సాహిత్యము—సౌహిత్యము ~ 68 | భక్తుడి భావుకతా వైభవం

ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః|
01—09—2018; శనివారము|

“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|

“సాహిత్యము—సౌహిత్రము ~ 68″| “భక్తుడి భావుకతా వైభవం”|

“తరవోsపి హి జీవంతి, జీవంతి మృగపక్షిణః|
స జీవతి మనో యస్య మననేన హి జీవతి”||

“చెట్లూ బ్రతుకుతున్నాయి. జంతువులూ, పక్షులూ బ్రతుకుతున్నాయి. ఐతే, ఎవరి మనస్సు మననం అనే విలక్షణ మానవీయ ప్రక్రియని చేస్తూంటుందో అటువంటి మానవుడు మాత్రమే (కేవలం ‘బ్రతకడం’ అనే దేహపరిమితమైన యాంత్రిక ప్రక్రియని కొనసాగించడం చేయకుండా) జీవితాన్ని జీవిస్తున్నాడు”.

మనస్సుచేసే ఈ “మననం” అంతటి పరమాద్భుతమైన విలక్షణ మానవీయ ప్రక్రియ. అంతేకాదు. అటువంటి మననానికి మూలస్థానమైన మనస్సుగురించి సామాన్యశాస్త్రజ్ఞులు, వైద్యశాస్త్రజ్ఞులు వివరించడానికి వీలులేనంత, వీలులేనన్ని పరిశోధనలుచేసేరు, చేస్తూనేవున్నారు. విషయసేకరణని చేస్తున్నారు. ఆ విషయాల వివరాలతో గ్రంథప్రచురణనికూడా నిర్వహిస్తున్నారు.

అధ్యాత్మవిద్యాశాస్త్రంలోకూడా మానవమనస్తత్వశాస్త్రం(The Science of  Human Mind)గురించి, మానవమస్తిష్కశాస్త్రం(The Science of Human Intellect)గురించి భారతీయ ప్రాచీన ఋషులు సాధకజనప్రయోజనార్థం అనేకమైన నిత్యప్రయోజనవంతమైన సూచనలు చేసేరు. వారు చెప్పిన గొప్ప దిగ్దర్శకమైన అనేకవిషయాల ఒకటి-రెండు ఇప్పుడు మనకి అవసరమైనవి చూద్దాం.

మన ఆర్ష అధ్యాత్మవిద్యాశాస్త్ర అధ్యయన ప్రణాళిక ప్రకారం
(1) మనస్సు (Mind; సంకల్ప-వికల్పాత్మకమై మెలకువ, కల అనే మన రెండు స్థితులలోను మనతోవుండేది; గాఢనిద్రలో ఉండనిది),
(2) బుద్ధి (Intellect; నిశ్చయాత్మకమై, మనస్సులాగే మెలకువ-కలలలో ఉంటూ, గాఢనిద్రలో ఉండనిది),
(3) అహంకారం (Ego; అభిమానరూపంలో ఉంటూ, మనోబుద్ధులలాగే గాఢనిద్రలోతప్ప మిగిలిన మెలకువ-కలలలో ఉండేది),
(4) చిత్తం (The Faculty of Retentivity; మానవీయ అనుభవాలనీ, అనుభూతులనీ, అటువంటి సమయాలలో సంభవించే సంక్లిష్ట ఊహలనీ-అపోహలనీ యథాతథభావజాలాన్నీ స్మృతులరూపంలో భద్రపరచు వ్యవస్థ, మెలకువ-కల-గాఢనిద్రలనే మూడు స్థితులు లేక అవస్థలులో ఉండేది), ఈ నాలుగూ సాధకలోకం పరిగణనలోకి తీసుకుని అవగాహన చేసుకోవలసిన సూక్ష్మమైన అంతఃకరణతుష్టయం అని చెప్పబడే అంశాలు.

మెలకువ-కల-గాఢనిద్రలు మూడుమాత్రమేకాక “తురీయం” అనే నాలుగో స్థితి లేక అవస్థ కూడా అధ్యాత్మవిద్యాశాస్త్రంలో ప్రస్తావించబడింది. ఆ స్థితిలో  పై అంతఃకరణచతుష్టయం కూడా ఉండదు. ఆ నాలుగూ లయించిపోయిన జీవమాత్ర సత్తా అంటే మౌలిక నిర్వికార జీవచైతన్యంయొక్క “ఉనికి” మాత్రమే ఉంటుందన్నమాట. దీనినే వేదాంతులు “ప్రత్యగాత్మానుభూతి” అంటారు.

అన్ని రకాల వేదాంతశాస్త్రాల అధ్యయనానికి పైన విశదీకరించబడిన వివరణని గురించిన స్పష్ట అవగాహన అత్యావశ్యకం. పరాభక్తిశాస్త్రంలో చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలకి పైన “పరాభక్తి” అనే పంచమపురుషార్థం పెద్దలచేత చెప్పబడింది. ఉదాహరణకి పరమపావనమయవ్రజభూమిలోని శ్రీరాధాకృష్ణభక్తవరులు మోక్షాన్ని తృణీకరించి, మోక్షం పొందడానికి నిరాకరిస్తారు. వారు శ్రీరాధాకృష్ణులయందు పరమపవిత్ర ఆత్యంతికభక్తిభావమయులై ఆ దివ్యభావభూమికలోనేవుండిపోతారు. వారికి మిగిలినలోకంతో నిమిత్తం ఏమీ ఉండదు. ఆ భూమికలో వారు తమ హృదయస్థులైన శ్రీరాధాకృష్ణులలో తన్మయులైవుంటారు. వారు మనో-బుద్ధి అహంకార-చిత్త రూపాలైన అంతఃకరణచతుష్టయానికి అతీతమైన “హృదయం” అనబడే పరమోత్తమ భూమికలో ఉంటారు. ఈ హృదయభూమికకి సంబంధించిన ప్రస్తావన శ్రీమద్భాగవతమహాపురాణంలో ఉంది:—

“ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనో హృది|
జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితమ్ “||
(శ్రీమద్భాగవతమహాపురాణమ్ | VIII : 3 : 1)|

” ఈ విధంగా తన బుద్ధిశక్తితో నిశ్చయంచేసుకున్న గజేంద్ర ఆళ్వారు తన మనస్సుని తన హృదయస్థానమందు స్థిరపరచుకొని, జన్మాంతరములనుండి తాను అనుష్ఠించుచున్న సర్వోత్కృష్ట ఇష్టదైవజపమును ఆచరించెను”.

పై శ్లోకంలో మనకి పరిచితమైన మనస్సు, బుద్ధి అనేవాటిని మించిన “హృదయం” గురించిన ప్రస్తావన చేయబడింది. తైత్తిరీయోపనిషత్తులోని నారాయణప్రశ్నంలో ఉన్న 13వ అనువాకంలోగల 6-7వ మంత్రాలలో

“పద్మకోశప్రతీకాశగ్ ం హృదయం చాప్యధోముఖమ్ ||
అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి |
జ్వాలమాలాssకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ “||

ఈ “హృదయం” గురించిన ప్రస్తుతి చేయబడింది. ఈ హృదయం కేవలం ఈశ్వరస్థానంగా పై మంత్రతాత్పర్యం వెల్లడి చేస్తోంది.

పంచమపురుషార్థమైన భక్తి, అటువంటి భక్తికి ఆలవాలమైన హృదయం అనే  పై రెండు అంశాలని మనం పరిగణనలోకి తీసుకుంటే, అటువంటి స్థితి-గతులున్న భక్తప్రహ్లాదులవారి జీవితం భాగవతమహాపురాణప్రోక్తమై, మిగిలిన భక్తజనులకి ఉదాహరణప్రాయంగా అలరారుతోంది. Sri Prahlada swamy is a  “paradigm of devotional excellence” and a “paragon among those who deserved the Divine Grace” in the Bhagavata Mahapurana. He is such a unique devotee in the Holy Text on account of whom the Lord Sri Hari bestowed motherly status to an inanimate object which was a pillar of the royal palace of the king of demons, Hiranyakasipu, by revealing Himself from the pillar.

