శారదా సంతతి ~ 56 : భారతీయ సంగీత రస చింతామణి—పండిత్ చింతామణి రఘునాథ వ్యాస్ | Pandit C.R.Vyas
ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః|
19—08—2018; ఆదిత్యవాసరము|
“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|
“శారదా సంతతి ~ 56″| భారతీయ సంగీత రస చింతామణి—పండిత్ చింతామణి రఘునాథ వ్యాస్ | Pandit C.R.Vyas (09-11-1924 నుండి 10—01—2002 వరకు)|
అది 1932-1933 ప్రాంతం. మహారాష్ట్రలోని ఇప్పటి మరాఠ్వాడా ప్రదేశంలోని ఉస్మానాబాద్ జిల్లాలోగల థైర్ అనే కుగ్రామంలో ఒక పేద బ్రాహ్మణకుటుంబానికి చెందిన సాదాసీదా ఇల్లు. ఇంటి యజమాని ఐన రఘునాథ్ బువా వ్యాస్జీ ఒక గొప్ప కీర్తనకారుడు. అంటే మన తెలుగు సంస్కృతిలో హరిదాసులని, తమిళ-మలయాళ రాష్ట్రాలలో భాగవతులు అని ఎవరిని అంటామో వారినే మహారాష్ట్రలో “(హరి)కీర్తనకారులు” అంటారు. రఘునాథ్ బువాజీ తండ్రిగారైన యోగిరాజ్ శ్రీ ఏకనాథ వ్యాస మహరాజ్ వర్యులు, వారి సహోదరులైన శ్రీ రంగనాథ వ్యాస్ మహరాజ్ కూడా కీర్తనకారులుగా ప్రశస్తి పొందేరు. వారి కుటుంబాలవారు తర-తరాలుగా కీర్తనకారులే కాక గొప్ప సంస్కృతపండితులు కూడాను!
రఘునాథ్జీ వ్యాస్ మహరాజ్ గారి భార్య శ్రీమతి అనసూయాబాయివ్యాస్ . ఆ దంపతులకి ముగ్గురు కుమారులు. తండ్రిగారు తమ పిల్లల్ని కుటుంబపరంపరని అనుసరించి కీర్తనకారులుగానే తీర్చిదిద్దాలని, ఆ ప్రాచీనవిద్యారంగంలోనే ముగ్గుర్నీ తయారుచేస్తున్నారు. అనసూయమ్మగారికి ఇది ఇష్టంలేదు. ఆ కాలానికే ప్రజలలో భక్తిభావాలు సన్నగిల్లిపోతూ, కేవల లౌకిక విద్యలు, ధనార్జన, ఇహలోకసుఖాలకి వెంపర్లాడడం మొదలైన ప్రాపంచికభోగదృష్టి పెరిగిపోతూ, అలౌకికవిద్యలపట్ల అనాదరణ పెరిగిపోవడం ఆరంభమయ్యింది. ఈ క్రమపరిణామం గమనిస్తూన్న అనసూయాదేవి వారి పిల్లల సుస్థిర భవితవ్య సంరక్షణబాధ్యతని దృష్టిలోవుంచుకుని, పిల్లలు ముగ్గురిని ఆధునిక విద్యలో ప్రవేశపెట్టాలని ఆలోచించి, భర్తగారితో ఆ ప్రస్తావననే చేయడం జరిగింది. ఆయన అందుకు అంగీకరించలేదు. దానితో ఆమె తన పిల్లల సురక్షిత భవిష్యత్తు కోసం “నిరాహారదీక్ష” చేపట్టడం అనివార్యమయ్యింది. ఆయన ఆమె దీక్షని లక్ష్యపెట్టలేదు. రోజులు గడిచిపోతున్నాయికాని ఆమె పట్టు వదలలేదు, ఆయన కూడా బింకంగానేవున్నారు. చివరకి చింతామణిగారి అత్యంతసన్నిహితబంధువు కలగజేసుకుని, ముగ్గురు పిల్లలని దగ్గరలోనేవున్న వార్సీ అనే ఊరిలోని మంచి విద్యాలయంలో చేర్పించేరు. అనసూయాదేవి అంతటి పట్టుదల పడితేగాని పని జరగలేదు. పాఠశాలలో చేరే సమయానికి చింతామణి వ్యాస్ గారికి తొమ్మిదేళ్ళవయస్సు వచ్చింది. అప్పటికే తండ్రివద్దనేర్చుకున్న భజనగీతాలని చింతామణిజీ దైవదత్తమైన తన మహామధురగళంలో పాడుతూవుంటే శ్రోతలు మంత్రముగ్ధులైపోయేవారు. భజనలతోబాటు ఆయన దేశభక్తిగేయాలు, అప్పటి సినిమాపాటలు వంటివాటినన్నీ అలవోకగా తీయగా పాడేవారు. “గణేశ చతుర్థి“వంటి పండగలకి, ఇతర పర్వదినాలకి ఆయనని ముందుగానే చెప్పి సభాకార్యకర్తలు ఆయా సమయాలలో ఆయనచేత పాడించుకునేవారు. అటువంటి సందర్భాలలో ఆయనకి ఖాళీయేవుండేదికాదు. ఆ రకంగా ఆయన అంత చిన్నవయస్సులోనే పేరు-ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించేరు.
