సాహిత్యము—సౌహిత్యము ~ 67 | సాధకజన సమయము ~ సద్వినియోగ సాధన
ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః|
25—08—2018; శనివారము|
“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|
“సాహిత్యము—సౌహిత్యము ~ 67″| “సాధకజన సమయము ~ సద్వినియోగ సాధన”|
సాధకజనులు, స్నాన-పాన-ఆహార-నిద్రాదులకి అవసరమైన సమయం, కుటుంబ పోషణాది లౌకిక ధర్మనిర్వహణ సమయం, నిత్య ఇష్టదేవతార్చనాది అనుష్ఠాన సమయం మొదలైన దినసరి కార్యకలాపాలని దైవదత్తమైన తమ వ్యక్తిగత శక్తి-యుక్తులకి అనుగుణంగా ౘక్కగా నిర్వర్తించాలి. అలాగ చెయ్యగా మిగిలిన సమయాన్ని సాధకులు, ఈ జన్మలోనే అధ్యాత్మవిద్యలో వీలైనంత ఎక్కువ పురోగతిని లేక పరిపూర్ణ పరిణతిని సాధించడానికి తగినవిధంగా ౘక్కని ప్రణాళికని రూపొందించుకోవాలి. ఆ ప్రణాళికని ఏ విధమైన రాజీలు పడకుండా యథాతథంగా అమలు చేసుకోవాలి. మనం మన దీర్ఘకాలిక శరీర సౌఖ్యాలకోసం, మంచి ౘదువుకోసం, ఉన్నతమైన ఉద్యోగాలకోసం, సకల ఇహలోక భోగ భాగ్యాలని సమకూర్చే అలవిమీరిన సంపదలని అష్టకష్టాలుపడి కూడబెట్టడంకోసం మన తాత్కాలిక సుఖ సంతోషాలని త్యాగంచేసి, దైవదత్తమైన ప్రజ్ఞలనన్నీ సద్వినియోగం చేసుకుంటూ అత్యధిక అంకితభావంతో కష్టపడడం మన అందరి అనుభవంలో ఉన్న విషయమే! అందంతా మంచిదే! అలాగ చెయ్యవలసినదే! ఐతే కేవల లౌకిక ప్రయోజనాలకే జీవితంలోని సారవంతమైన ప్రజ్ఞలని, ప్రధానమైన జీవితకాలాన్ని ప్రణాళికాబద్ధంగా వెచ్చించి, ఆ ఫలాలని ౘక్కగా అనుభవిస్తూన్న మనం, పారమార్థిక ప్రయోజనం కలిగిన మన అధ్యాత్మవిద్యా సాధనల విషయంలో అంతటి క్రమబద్ధమైన ప్రణాళికలని రూపొందించుకోవడం లోను, ఆ ప్రణాళికలని అమలు పరచడంలోను అంతటి చిత్తశుద్ధిని కలిగి ఉన్నామా అనే అంశంలో వాస్తవిక దృక్పథంతో మదింపువేసుకోవాలి. ఇహలోక సంబంధమైన సేకరణలన్నీ, ఈ లోకందాటేక మనకి ఏ ప్రయోజనాలనీ సమకూర్చలేవని మనందరికీ తెలిసిన విషయమే! మన దేశంలోని కరెన్సీ మరొకదేశంలో మారకం విలువని కోల్పోయి ఏ విధంగా నిరర్ధకం ఐపోతుందో, అలాగే ఇహలోకభాగ్యాలు పరలోకంలో ఏ మాత్రమూ ప్రయోజనకరమైనవి కావడంలేదు. ఇహలోక సంపదలు ఈ శరీరానికి, ప్రాణానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి, అహంకారానికి, చిత్తానికి, అంతో-ఇంతో ఇంపుని కలిగించవచ్చు. కాని ఎంత సంపదని సంపాదించినా ఏదో ఒక వెలితి, పూడ్చలేని కొరత జీవచైతన్యంలో ఉండిపోతుంది. అందుకే అన్ని సంపదలని అమితంగా కలిగివున్న సంపన్నులుకూడా, సర్వసంపదల సాంగత్యాన్ని పరిత్యజించిన పరివ్రాజకులని, యోగులని, అవధూతలని ఆశ్రయించి జీవాత్మలోవున్న ఆ అసంపూర్ణభావమయ అశాంతిని అంతరింపజేసుకునే యత్నం చేస్తారు. జనకచక్రవర్తి యాజ్ఞవల్క్యమహర్షిని, శ్రీరామచంద్రప్రభువు వశిష్ఠమహామునిని పురాణకాలంలో ఏ విధంగా ఆశ్రయించేరో, అలాగే మనకాలంలోకూడా రమణభగవానులని, జిడ్డు కృష్ణమూర్తిగారిని, నిసర్గదత్త మహరాజ్ వారిని దేశదేశాలలోని సుప్రసిద్ధ మహానుభావులెందరో ఆశ్రయించి ఆధ్యాత్మికప్రయోజనం పొందేరు. ఇటువంటి ప్రయత్నాలనికూడా సాధకజనులు తమ అధ్యాత్మవిద్యాభ్యాసప్రణాళికలో భాగంగానే అనుసరించి, ఆచరించేరు.అధ్యాత్మవిద్యాభ్యాస ప్రణాళికలో సత్సంగమహిమ మనకితెలిసినదే! శ్రవణ, మనన, ధ్యాన, అధ్యయన, అభ్యాసాదులన్నింటికీ మన ప్రణాళికలో తగిన భాగం ఉండాలి. శ్రవణం అంటే కేవలం ఆధ్యాత్మిక ప్రవచనాలు, పురాణాలు, ఉపన్యాసాలు, రామాయణాది కావ్య-మహాభారతాది ఇతిహాస- శ్రీమద్భాగవతాది పురాణ సంబంధమైన భాషణలు వినడమేకాక, దక్షిణభారత శాస్త్రీయ సంగీత సంప్రదాయంలో మహాగాయనీ-గాయకులచేత గానం చేయబడిన త్యాగరాజవర్య- దీక్షితవర్య-శ్యామాశాస్త్రివర్
“కామదా కామినాం ఏషా ముముక్షూణాం చ మోక్షదా|
శృణ్వతాం గాయతాం భక్త్యా కృష్ణలీలాతరంగిణీ”||
అని నారాయణతీర్థయతీశ్వరులు తమ “శ్రీకృష్ణలీలాతరంగిణి” గ్రంథంయొక్క ఫలశ్రుతిలో ప్రకటించేరు. ఇది భాగవతులైన మన వాగ్గేయకారుల కృతులకి అన్నింటికీ అన్వయిస్తుంది. ఎందుకంటే మన ప్రాచీన-అర్వాచీన వాగ్గేయ కారులందరూ భగవద్భక్తిమయమైన కృతులని-సంకీర్తనలని రచించినవారే! అందువలన పై శ్లోకభావం భగవల్లీలావర్ణనయుతమైన కృతులన్నింటికీ ప్రసక్తమైవుంది. ఆ శ్లోకభావం యిది:—
“ఈ కృష్ణలీలాతరంగిణి అనే పవిత్రగ్రంథంలోని శ్రీకృష్ణలీలావిభూతులని వర్ణించే తరంగ సంకీర్తనలని భక్తిమయహృదయంతో వినడంకాని, లేక, పాడడంకాని, లేక వినడం-పాడడం రెండింటినీ చేసేవారికి ఇహలోక సంబంధమైన కోరికలువుంటే అవి తీరుతాయి. అవేవీకాక మోక్షమే కావాలంటే అదే కలుగుతుంది” అని సద్గురు నారాయణ యతివరుల వాక్కు!
