శారదా సంతతి ~ 57 : ఉత్తరభారత గాత్రసంగీత రామ+లక్ష్మణులు — రాజన్ + సాజన్ మిశ్రా సోదరులు
ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః|
26—08—2018; ఆదిత్యవాసరము|
“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|
“శారదా సంతతి ~ 57″| “ఉత్తరభారత గాత్రసంగీత రామ+లక్ష్మణులు — రాజన్ + సాజన్ మిశ్రా సోదరులు”|(రాజన్ మిశ్రా: 01—08—1951; సాజన్ మిశ్రా: 07—01—1956)|
అది 1974వ సంవత్సరం. ముంబైలోని “రసిక్ సంగమ్” సంస్థవారు శాస్త్రీయ సంగీత సప్తాహ కార్యక్రమాలు ౘాలా పెద్దయెత్తున నిర్వహిస్తున్నారు. ఆ సంగీత సభల మహోత్సవంలో భాగంగా వారాణసీ సారంగీవాదనపరంపరలో ఆనువంశికంగా సంగీతవిద్వాంసుడైన పండిత్ గోపాల్ మిశ్రాజీ సారంగీవాదనం ఒకరోజు ఏర్పాటు చేయబడింది. సంగీతసభకి విచ్చేసిన గోపాల్జీ తమ అన్నగారి పెద్ద కుమారుడు, తనకి శిష్యుడు ఐన 23 సంవత్సరాల యువగాయకుడు, రాజన్ మిశ్రాని తనకి తోడుగా తీసుకువచ్చేరు. విడిదిలో రాజన్జీని చూసి కార్యకర్తలు వివరాలు అన్నీ అడిగి తెలుసుకుని, గోపాల్జీ కార్యక్రమంతోబాటు, రాజన్జీచేత కూడా పాడించవలసినదిగా గోపాల్జీని ప్రాధేయపూర్వకంగా అడిగేరు. గోపాల్జీ ౘాలా సంతోషంతో అంగీకరించి, రాజన్జీని పాడవలసినదిగా ప్రోత్సహించేరు. గురువైన చాచాజీమాటలని రాజన్జీ శిరసా వహించి, ఆ రోజు సాయంత్రం, సంగీతసభలో “మార్వా” రాగాన్ని మాసొగసుగా పాడేరు. రాజన్జీ గానం విని రసజ్ఞశ్రోతలు పరవశించిపోయేరని మరునాడు వార్తాపత్రికలలో ప్రశంసాత్మకమైన ౘక్కని సమీక్షలు లెక్కకి మిక్కుటంగా వచ్చేయి. ఆ ప్రశంసాత్మక వార్తలని “నామధారీ సిక్కు సంఘం” వారి సద్గురువు జగ్జిత్సింగ్జీ మహరాజ్ ౘదవడం తటస్థించింది. రాజన్జీ గానానికి రసికవరులు మహాముగ్ధులైపోయిన వార్త సద్గురుజీని బాగా ఆకట్టుకుంది. సద్గురు జగ్జిత్సింగ్ మహరాజ్ స్వయంగా గొప్ప గాయకులు, దిల్రుబా వాద్యవాదనకుశలులేకాక, సంగీతరంగానికి, కళాకారులకి ఆర్థికప్రోత్సాహాన్ని అందించి భారతీయ సంగీత సంప్రదాయానికి అపరిమితసేవలు చేసే అనుపమానవ్యక్తిత్వం కలిగిన సిక్కుమత అధ్యాత్మవిద్యాసద్గురువుగా లోకప్రసిద్ధిపొందిన మహనీయులు. సిక్కు నామధారీ మతసంప్రదాయ అనుయాయులైన అనేక ఔత్సాహిక యువకళాకారులని విశ్వవిఖ్యాత సంగీత విద్వాంసులైన ఉస్తాద్ విలాయత్ ఖాcజీ, ఉస్తాద్ అంజద్ అలీఖాcజీ, పండిత్ శివకుమార్ శర్మ, పండిత్ రాంనారాయణ్ , పండిత్ కిషన్ మహరాజ్ మొదలైన వారివద్దకి పంపించి విద్యార్థులకి నెలవారీ విద్యావేతనం అందిస్తూ సంగీతవిద్యని నేర్పించేవారు.