# # # # # # # # # #
శ్రీ చింతామణి రఘునాథ వ్యాసజీ, 1924వ సంవత్సరం, నవంబరునెల, 9వ తేదీన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోగల థైర్ అనే చిన్నగ్రామంలో జన్మించేరు. ఆ గ్రామంలో పిల్లల ౘదువులకోసం, కనీసం వీధి బడైనాలేదు. అందువలన ఆయన తమ తల్లిగారి ప్రోద్బలంతో తొమ్మిదేళ్ళప్రాయంలో దగ్గరలోవున్న ఊరు వార్సీలోని పాఠశాలలో చేరేరు. ఆ ఊరిలో మానిక్రావు అనే వ్యవసాయదారుడు ఉండేవాడు. ఆయన ఖాళీ సమయాలలో సితారువాదనవిద్యలో నైపుణ్యం పొందడంకోసం సాధనచేసుకునేవారు. ఆయన ఒకసారి చింతామణిజీ భజన గానం వినడం తటస్థించింది. ఆ గానానికి ఆయన ముగ్ధులైపోయేరు. పిల్లవాడికి శాస్త్రీయసంగీతవిద్యారంగంలో అపారప్రశస్తిని సంపాదించగలిగిన అమేయ ప్రతిభా-పాటవాలు ఉన్నాయని మానిక్జీ గ్రహించేరు. ఆ విషయాన్ని వారు రఘునాథబువాజీతో సంప్రదించేరు. రఘునాథజీ పిల్లవాడి ౘదువుకి ఇబ్బంది కలుగుతుందేమోననే భయంతో వెంటనే అంగీకరించలేదు. మానిక్జీ రఘునాథబువాతో నిదానంగా అన్ని విషయాలు మాట్లాడి, ౘదువు సంధ్యలకి అంతరాయంకలగకుండానే చింతామణిజీకి సంగీతం ౘక్కగా నేర్పించవచ్చని నచ్చచెప్పి ఆయన అనుమతితో చింతామణి సంగీతవిద్యాభ్యాసానికి తిరుగులేని పునాదివేసేరు. 14 సంవత్సరాల వయస్సున్న చింతామణిజీని, తనకి గాయక మిత్రుడైన గోవిందరావు భటాంబ్రేకర్జీవద్దకి గాత్రసంగీతబోధకోసం తీసుకువెళ్ళేరు. గోవిందరావుజీ “కిరానా ఘరానా గానవిద్య“లో పేరున్నవాడు. చింతామణిజీ గాత్రంవిన్న గోవిందజీ అతడికి సంగీతం నేర్పించడానికి అంగీకరించేరు. ఆశ్చర్యకరంగా గోవిందజీ తన మొదటి సంగీతపాఠాన్ని, కఠినమైన “పూర్యా” రాగంతో ప్రారంభించేరు. 15 సంవత్సరాల వయస్సులో చింతామణిజీ కంఠం యౌవనం తొలి దశలో ఏర్పడే మార్పును పొందుతూ, పాడడానికి కొంత ఇబ్బందిని కలిగించింది. ఐనా అతడు తన అభ్యాసాన్ని అకుంఠితదీక్షతో కొనసాగించి, గురువుగారికి, సంగీతసభలలో తన సహకారగానాన్ని అందించేవాడు. ఆ తరువాత గోవిందజీ తన శిష్యుడి అంకితభావంతోకూడిన తీవ్ర అభ్యాసదీక్షకి సంతోషించి “యమన్ “రాగం నేర్పించడం ప్రారంభించేరు. సుమారు ఒక ఏడాది పైగా అదే రాగాన్ని ఆయన తమ శిష్యుడిచేత అనవరత వ్రతంగా అభ్యసింపజేసేరు. సుమారు 19 సంవత్సరాల వయస్సుకి చింతామణిజీ మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేరు. తండ్రిగారిని ప్రార్థించి ఆయన అనుమతితో చింతామణిజీ తన సంగీతవిద్యాభ్యాసదాహాన్ని సంతృప్తి పరుచుకునే ప్రయత్నంలో బొంబై చేరుకున్నారు. బొంబై చేరిన అనతికాలంలోనే అష్టకష్టాలూ పడి ఒక సంస్థలో నలభైరూపాయల నెలసరి వేతనానికి ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు. తన నివాసమైన గిర్గాcవు నుంచి ఉద్యోగంకోసం మటుంగా రోజూ నడిచి వెళ్ళేవారు. ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 5 గంటలవరకు ఉద్యోగమే సరిపోయేది. మిగిలిన సమయంలో ఎక్కువభాగం నిరంతర గాన సాధనకి, వివిధ మహాకళాకారుల గానం వినడానికి, తనకి అన్నివిధాలా అందుబాటులోవుండే మంచి గురువుని వెదకడానికి చింతామణిజీ వెచ్చించేవారు. ఆ కాలంలో వారు స్థానికంగా సుప్రసిద్ధమైన “ట్రినిటీ క్లబ్ ” వారి వారాంత సంగీత సభలకి తప్పక వెళ్ళేవారు. ఆ సభలలో పాల్గొనే డా. బి. ఆర్ . దేవధర్ , పండిత్ కుమార గంధర్వ, పండిత రామ్ మరాఠే, పండిత్ గోవిందరావు తెంబే, మాస్టర్ నవరంగ్ మొదలైన మహామహుల సంగీతం ఆయన పరమశ్రద్ధతో వినేవారు. ఒక్కొక్కసారి వారికి అవకాశం ఇచ్చినపుడు ఆయనకూడా పాడి అందరి మన్ననలని పొందేవారు. ఆయనకి తన విద్యాభ్యాసాన్ని బాగా కొనసాగించి, గానవిద్యలో ఎంతో కొంత పరిణతి సాధించడంలోవున్న శ్రద్ధాసక్తులు కీర్తి-ప్రతిష్ఠలమీదవుండేవి కావు!
నఫ్దే అనే ఒక శ్రోత చింతామణిజీ గానానికి అభిమాని ఐపోయేడు. ఐతే ఆయన చింతామణిజీ మనసులోని బాధని గ్రహించేరు. ఆయనని తనకి ఆత్మీయమిత్రుడైన పండిత్ రాజారాం పరాద్కర్ అనే ప్రసిద్ధగాయకుడివద్దకి నఫ్దే తీసుకువెళ్ళేరు. 19 సంవత్సరాల చింతామణిజీని, రాజారాంజీ నెలసరి 15 రూపాయల జీతం తీసుకుని సంగీతశిక్షణని ఇవ్వడానికి అంగీకరించేరు. నెలకి ఎనిమిది పాఠాలు చెప్పడానికి నిర్ణయం జరిగింది. కాని, అనతికాలంలోనే, చింతామణిజీ గాఢమైన అంకితభావం, ఆయన ప్రజ్ఞాపాటవాలు గ్రహించిన రాజారాంజీ, ప్రతిఫలాపేక్షతో కూడిన లౌకిక వ్యవహారాన్ని విడిచిపెట్టి, సనాతన గురు-శిష్యసంప్రదాయంగా భావించి, చింతామణిజీకి ఏ విధమైన పరిమితులు-షరతులు లేని సంగీతవిద్యాబోధనని అందించేరు. చింతామణిజీ 15 సంవత్సరాలు నిరవధికంగా రాజారాంజీ వద్ద “గ్వాలియర్ ఘరానా” సంప్రదాయానికి చెందిన గాన విద్యని అకళంకంగా నేర్చుకున్నారు. ఆ కాలంలో సుప్రసిద్ధులైన ఉస్తాద్ ఫైయాజ్ ఖాc, పండిత్ వినాయకరావు పట్వర్థన్ ,పండిత్ నారాయణరావు వ్యాస్ , విదుషి హీరాబాయి బరోడేకర్ , విదుషి కేసర్బాయి కేర్కర్ , విదుషి గంగూబాయి హంగల్ , ఉస్తాద్ అజ్మత్ హుస్సేన్ ఖాc, మొదలైన విభిన్న గాయనశైలిలకి చెందిన గాయనీ-గాయకులందరినీ చింతామణిజీ ఎనలేని ప్రీతితో వినడం జరిగింది. చింతామణిజీ సౌశీల్యమూ, సామర్థ్యమూ ఏళ్ళతరబడి గమనించిన రాజారాంజీ, యుక్తవయస్కురాలైన తన భార్య చెల్లెలు, ఇందిరాబాయిని వివాహంచేసుకోవలసినదిగా తన ప్రియశిష్యుడిని కోరేరు. గురువు కోరికని ఆదేశంగా శిరసా వహించి చింతామణిజీ ఇందిరాబాయిజీని 1945లో వివాహమాడి, గృహస్థు అయ్యేరు. అదే సంవత్సరం ఆయన I.T.C. సంస్థలో ఉద్యోగంలో చేరేరు. 32 సంవత్సరాల సేవానంతరం, 1977లో స్వచ్ఛంద ఉద్యోగవిరమణ చేసేరు. అప్పటినుంచి, 2002లో వారు దివంగతులయ్యేవరకు ఆయన తన 25 సంవత్సరాల శేషజీవితాన్ని కేవలం సంగీతంకోసమే సంపూర్ణంగా అంకితం చేసుకున్నారు.
సంగీతపరంగా వారి జీవితంలో పండిత్ జగన్నాథబువా పురోహిత్ గారి శుశ్రూషని చేసి సంగీతవిద్యాధ్యయనం చేయడాన్ని మహోత్కృష్ట సంఘటనగా పరిగణించాలి. జగన్నాథబువాజీ గానాన్ని, ఆయన, విదుషి అంజనీబాయి లోలేకర్ గారి ఇంట్లో జరిగిన గృహసభలో మొట్టమొదటిసారిగా వినడం తటస్థించింది. ఆ సాయంత్రం జగన్నాథబువా తమధ్యానభావమయగళంలో “శివమత్ భైరవ్ ” రాగాన్ని గానంచేసేరు. ఆ గానశోభావైభవానికి చింతామణిజీ ఆశ్చర్యంతో మంత్రముగ్ధులైపోయేరు. బువాజీ “ఆగ్రా ఘరానా” గానసంప్రదాయానికి చెందిన ఉస్తాద్ విలాయత్ హుస్సేన్ ఖాcజీ ప్రియతమ శిష్యులు. జగన్నాథబువాజీ వద్ద చింతామణిజీ శిష్యరికంచేసి, గురువుగారి అనుంగు శిష్యుడిగా ఐపోయేరు. జగన్నాథబువా మహాగాయకులు, మహోన్నతగురువులు, మహోత్తమ వాగ్గేయ కారులు, మహోత్కృష్ట మానవతామూర్తి, సనాతన భారతీయ సత్సంప్రదాయానికి మహోర్జిత ప్రతినిధి! అలాగే చింతామణిజీకూడా గురువుగారి అడుగుౙాడలలో నడిచిన గొప్ప గాయకుడు, గురువు, వాగ్గేయకారుడుగా పరిపూర్ణత సాధించేరు. ఆయన మొత్తంమీద కిరానా, గ్వాలియర్ , ఆగ్రా ఘరానాలకి చెందిన గురువుల వద్ద కూలంకషంగా విద్యని అభ్యసించేరు. పైన ప్రస్తావ వశంగా చెప్పుకున్న గురువులవద్ద మాత్రమే కాక, చింతామణిజీ శ్రీ యశ్వంత్ బువా మిరాశీ, శ్రీ S.N.రతన్ ఝంకర్, ఉస్తాద్ ఫైయాజ్ ఖాc, శ్రీ అనంతమనోహర జోషీలవద్ద కూడా వారు తమ సంగీతానికి మెరుగులు దిద్దుకోవడం జరిగింది. అంతేకాక, కె.జి. గిండే, S.C.R. భట్ , చిదానంద నాగర్కర్ మొదలైనవారివద్దకూడా చింతామణిజీ తమవిద్యకి నగిషీలు పెట్టుకున్నారు.
1978లో, ఆయన గానయానం ఉత్తమస్థాయిలో కోనసాగుతూండగా, ఆరోగ్యపరంగా ఆయన జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది. తీవ్రమైన పక్షవాత వ్యాధికి గురికావడంవలన ఆయన మాట పడిపోయింది. ప్రాణానికే ముప్పు వాటిల్లింది. ఆ సమయంలో శారదామాత అపార కృపా విశేష కారణంగా, బొంబైలోని, జస్లోక్ ఆసుపత్రిలో, డా. దస్తూర్జీ – డా. గజేంద్రసింగ్జీల అద్భుతమైన శస్త్రచికిత్సవలన, చింతామణిజీ ప్రాణసంరక్షణ జరగడమేకాక, ఆయన కంఠం యథాపూర్వంగా వచ్చి సంగీతప్రియులందరికి మహానందాన్ని కలగజేసింది. 1982లోను, మరల 1985లోను U.S.A., U.K., Canada దేశాలలో పర్యటించిన చింతామణిజీ తమ అత్యద్భుత గానసంగీతయాత్రని నిరాటంకంగా నిర్వహించి ప్రపంచ సంగీత రసజ్ఞులకి అమిత ఆనందాన్ని పంచిపెట్టేరు. వారు మన ఆకాశవాణి, దూరదర్శన కేంద్రాలలోను, భారతదేశంలోని ప్రముఖనగరాలలోను లెక్కకి మిక్కుటమైన సంగీతసభలని నిర్వహించి రసికుల మన్ననలని పొందేరు.
“పద్మభూషణ్ “, సంగీత నాటక అకాడమీ బహుమానం, మహారాష్ట్ర గౌరవ పురస్కారం, ఉస్తాద్ హఫిజ్ ఆలీ ఖాc సమ్మానం, మరాఠ్వాడా గౌరవ పురస్కారం, దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం, మధ్యప్రదేశ్ రాష్ట్రంవారి “తాన్సేన్ సన్మానం” మొదలైన సత్కారాలు వారిని వరించేయి.
శ్రీ ప్రభాకర్ కారెకర్ , శ్రీ జితేంద్ర అభిషేకి, శ్రీ గణపతి భట్ , శ్రీ శ్రీరాం పరశురాం, శ్రీ సుహాస్ వ్యాస్ , శ్రీ సంజీవ చిమ్మాల్గి మొదలైనవారు చింతామణి వ్యాస్జీ సుప్రసిద్ధ శిష్యులలో కొందరు.
Pandit C.R. Vyas గారి గానం “యూ-ట్యూబు”లో పుష్కలంగా లభిస్తోంది. బేహాగ్ , భీంపలాసీ, ఆహిరి లలిత్ , బసంతీ-కేదార్ ,శివ్ – అభోగి, దేశ్ , బిలాస్ఖానీ తోడీ, స్వానంది, భైరవ్ బహార్ , మాలవ్ , మలూహా కేదార్ , శ్రీ, గూర్జరీ తోడి, ఛాయానట్ , రాంకలీ మొదలైన రాగాలని ఆయన ముగ్ధమనోహర పురుషగళంలో పరవశించి వినగలగడం మహా సౌభాగ్యంగా భావించి రసజ్ఞులు విని, శ్రీశారదామాత అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.
2002వ సంవత్సరంలో, జనవరినెలలో, 10వ తేదీన కలకత్తా నగరంలో శ్రీ చింతామణి రఘునాథ్ వ్యాస్జీ పరమపదించేరు. ఆ అలౌకిక శారదాతనయునికి మన సాష్టాంగ దండ ప్రణామం సమర్పించుకుందాం.
స్వస్తి|
సంగీత రసచింతామణి శ్రీ రఘునాథ్ వ్యాస్జీగూర్చి తెలుసుకొనే భాగ్యం కలిగింది
ఈ website లో చాలా విషయాలు తెలుస్తున్నాయి. ధన్యవాదములు.
రసవంతమైన సంగీతాన్ని శ్రోతలకు
అందిస్తూ, ఫలవంతమైన జీవితాన్ని
గడిపిన చింతామణి రఘునాథ్ వ్యాస్
గారి గురించి రాసిన
సమీక్ష స్ఫూర్తిదాయకంగా ఉంది.
వయసుతో నిమిత్తం లేకుండా , నిత్య విద్యార్థిగా
అంతమంది గురువుల దగ్గర నిరంతరంగా సంగీతం
అభ్యాసం చెయ్యడం సామాన్యమైన విషయం కాదు.
వారిలోని సంగీతం నేర్చుకోవడం పట్ల తీరని తృష్ణ ,
తరగని తపన అంతటిది..!
మూడు ఘరానాలు….ఆరు పదుల శిష్య బృందంతో
వారు సాధించిన విజయాలకు జోహార్లు..
చిన్న నాడె నేర్చె చింతామణి వరులు
భజన గాన మెంతొ బాగుగాను
సంతత కృషి తోడ సంగీత రంగాన
సాటి ఎవరు లేని మేటి యయ్యె.