అధ్యాత్మవిద్యావిషయాలపైన మాట్లాడేవారు అనేకవిధాలుగావుంటారు. పౌరాణికులు, ఉపన్యాసకులు, ప్రవచనకారులు, కథకులు, మొదలైనవారందరూ ఈ కోవకి చెందినవారే! ఐతే, ఈ కాలంలో అందరినీ ప్రవచనకారులని అనడం పరిపాటి అయిపోయింది. పౌరాణికులు, ప్రవచనకారులు వేదికపైన వ్యాసపీఠంలో తాము చెప్పే విషయానికి సంబంధించిన మూలగ్రంథాన్ని ఎదురుగా పెట్టుకుని దానినుండి శ్లోకాలనికాని, పద్యాలనికాని ౘదువుతూ తమ వ్యాఖ్యానాన్ని వైదిక సంప్రదాయానుసారంగాను, స్పష్టతతోను, శ్రోతృహృదయ సంస్పందకంగా విశదంచెయ్యడం జరుగుతుంది. ఉపన్యాసకులు, కథకులు పుస్తకం అవసరం లేకండా చెప్పదలుచుకున్న విషయాన్ని సభాసదులకి విపులంగా వివరించడం జరుగుతుంది. ప్రస్తుతకాలంలో ఇటువంటి పద్ధతులు మన తెలుగు ప్రాంతంలో విధిగా ఆచరింపబడడంలేదు. అందువల్ల పై విభజనయొక్క ప్రమేయం ఇప్పుడు లేదనే చెప్పాలి.
అదే విధంగా ప్రవచనాలని వినడంకూడా అభ్యాసం చేసుకోవాలి. ఈ “ప్రవచనం” అనేది ప్రధానంగా రెండువిధాలుగా ఉంటుంది:—
(1) నారదీయ ప్రవచన సంప్రదాయం. ఈ ప్రవచనవిధానంలో బాహ్యంగాభాషణంతోబాటు, ఎడనెడ, సంకీర్తన కూడా ప్రవచనంతోబాటు పడుగు-పేకలాగ అల్లుకుపోయివుంటుంది. సంకీర్తనలో వాఙ్మయమైన మనోహర భగవద్భావ పూర్ణగీత గానం ఉంటుంది. మనోహరమయమైన రాగభావ-సాహిత్యభావ రసబంధురమైన పాటని పాడే ప్రత్యేక గాయక-వాద్యవాదక బృందం ప్రవచనంలో అంతర్భాగంగా ఉంటుంది. అభినయప్రధానమైన తాళ-లయ నృత్యగతులు నిండిన శరీరభంగిమలు, చేష్టలతోకూడిన నాట్యం ఉంటుంది. అంటే, “భగవద్గీత”లో శ్రీకృష్ణభగవానుడు వివరించిన మనోవాక్కాయాల తపస్సుకి తుల్యమైన భక్తిభావమయమైన సంకీర్తన ఈ నారదీయ ప్రవచనవిధానంలో ఒక ముఖ్యఅంశం. నోటితో పాటని పాడడం వాచికతపస్సు. రాగ-తాళ-లయబద్ధంగా నాట్యం చెయ్యడం కాయిక(శరీర)తపస్సు. పాటలోని భగవద్భక్తిసంబంధమైన సంగీత-సాహిత్యాదిభావాలని మనస్సులో మననం చేయడం మానసికతపస్సు. సాహిత్యప్రధానమైన ప్రవచనసామ్రాజ్యానికి శ్రీభక్తిదేవి మహారాజ్ఞి. భక్తుడు కేవలం హృదయకేంద్రభావం (heart-centered emotional identity) తో కూడిన భక్తిపారవశ్యస్థితిలోవుండి ప్రవచనం వింటాడు. ప్రవచనకారుడు కేవలం హృదయపీఠగత భక్తిదేవియొక్క సమారాధనగానే తన ప్రవచనాన్ని పారవశ్యస్థితిలోవుండి చెపుతాడు. భక్తిరసభరితశాంతభావం అనే వాహికద్వారా ప్రవచనకారుడి ప్రవచనం, అతడి భక్తిపూర్ణహృదయంనుంచి, శ్రోతయొక్క భక్తిచైతన్యమయహృదయంలోకి ప్రవహిస్తుంది.
ప్రవచనం, పదాలనే భక్తిపరిమళభరితదేహవస్త్రాభరణాదు
“శ్రీమద్భాగవత మహాపురాణమ్ ” లోని ద్వాదశస్కంధం, మూడవ అధ్యాయంలో శ్రీశుకబ్రహ్మేంద్రులవారు, పరీక్షిన్మహారాజుతో ఈ విధంగా అన్నారు:—
“కలేః దోషనిధేః రాజన్ ! అస్తి హ్యేకః మహాన్ గుణః|
కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్తసంగః పరం వ్రజేత్ ||51||
“కృతే యత్ ధ్యాయతః విష్ణుం త్రేతాయాం యజతః మఖైః|
ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్ “||52||
“ఓ పరీక్షిన్మహారాజా! రక-రకాల దోషాలకి ఆలవాలమైన కలియుగుంలో విశిష్టమైన ఒక గొప్ప గుణంవుంది. శ్రీకృష్ణపరమాత్మని కేవలమూ సంకీర్తన చేయడంద్వారా భక్తుడు ఇహలోకసంబంధమైన సంసార అనురక్తి నిర్మూలించబడి పరంధామాన్ని పొందుతాడు. కృతయుగంలో తపోమయధ్యానంద్వారాను, త్రేతాయుగంలో యజ్ఞ -యాగాది భగవదర్చనద్వారాను, ద్వాపరయుగంలో విశేషమైన పూజాదికాల ద్వారాను ఏ పరమఫలం ప్రాప్తిస్తుందో, అది కలియుగంలో శ్రీహరియొక్క సంకీర్తనచేయడంద్వారానే పొందవచ్చు!”
అంతేకాక స్వయంగా శ్రీకృష్ణులవారే నారదదేవర్షితో ఇలాగ అన్నారని భాగవతం చెపుతోంది:—
“నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయే న చ|
మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద!”||
“నేను వైకుంఠంలోకాని, యోగుల హృదయాలలోకాని ఉండడంలేదు. నా భక్తులు నన్నుగురించి సంకీర్తనని చేసేచోట నేను స్థిరంగా ఉంటున్నాను”.
(2) వ్యాస ప్రవచన సంప్రదాయం, దక్షిణ భారత దేశంలో బాగా ప్రచారంలోవుంది. అందునా, తెలుగు దేశంలో ఇది ౘాలా విస్తృతంగావుంది. దీనిలో బుద్ధి ప్రమేయానికి పెద్దపీట వేస్తారు. హృదయప్రత్యయానికి పాత్ర ౘాలా పరిమితంగా ఉంటుంది. సంకీర్తనకి స్థానమేవుండదు. వివేకానికి, విశ్లేషణకి, విమర్శనాత్మక దృష్టికి, మొదలైన బుద్ధి ప్రమేయంకలిగిన అంశాలకే ఆధిపత్యంవుంటుంది. అందువల్ల అది బుద్ధికి చేరువ ఔతుంది. అంతేకాని హృదయానికి సన్నిహితం కాదు. ఇక్కడ సాహిత్యసంబంధమైన అంశమైనా, సందర్భశుధ్ధికలిగినది కనుక మనం ప్రస్తావించుకోవచ్చు. Mathew Arnold అనే ఆంగ్లకవి, విమర్శకుడు ఐన సాహిత్య విమర్శక ఆచార్యుడు ఆక్స్ఫర్డు విశ్వవిద్యాలయంలో మొదటిసారి తరగతిగదిలోకి వెళ్ళేరు. అప్పుడు తరగతిగదిలోవున్న విద్యార్థి, Benjamin Jowett తమ నూతన ఆచార్యవర్యులని ఈ విధంగా అభ్యర్థించేరు:—
“Sir! teach us, not to criticise, but to admire”!
“అయ్యా! మాకు (సాహిత్యాంశాలని ౘదివి) అభినందిస్తూ ఆనందించగలగడం నేర్పించండి. విమర్శించడం(ద్వారా దోషాన్వేషణని) నేర్పవద్దు”! అని పై మాటల భావం లేక తాత్పర్యం!
మన పెద్దలు ఇటువంటి విషయాలని దృష్టిలోవుంచుకుని అనుల్లంఘనీయమైన ఒక గొప్ప హెచ్చరికని ఈ విధంగా చేసేరు:—
“భక్త్యా భాగవతం శాస్త్రం న వ్యుత్పత్త్యా న టీకయా|
గృహిణ్యైవ గృహం ప్రోక్తం న పుంశ్చల్యా న వేశ్యయా”||
“భాగవతశాస్త్రాన్ని అధ్యయన-పఠన-పాఠన-ప్రవచన-శ్రవణా
“న గృహం గృహ మిత్యాహుః గృహిణీం గృహముచ్యతే|
గృహం తు గృహిణీహీనం అరణ్యసదృశం మతమ్ “||
“(భారతీయ గార్హస్థ్యధర్మశాస్త్రం ప్రకారం) ఇంటిని “ఇల్లు” అని ధర్మజ్ఞులు అనరు. “ఇల్లాలు”నే ఇల్లు అని ప్రాచీనభారతీయశాస్త్రాలు బోధిస్తున్నాయి. ఇల్లాలులేని ఇల్లు అడవివంటిదేకాని ఇల్లుమాత్రం కాదు”. (ధర్మశాస్త్రం).
అందువల్ల పరిమిత, లౌకిక మానవబుద్ధితో అపరిమిత, అలౌకిక దివ్యతత్త్వాన్ని తెలుసుకునే ప్రయత్నంవలన ఈ అధ్యాత్మవిద్యారంగంలో మనిషి పొందగలిగేదాని కన్న కోల్పోయేదే ౘాలా ఎక్కువ అని సాధకుడు తెలుసుకోగలిగేసరికి సమయం మించిపోవచ్చు. అలాగ సమయం మించకుండానే సత్యం తెలుసుకుని నిత్యజీవితంలో ఆచరించి, తరించేప్రయత్నం చేద్దాం!
స్వస్తి|
Adbhutamaina visleshana guruvugaru. Namaskaram.
తరణోపాయ మనేందుకు
తరుణోపాయ మ్మనేటి తప్పు స్పెల్లింగ్
చొరబడుతుంది తరుచు, ఆ
వరసని మార్చాలి మనమె బాలాంత్రపురే!
తెలుగులో తరుణోపాయ మనే పదం లేదు. తరణోపాయము (తరణ ఉపాయము) అన్న అద్భుతమైన పదాన్ని చాలామంది lose గా తరుణోపాయము అని వ్రాసేస్తున్నారనీ, అది తప్పనీ నేను నా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పగా నేర్చుకున్నాను. మన పై article లో కూడా రామకృష్ణ పరమహంస చెప్పారంటూ తరుణోపాయము అని type చెయ్యడం జరిగింది. దాన్ని సవరించుకుని పై article లో ఆ చోట తరుణోపాయము అన్నదాన్ని తరణోపాయము అని మార్చాలని నా అభిప్రాయం.
Chala upayukhamaina vyasamu.
చిన్న కాలవలా మొదలై , ప్రవహించి ఒక
నదిలా విస్తరించిన నీటి లాగ — సాధక జనులు అధ్యాత్మ
సాధన కోసంతమ సమయసద్వినియోగం ఎలా
చేసుకోవాలి అనే అంశం ఎత్తుకుని , అసలు సాధన చెయ్యాల్సిన
పద్ధతులు , తదనుగుణంగా అమలు పరచవలసిన ప్రణాళిక
చాలా ప్రయోజనవంతంగా వివరించావు.
ముఖ్యంగా నారాయణతీర్థుల వారు చెప్పిన మాట మహాద్భుతం!
భగవన్నామ సంకీర్తన చేసినా లేదా శ్రవణం చేసినా ఇహలోక
సంబంధమైన కోరికలు తీరతాయి…ఒకవేళ మోక్షమే కావాలంటే
అదే కలుగుతుంది అని. అంటే లౌకిక ప్రయోజనాలకోసం
అహోరాత్రాలు శ్రమిస్తే వాటి పరిమితి ఈ లోకంవరకే సుమీ!
అదే అధ్యాత్మ సాధన వల్ల చేకూరే ప్రయోజనం ఇహపరమైనది.
అని చెప్పినట్టయింది.
నారదీయ ప్రవచన సంప్రదాయం , వ్యాస ప్రవచన సంప్రదాయం
వాటి పద్ధతులూ ఇదే వినడం. మొత్తం ఆర్టికల్ అంతా ఎంతో
సాధకజన ప్రయోజనమైనది.
Very interesting and informative article which is a path way for Sadhaks as to how they should make use of their precious time in their given life span. Excellent quotes from Srimadbhagavatam and detailed presentation of Naradeeya and Vyasa traditions of pravachanams. Had an opportunity to pay salutations to the greatest holy men of Naradeeya pravachana tradition.