాకూర్జీని ఆకాశవాణి-ఢిల్లీ కేంద్రంలో హిందుస్థానీ సంగీత విభాగానికి ప్రధాన సంగీత నిర్మాతగా ఉండవలసినదిగా కోరేరు. ఆ కాలంలో ఆకాశవాణిలో అత్యున్నతపదవులలోవుండి ఉత్తరభారత సంగీతవిభాగాన్ని తీర్చిదిద్దిన మహామహుల బృందంలో సభ్యులైన డా. కేస్కర్ , ఠాకూర్ సాహెబ్ , డా. రతన్ ఝంకర్ , పండిత్గో విందరావ్ తెంబే, శ్రీ లాడ్ I.AS. మొదలైనవారందరూకలిసి ఒక స్వర్ణయుగాన్ని నిర్మించేరు. ఆ కాలంలోనే ప్రతిశనివారంరాత్రి గం.9 30ని. నుండి, గం.11-00 వరకు, గంటన్నరసేపు “జాతీయ సంగీత కార్యక్రమం” ఏర్పాటు చేయబడింది. అలాగే, ప్రతిసంవత్సరమూ “ఆకాశవాణి—వార్షిక సంగీతసమ్మేళనం” కార్యక్రమాలు నెలరోజులు జరిగేవి. అదేవిధంగా, ఆ కాలంలో “శాస్త్రీయసంగీత శిక్షణ“, ఆదివారం ఉదయం ప్రత్యేక సంగీతకార్యక్రమాలు, రసహృదయులలో సంగీతాభిరుచిని కలిగించి, పెంపొందింప జేసే కార్యక్రమాలు, ఆహూతులైన రసజ్ఞ శ్రోతల సమక్షంలో సంగీతసభల నిర్వహణ మొదలైన ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించబడ్డాయి.
1973—1976ల మధ్య ఠాకూరు జయదేవసింగ్జీ “ఉత్తరప్రదేశ సంగీత నాటక అకాడమీ“కి అధ్యక్షులుగా వున్నారు. ఆ కాలంలో ఆయన సంగీత-నాట్య శాస్త్రాలకి సంబంధించిన అనేక ప్రామాణికమైన ప్రాచీన, అధునాతన గ్రంథాలని ప్రచురింప చేసేరు.
భారతీయభాషలైన సంస్కృతం, హిందీ, ఉర్దూ, బంగాలీ, మరాఠీ, గుజరాతీ, పాలీ లయందు మాత్రమే కాకండా ఆయన ఇంగ్లిష్ , ఫ్రెంచి, జర్మను, గ్రీకు, లాటిను, పార్సీ, అరబిక్ మొదలైన భాషలలోకూడా అపారపాండిత్యం సంపాదించేరు. అంతేకాక వివిధ ప్రాంతీయ సంగీత-నాట్యరీతులగురించికూడా సమగ్ర అధ్యయనం చేసేరు. లఖింపూర్ ఖేరీలోని యువరాజదత్త విద్యాలయంయొక్క పురోభివృద్ధికోసం ఏళ్ళతరబడి పాటు పడ్డారు. చివరికి దానిని పోస్ట్ – గ్రాడ్యుయేట్ కళాశాలగా తీర్చిదిద్దేరు. ఆ పైన తన వ్యక్తిగత గ్రంథాలయాన్ని ఆ కళాశాల గ్రంథాలయానికి ప్రదానం చేసేరు.
90 వసంతాల వయస్సు దాటిన తరువాత ఆయన ఇచ్చిన ఒక రేడియో ఇంటర్వ్యూలో ధ్రువపద్ – ఖయాల్ -ఠుమ్రీ మొదలైన సంపూర్ణ శాస్త్రీయ – ఉపశాస్త్రీయ సంగీత సంబంధమైన వివిధ అంశాలని వివరించడానికి వారు వాటినన్నింటినీ సంప్రదాయసిద్ధంగాపాడి వినిపించి శ్రోతలందరినీ ఆశ్చర్యచకితులని చేసేరు.
ఆయన వారాణసీలోని సిద్ధగిరిబాగ్లో “విశ్రామకుటి” అనే స్వగృహాన్ని నిర్మించుకున్నారు. వారికి ఆచార్యులైన పండిత్ గోపీనాథకవిరాజ్ గారి నివాసానికి సన్నిహితంగావుండాలనేది ఆయన బనారసులో స్థిరపడడానికి ప్రధానకారణాలలో ఒకటి. ఆయన భార్య 1972లో దివంగతురాలు అయ్యేరు. ఆయనకి ఒకేఒక కుమార్తె ఉన్నారు. ఆయన వయోవృద్ధులైనతరవాత ఆయనకి తోడుగావుండే ఆయన మనుమడైన సంజయ్ సింగ్ తమ తాతగారిగురించి ఇలా అన్నారు:—
“తాతగారు, మనిషి పొట్టిగావున్నా, హిమాలయాలకంటె ఉన్నతమైనవారు. మహాసముద్రాలకన్న లోతైనవారు. ఆయన ఆలోచనలన్నీ ఉత్కృష్టమైనవి, ఉదాత్తమైనవీను! కాని ఆయన నిత్యజీవితం ౘాలా సరళంగాను, ఆయన మాటలు కోమలంగాను ఉంటాయి”.
ఇదంతా ఆయన జీవితంలో ఒక ఎత్తు అయితే, భారతీయ ప్రాచీన తంత్రశాస్త్ర సంప్రదాయానికి, అందులోనూ “కాశ్మీర శివాద్వైత సిద్ధాంతం” గురించి జనబాహుళ్యంలో సమ్యగవగాహన-సదవగాహన కలిగించడంకోసం ఆయన చేసిన అపారసేవ మరొక ఎత్తు అని చెప్పాలి.
కాశ్మీరశివాద్వైతం పేరు చెప్పగానే “అభినవగుప్తపాదాచార్యులవారు” తలపుకి రాకమానరు. కేవలాద్వైత సంప్రదాయానికి ఆదిశంకర భగవత్పాదాచార్యులవారు ఎలాగో, కాశ్మీర శివాద్వైతానికి అభినవగుప్తపాదాచార్యులవారు అలాగ అన్నమాట! కాశ్మీరశివాద్వైత తంత్రసాధనని జయదేవసింగ్జీ “స్వామీ లక్ష్మణజూ రైనా” మహరాజ్ లేక లాల్ సాహిబ్ మహరాజ్ గా ప్రశస్తి పొందిన గురుమహోదయుల మార్గదర్శకత్వంలో ఆచరించి, తరించేరు. తమ గురువర్యుల ఆచార్యకంలోనే కాశ్మీరశివాద్వైత ప్రామాణిక గ్రంథాలు కొన్నింటిని ఆంగ్లభాషలోకి అనువదించేరు. “శివ సూత్రాలు“, “విజ్ఞానభైరవతంత్రం“, “స్పందకారికలు“, “ప్రత్యభిజ్ఞాహృదయం“, “పరా త్రిశికా వివరణ” మొదలైన శైవాగమతంత్రగ్రంథాలు ప్రామాణికమైన ఆంగ్ల అనువాదంతో ఆ అభిరుచికలిగిన అన్వేషకులకి ఠాకూర్ జయదేవసింగ్జీ అందించేరు.
“Contemporary Philosophy”, “An Introduction to Maadhyamik Philosophy”, “Concept of Buddhist Nirvaana” మొదలైన గ్రంథాలు తత్త్వశాస్త్రసంబంధమైన వారి ఆంగ్ల రచనలు.
ఇవి కాకండా వారు అనేక సంగీత-సాహిత్య-తత్త్వశాస్త్ర-తంత్రశాస్త్ర-గుప్తశాస్త్ర రచనలనెన్నో లెక్కలేనన్ని అనేక పత్రికలలోను, స్మారకసంచికలలోను, ప్రత్యేక సంకలనాలలోను ప్రచురించేరు. వాటినన్నింటినీ “ఠాకూర్ జయదేవసింగ్ సంపూర్ణ రచనలు” అనే పుస్తక సంపుటిలుగా ప్రకటించడంద్వారా వర్తమాన-భవిష్యత్ తరాల విద్యార్థులకి ఫలవంతమైన ప్రయోజనం కలుగుతుందని గ్రహించి ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయ పుస్తక ప్రచురణ విభాగాలు, ప్రచురణకర్తలు మొదలైనవారు తగిన కృషినిచేస్తే బాగుంటుంది.
ఉత్తరప్రదేశ సంగీత-నాటక అకాడమీ, కేంద్రప్రభుత్వ సంగీత-నాటక అకాడమీ ఫెలోషిప్స్ , సుర్ సింగార్ సంసద్ , ముంబై వారి సారంగదేవ ఫెలోషిప్ , భారతప్రభుత్వ అధ్యక్షులవారినుండి “పద్మభూషణ్ ” అవార్డ్ , బనారసు హిందూ విశ్వవిద్యాలయంవారి “సాహిత్య వారిధి”, డి.లిట్ . పట్టా, కాన్పూరు విశ్వవిద్యాలయంవారి డి.లిట్ . పట్టా, మధ్యప్రదేశ ప్రభుత్వంవారి “తాన్సేన్ సమ్మాన్ “ మొదలైనవి ఆయనని వరించిన కొన్ని ప్రముఖ పురస్కారాలు.
ఆయన 1986వ సంవత్సరం, మే నెల, 27వ తేదీన కైవల్యం పొందేరు. నతమస్తకులమై వారికి పాదాభివందనం సమర్పించుకుందాం!
స్వస్తి||
Namaskaram guruvugaru. I bow for your profound research in all fields.Great sir.
ఠాకూర్ జయదేవసింగ్ ఆచార్యులవారి గురించి
చదివి , ఒక్కసారి అయన గురించి ఆలోచిస్తే మహదాశ్చర్యం
కలుగుతోంది. ఒకమనిషి తన జీవితంలో ఏదో ఒక్క రంగంలో
అత్యున్నత స్థాయి చేరడానికి– అపారమైన దైవకృప,
విశేష ప్రజ్ఞా పాటవాలూ ఉంటే తప్ప… ఆ జీవితం
సరిపోదని పెద్దలు చెబుతుంటారు. అలాంటిది….
జయదేవసింగ్ వర్యులు- సంగీత, సాహిత్య ,నాట్య , విద్యా,
తత్త్వశాస్త్ర, తంత్రశాస్త్ర రంగాలలో అంతటి మహోన్నత
స్థాయిని అందుకోగలగడం అసామాన్యమైన విషయమేనని
చెప్పాలి. తాతగారి గురించి వారి మనుమడు చెప్పినది చాలు
వారిని గురించి తెలుసుకోవడానికి.
జయదేవసింగ్ వారివంటి అసమానప్రతిభా సంపన్నుల
గురించి అక్కడక్కడ చదవడం, అప్పుడప్పుడు వినడం
జరుగుతూంటుంది. వీరిని గురించి తెలిసికోవడం ఇదే
మొదటిసారి. చాలా సంతోషమైంది.
మరుగున పడిన, మరచిపోయిన మహనీయుల గురించి
మళ్ళీ మాకు తెలియచేయడానికి చేస్తోన్న నీ కృషికి మరోమారు
ధన్యవాదాలు.