ఆ తరువాత రాజన్జీ ఎం.ఏ.,(సోషియాలజీ) చేసి, ఢిల్లీలోని డి.సి.యం. కంపెనీలో నెలసరి ఐదువందల రూపాయల జీతానికి ఉద్యోగంచేస్తూ, తన గాత్రసంగీతవిద్య నిత్యాభ్యాసానికి తగిన సమయంలేక ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఆ విషయం తెలుసిన సద్గురు మహరాజ్ , ఆయనని ఆ ఉద్యోగం చెరనుండి విడిపించి, రాజన్జీకి నెలవారీ ఐదువందలరూపాయల విద్యార్థివేతనాన్ని అంటే స్కాలర్ షిప్ ని ఏర్పాటుచేసి ఆయనని ఆదుకుని తన సంగీతవిద్యాభ్యాసం నిరాఘాటంగా కొనసాగించుకోవడానికి ౘక్కని వీలు కల్పించి రాజన్జీ సంపూర్ణ సంగీతకళాకారుడిగా రూపొందడానికి సంపూర్ణంగా దోహదంచేసేరని స్వయంగా రాజన్జీ పూర్ణకృతజ్ఞతా పూర్వకంగా అనేకసందర్భాలలో వ్యక్తిగతంగాను, సభాముఖంగాను వ్యక్తం చేసేరు.
© © © © © © © © © © © ©
వారాణసీలో గత రెండు – మూడు శతాబ్దాలుగా సారంగీవాద్యవాదనకౌశలంలో పేరెన్నికగన్న “ఘరానా” సంప్రదాయం, మిశ్రా కుటుంబపరంపరది అని చెప్పాలి. మిశ్రాకుటుంబపరంపరకి చెందిన “సారంగీ వాదన ఘరానా” విద్వాంసులందరూ వాద్యసంగీతంతోబాటు, గాత్రసంగీతంలోకూడా నైపుణ్యం సంపాదించినవారే! చరిత్రకి అందినంతమేరకి పండిత్ రాంబక్ష్ మిశ్రా, వారి కుమారుడు పండిత్ గణేశ్జీ మిశ్రా, వారి పుత్రుడు పండిత్ సుర్ సహాయ్ మిశ్రా, ఆయన కొడుకులు ఇద్దరూ పండిత్ హనుమాన్ ప్రసాద్ మిశ్రా, పండిత్ గోపాల్ ప్రసాద్ మిశ్రా వరకు అందరూ సారంగీవాద్య వాదనంలో మహావిద్వాంసులే! హనుమాన్ ప్రసాద్ మిశ్రా, గోపాల్ ప్రసాద్ మిశ్రా సహోదరులిద్దరూ సభాముఖంగా సారంగీవిద్వాంసులుగానే మంచి పేరు-ప్రఖ్యాతులు పొందినా, గొప్ప గాయకులుకూడాను! హనుమాన్జీకి ఇద్దరు కుమారులు. గోపాల్జీకి సంతానం లేదు. అందువల్ల అన్నగారి కొడుకులైన రాజన్జీ-సాజన్జీలని ఇద్దరినీ తన స్వంత బిడ్డలుగా భావించి వారిద్దరియందు అపారపుత్రవాత్సల్యంతో గోపాల్జీ, బనారసీ ఘరానా గానఫణితిలో పిల్లలైన అన్నదమ్ములిద్దరికీ ౘక్కని తరిఫీదు ఇస్తూవుండేవారు.
హనుమాన్ప్రసాద్జీకి 1951, ఆగస్ట్ నెల, 1వ తేదీన మొదటి కొడుకు పుట్టేడు. ఆ కుమారుడికి తండ్రిగారు “రాజన్ ” మిశ్రా అని నామకరణం చేసేరు. ఆ తరువాత, 1956, జనవరినెలలో 7వ తారీకున రెండవ పిల్లవాడు జన్మించేడు. అతడికి “సాజన్ ” మిశ్రా అని హనుమాన్ ప్రసాద్జీ పేరుపెట్టేరు. హనుమాన్జీకి కొడుకులిద్దరినీ ౘక్కని శాస్త్రీయ సంగీత యుగళ గాయకులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు.
ఆ కాలంలో, అంటే, అరవై సంవత్సరాల క్రితం వరకూ, ఖయాల్ గాత్రసంగీతంలో విశ్వవిఖ్యాతి పొందిన “బనారసు ఘరానా” సంగీతప్రపంచంలో బాగా ప్రచారంలో ఉండేది. బడే రాందాస్జీ, ఛోటే రాందాస్జీ, శివాజీ-పశుపతిజీ ద్వయం, మిఠాయీలాల్ , శివదాస్ ప్రయాగ్జీ మొదలైన గాయకశిఖామణులు అందరూ బనారసీ ఖయాల్ సంప్రదాయ గానపద్ధతికి చెందిన “ఆమద్ కీ గాయకీ” అంటే, సంగీత రసభావ తత్పరతతో గానంచేసే రీతిలో పాడేవారు. వారి గానఫణితి మధ్యలయప్రధానమైన గానశైలిని అనుసరించి ఉండేది. వేగవంతమైన తానప్రయోగాలతో శోభించే గానప్రక్రియ అది. ఖయాల్ గానాన్ని విస్తరించి పాడడంలో “టప్పా-తానప్రయోగం” నిండిన అలంకారాలతో ప్రకాశించే గానశైలి బనారసు ఘరానా ప్రత్యేకతలలో ఒక ముఖ్యలక్షణం. ౘాలా శ్రద్ధాసక్తులతోకూడిన విశేషఅభ్యాసంచేస్తేనేకాని ఆ ఘరానాలో మరొక ముఖ్యాంశమైన “టప్ – ఖయాల్ ” పాడడం సాధ్యంకాదు. బనారసు ఘరానా గాయకులు కాశీమహానగరం దాటి తమ ఖయాల్ గాయకీని ప్రచారంచెయ్యడంలో ఇతర ఘరానా కళాకారులలాగ పాటుపడలేదు. అందువలన బనారసీ ఘరానా గాన సంప్రదాయం కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు మనకి బనారసీ ఖయాల్ గాయకీ యథామూలంగా లభించకపోవడం సంగీతప్రియులకి నిరాశాజనకమైన విషయమే!
పండిత్ హనుమాన్ ప్రసాద్ మిశ్రాజీ తమ పెద్దకొడుకు రాజన్ మిశ్రాకి ఐదేళ్ళ వయస్సుండగా, తమ తండ్రిగారికి సహోదరుడు, బనారసీ ఘరానాలో లబ్ధప్రతిష్ఠులు ఐన గాయనాచార్య బడేరాందాస్జీ వద్ద, “గండా బంధ” శిష్యుడిగా, అంటే, “గురుకుల దీక్షిత శిష్యుడు“గా చేర్పించి, బనారసు ఘరానా గానంలో శిక్షణ ప్రారంభింపజేసేరు. కాని దురదృష్టకారణంగా సుమారు ఐదేళ్ళ తరవాత, అంటే, రాజన్జీ పదేళ్ళ ప్రాయంలోవుండగా, బడేరాందాస్జీ పరమపదించేరు. ఆ తరువాత హనుమాన్ ప్రసాద్జీ, గోపాల్జీల శిక్షణలో, సుమారు పదేళ్ళ వయస్సున్న రాజన్జీ, ఐదేళ్ళ ప్రాయమున్న సాజన్జీ తమ గాత్రసంగీతవిద్యాభ్యాసాన్ని కొనసాగించేరు. రాజన్ మిశ్రాజీ, సాజన్ మిశ్రాజీ పరిపూర్ణ భక్తిశ్రద్ధలతోను, అనుపమ అంకితభావంతోను తమ తండ్రిగారివద్ద, పినతండ్రిగారివద్ద ఉత్తరభారత గాత్రసంగీతాన్ని గురుకులపద్ధతిలో నేర్చుకుని, “జుగల్ బందీ“గానంలో, అంటే, యుగళసంగీతగానంలో పరిణతిని సాధించి, చిన్న వయస్సులోనే వివిధ సభలలో గానంచేసి సంగీతరసజ్ఞశ్రోతల హృదయాలని చూరగొన్నారు. “శాం-చౌరశియా ఖయాల్ ” ఘరానాలో సుప్రసిద్ధ సహోదరులైన సలామత్ అలీ-నౙాఖత్ అలీల సహోదరులు, “ఇండోర్ ” ఘరానాలో తేజ్ పాల్ – సురిందర్ సింగ్ సోదరులు, “కిరానా ఘరానా”లో ఫయ్యాజ్ అహ్మద్ ఖాc & నియాజ్ అహ్మద్ ఖాc సోదరులు, మొదలైనవారి జుగల్బందీగానంలాగే “మిశ్రా” సహోదరుల యుగళగానం కూడా లోకప్రసిద్ధిని పొందింది. ధ్రు(వ)పద సంగీతంలో జుగల్బందీగానప్రక్రియ సర్వసామాన్యమే! ఖయాల్ సంగీతంలోను, కర్ణాటక సంగీతంలోను యుగళగానప్రక్రియ ధ్రుపదసంగీతంలో ఉన్నంత ఎక్కువగా బహుళ ప్రచారం పొంద లేదు.
జుగల్బందీ ప్రక్రియలో పాడడం అంత సులువేమీకాదు. ఉభయ కళాకారులు ఎవరి శక్తి-యుక్తులు వారు తెలుసుకువాలి. అంతేకాక తమ-తమ పరిమితులని గురించిన అవగాహనని కలిగి ఉండాలి. ఆ పైన తోడి కళాకారుని బలాబలాలని సమగ్రంగా గ్రహించుకోవాలి. ఉభయ కళాకారుల గానప్రక్రియ పరస్పర సంపూరకం (mutually complementary) గా ఉండేవిధంగా తమ యుగళ సంగీతాన్ని సభాసదులకి వినిపించి, వారి హృదయాలని రంజింపజేసేటట్లు సరసమనోజ్ఞ గాన ఐక్యత సిద్ధించేవిధంగా పాటకచేరీని నిర్వహించగలగాలి.
ఉదాహరణకి రాజన్ + సాజన్ మిశ్రా సహోదరుల యుగళగానప్రక్రియ గురించి కొంతలోకొంత పరిచయం చేసుకుందాం! సోదరులు ఇద్దరి గళాలు శాస్త్రీయ సంగీత గాన మార్దవం (vocal suppleness), మాధుర్యం (melody) పుష్కలంగావున్నవే! ఐతే, రాజన్జీ గళంలో పురుషగాంభీర్యం హెచ్చుగావుంటే, సాజన్జీ గళంలో స్త్రీసహజ కోమలత్వం అధికంగావుంటుంది. రాజన్జీ కంఠం ప్రధానంగా నవరస భావ సాంద్రంగావుంటుంది. సాజన్జీ కంఠం ధ్యానభావభరిత ప్రాధాన్యాన్ని సంతరించుకుని ఉంటుంది. రాజన్జీ కంఠం స్వాభావికంగా గాఢసంగీతమయభావాన్ని శక్తిమంతంగా నివేదిస్తుంది (makes strong musical statements assertively)! సాజన్జీ గళం సహజ మృదుల సంగీతమయ భావనని సరళసుకుమారంగా నివేదిస్తుంది (makes sensitive musical statements delicately)! ఇద్దరి గాత్రజనిత గాన మాధుర్య వైభవం ఏకైక సంగీత సంపూర్ణత్వం (singular musical whole) తో అలరారుతూ ఉంటుంది. అయితే వారిది బనారసీ ఘరానా ఐనా, మిగిలిన అనేక సంప్రదాయాలకి చెందిన వివిధ గాయక ప్రతిభావంతుల అందరి సంగీతాన్ని శ్రద్ధాసక్తులతోవిని, మిశ్రా సహోదరులు ఆయా గానరీతులలోని రసికజన ఆమోదయోగ్యమైన అనేక మధురసంగీతాంశాలని తమగానంలో పొందుపరచుకుని, తమ గానశైలిని ప్రత్యేకపద్ధతిలో వారిద్దరూ రూపొందించుకుని, వర్ధిల్లజేసుకున్నారు. అందువలన ప్రాచీన బనారసీ ఘరానా గాయకీ యథామూలంగా మనకి లభించడంలేదు.
ప్రపంచ భారతీయ సంగీత ప్రియులందరికి వారిద్దరి గానం లోకోత్తరప్రీతిని కలిగిస్తూంది. జర్మనీ, ఫ్రాంసు, స్విట్జర్లాండు, ఆస్ట్రియా, అమెరికా, ఇంగ్లండు, నెదర్లాండ్స్ , రష్యా, సింగపూర్ , కతార్ , బంగ్లాదేశ్ , మస్కట్ , శ్రీలంక మొదలైన దేశాలలోని సంగీతప్రేమికులని మిశ్రాసోదరులు తమ అద్భుతమైన గానంతో అలరింపజేసేరు.
పద్మభూషణ్ , సంగీత నాటక అకాడమీ బహుమానం, జాతీయ తాన్సేన్ బహుమానం, జాతీయ గంధర్వ బహుమతి మొదలైనవి మిశ్రాసోదరులని వరించిన కొన్ని సమ్మానాలు.
సారథి ఛటర్జీ, రూపాందె షా, విరాజ్ అమర్ , జస్మిత్ కౌర్ , శ్రద్ధాజైన్ , ఋతు శర్మ, కనికా పాండే, మైత్రేయి సన్యాల్ , మోహనసింగ్ నామధారీ, సుఖదేవసింగ్ నామధారీ – మిశ్రాసహోదరుల శిష్యులలో కొందరు. వీరి శిష్యులలో ౘాలా మంది ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఇప్పటికే ప్రత్యేకస్థాయిపొందిన లబ్ధప్రతిష్ఠులైన కళాకారులు. ఉదాహరణకి పండిత్ సారథి ఛటర్జీగానానికి నేను మహాభిమానిని. పండిత్ సారథి ఛటర్జీ అద్భుతగానాన్ని సంగీతప్రియులు “యూ-ట్యూబు”లో విరివిగా వినవచ్చు. అలాగే విదుషి విరాజ్ అమర్ గానంకూడా కేసెట్లలో వచ్చింది. “యూ-ట్యూబు”లో లభ్యం ఔతుంది.
రాజన్ – సాజన్ మిశ్రా సహోదరుల ప్రధానశిష్యులగా వారివద్ద సంగీతం నేర్చుకునే శ్రీ రాజన్ మిశ్రాజీ పుత్రద్వయం రితేశ్ మిశ్రా, రజనీశ్ మిశ్రా ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించిన రెండవతరం మిశ్రా సహోదరులుగా జుగల్బందీ గానసామ్రాజ్యంలో యువరాజులై ప్రశస్తిని సాధించేరు. శ్రీ సాజన్జీ పుత్రుడు స్వరాంశ్ మిశ్రా, కుమార్తె కవితా మిశ్రా సంగీతరంగంలోకి త్వరలో ప్రవేశించవచ్చని ఆశించవచ్చు.
హమీర్ , కేదార్ , జయజయవంతి, జనసమ్మోహిని, కామోద్ , నంద్ , దుర్గ, లలిత్ , పూర్యా, ముల్తానీ మొదలైన జనప్రియరాగాలు/అపూర్వరాగాలు సీనియర్ మిశ్రా సహోదరులగానంలో భాగంగా “యూ – ట్యూబు”లో లభ్యం ఔతున్నాయి. సంగీతప్రియులందరూ విని ఆనందించవచ్చు. వారితోబాటు చిన్న మిశ్రా సోదరులగానంకూడా వినవచ్చు.
ఉత్తరభారత సంగీతంలో “తరానా“గానానికి విశిష్టస్థానంవుంది. తరానా-ప్రియులకి గొప్ప వినికిడి~విందు (listening feast) “MUSIC TODAY” వారు విడుదల చేసిన “FLIGHTS OF MELODY” శీర్షికతో వచ్చిన నాలుగు కేసెట్ల సెట్ . అది ఒక మహాప్రసాదం వంటిది. ఆ సీరీస్ లో, రాజన్ – సాజన్ మిశ్రాసోదరుల ఐదు తరానాలు వినితీరవలసినవే! ఆ తరానాలు భైరవ్ , గూర్జరీ తోడి, జోన్పురి, హంసధ్వని, జయజయవంతి రాగాలలో స్వర రచన చేయబడినవి. ఈ సీరీస్లో వచ్చిన నాలుగు కేసెట్లు “యూ-ట్యూబు”లో లభ్యం ఔతున్నాయి.
సంగీతప్రియులకి అద్భుతరసమయసంగీతాన్ని అందిస్తూన్న రాజన్ – సాజన్ మిశ్రా సహోదరులకి సాంజలిబద్ధులమై ధన్యవాదశతాన్ని సమర్పించుకుందాం!
స్వస్తి|
ఉత్తర భారత సంగీత సామ్రాజ్యానికి రామ లక్ష్మణుల
వంటి వారని చెప్పిన రాజన్ మిశ్రా , సాజన్ మిశ్రాల పేర్లు
వినగానే, అఖిల భారత సంగీత కార్యక్రమాల్లో
వారి జంట గానం విన్న రోజులు జ్ఞాపకానికొస్తున్నాయి.
అనూచానంగా వస్తోన్న బనారసీ ఘరానాకి వారు ఇతర
ఘరానాలనుంచి గానరీతుల్ని, సంప్రదాయాల్ని మిశ్రమం చేసి తమదంటూ ఒక ప్రత్యేక శైలి ఏర్పరుచుకుని
శ్రోతలను రంజింపజేయడం వారి మహత్తర ప్రతిభకు నిదర్శనం.
స్త్రీ ,పురుషుల గొంతుకల్లోని మార్దవం , గాంభీర్యాల్ని కలబోసి
ఏక రీతిలో ఆలపించి, సాఫల్యం, సంపూర్ణత్వం సాధించుకున్న
మిశ్రా సోదరుల గాత్రానికి ప్రణామాలు.