ప్రహ్లాదస్వామివారి ఆంతర్యం ఏ విధంగా ఉండేదో దేవర్షి నారదమునీంద్రులు స్వయంగా మనకి బోధపడేవిధంగా ఇలాగ వర్ణించేరు:—

“న్యస్త క్రీడనకో బాలో జడవత్ తన్మనస్తయా|
కృష్ణగ్రహ గృహీతాత్మా న వేద జగదీదృశమ్ ||

“ఆసీనః పర్యటన్నశ్నన్ శయానః ప్రపిబన్ బృవన్ |
నానుసంధత్త ఏతాని గోవింద పరిరంభితః||
(శ్రీమద్భాగవతమహాపురాణమ్ | సప్తమ స్కంధం : IV : 37/38)

“(ప్రహ్లాదుడు బాల్య క్రీడలకి సంబంధించిన) ఆటవస్తువులయందు ఏ మాత్రమూ ఆసక్తి లేనందువలన వాటిని విడిచిపెట్టివేసేడు. అతడు ఎల్లప్పుడూ సహజంగానే శ్రీకృష్ణప్రేమమయభావంలో విలీనమైపోయి ఉండేవాడు. అందువల్ల లోకుల చూపులకి జడుడిలాగ అంటే మతిలేనివాడిలాగ కనిపించేవాడు, అనిపించేవాడు!శ్రీకృష్ణభక్తిభావరసమయుడైన అతడికి వస్తుప్రపంచమంతా కృష్ణమయంగానే అనుభవంలోకి వచ్చేది. అంతేకాని లౌకికులకి లోకం ఏ విధంగా అనిపిస్తుందో  ఆవిధంగా అతడికి అనిపించేదికాదు.

“అతడు కూర్చున్నా, తిరుగుతూ ఉన్నా, అన్నం తింటున్నా, పడుకున్నా,  పానీయాలు సేవిస్తూన్నా, మాట్లాడుతూన్నా, గోవిందుడికి సంబంధించిన భావనలతో నిండిపోయి ఉండడంవల్ల ఆయా పనులకి చెందిన స్పృహ అతడిలో ఏ మాత్రమూ కలగలేదు.”

ఈ విధంగా ఇంకా ఎన్నెన్నో వర్ణనలు సాధకజనప్రయోజనార్థం ఉన్నాయి. ఈ వర్ణన భక్తిరసమయసాధనచేసుకోవాలనుకునే సాధకులకి దారిని  చూపిస్తుంది. కేవలం లౌకికులైన జనులు లౌకికవిషయాలమీద ఎటువంటి తీవ్ర-గాఢ భావనలని కలిగివుంటారో ప్రహ్లాదుడు శ్రీకృష్ణుడియందు అదే  విధంగా కలిగివున్నాడు. అందుకనే “ద్రమిడోపనిషత్సారసంగ్రహం” ఈ విధంగా చెప్పింది:—

“యా ప్రీతిరస్తి విషయే ష్వవివేకభాజాం|
సైవాచ్యుతే భవతి భక్తి పదాభిధేయా”|

“ఇంద్రియలోలత్వంతో సంచరించే వివేకరహిత లౌకికులకి తాత్కాలిక భోగమయ విషయప్రంపంచమంటే ఎంత గాఢమైన, తీవ్రమైన మోహభరితప్రీతి ఉంటుందో అటువంటి అనురాగం అచ్యుతభగవానుడియందు కలిగితే దానినే “భక్తి” అనే పేరుతో పిలుస్తారు”.

అందువల్ల విషయప్రపంచలోలురైన లౌకికులయందువున్న భావమే భక్తులయందు కూడావుంది. ఐతే ఆ ఉన్నది దేని యెడల లేక ఎవరిపట్ల అనే అంశమే ఇక్కడ కీలకమైనది. అందువల్ల ప్రహ్లాదులవారికి ఉన్నది, లౌకికులలోకూడావుంది. ఐతే ఆయనలో శ్రీకృష్ణునిపట్లవుండడంవలన ఆయన తరించేరు. లౌకికులకి విషయప్రపంచంమీదవుండడంవలన వారు జన్మ పరంపరని పొందుతున్నారు. స్థిరము, శాశ్వతము అయినదానియందు మనస్సు లగ్నమైతే దాని ఫలితం కూడా స్థిరంగా, శాశ్వతంగా ఉంటుంది. అలాగకాక మనస్సు అస్థిరము, అశాశ్వతము అయినదానియందు తగులుకుంటే దాని ఫలితం దానికి అనుగుణంగానే ఉంటుంది:—

“యో ధ్రువాణి పరిత్యజ్య అధ్రువాణి నిషేవతే|
ధ్రువాణి తస్య నశ్యంతి అధ్రువం నష్టమేవ హి”||

“స్థిరమైనవాటిని విడిచిపెట్టి, అస్థిరమైనవాటిని ఆశ్రయించుకుంటే, స్థిరమైనవి ఆలంబనగా ఉండే ఆస్కారంలేదు. అస్థిరమైనవి ఎలాగైనా నశించేవేకనక, వాటి ఆశ్రయమూ నశించిపోయేదే! అందువలన స్థిరమైనవాటిని మనం నిరాకరిస్తే, అస్థిరమైన మన ఆలంబనలు మనలని నట్టేటముంచి నశించిపోయేయి”! (హితోపదేశం)

ఈ విషయంలో మనపెద్దలు మరింత స్పష్టతని కలిగించే మరొక అందమైన మాటని అన్నారు:—

“ప్రతిమా మంత్ర తీర్థేషు దైవజ్ఞే భిషజే గురౌ|
యాదృశీ భావనా యస్య సిద్ధిః భవతి తాదృశీ”||

“అర్చనచేయబడే భగవత్ప్రతిమ, ఉపాసించబడే మంత్రం, సేవించబడే తీర్థం,  దైవజ్ఞుడు, వైద్యుడు, గురువు — వీరియందు సాధకుడికి ఎటువంటి స్థాయి కలిగిన భావనవుంటుందో ఆ సాధకుడు పొందబోయే ఫలం అదే స్థాయిలో ఉంటుంది”.

ఈ వివరణని సమగ్రంగా అవగాహనచేసుకుని సాధకభక్తజనం తమ సాధనని సఫలీకృతంచేసుకునే ప్రయత్నం చేసుకోవాలి.

స్వస్తి||

You may also like...

6 Responses

  1. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    బ్రువన్.

    • కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

      శ్రుతి అనడంపోయి శృతి అనీ, ధ్రువుడు అని వ్రాయడంపోయి ధృవుడు అనీ ఈ మధ్య రాష్ట్రవ్యాప్తంగా అందరూ వ్రాసుకుపోతున్నారు. అదే మాదిరిగా బ్రువన్ అనడానికి బదులు బృవన్ అని పడింది మన పై article లో నారదులవారు ప్రహ్లాదుని మీద చెప్పిన శ్లోకంలో. అంచేత ఆ బృవన్ అన్నదాన్ని బ్రువన్ అని పై article లో మార్చాలని నా అభిప్రాయం.

  2. PURUSHOTHAM SRIKAKULAPU says:

    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹dhanyosmi

  3. సి.యస్ says:

    ‘భక్తుడి భావుకతా వైభవం’ లో చర్చించిన
    విషయం చాలా లోతైనదే. ఆఖరులో రాసినట్టు
    ఈ వివరణని సమగ్రంగా అవగాహన చేసుకునే సాధక
    భక్తజనులే సఫలీకృతులు కాగలరు. అలా కావడానికి దారి
    చూపే కరదీపిక కాగలదు ఈ రచనలోని విషయం.
    తెలుసుకోవాలనే కుతూహలం , లోలోతులకెళ్ళి విషయపరిశీలన
    చెయ్యాలనే పట్టుదల ఉన్నవారికి ఇది చదవడం…
    గురువును ఆశ్రయించి అధ్యయనం చేసినట్టుగా
    ఉపకరిస్తుంది.
    అవస్థాత్రయాన్ని దాటి నాలుగో అవస్థ అనబడే ‘ తురీయం’
    అంటే ఏమిటో, ఆ స్థితిలో జీవుని ఉనికి ఎలా ఉంటుందో
    తెలియచెప్పింది.
    చతుర్విధపురుషార్ధాలకి పైన పంచమ పురుషార్థంగా
    చెప్పబడిన భక్తి , అంతఃకరణ చతుష్టయానికి అతీతమని
    చెప్పబడిన హృదయం…. ఈ రెండు స్థితిగతులు కలవాడని
    చెప్పిన ప్రహ్లాదుడి ఉదంతం apt గా ఉంది.

  4. Dakshinamurthy M says:

    చాలా బాగుంది. మంచి విశ్లేషణ తో అలరించింది. ధన్యవాదములు

  5. Srvalliseshasai says:

    Chala bavundhi..entho upayogapaduthundhi..,maalanti vallaki.dhanyavadhamulu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *