సాహిత్యము—సౌహిత్యము ~ 66 | సత్త్వగుణవృద్ధి—సాధక ప్రయత్నం

ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః|
18—08—2018; శనివాసరము|

“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|

“సాహిత్యము—సౌహిత్యము ~ 66″| “సత్త్వగుణవృద్ధి—సాధక ప్రయత్నం”|

జీవుడు మానవరూపంలో నేలమీదవాలడానికి, ఆ నేలమీదే నెలవుని ఏర్పాటు చేసుకుని మరణించేవరకు మోహ లోభమయ జీవనంలో బానిస బ్రతుకుని కొనసాగింౘడానికి ప్రారబ్ధకర్మఫలమే కారణమని మన అధ్యాత్మవిద్యాశాస్త్రం విశదంచేస్తోంది.

కర్మ సిద్ధాంతం” Newton’s Laws of Motionలో మూడవసూత్రం వంటిది. న్యూటన్ కన్న వేల-వేల సంవత్సరాలనుంచి భారతదేశంలో ప్రచారంలోవుంది. ఎటొచ్చీ న్యూటన్ జడ ద్రవ్యవిజ్ఞానం(the science that explains the properties of inert matter) పరిధికి పరిమితంచేసి చెప్పిన సూత్రాన్ని, మన ఋషుల ఉపదేశంద్వారా విశ్వంలోని జీవసృష్టికి అంతటికీ అన్వయించి మనం అర్థంచేసుకుంటున్నాం! న్యూటన్ 3వ సూత్రం యిది:—

” For every action there is an equal and opposite reaction”.

అంటే, “ఏ చర్యకైనా, దానికి సమానమైన మరియు వ్యతిరేకదిశగల ప్రతిచర్య ఉంటుంది” అని అర్థం!

అలాగే అక్కౌంటెన్సీలోని డబుల్ ఎంట్రీ సిస్టంలో “For every debit there  is a corresponding credit with the same amount and vice versa” అనే సూత్రంవుంది. ప్రతి ఖర్చుపద్దు అంశానికి అదే మొత్తంతో దానికి అనుగుణమైన జమపద్దు అంశంవుంటుంది. అలాగే ప్రతి జమపద్దుకి అదేమొత్తంతో ఖర్చుపద్దు అంశమూవుంటుంది” అని దీనికి అర్థం!

అలాగే కర్మ సిద్ధాంతంలోనూవుంటుంది. కర్మ-
(1) సూక్ష్మమైన మానసిక వ్యాపారంగాను,
(2) స్థూలమైన బాహ్య క్రియాకలాపంగాను ఉంటుంది. ఏ కర్మకైనా దానికి సమానమైన వ్యతిరేకదిశగల ప్రతిక్రియ పుడుతుంది. దీని ప్రమేయంతోనే భిన్న-విభిన్న వృత్తులు, ప్రవృత్తులుగల మానవాళితోబాటు మొత్తం సృష్టి అంతా జరుగుతోంది. ఈ కర్మ,
(1) సంచితకర్మ లేక కర్మాశయం,
(2) ప్రారబ్ధకర్మ,
(3) ఆగామికర్మ అని మూడు రకాలుగావుంటుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
ఈ కర్మఫలాలన్నీ ఒకే మూసలో పోసి తయారు చేసిన స్థూల-సూక్ష్మ ద్రవ్యాలవలె ఏర్పడేవికాదు. వేరు-వేరు తీవ్రతలు, గాఢతలు, కోమలత, సాంద్రత మొదలైన భేదాలననుసరించి అవి విభిన్న ఫలాలుగా పరిణమిస్తాయి.

ఉదాహరణకి వరి విత్తనం వేస్తే ఏడాదిలోగానే వరిమొలక పుట్టి, పెరిగి, వరివెన్నులువేసి అనుభవయోగ్యమైన ధాన్యాన్ని యజమానికి అందించి, అంతరించిపోతుంది. అదే కొబ్బరివిత్తనం అయితే మొలకెత్తడానికి,  చెట్టుగా పెరిగి, పెద్దదై నారికేళఫలాన్ని ఇవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎలుక గర్భధారణసమయం, అంటే, gestation-period, 19 రోజుల వ్యవధిగా ఉంటుంది. ఏనుగు గర్భధారణ సమయం/gestation period, 643 రోజుల వ్యవధిని కలిగివుంటుంది.

అనేక జన్మలపరంపర ద్వారా జీవుడు సంపాదించుకున్న వివిధ శుభ-అశుభ కర్మల ఫలాల ప్రోగుని,లేక సంచయాన్ని సంచితకర్మ అంటారు. ఈ ప్రోగు/సంచయం/కర్మాశయం మనిషి వంద సంవత్సరాల ఆయుఃప్రమాణంలో ఒకే జన్మలో అనుభవించడానికి అవకాశంలేదు. సంచితకర్మ సముద్రమంతవుంటే,  మనిషి జీవితం మహా ఐతే ఒక బిందెలాగో, పీపాలాగో, టేంకర్ లాగో ఆయుర్దాయాన్నిబట్టివుంటుంది. అందువలన సంచితకర్మనుంచి ఒక జన్మకి సరిపోయే శుభాశుభ మిశ్రమఫలరూపంలోని కర్మభాగాన్ని తీసుకుని జీవుడు మానవుడై జన్మిస్తాడు. వివిధరకాలైన స్థాయీభేదం కలిగిన అటువంటి కర్మఫల విభాగానికే ప్రారబ్ధ కర్మ అని పేరు. ప్రారబ్ధం అంటే ప్రారంభం ఐపోయినది, లేక,  మొదలైపోయినది అని అర్ఠం. అది మొదలైతేనేకాని జీవుడు జన్మ ఎత్తడం అనే  క్రియ ఆరంభమేకాదు. జీవుడి జన్మ అనే ప్రక్రియ మొలకెత్తడానికి మూలబీజం,  అంటే, కారణమైన విత్తనం, “ప్రారబ్ధకర్మ”! జీవుడి జన్మకి సంబంధించిన  జననాది మరణపర్యంతం జరిగే క్రియాకలాపాలకి అన్నింటికీ కర్మబీజం  లేక Karmic Capsule-like Seed మూలకారణం అన్నమాట.

వర్తమానజన్మలో క్రొత్త కర్మలనిచేసి వాటి శుభాశుభ ఫలాలని సంచితకర్మ (accumulated fruits of action acquired through various uncountable births) కి చేరవేసుకుంటూ చేసే క్రియా కలాపమే “ఆగామికర్మ”! ఆగామి అంటే జీవుడు రాబోయేకాలంలో సంభవించే జన్మపరంపరలద్వారా అనుభవించబోయే కర్మఫలం అని అర్థం.

ఈ పుణ్య-పాప మిశ్రమ ప్రారబ్ధకర్మనుంచి మనిషికి వివిధ వాసనలు – అంటే various tendencies or inclinations or propensities or  proclivities, వాటినుంచి పుట్టిన సంస్కారాలు – అంటే indelible impressions left in the mind, దానివల్ల ఏర్పడే రాగ-ద్వేషాదులు, అంటే likes and dislikes and so on, కలుగుతాయి. ఇవన్నీ మానవుల పరస్పరభిన్నమైన వ్యక్తిత్వ లక్షణాలని అంటే- individuality-defining characteristicsని లోకానికి వ్యక్తపరుస్తాయి. ఈ మౌలిక లక్షణాలు  ప్రకృతి ధర్మాలైన సత్త్వ-రజస్ -తమోగుణాలనబడే మూడు గుణాలద్వారా ప్రకృతిలో భాగమైన మానవుల బుద్ధులని, తద్ద్వారా జీవితపరంపరని, సంపూర్ణంగా ప్రభావితంచేసి మానవ పుణ్య-పాప కర్మనిర్వహణలో ప్రధాన ఆధారభూమికని పోషిస్తాయి.

అహింస, సత్యసంధత, బ్రహ్మచర్యం, అపరిగ్రహం(ఎవ్వరినుంచి ఏమీ తీసుకోకపోవడం), క్రోధంలేకపోవడం, గురుశుశ్రూష, నిత్యసంతోషం, శౌచం, ఋజువర్తనం, మొదలైనవన్నీ సత్త్వగుణలక్షణాలు.

“నేను కర్తని”, “నేను భోక్తని”, “నేను వక్తని” అనే అభిమానభావాలు, లోభం, అశాంతి, కోరికలు మొదలైనవి రజోగుణలక్షణాలు.

నిద్ర, బద్ధకం, మోహం, రాగం, మైథునం, చౌర్యం మొదలైనవన్నీ తమోగుణ లక్షణాలు.

భక్తుడైన సాధకుడు వీటినుంచి ఎలాగ బయటపడి ఇష్టదేవతానుగ్రహ పాత్రతని పొందడానికి వీలుందో వివరిస్తూ, శ్రీకృష్ణభగవానులు, తన భక్తశిరోమణి ఐన ఉద్ధవులకి భాగవతంలోని ఏకాదశస్కంధంలోవున్న 13వ అధ్యాయమైన “హంసగీత“లో ఈ విధంగా బోధించేరు:—

“సత్త్వం, రజః, తమః, ఇతి గుణాః బుద్ధేః న చాత్మనః|
సత్త్వేనాన్యతమౌ హన్యాత్ సత్త్వం సత్త్వేన చైవ హి”||

(శ్రీకృష్ణభగవానుడు ఇలాగ అన్నాడు) “సత్త్వం, రజస్సు, తమస్సు అనే ఈ మూడు గుణాలు బుద్ధికి సంబంధించినవే. ఆత్మకి చెందవు. సత్త్వగుణం  ఆలంబనగాచేసుకుని మిగిలిన రజోగుణ, తమోగుణాలు రెండింటినీ  అణచివేయాలి. ఆ తరువాత సత్త్వగుణాన్ని సత్త్వగుణంతోటే నిర్మూలించాలి”.

“సత్త్వాత్ ధర్మః భవేత్ వృద్ధాత్ పుంసః మత్ భక్తి లక్షణః|
సాత్త్వికోపాసయా సత్త్వం తతః ధర్మః ప్రవర్తతే”||

“సత్త్వగుణం పెరగడంవలన మనిషికి నాయందు భక్తికి చిహ్నమైన విలక్షణ ధర్మం ఏర్పడుతుంది. సత్త్వగుణమయమైనవాటినే (సాధకుడు) సేవిస్తూ ఉండడంవలన మరల సత్త్వగుణము, దానినుండి ధర్మాచరణమయజీవనము కలుగుతాయి”.

ఈ విధంగా చెపుతూ సత్త్వగుణంవలన సర్వోత్తమధర్మం వెల్లివిరుస్తుందని, దానివలన రజస్తమోగుణాలు నశించి, ఆ రెండింటివలనపుట్టే అధర్మం అంతటితో పూర్తిగా నిర్మూలించబడుతుందని భగవానుడు బోధించేడు.

ఆ పైన మానవులలో ఏర్పడే గుణాలకి కారణాలు పది అని భగవానుడు చెప్పేడు. శాస్త్రం, నీరు, సంతానం, దేశం, కాలం, కర్మ, జన్మ, ధ్యానం, మంత్రం, సంస్కారం అనేవి ఆ పది అని విశదం చేసేడు. ఈ పదింటిలో వ్యాసాది  మహర్షులు ప్రశంసించినవాటిని సాత్త్వికమైనవాటినిగాను, నిందించినవాటిని తామసికమైనవాటినిగాను, తటస్థవైఖరితో ఉపేక్షించిన మిగిలినవాటిని రాజసికములైనవిగాను సాధకజనులు పరిగణించాలని భగవానుడు స్పష్టంచేసేడు. వీటి వివరాలు భగవద్గీతలోని “గుణత్రయవిభాగయోగం“లో ౘక్కగా చర్చించబడ్డాయి. ఆహార-విహారాదులందుకూడా సత్త్వగుణప్రధానమైన వాటినే సాధకులందరూ ఆచరించాలి. రాజసిక-తామసిక విషయాలని దూరంగా త్యజించాలి. అధ్యయన-పఠన-శ్రవణ-దర్శనాదులయందు అప్రమత్తతతో సాత్త్వికమైనవానినే స్వీకరించాలి. వీటిగురించి పెద్దలు ఉపదేశించిన మార్గాన్నే సాధకజనులు అనుసరించాలి.

“సాత్త్వికం వేద-శాస్త్రాది, సాహిత్యం చైవ రాజసమ్ |
తామసం యుద్ధవార్తా చ పరదోష ప్రకాశనమ్ “||

“వేదాధ్యయనం, వేదప్రామాణ్యాన్ని శిరసావహించి, వేదోపదేశానుసారంగా వెలసిన శాస్త్రాధ్యయనం, వాటిని అనుసరించి రచించబడిన వాల్మీకిరామాయణ, వ్యాసభారత-భాగవత-పూరాణాదులు, వాటి పఠన-పాఠన-ప్రవచన శ్రవణ-మననాదులు సత్త్వగుణవృద్ధిని కలిగిస్తాయి. కేవల మానవ మనఃకల్పిత కావ్య-నాటక-కథాదుల పఠనాదులు రాజసిక ప్రవృత్తిని ప్రేరేపిస్తాయి.  కేవల లౌకిక యుద్ధవార్తలు, ఇతరుల దోషాలని ఎత్తిచూపించే వ్రాతలు  తామసిక అవిద్యాంధకారాన్ని ఇనుమడింపజేస్తాయి”.

ఈ ఉపదేశాల ఆదర్శప్రకాశంతో సాధకజనులు తమ అంతర్గత భావప్రపంచాన్ని మణిమయమందిరంగా మలచుకుని, దానియందు తమ ఇష్టదైవాన్ని సుప్రతిష్ఠితంచేసుకుని ఆ దివ్యభావనాసౌందర్యసీమలో తమ ఇష్టదైవంతో “ఏకాంత సేవ“ని, “ఏకాంత నివేదన“ని చేసుకుంటూవుండాలి. తథాsస్తు!

స్వస్తి||

You may also like...

5 Responses

  1. Sampathkumar says:

    Jeevana satyam chala baagundi guruvugaru.

  2. సి.యస్ says:

    సత్వ గుణము కన్న సర్వ ధర్మము లేదు
    సంచితాదుల నది త్రెంచి వేయు.
    ముక్తి కోరు వారు భక్తి మార్గము పట్టి
    సాధనమున పొందు సత్వ గుణము.

  3. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే సాధకులకు చక్కటి సమాచారపు విందు భోజనం. సంచితకర్మల క్షయానికి సాత్విక సాధన గూర్చి వివరించడం బాగుంది.

  4. Srvalliseshasai says:

    Chala bavundhi.

  5. సి.యస్ says:

    ఎన్నొ విలువైన సంగతుల నెంపు జేసి
    వాటి లోతైన అర్థాల వ్యాఖ్య నొసగి
    వివిధ రీతుల మాకెల్ల విశద పరచి
    ముదము చేకూర్చు చుంటివి హృదయ మంత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *