శారదా సంతతి ~ 54 : కర్ణాటకసంగీత గానకళా విశారదుడు ~ ప్రొఫెసర్ జాన్ . బి. హిగిన్స్ భాగవతర్ “| (Prof. Jon Borthwick Higgins Bhagavatar )

ఐంశ్రీశారదాపరదేవతాయై నమో నమః|
05—08—2018; ఆదిత్యవాసరము|

“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|

“శారదా సంతతి ~ 54″| “కర్ణాటకసంగీత గానకళా విశారదుడు ~ ప్రొఫెసర్ జాన్ . బి. హిగిన్స్ భాగవతర్ “| (Prof. Jon Borthwick Higgins Bhagavatar : 18—09—1939 నుండి 07—12—1984)|

మా కుటుంబాలలో పరంపరగా సంగీత, సాహిత్య రంగాలలో పేరెన్నికగన్న కళాకారులు ఉండడమేకాక, సంగీతప్రియులు ౘాలామందివుండడం మా సౌభాగ్యంగా భావిస్తాము. మా మాతామహులు శ్రీ బాలాంత్రపు వెంకట కృష్ణారావుగారు, మా పితామహులు శ్రీ అద్దంకి సుబ్బారావుగారు ఉభయులూ మహాసంగీతప్రియులు. సుప్రసిద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయనీ, గాయకులు అరియక్కుడి, చెంబై, మదురై మణిఅయ్యరు, జి.ఎన్ .బి., డి.కె.పట్టమ్మాళ్ , ఎం.ఎస్ . సుబ్బులక్ష్మి, ఎం.ఎల్ . వసంతకుమారి, బాలమురళి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యరు, ముడికొండాన్ వెంకట్రామయ్యరు, శఠగోపన్ , తురైయూరు రాజగోపాల అయ్యరు, చిత్తూరు సుబ్రహ్మణ్యపిళ్ళై, ఓలేటి వెంకటేశ్వర్లు మొదలైన అనేక మహాకళాకారుల గానం మా పితామహులు, శ్రీ సుబ్బారావుగారు, మా పినతండ్రి శ్రీ అద్దంకి వెంకటరమణారావుగారు ఆకాశవాణి సంగీతకార్యక్రమాలద్వారా విని ఆనందించేవారు. మదరాసు-ఎ  కేంద్రంవారు ప్రతిరోజు ఉదయం గం.07-00ల నుండి 07-15 వరకు ప్రసారం చేసే “ఇశై అముదం” (సంగీతామృతం) అనే కార్యక్రమాన్ని మా తాతగారు విడవకుండా వినేవారు.

ఆ కార్యక్రమంలో, పైన ఉదహరించబడిన మహాగాయనీగాయకులలో ఒక  అత్యద్భుతగాయకుడి గానం విని మా తాతగారు పరవశించిపోయేవారు. ఆ గాయకుడి పేరే జాన్ . బి. హిగిన్స్ భాగవతర్ . మా తాతగారు హిగిన్స్ గారి గానానికి ముగ్ధులైపోయి వారి అభిమాని(a fan of Prof. Jon B. Higgins) ఐపోయేరు. అలాగ దేశవ్యాప్తంగాను, ప్రపంచవ్యాప్తంగాను హిగిన్సుజీకి ఎందరెందరు అభిమానులున్నారో మన ఊహకి అంతుపట్టని విషయం.  ఆయన పాడిన త్యాగరాజకృతులు, దీక్షితులవారి కృతులు మొదలైన భారతీయ భాషలలోని వివిధకృతులని ఆయన ౘక్కని ఉచ్చారణతో, రాగభావంతో, తాళప్రమాణబద్ధంగా కర్ణాటకసంగీతపద్ధతిలోని అందమైన గమకాలతో, లయభావంతో పాడేవారు. సంస్కృతం, తెలుగు, తమిళం వంటి మన భాషలలోని కృతులని ఆయాభాషలు ఆయన మాతృభాషలేమోననిపించే తరహాలో ఆయన పాడేవారు. ఉదాహరణకి ఘనరాగపంచరత్నకృతులలో ఒకటైన శ్రీరాగంలోని “ఎందరో మహానుభావులు” అనే సంస్కృతసమాసాలతో నిండిన ౘాలా పెద్ద తెలుగు కృతిని ఆయన ఎంత మంచిపలుకుబడితో, ఎంత మనోహర సాహిత్యభావపుష్టితో, ఎంత రమ్యసంగీతభావబంధురంగా గానం చేసేరో వింటి సంగీతప్రియులందరూ ముగ్ధులైపోతారు. మళ్ళీ-మళ్ళీ ఆయన పాడిన ఆ కృతిని వినాలనే ఎడతెగని కుతూహలం మనలో నిండిపోతుంది.

© = © = © = © = © = © =

అది కర్ణాటకరాష్ట్రంలోని ఉడిపి శ్రీకృష్ణక్షేత్రం. జాన్ హిగిన్సుభాగవతరుగారు, వారికి వాయులీనవాద్యసహకారం అందించే వి. త్యాగరాజనుగారు, మృదంగ సహకారమిచ్చే టి. రంగనాథనుగారు, కంజీరా వాయించే వి. నాగరాజనుగారు ఇతర సంగీతమిత్రులు కలిసి దక్షిణభారత సంప్రదాయశుద్ధమైన పట్టు ధోవతులు, ఉత్తరీయాలు ధరించి, నుదుట విభూతి, కుంకుమబొట్టులని పెట్టుకుని, దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించేరు. సంగీతం గురించి, ఆ క్షేత్ర ప్రశస్తిగురించి భక్తిభావంతో మాట్లాడుకుంటూ ప్రధాన ఆలయం ముందుకి వారందరు వెళ్ళబోయేరు. ఆలయ అర్చకవర్గం హిగిన్సుజీని విదేశీయునిగా గమనించి ఆలయ దర్శనానికి ఆయనని అనుమతించలేదు. దానితో మిగిలిన మిత్రబృందంవారుకూడా ముందుకి వెళ్ళకుండా హిగిన్సుగారిని పురందరదాసులవారి యమన్ కల్యాణి రాగంలోని కన్నడకృతి “కృష్ణా! నీ బేగనే బారో!” పాడమని అభ్యర్థించేరు. పరిపూర్ణభక్తితో ఆయన రసమయంగా పాడడం ప్రారంభించగానే దైవదర్శనానికి వచ్చిన భక్తులందరు ఆయనచుట్టూచేరి ఆ పాటని వింటూ తన్మయులైపోయేరు.  అర్చకులందరూ అత్యాశ్చర్యంతో ఆయనముందుకి వచ్చి, ఆయనని గౌరవాదరాలతో ఆహ్వానించి, దైవదర్శనానంతరం వారికి శ్రీకృష్ణులవారి తీర్థ-ప్రసాదాలని అందించి ఆనందించేరు.

@ # @ # @ # @ # @ # @ #

అది 1962వ సంవత్సరం. అమెరికా సంయుక్తరాష్ట్రాలలోని, మసాచుసెట్సులోని, Leeలో, Ted Shawn’s వారి సుప్రసిద్ధమైన “Jacob’s Pillow Music and Dance Festival” జరుగుతోంది. ఆ ఉత్సవంలో భాగంగా భరతనాట్యమహారాజ్ఞి శ్రీమతి టి. బాలసరస్వతిగారు స్వయంగా పాడుతూ నాట్యప్రదర్శన కార్యక్రమం చేసేరు. ఆ సభలో నాట్యాన్ని, నాట్యగానాన్ని, ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్న రాగ-తాళవాద్యనిర్వహణని సమగ్రంగాను, సరసమనోజ్ఞభావంతోను ఇరవైమూడు సంవత్సరాల వయస్సువున్న యువకుడైన జాన్ హిగిన్స్ చూస్తూ వినడం జరిగింది. జాన్ హిగిన్సు మంత్రముగ్ధుడైపోయి ఆ ప్రదర్శనని తిలకించి, ఆ నాట్యసంగీత వైభవానికి పరవశించిపోయి, ఇలాగ అన్నాడు:—

“ఆ గొప్ప నాట్యప్రదర్శనకి అంగభూతమై, నాట్యానికి సహకారంగా ఆ సంమోహనకరమైన సంగీతం లేదు. ఆ మాధుర్యమహిమాన్వితమైన అద్భుతసంగీత తరంగిణి నుంచి అపురూపమైన ఆ నాట్యవిన్యాసం ఆవిర్భవించింది”.

ఈ అపూర్వ అలౌకిక అనుభవమే జాన్ బి. హిగిన్స్ ని, జాన్ హిగిన్సుభాగవతర్ గా తీర్చిదిద్దింది.

— # — # — # — # — # — #

18—3—1939వ తేదీన U.S.A.లోని Massachussetsలో గల Andover అనే ఊరిలో జాన్ బి. హిగిన్స్ (Jon B. Higgins) జన్మించేరు. స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించేరు. అదే పాఠశాలలో ఆయన తండ్రిగారు నలభై సంవత్సరాలు ఆంగ్లభాషని బోధించేరు. వారి తల్లిగారు పియానో వాద్యవిద్యని అదే పాఠశాలలో బోధిస్తూ, అక్కడ సంగీతసభలలో పియానో వాద్యసహకారాన్ని అందించేవారు.

అక్కడ విద్య పూర్తికాగానే, Middletownలోని, Wesleyan Universityలో, సంగీతం-చరిత్ర ప్రధానవిషయాలుగా 1962లో B.A. పట్టా తీసుకున్నారు. అక్కడే 1964లో M.A. సంగీతం పూర్తిచేసి, 1973లో Ethnomusicologyలో అంటే, విభిన్నజాతులలోని వివిధసంగీతరీతులు, అనే విషయం ప్రధాన పరిశోధనాంశంగా తీసుకుని, దానిలో Ph.D. పట్టాని పొందేరు. అదే విశ్వవిద్యాలయంలో, 1976లో, ఆయన Director of the Centre of Arts గాను, ఆ విశ్వవిద్యాలయ సంగీతవిభాగంలో ప్రాచార్యులు అంటే Professor గాను పదవులని నిర్వహించేరు. 1971—1978 మధ్యకాలంలో, ఆయన  కెనడాలోని, టోరెంటోలోగల, యార్క్ విశ్వవిద్యాలయంలోకూడా Professor of Music మరియు Associate Dean of Fine Artsగా పదవీబాధ్యతలని నిర్వహించేరు.

ఆయన ఎం.ఏ. (సంగీతం) ౘదివేరోజులలో, డా.॥ రాబర్ట్ బ్రౌన్ మార్గదర్శకత్వంలో,  వివిధజాతీయ సంగీతశాస్త్ర అధ్యయనం చేసే సందర్భంలో మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంగురించిన పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో ఆయన కర్ణాటక గాత్ర సంగీతం, వీణావాదనం రెండూ అభ్యసించేరు. అప్పుడే ఆయనకి మన సంగీతం మీద గొప్ప మక్కువ ఏర్పడింది. డా. బ్రౌన్ “సంగీతాధ్యయన బృందం“లో వారు ఒకరు. ఆ సమయంలోనే వారు మన అభ్యాససంగీత ప్రణాళికలోని అంశాలైన సరళీస్వరాలు, జంటస్వరాలు, దాటుస్వరాలు, గీతాలు, స్వరజతులు, వర్ణాలు మొదలైనవాటినన్నీ కూలంకషంగా నేర్చుకున్నారు. ఇవన్నీ ఆయన బాలసరస్వతి గారి సోదరులైన టి.విశ్వనాథన్జీ డా. బ్రౌన్ గారి అధ్యయనకేంద్రంకోసం టేపులమీద రికార్డుచేసి ఇచ్చిన పాఠాలని క్రమం తప్పక విని నేర్చుకున్నారు. విశ్వనాథనుగారు గొప్ప వేణువాదనవిద్వాంసులు. ఆయన “సొళ్కట్టులు అంటే తాళశాస్త్ర సంబంధమైన జతులు“, మృదంగవాద్యవిద్య విశ్వనాథనుగారి సోదరుడైన టి. రంగనాథన్జీ వద్ద నేర్చుకున్నారు. ఇంతవరకు వచ్చాక ఆయన కర్ణాటక శాస్త్రీయ సంగీతాభ్యాస తపస్సు మరింత దృఢతరమై, మరింత గాఢతరమైపోయింది. అందువలన ఆయన విశ్వనాథనుగారి వద్దకువెళ్ళి సంప్రదాయపద్ధతిలో తనని శిష్యునిగా స్వీకరించి, సంపూర్ణశాస్త్రీయగాయకునిగా తనని దిద్దితీర్చవలసినదిగా అభ్యర్థించేరు. ఆ సందర్భంలో ఆయన తమ కాబోయే గురువర్యులతో ఇలాగ అన్నారు:—

” అయ్యా! కర్ణాటక శాస్త్రీయ సంగీతం నాకు పూర్తిగా అపరిచితమైన వేరే  ప్రాచీన సంప్రదాయానికి చెందిన సంగీతశైలితో కూడుకొనివున్నది. అయినా నేను నా శక్తి-యుక్తులనన్నీ కూడగట్టుకుని, అంకితభావంతో తపస్సుచేసి ఆ సంగీతరీతిని జీర్ణించుకుని నా స్వంతం చేసుకోగలననుకుంటున్నాను”.

ఆ మాటలువిని విశ్వనాథనుగారు హిగిన్సుగారికివున్న అంకితభావం అర్థం చేసుకున్నారు. 1964లో ఆయనకి Fullbright స్కాలర్ షిప్ తొమ్మిదినెలల కాలవ్యవధికి మంజూరుచేయబడింది. ఆయన చెన్నైలోని బాలసరస్వతి కుటుంబసభ్యులవద్దనుంచి వారి గానసంప్రదాయాన్ని నేర్చుకుని, సంగీతసభలలో ఆ సంగీతాన్నే గానంచెయ్యాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే చెన్నై చేరేరు. అప్పటికి విశ్వనాథనుగారు మదరాసు విశ్వవిద్యాలయంలో సంగీతశాఖాధిపతిగా ఉన్నారు. విశ్వనాథనుగారు హిగిన్సుగారి అధ్యయనానికి అనువైన సంగీతగాన ప్రణాళికని సిద్ధంచేసుకున్నారు. ఆచార్యులవారు శిష్యుడికి కేవల సంగీతజ్ఞానమైన ఆలాపాది మనోధర్మసంగీతం నేర్పడంతోబాటు, సంగీతకృతుల అభ్యాసానికి  అత్యావశ్యకమైన తెలుగు-తమిళం భాషల పరిజ్ఞానాన్నికూడా అధ్యయనం చేయించడంలో తగిన శ్రద్ధని తీసుకున్నారు. ఆ భాషలని నేర్చుకోవడంలో హిగిన్సుజీ కనపరచిన శ్రద్ధ అపరిమిత ఆశ్చర్యజనకంగాను, అత్యంత అభినందనీయంగాను ఉంటుంది. స్థానికగాయకులుకూడా పొరబాటుగా పలికే శబ్దాలని వారు దోషరహితంగా ఉచ్చరించేవారు. ఆయన పలుకుబడి మన గాయకులకి ఆదర్శప్రాయంగివుండేది.

ఆయన అద్భుతమైన విద్యాభ్యాసపురోగతికి సంతసించిన అమెరికా వారి తగిన అధికారులు “ఫుల్ బ్రైట్ ” స్కాలర్ షిప్ ని, మరొక 33 నెలలకి పొడిగించేరు. ఆ సమయంలో తిరువైయారులోని త్యాగరాజస్వామివారి మహాసమాధి ఆలయం వద్ద ప్రతిసంవత్సరం జరిగే “శ్రీత్యాగరాజ సంగీత ఆరాధనోత్సవాలు” జరిగేయి. ఆ సందర్భంలో ఆ సభానిర్వహణచేస్తున్న కార్యకర్తలతో విశ్వనాథనుగారు  సంప్రదించి హిగిన్సుగారికి ప్రధానసమయంలో పాటకచ్చేరీలో పాల్గొనే అవకాశం కల్పించేరు. శ్రీత్యాగరాజస్వామివారి కృతులని రసరమ్యంగా భావనచేసి పాడి హిగిన్సుజీ స్వామివారి అనుగ్రహానికి పాత్రులై, ఆశీస్సులనిపొంది విశ్వవిఖ్యాతిని ఆర్జించాలని ఆచార్యులవారికి శిష్యవాత్సల్యం కలిగింది. శారదాదేవి అనుగ్రహంతో హిగిన్సుగారు అత్యద్భుతమైన ఆదర్శ పురుష కంఠనాదంతో అజరామర  యశస్సుని సంపాదించిపెట్టిన పాటకచ్చేరీచేసేరు. పామరులనుంచి పండితులవరకు అందరూ ఆ రసప్లావితగానమాధుర్యానికి మహాముగ్ధులైపోయేరు.

1966 చివరభాగంలో విశ్వనాథనుగారు, తమ అధ్యాపకబాధ్యతలని నిర్వహించడానికి అమెరికా వెళ్ళవలసివచ్చింది. ఆ సమయంలో హిగిన్సుగారికి సంగీతశిక్షణని కొనసాగించడానికి రామ్నాడ్ కృష్ణన్ గారిని విశ్వనాథనుగారు నియమించేరు. వారందరూ కర్ణాటకసంగీతంలోగల ఒక ప్రముఖసంప్రదాయమైన వీణ ధనమ్మాళ్ బాణీకి చెందినవారు. హిగిన్సుగారి గానం కూడా అదే బాణీని అనుసరించివుంటుంది.

ఆ తరువాత ఆచార్య-శిష్యులు ఇరువురూ పరస్పర సహాయ-సహకారాలతో, విశ్వనాథనుగారు పాశ్చాత్యసంగీతంలోను, హిగిన్సుగారు దక్షిణభారతసంగీతం లోను సిద్ధాంతవ్యాసాలని విశ్వవిద్యాలయానికి సమర్పించి, ఇద్దరూ పిహెచ్ . డి., పట్టాలనిపొందేరు.

1967 అక్టోబరునెలలో Higginsగారు Rheaగారిని వివాహంచేసుకున్నారు. వారికి ముగ్గురు కొడుకులు.

ఆయన 1964—1967 లలో చెన్నైలోవున్నప్పుడు రెండు HMV LPలకోసం గానంచేసేరు. వాటిలోనే, శ్రీ రాగంలోని “ఎందరోమహానుభావులు“, భైరవి రాగంలో “విరిబోణి” వర్ణం, ఆభోగిరాగంలోని “ఎవ్వరీబోధన“వర్ణం, పంతువరాళి లేక  కామవర్థిని రాగంలోని “శివ శివ శివ యనరాదా“, ఆనందభైరవి రాగంలో  “త్యాగరాజయోగ వైభవం” మొదలైన ౘక్కని కృతులని అనితరసాధ్యంగా పాడి, అజరామరమైన కీర్తిని గడించేరు.

ప్రపంచవ్యాప్త సంగీతప్రియుల దురదృష్టంవలన జాన్ బి. హిగిన్స్ గారు, 07—12—1984న వారి ఇంటివద్ద నడుస్తుండగా మద్యపానమత్తుడైన ఒక డ్రైవరు నిర్లక్ష్యంవల్ల ట్రక్ ప్రమాదంలో స్వర్గస్థులయ్యేరు.

వారికి పాదాభివందనం సమర్పించుకుని, మన శ్రద్ధాంజలిని తెలియపరచుకుందాం.

స్వస్తి||

You may also like...

8 Responses

  1. విశ్వ సంగీత ప్రియులకు ఆరాధ్యులు హిగిన్సుకు స్మృత్యంజలి.

  2. sampathkumar says:

    Great artist gurinchi great article guruvugaru.

  3. Ramarao says:

    Chaala vishayalu telisaayi.

  4. v.v.krishnarao says:

    జాను హిగ్గిన్సు వర్యుల గానకళకి,
    మానవాళి అంతయు పూర్ణమనము తోడ,
    వేనవేలగు వందన విధులు చేసి,
    స్థానమర్పించె హృదయాల శాశ్వతముగ!

  5. సి.యస్ says:

    రామచంద్రపురంలో ఉండగా చిన్నతనపు
    ఆ రోజుల్లో , గ్రామఫోను ప్లేట్లలోనూ, క్యాసెట్లలోనూ
    సంగీతం వినే ఆ కాలంలో జాన్ హిగ్గిన్స్ భాగవతార్
    గానాన్ని పరిచయం చేశావు. ఆయన గాత్రాన్ని బాగా
    వింటూ ఉండేవాళ్ళం. ఒక అమెరికన్ మన భారతీయ
    శాస్త్రీయ సంగీతాన్ని అంత లోతుగా అవగాహన చేసుకుని
    పాడడం ఆశ్చర్యపరిచేది. ఆ ఆలాపన, స్వరకల్పన….అలాగే
    పదాల ఉచ్చారణలో స్పష్టత విని ఆనందపడేవాళ్ళం. అతని
    కంఠాన్ని మెచ్చుకుంటూ ‘అద్భుతమైన Male Voice’
    అనేవాడివి. ఈరోజు ఆయనని గురించి చదవడం చాలా
    సంతోషాన్నిచ్చింది.

    ఎచటి అమెరికా దేశంబు? ఏడ తమిళ
    నాడు? రెంటి నేకము చేసె నాద విద్య.
    జాను హిగ్గిన్సు పాడంగ జాతి మెచ్చ
    రాగ ధారల తడిసేను రసిక జనులు.

  6. వాసుదేవరావు says:

    మీరు ఒక అక్షయ జ్ఞాన బాండాగారం- పిండుకున్న వాడికి పిండుకున్నంత – వాసుదేవరావు

  7. v.v.krishnarao says:

    జాన్ హిగిన్స్ భాగవతరుగారి భార్యపేరు Rhea Padias.ఆ దంపతులకి ఇద్దరే కుమారులు.
    Luke Higgins, Nicholas Higgins.
    Nicholas కర్ణాటక సంగీతం నేర్చుకుని,
    రెండవతరం హిగిన్సు భాగవతరుగా అవతరించేడు.

    జాన్ హిగిన్స్ భాగవతరుగారి తమ్ముడు అయిన
    ఎడ్డీ(Hayden)హిగిన్స్ మంచి జాజ్ పియానిస్టుగా పేరు-ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

    దివంగత జాన్ హిగిన్స్ భాగవతరుగారి పేరున
    ఒక శాశ్వతనిధిని అమెరికాలో ఏర్పాటుచేసి
    ఆయన స్మారకచిహ్నంగా వారి కుటుంబసభ్యులు,
    సంగీతాభిమానులు ౘక్కని సంగీతప్రోత్సాహక
    కార్యక్రమాలని నిర్వహించడం ముదావహం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *