శారదా సంతతి ~ 55 : భారతీయ సంగీత-నాట్య సంస్కృతి స్రవంతిని గ్రంథస్థంచేసిన అనుపమ రచయిత్రి ~ శ్రీమతి డా. సుశీలా మిశ్రా

ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః|
12—08—2018; ఆదిత్యవాసరము|

“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|

“శారదా సంతతి ~ 55″| భారతీయ సంగీత-నాట్య సంస్కృతి స్రవంతిని గ్రంథస్థంచేసిన అనుపమ రచయిత్రి ~ శ్రీమతి డా. సుశీలా మిశ్రా (15—09—1920 నుండి 08—04—1998 వరకు)|

డా. సుశీలా మిశ్రా జన్మస్థలం కేరళరాష్ట్రం. ఆమె 1920వ సంవత్సరంలో, సెప్టెంబరునెల, 15వ తేదీన జన్మించేరు. వారి తల్లిగారి పేరు శ్రీమతి టి.సి. మాధవి నంబియార్ . తండ్రిగారి పేరు ప్రొఫెసర్ పి. సంస్కరణ్ నంబియార్ . వారిద్దరు విద్యాధికులు, శాస్త్రీయకళా సంపన్నులు కావడంవల్ల తమ బిడ్డ సుశీలని అటువంటి ౘక్కని వాతావరణంలో పెంచుతూ, ఆమెకి, ౘదువులోను, సంగీత-నాట్య విద్యలలోను ఆరితేరడానికి అనువైన శిక్షణని అందించేరు. వివిధస్థాయి విద్యాలయాలలో సుశీలాజీ ప్రథమశ్రేణిలోనే ఉత్తీర్ణురాలు ఔతూండేది.

ఎర్ణాకులం, మహారాజా కళాశాలనుండి సుశీలాజీ పట్టభద్రురాలయ్యేరు.  పట్టభద్రపరీక్షలో ఆమెకి ఇంగ్లిష్ భాషలో ఉత్తమస్థాయి లభించింది. సంగీతం(Music)లోను, నాటక కళా శాస్త్రం(Dramatics)లోను ఆమె స్వర్ణపతకాన్ని పొందేరు. ఆ తరువాత, ఆనాటి మదరాసు, ప్రెసిడెన్సీ కళాశాలలో, ఆంగ్ల భాషా-సాహిత్యాలలో ఎం.ఏ. పట్టాన్ని సంపాదించేరు.

చిన్నతనంనుంచి సంగీతమన్నా, సంగీతకళాకారులన్నా వల్లమాలిన ప్రీతిభావం ఉండడంవల్ల సంగీతరంగానికి సంబంధించిన వివిధ అంశాలగురించి, కళాకారుల గురించి విపులమైన విశేషాలని తెలుసుకోవడం, వాటిని వ్రాతరూపంలో పుస్తకాలలో భద్రపరుచుకోవడం వారి జీవితంలో ఒక ౘక్కని అభిరుచి లేక హాబీగా ఆమెకి స్వభావమైపోయింది. తరువాతకాలంలో వారి ఉద్యోగరంగంలో పెద్ద-పెద్ద కళాకారులతో స్నేహబాంధవ్యాలు నెలకొల్పి కొనసాగించడంలోను, ఆకాశవాణి వారికోసం లేక ప్రముఖపత్రికలవారికోసం అనేక కళాకారుల పరిచయకార్యక్రమాలు, ఇంటర్వ్యూలు నిర్వహించడంలోను ఆమె ప్రేమతో సంపాదించుకున్న వివిధ రంగాలలోని విభిన్న విఖ్యాత వ్యక్తుల వివరాలు ఆమెకి ఎంతగానో ఉపకరించేవి. వారి గ్రంథరచనలలోకూడా అవన్నీ అమితంగా అక్కరకి వచ్చేవి.

విద్యాభ్యాసానంతరం, వారు, ఆకాశవాణి-మదరాసు కేంద్రంలో మంచి స్థాయి  కలిగిన కర్ణాటక శాస్త్రీయ సంగీత గాన కళాకారిణిగా పనిచేసేవారు. ఆ తరువాత వారి కార్యక్షేత్రం ఆకాశవాణి – లక్నో కేంద్రానికి బదిలీ అవ్వడం, లక్నో వారి జీవితాంతమూ, భర్తగారి స్వస్థలంకావడంవలన, సుశీలాజీ స్వస్థలమైపోవడమూ దైవసంకల్పంవల్ల జరిగిందని చెప్పాలి. లక్నో మహానగరం ప్రాచీన గాన, వాద్య సంగీతాలకి, “కథక్ ” వంటి నృత్యాలకి, ప్రత్యేక ఠుమ్రీ ప్రక్రియా స్వరూపప్రయోగానికి నిరుపమాన కేంద్రస్థానమై నిలిచివుంది.

“గీతం, వాద్యం, తథా నృత్యం, త్రయం సంగీత సంజ్ఞకమ్ “|

“గానం, వాద్యం, నృత్యం – ఈ మూడింటిని కలిపి సంగీతం అంటారు” అనే శాస్త్రవాక్యానికి “లక్నో ఘరానా” సంప్రదాయం లక్ష్యభూతంగా ఉంటుంది.

అటువంటి లక్నో మహానగర సంస్కృతి సుశీలాజీకి “మత్స్యానికి మందాకిని  పాయ“లాగ అమిరిపోయింది. ఆమె చిన్నతనంనుంచీ కలలు కంటున్న “హిందుస్థానీ” సంగీతం అని పిలవబడే ఉత్తరభారత సంగీతప్రపంచంలోని వివిధ గాయన-వాదన రీతులు, ప్రాంతీయ పద్ధతులు, ఘరానా సంప్రదాయాలు మొదలైన అనేక అంశాలని ఆకళింపుచేసుకోవడానికి అనువైన వాతావరణం లభించింది. లక్నోలో “భాత్ఖండే సంగీత కళాశాల“లో చేరి ఆమె ఉత్తరభారత సంగీతంలో పట్టభద్రులయ్యేరు. లక్నోలో తరతరాలుగా వస్తూన్న సత్సంప్రదాయాలు అన్నీ ఆమె ఊపిరిలో ఊపిరైపోయేయి. అక్కడి ఉర్దూకవిత్వ సున్నిత భావుకత-సునిశిత తాత్త్వికతలు, నాట్యరీతులు, సంగీతవైవిధ్యం, ఇతరులని ఆత్మీయంగా గౌరవించే మైత్రీభావం, సహజవినయవర్తనం, అభిరుచులన్నింటిలోను ఉత్తమ సంస్కార అభినివేశం, అందరినీ స్థాయీభేదం పరిగణించకుండా సమానంగా  ఆదరించడం, హాయిగా నిదానంగా నిర్వహించబడే నిత్యజీవనసరళి మొదలైన అనేక నాగరక అనుపమ జీవితశైలి-విధానాలు ఆమె ఆంతరికప్రపంచంలో అపురూపమైన నైజాలుగా సుస్థిరమైపోయేయి.

పండిత్ ఎస్ . ఎన్ . రతన్ ఝంకర్ , పండిత్ గోవిందనారాయణ నటు ల వద్ద  ఆమె శుశ్రూషచేసి సంగీత-నాట్యాలలో తగినంత పరిణతజ్ఞానాన్ని సముపార్జించేరు. లక్నోలోని సువిఖ్యాత వైద్యవరిష్ఠులైన డాక్టర్ శివశరణ మిశ్రా, M.D., F.R.C.P.,  F.A.M.S., గారిని ప్రేమవివాహం చేసుకున్నారు. ఆయన వైద్యవిద్యలో ఎంతగా ఆరితేరేరో, అంతగానూ సంగీత-సాహిత్య-నాట్యాదులలోకూడా ఉత్తమాభిరుచి కలిగినవారు. తల్లితండ్రులు, సోదరుడైన సత్యనాథ్ సుశీలాజీ బహుముఖ ప్రజ్ఞావంతురాలుగా వర్ధిల్లడానికి పెళ్ళికిముందు ఎంతగా ప్రోత్సహించేరో, అలాగే వివాహానంతరం, డా. మిశ్రాజీ భార్యకి అన్ని విధాలా బాసటగా నిలిచేరు. ఆ కారణంగానే ఆమె తమ ఉద్యోగధర్మంగా అనేకమహామహులైన వ్యక్తులని ఆకాశవాణి-దూరదర్శన్ ప్రతినిధిగా ఇంటర్వ్యూలు చేసేరు. ఆయా సందర్భాలలో తాను వ్రాయబోయే గ్రంథరచనకి అవసరమైన వివరాలని, విషయాలని కూడా  సేకరించుకుని, భద్రపరుచుకునేవారు.

లక్నో, ఆకాశవాణి కేంద్రంలో శాస్త్రీయసంగీతనిర్మాతగా అంటే Producer of  Classical Music గా పని చేసిన కాలంలో శాశ్వత చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన అనేక చిరస్మరణీయ కార్యక్రమాలని వారు నిర్మించి, ప్రసారంచేయించేరు. అదేవిధంగా భారతీయ దూరదర్శన కేంద్రంవారికికూడా కొన్ని భారతీయ సాంస్కృతిక విశిష్ట కార్యక్రమాలని వారు నిర్మించడం జరిగింది.

భారతీయ సంగీతకళాకారుల జీవితచరిత్రలు, నాట్యకళాకారుల జీవిత చరిత్రలు ప్రామాణికమైన గ్రంథరూపంలో భద్రపరచిన మొదటితరం  రచయితలు, రచయిత్రులు తరానికి చెందిన మహిమాన్విత గ్రంథకర్త్రి శ్రీమతి సుశీలామిశ్రాజీ అని వారు సుప్రసిద్ధిని చూరగొన్నారు. వారు రచించిన కొన్ని ప్రముఖగ్రంథాలు యివి:—

(1) Music Profiles.
(2) Great Masters of Hindustani Music (released by the then Prime Minister, Smt. Indira Gandhi).
(3) Music Makers of Bhatkhande College (released by the then Prime Minister, Sri Rajiv Gandhi).
(4) Invitation to Indian Dances.
(5) Some Immortals of Hindustani Music (released by Padmavibhushan Ustad Amjad Ali Khan).
(6) Musical Heritage of Lucknow (released by Padmavibushan  Ustad Amjad Ali Khan).
(7) Some Dancers of India (released by the then President, Sri Shankar Dayal Sharma at Rashtrapati Bhavan, New Delhi).
(8) Among Contemporary Musicians.
(9) Uroob’s prize-winning Malayalam novels are translated by her into English which were published by Kerala Sahitya Academy.
(10) She translated many prize-winning Malayalam short-stories into English for the International Short Story Competitions held by “The New York Herald Tribune”.

మన జాతీయ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలైన The Times of India, The Hindustan Times, The Hindu లతో కలిసి డా. సుశీలామిశ్రాజీ సాంస్కృతిక విశ్లేషకురాలుగాను, విమర్శకురాలిగాను పనిచేసేరు. సంగీత-నాట్య విషయాలమీద ఆమె వ్రాసిన మూడువేలు (3,000) కి పైగా వ్యాసాలు (Articles) ఆయా దినపత్రికలలో ప్రచురితమయ్యేయి.

డా. సుశీలామిశ్రా రచించిన “Invitation to Indian Dances” గ్రంథం గురించి విశ్వవిఖ్యాత నాట్యవిశారద శ్రీమతి మృణాళిని సారాభాయి ఇలాగ అన్నారు:—

“మీ అమూల్యగ్రంథానికి నా ధన్యవాదాలు! మీ గ్రంథం మన ప్రాచీన సంప్రదాయాలకి సజీవ సమగ్రనిధి. సనాతన భారతీయ కళా సంస్కృతీ మహానదీ ప్రవాహాలకి తమవంతు భాగధేయాలని సమర్పించుకున్న మహితాత్ములందరికి ఆరని నీరాజనాలని మీరు మీ రచనలో సమర్పించేరు. అనంత అమల ఆకాశ వితానంలో మా కళాకారుల జీవితాలు కదలిపోయేనీడలు, కరిగిపోయే క్షణిక దృశ్యాలూను! మీ రచన మా జీవితాలని మరుగున పడిపోకుండా భద్రపరిచి, మరింతకాలం కొనసాగిస్తుందని నా సవినయ ఆశ! మీ అమోఘ రచనలద్వారా, మేము చూడడానికి అవకాశంలేని భవిష్యత్కాలంలో జన్మించి, జీవించే కళాప్రియుల స్మరణరూపంలో మేము జీవించబోతున్నాం! కాలాతీత దిఙ్మండలంలో మా గానం మీ రచనద్వారా కొనసాగుతుంది”!

సుశీలామిశ్రాజీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సంగీత-నాటక అకాడమీకి ఉపాధ్యక్షురాలిగా రెండు తడవలు ఉన్నారు. “ఉత్తర-దక్షిణ సాంస్కృతిక సంస్థ“కి ఉపాధ్యక్షురాలిగా పనిచేసేరు. “భాత్ఖండే జయంతి ఉత్సవ సంఘం“కి అధ్యక్షురాలుగావున్నారు.

వారిని వరించిన కొన్ని ముఖ్యమైన ప్రశంసాత్మక బహుమతుల యివి:—
(1) “సంగీత లలితకళా అకాడమీ” కాన్పూరు వారి గౌరవ డాక్టరేట్ పట్టా ప్రదానం.
(2) ఉత్తరప్రదేశ్ సంగీత అకాడమీ సభ్యత్వ ప్రదాన గౌరవ పురస్కారం.
(3) “సుర్ సింగార్ సంసద్ ” బొంబాయివారి, “సారంగదేవ గౌరవసభ్యత్వం”.
(4) భాత్ఖండే వజ్రోత్సవ సందర్భంలో “సప్తస్వర బహుమతి” ప్రదానం.
(5) ఉత్తమ సాంస్కృతిక విమర్శకురాలిగా “ఆకర్షణ్ ” బహుమతి ప్రదానం.
(6) సంగీతరంగానికి చేయబడిన అపారసేవకి గుర్తింపుగా “సంస్కార భారతి” బహుమతి ప్రదానం.
(7) “స్వామి హరిదాస్ ” సమ్మాన బహుమానం.
(8) “ది అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ ” వారి సలహా శాఖ అయిన  “ది రిసెర్చ్ బోర్డ్ ఆఫ్ ఎడ్వైజర్స్ “లో గౌరవ సలహాదారుగా ఎంపిక పురస్కారం.


1998, ఏప్రిల్ , 8వ తేదీన డా. సుశీలామిశ్రా తమభౌతిక కాయాన్ని విడిచిపెట్టి దివంగతులయ్యేరు. వారి కుటుంబసభ్యులేకాక, భారతీయ సంగీత-నాట్య రసికవరలోకమంతా ఒక మహోన్నత సాంస్కృతికదివ్యమూర్తిని కోల్పోవడం వలన అపారవిషాదానికి లోనయ్యింది. అయితే సుశీలాజీ అద్భుత, రసమయ గ్రంథాలు ఎప్పటికీ రసజ్ఞుల రమణీయ సహవాసులుగా ఈ లోకంలో మిగిలే ఉన్నాయి, అలాగే ఎప్పటికీ ఉంటాయికూడాను. మన “శారదా సంతతి” లోని
మహనీయ శారదా తనయలు- తనయులు యొక్క జీవితరేఖాచిత్రణలకి డా. సుశీలామిశ్రాజీ వ్యాసాలు కొంతవరకు సహాయపడుతున్నాయి. ఆమెకి మనమంతా ఎంతగానో ఋణపడివున్నాం.

శ్రీమతి సుశీలా మిశ్రా మరియు డా. శివ శరణ మిశ్రా దంపతికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు శ్రీ రంజిత్ మిశ్రా. శ్రీమతి సుశీలామిశ్రాకి ముగ్గురు మనుమరాండ్రువున్నారు. సుహాసిని, షాలిని, స్వాతి వారి పేర్లు.

హర్మన్ పబ్లిషింగ్ హౌస్ – న్యూఢిల్లీ” పుస్తక ప్రచురణ సంస్థవారి యజమాని అయిన మన్జీత్ సింగ్జీ డా. శ్రీమతి సుశీలామిశ్రా గ్రంథాలని కొన్నింటిని ప్రచురించేరు. ఆయన, సుశీలాజీ గురించి, గౌరవయుతమైన తమ సాధువాదాలని ఈ విధంగా వ్యక్తపరిచి, సుశీలాజీ దేహపరిత్యాగానంతరం, తమ హార్దిక శ్రద్ధాంజలిని  ఘటించేరు:—

“శ్రీమతి సుశీలా మిశ్రా గారి పేరు, వారివ్యక్తిత్వమూ నా హృదయ తంత్రులని ఎల్లప్పుడూ స్పృశించేవి. మొదటిసారి “దూరవాణి” సంభాషణ ద్వారా నాకు వారి పరిచయభాగ్యం లభించింది. వారి శ్రావ్యకంఠధ్వని, విలక్షణ మాధుర్యంతోను, ఉత్తమ సంస్కారశోభతోను నన్ను వెనువెంటనే ఆకట్టుకుంది. అందువలన వారి గ్రంథం “Some Immortals of Hindustani Music” ని ప్రచురించడానికి వెంటనే అంగీకరించేను. అదేకాక మరిమూడు పుస్తకాలుకూడా ప్రచురించే సందర్భంలో వారితోకలిసి పనిచేసే మంచి అవకాశం నాకు కలిగింది. ౘాలాసార్లు పుస్తక ప్రచురణకోసం నేను లక్నోలోని వారి ఇంటికి వెళ్ళేవాడిని. వారి లక్నవీ ఉరుదూ ఉచ్చారణ (దక్షిణభారతదేశ కేరళీయకుటుంబానికి చెందినవారైనా) స్వచ్ఛంగాను, సుందరంగాను ఉండేది. వారి ఆతిథ్యం, పుస్తకరచనకి వారి అనన్య అంకితభావం మొదలైనవన్నీ ఉత్కృష్టస్థాయికి చెందినవి. – – — – – వారు దివంగతులు కావడంవలన సంగీతగ్రంథాల ప్రచురణలో ఉత్తేజం కలిగించే ఒక గొప్ప మూలస్థానాన్ని పోగొట్టుకోవడం సంభవించిందని నా భావన”!

సంగీత-నాట్య-సాహిత్యాది వివిధ సనాతన భారతీయ కళాశారదాంశా సంభూతురాలైన డా. సుశీలా మిశ్రాజీకి సాష్టాంగదండప్రణామం సమర్పించుకుందాం!

“నాట్య, సంగీత, సాహిత్య నవరసయుత
కళల భారతీయ విభవ గరిమ తెలుపు
ఘన సుశీల మిశ్ర మహా రచనలు చేయ,
శాశ్వత యశస్సు ప్రసరించె సర్వదిశల!”||

స్వస్తి||

You may also like...

2 Responses

  1. సి.యస్ says:

    శ్రీమతి సుశీలా మిశ్రా గురించి తెలుసుకోవడం
    ఇదే మొదటిసారి. సంగీతం నేర్చుకోవడం, కచేరీలు చెయ్యడం,
    పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం…..ఇవి చాలామంది
    సాధించిన/ సాధిస్తూన్న విజయాలు. చాలా గొప్పగొప్ప
    విద్వాంసులున్నారు.
    రేడియోలోనూ, సభల్లోనూ కచేరీలు చేయగల సామర్థ్యముండి,
    అటువంటి విద్వాంసులకు దక్కుతున్న మర్యాదలు తెలిసుండీ,
    శ్రీమతి సుశీలా మిశ్రా వాటిని వదిలిపెట్టి,
    ఆ రంగంలో కృషి చేస్తున్న ఇతర కళాకారులని
    పరిచయం చెయ్యడంలోనూ, వారిమీద వ్యాసాలూ, గ్రంథాలూ
    రాయడంలోనూ చూపించిన అభిరుచి, శ్రద్ధ అనన్య సామాన్యం.
    లక్నోలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోకూడా అంత కృషి
    చెయ్యడం, అక్కడి నృత్య సంప్రదాయాలపై ప్రామాణిక గ్రంథాలు
    రాయడం చూస్తే ఆశ్చర్యం కలిగించింది. అక్కడ ఉదాహరించిన
    పురస్కరాలన్నింటికీ ఆమె వల్ల గౌరవం లభించింది.

    శాస్త్ర సంగీత కారుల చరిత లేమి
    ఘనత గల నర్తకుల కీర్తి గాథ లేమి
    భద్రముగ సుశీలా మిశ్ర పదిల పరచి
    నిలిపె గదవారి ప్రతిష్ఠ నిఖిలముగను.

  2. శ్రీమతి సుశీలా మిశ్రా గారి సంగీత వైభవం గూర్చి మంచి సమాచారం అందించారు. వారి గూర్చి మీద్వారా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *