సాహిత్యము—సౌహిత్యము~65 : “సత్సంగ(తి)ము” లేక “సత్సాంగత్యము” లేక “సజ్జన సహవాసము”

ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః|
11—08—2018; శనివారము|

“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|

“సాహిత్యము—సౌహిత్యము ~ 65″| “సత్సంగ(తి)ము” లేక “సత్సాంగత్యము” లేక “సజ్జన సహవాసము”|

05—08—2018వ తేదీ ఆదివారం రోజున “ప్రపంచ మైత్రీ దినోత్సవం” (World Friendship Day as it’s popularly known in English) జరుపుకున్నాం!భారతీయ సంస్కృతిలో మైత్రికి ప్రత్యేకస్థానంవుంది. ఐతే, మిగిలిన అన్ని రంగాలలోను, వ్యాసంగాలలోను లాగే మైత్రి విషయంలో కూడా మన సనాతన సంస్కృతిలో కేవలం లౌకిక ప్రమేయానికి, ప్రాపంచిక వ్యవహార పరిధికి మాత్రమే మానవమైత్రీభావం పరిమితమై ఉండదు. అదికూడా ఇహ-పర సాధకమైన మానవీయ వ్యవహారంగా ధర్మప్రతిపత్తిని కలిగివుంటుంది.

పండితైః సహ మిత్రతాం” అని “ఆర్యధర్మం” బోధిస్తోంది. “పండతే జానాతి పండితః” అని అర్థం. అంటే “ఎరుక కలిగినవాడు లేక తెలిసినవాడు” అని తెలుగులో చెప్పవచ్చు. “పండా ధీః అస్య సంజాతా వా పండితః” అనికూడా అర్థం. “పండ అంటే ‘ధీశక్తి’, అంటే ధ్యానస్వభావం లేక చింతనశీలం కలిగిన బుధ్ధిని కలిగినవాడు” అనికూడా ‘పండితుడు’ అనే మాటకి అర్థంచెప్పవచ్చు. అటువంటివాడితో చేసే చెలిమిని మన ధర్మశాస్త్రాలు శ్లాఘిస్తున్నాయి. అందుకే మన పెద్దలు ఇలాగ మన జీవనయానానికి దిశానిర్దేశం చేసేరు:—

“అసారే ఖలు సంసారే సారం ఏతత్ చతుష్టయమ్ |
కాశ్యాం వాసః, సతాం సంగః, గంగాంభః, శంభుసేవనమ్ “||

“సారహీనమైన సంసారంలో సారవంతమైనవి నాలుగున్నాయి. పరమపుణ్యమయ కాశీక్షేత్రనివాసం, సజ్జన సహవాసం, గంగాజలస్నాన-పానాదులు, శంకర కైంకర్యం అనేవే ఆ నాలుగూనూ! అంతకిమించి ఇహ-పర సాధకమైనవి మరేమీలేవు”.

మన ప్రాచీన సారస్వతంలో సన్మైత్రిని “సత్సంగము” లేక “సత్సాంగత్యము” లేక “సజ్జన సహవాసము” అని మన పూర్వులు వ్యవహరించేవారు. దీనినే “సత్సంగతి” అని కూడా అనవచ్చు. ఈ “సత్సంగతి”యొక్క వైశిష్ట్యాన్ని విశదంచేసే ఒక మహనీయశ్లోకాన్ని మన పెద్దలు మనకి ఆప్యాయంగా అందించేరు. అది ఇది:—

“గంగేవాఘవినాశినీ జనమనస్సంతోషవత్ చంద్రికా|

తీక్ష్ణాంశోః అపి సత్ ప్రభేవ జగదజ్ఞానాంధకారాపహా |

ఛాయేవాఖిల తాపనాశనకరీ స్వర్ధేనువత్ కామదా |

పుణ్యైః ఏవ హి లభ్యతే సుకృతిభిః సత్సంగతిః దుర్లభా”||

“సజ్జనులతో మైత్రి కలగడం ౘాలా కష్టసాధ్యమనే అనాలి. సత్సంగతి గంగానదిలాగ పాపాలనన్నీ నిర్మూలిస్తుంది. వెన్నెలవలె ౘల్లనివెలుగులని వెదౙల్లుతూ అందరి మనస్సులకి ప్రసన్నమైన ప్రమోదాన్ని పంచుతుంది. తిరుగులేని తేజస్సుతో  తిమిరజాలాన్ని తరిమికొట్టే తీక్ష్ణ సూర్యకాంతిలాగ అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. ఎండవేడిమినుండి కాపాడే శీతల వృక్షచ్ఛాయవలె జీవతాపాన్ని ఉపశమింపజేస్తుంది. కామధేనువులాగ సాత్త్వికతని కలిగించి సత్త్వగుణమయమైన కోరికలని ఈడేరుస్తుంది. ఇంతటి మహామహిమాన్విత సత్సంగతి అపూర్వసుకృతం కలిగిన పుణ్యమయ మహితాత్ములకే లభ్యం ఔతుంది”.

భక్తిరసదర్శనశాస్త్రం” అయిన “శ్రీమద్భాగవతమహాపురాణమ్ “, కలియుగ అధ్యాత్మవిద్యాసాధకులందరికి పరమప్రమాణగ్రంథరాజమై విలసిల్లుతోంది. దానిలోని, ఏకాదశస్కంధంలోని, 12వ అధ్యాయం అంతా శ్రీకృష్ణభగవానులుఉద్ధవస్వామికిసత్సంగ మహిమ“ని బోధపరచడానికే కేటాయించేరు. దానిలో మొదటి రెండు శ్లోకాలు ఇవి:—

“న రోధయతి మాం యోగః, న సాంఖ్యం, ధర్మ ఏవ చ|
న స్వాధ్యాయః, తపః, త్యాగః, నేష్టాపూర్తం, న దక్షిణా ||

“వ్రతాని, యజ్ఞః, ఛందాంసి, తీర్థాని, నియమాః, యమాః|
యథాsవరుంధే సత్సంగః సర్వసంగాపహో హి మామ్ “||

” (శ్రీకృష్ణభగవానులు, ఉద్ధవులవారితో అంటున్నారు.) అన్ని రకాలైన దైహిక, మానసిక, వాచక సాంగత్యదోషాలన్నీ నిర్మూలింపచెయ్యడానికి సత్సంగము సర్వసమర్థమైనది. ఆ సత్సంగమహిమ వలననే నేను అధ్యాత్మవిద్యాసాధకులకి సంపూర్ణంగా వశమౌతాను.

ఇతరమార్గాలైన యోగం, సాంఖ్యం, ధర్మపాలనం, వేదాధ్యయనం, తపస్సు, సంన్యాసము, శాస్త్రవిహిత వ్యక్తిగతకర్మానుష్ఠానం-సామాజికశ్రేయోదాయక  కర్మానుష్ఠానం, దానదీక్షా ఆచరణం, వ్రతాచరణం, యజ్ఞకర్మాచరణం, మంత్రోపాసన, తీర్థసేవనం, బాహ్యనియమాచరణ, మానసికనియంత్రణ అనేవాటికి నేను అంత సులభంగాను, అంత సంపూర్ణంగాను వశుడను కాను”.

అంటే, “సత్సంగంద్వారా నేను సంపూర్ణంగా సులభ సాధ్యుడిని. ఇతర మార్గాల ద్వారా కష్టసాధ్యుడిని” అని స్వయంగా భగవానుడే భక్తుడికి భాగవతంలో చెప్పిన మాటలివి. ఆ సందర్భంలోనే వృత్ర, ప్రహ్లాద, బలి, విభీషణ, గజేంద్రాదుల గురించి ప్రస్తావిస్తూ, శ్రీకృష్ణుభగవానుడు, “వారెవ్వరూ వేదాధ్యయనం, వ్రతం, తపస్సు మొదలైనవేవీ చేయనేలేదు. కాని సత్సంగమహిమవలన నన్ను  పొందేరు(“అవ్రతాతప్త తపసః, సత్సంగాత్ మాం ఉపాగతాః”||)” అని సత్సంగ గౌరవాన్ని స్పష్టపరచి, పరిపుష్టం చేసేరు.

కవిత్రయవిరచిత “ఆంధ్రమహాభారతము” లోని నన్నయప్రణీత ఆరణ్యపర్వం (III : 347)లో,

“ధర్మాధర్మ విభాగంబు లెరుంగు విద్వాంసుల నుపాసించి శుభాచారుండవు గావలయు”

అనే బోధ ఉంది.

తిక్కనగారు సందర్భశుద్ధితో చేసిన “సత్సంగం” బోధ యిది:—

“పరమ జ్ఞానుల యొద్దను,
పరగిన అజ్ఞుడును బోధ భరితుడగు, నిరం
తర మేరు సమీపస్థితి,
హిరణ్యరుచి కాకమె సకమెసగిన పగిదిన్ “||
(ఆంధ్ర మహా భారతం – ఆనుశాసనికపర్వం – III : 325)

“(భ్రమర కీట న్యాయంలో వలె) సర్వదా సువర్ణపర్వతమైన మేరునగసమీపంలోనే ఉండడం వలన కాకి కూడా అపరంజి రంగుతో ధగధగలాడినట్లు, సంపూర్ణజ్ఞాన వంతుల సాంగత్యం పొందడంవలన అజ్ఞానికూడా ఆ జ్ఞానబోధని గ్రహించుకుని జ్ఞానమయశోభితుడౌతాడు”.

“సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతి కారణంబు – – -” 
(పోతన-భాగవతం-III-831)

“సాధు జనులతోడి సంసర్గ ముడిగిన,
హాని, భయము, క్లేశ మావహిల్లు
ఎంత వారికైన ఇది నిక్కము – – -“
(రామకృష్ణుడు-పాండురంగ మాహాత్మ్యము-II:184)

“సజ్జనుల గోష్ఠి యిహపర సాధనంబు”
(పింగళి సూరన-కళాపూర్ణోదయము-IV : 171)

“వింతైన జనులతో వినోదము నిష్ఫలము
చెంత సజ్జనసంగతి చేరిన ఆదాయము” (అన్నమయ్య)

“క్షితిలో సత్సంగతి సౌఖ్యము” (త్యాగరాజు)

Dr. Samuel Johnson, తాము రచించిన, “Friendship: An Ode” అనే కవితాఖండికలో ఇలాగ అన్నారు:—

“Friendship, peculiar boon of Heav’n,
The noble mind’s delight and pride,
To men and angels only giv’n,
To all the lower world denied.”

“ధర, విశిష్ట గుణము మైత్రి, దైవ వరము,
ఉన్నతోదారహృదయుల ఉత్తమాంశ,
దేవ, మానవ వరులకె దేవుడొసగె,
హీన జన్ములకది అతడీయలేదు!”
(స్వకీయ స్వేచ్ఛానువాదం).

Friendship is one mind in two bodies” అన్నాడు, Aristotle.

పరమపుణ్యమయము, అత్యంతపూజ్యము అయిన సత్సంగమంటే  ఏమిటో భర్తృహరిమహాకవి తమ “సుభాషిత త్రిశతి”లో మనకి  స్పష్టంగా తెలియచెప్పేరు.

మానవులమైన మనందరమూ మరణకాలంలో ఎటువంటి చిట్టచివరి వీడ్కోలు పలుకుతూ మన పాంచభౌతిక దేహాలని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలో బోధపరిచే ఏకైక పరమాద్భుత శ్లోకం రచించి, తన గ్రంథానికి అంతిమశ్లోకంగా దానిని అలంకరించి, మనందరికి అపరిమిత వాత్సల్యభావంతో అందించేరు:—

“మాతః మేదిని! తాత మారుత! సఖే తేజః! సుబన్ధో జల!

భ్రాతః వ్యోమ! నిబద్ధ ఏష భవతామన్త్యః ప్రణామాంజలిః|

యుష్మత్ సంగవశోపజాత సుకృత స్ఫారస్ఫురత్ నిర్మల

జ్ఞానాపాస్త సమస్త మోహ మహిమా లీయే పరబ్రహ్మణి”||

“ఓ నా భూమాతా! ఓ నా వాయుదేవపితా! ఓ నా అగ్నిదేవ మిత్రమా!  ఓ నా జలదేవ బంధూ! ఓ నా వ్యోమదేవ సహోదరా! మీ అందరికీ ఇదే  నా చిట్టచివరి కైమోడ్పు సమర్పించుకుంటున్నాను.

పూర్వజన్మకృత కర్మఫలరూపమైన అవిద్యాదోషజనితమగు నా అజ్ఞానమంతా మీ అందరి పరమపుణ్యమయ సాంగత్యమహిమవలన పూర్తిగా నశించగా, అఖండదివ్యజ్ఞానోదయమునుపొంది, అందువలన పరబ్రహ్మమందు  విలీనమైపోవుచున్నాను”

————————————————————————————

మన చిరకాల ఆత్మీయమిత్రులు డా. మల్లెల దక్షిణామూర్తివర్యులు, “సాహిత్యము—సౌహిత్యము” శీర్షికలోని, “సౌహిత్యము” అనే పదం గురించి కొంచెం వివరించమన్నారు. సౌహిత్యశబ్దానికి “సత్సాంగత్యం”లోని “సాంగత్యం” అని కూడా అర్థం చెప్పవచ్చు. “సహితస్య భావః సౌహిత్యమ్ ” అని చెప్పవచ్చు. Apte తమ నిఘంటువులో ఇతర అర్థాలతోబాటు, “friendliness” అనే అర్థాన్నికూడా చెప్పేరు. Monier-Williams, తమ నిఘంటువులో “amiableness” అనే అర్థంకూడా ఇచ్చేరు. అంటే, “స్నేహపూర్వకమైన లేక సౌహార్దపూర్వకమైన భావం” అని వివరించవచ్చు.

స్వస్తి||

You may also like...

3 Responses

  1. వాసుదేవరావు says:

    చాలా బాగుంది- సత్సాంగత్యం – స్నేహామృతం వాసుదేవరావు

  2. సి.యస్ says:

    పెద్దలు చెప్పినట్టు పుట్టుక మన చేతిలో లేదు.
    తల్లిదడ్రుల ఎంపిక మన చేతిలో లేదు. కానీ
    స్నేహితుల ఎంపిక మన చేతిలోనే ఉంది. కాబట్టి ,
    సజ్జనులను మిత్రులుగా చేసుకోవాలి. వారి ప్రభావం
    జీవితంమీద తప్పకుండా పడుతుంది. సజ్జన సాంగత్యం వల్ల
    జీవితాలని చక్కటి మార్గంలో పెట్టుకున్నవారు అనేకమంది.
    అలాగే దుర్జన సాంగత్యం వల్ల నాశనమైన మంచివాళ్లూ
    ఉంటారు.
    స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ వ్యాసం రాయడం
    సమయానుగుణంగా ఉంది. కాకపోతే ఇప్పటి తరం ‘ ఫ్రెండ్షిప్ డే’
    అంటే బారుకెళ్ళి బీరు తాగడం అనుకుంటున్నారు.
    అలాకాకుండా మన సంప్రదాయంలో మైత్రి గురించి మహామహులు
    ఎలా చెప్పారో సోదాహరణంగా వివరించడం చాలా బాగుంది.

    సాధు గుణము లబ్బు సత్సంగము వలన
    బ్రతుకు నడుచు దారి బాగు పడును.
    మంచి చెలుల మించిమరిలేదు భాగ్యంబు
    బుధుల పలుకు లెపుడు మధుర తరము.

  3. సత్సంగంలో ఉన్న మధురిమను నిన్న ఆస్వాదించాను. విశాఖపట్నంలోని శ్రీ కనకరాజు గారు (అడ్వకేట్) ఓసందర్భంలో మాట్లాడుతూ.. నా కుడబ్బు ప్రధానంకాదు.. మీ లాంటి పెద్దల సాంగత్యం ముఖ్యం… కాకినాడ శ్రీకృష్ణారావు గారు అంటే ఎంత గౌరవమో మీరన్నా అంతేగౌరవం అన్నారు. ఓమంచి వ్యక్తితో సాంగత్యం చేస్తే సమాజంలో ఎలాంటి గౌరవం లభిస్తుందో అర్ధమయ్యింది. అదిఅనుభవిస్తేగాని అర్ధంకాదు. సత్సంగులందరూ.. సంతత అభినందనీయులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *