సాహిత్యము—సౌహిత్యము~64 : చింతన

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః|
04—08—2018; శనివారము|

“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|

“సాహిత్యము—సౌహిత్యము ~ 64″| “చింతన”|

శ్రీమద్భగవద్గీత“లో అర్జునుడు శ్రీకృష్ణభగవానులవారిని ఉద్దేశించి ఇలాగ అడుగుతాడు:—

“కేషు కేషు చ భావేషు చిన్త్యోsసి భగవన్ ! మయా?”

“ఓ కృష్ణపరమాత్మా! ఎటువంటి భావనలద్వారా నేను నీగురించిన ‘చింతన’ని చేయడానికి నేను అర్హుడిని?”

అర్జునుడు అడిగిన సంస్కృతంలోని ప్రశ్నలోవున్న “చిన్త్యః” అనే మాటయొక్క ప్రయోగంకోసమే పై ఉదాహరణ ఇక్కడ ప్రస్తావించబడింది.

చితి – చిన్తాయామ్ ” అనే ధాతువుయొక్క అర్థంతో “చింత“, “చింతన” అనే రెండుమాటలూ పుట్టేయి. రెండు పదాలకీ మూలార్థం, అంటే ధాతువు(root)ను ఆధారంగాచేసుకుని పుట్టే అర్థం ఒకటే ఐనా, పదప్రయోగసందర్భాలని అనుసరించి విభిన్నమైన అర్థాలు ఏర్పడ్డాయి. భాషార్థశాస్త్రం(Semantics) అధ్యయనం చేసేవారికి ఇది సర్వసామాన్యవిషయమే!

“చితి” అనే ధాతువుకి “ఆలోచించు, యోచించు”అని తెలుగులోను,  “to reflect, to consider” అని ఆంగ్లంలోను అర్థం చెప్పవచ్చు. ఐతే, “చింత” అనే మాటకి, తెలుగులో, “విచారము, దుఃఖము” అని, ఆంగ్లంలో, “anxiety లేక, sad or sorrowful or pensive recollection or thought” అని అర్థం చెప్పాలి. ఈ అర్థం ఉండడంవలననే

“చితా చింతా ద్వయోర్మధ్యే చింతా నామ గరీయసీ|
చితా దహతి నిర్జీవం చింతా హి జీవితం తథా”||

“చితి, చింత అనే ఈ రెండింటిలోను, చింత అనేదే ఎక్కువైనది. ఎందుకంటే  చితి మరణించినతరవాత నిర్జీవ శరీరాన్నిమాత్రమే దహిస్తుంది. కాని చింత,  ప్రాణమున్న మనిషినికూడా కాలుస్తూవుంటుంది” అనే చితి-చింతల తరతమ భేదం నిర్ణయించే భావన పుట్టింది.

“చింతన” అనే పదం వివిధ రచయితలు, కవులు, భావుకులు, తాత్త్వికులు,  దర్శనకారులు, కళాకారులు, శాస్త్రజ్ఞులు మొదలైనవారందరిలోను జరిగే అత్యంత  ఆవశ్యక మానసిక లేక బౌద్ధిక ప్రక్రియని తెలియజేసే విస్తృత-గంభీర అర్థాన్ని కలిగివుంటుంది. ఈ సందర్భంలో “చింతన”కి గాఢమైన భావన, గంభీరధ్యానం అని అర్థం చెప్పవచ్చు. ఆంగ్లంలో “contemplation, meditation, cogitation,  rumination” మొదలైన అర్థాలు చెప్పవచ్చు.

చింతనశీలం మానవనైజం. చింతన తపస్సుకి ముందు భూమిక. మననం, చింతన  అనేవి తత్త్వాన్వేషణాశీలుడైన మానవుడి మనస్సుకి పూన్చబడిన రెండు గుర్రాల వంటివి. మననం జ్ఞానేంద్రియాల అనుభవ పరిధిలోకి వచ్చే విషయాలని మాత్రమే మనస్సులో మళ్ళీ-మళ్ళీ నెమరువేసుకుంటుంది. మననం అంటే, “అనుమానం  (inference)”, “యుక్తులతోకూడిన పదార్థనిర్ణయం (the process of determination of any substance with the help of logical or  rationalistic support) అని అర్థం చెప్పవచ్చు. మానవుడి మానసికలోకంలో మననం ౘాలా శక్తిమంతమైనది.

“మననాత్ పాపతః త్రాతి మననాత్ స్వర్గమశ్నుతే|
మననాత్ మోక్షమాప్నోతి చతుర్వర్గమయో భవేత్ “||
అని “గాయత్రీతంత్రం” (1:4) బోధిస్తోంది.

“మననం వలన పాపనిర్మూలనమౌతుంది. మననం వలన స్వర్గ-మోక్షాలని పొందుతూ, ధర్మార్థకామమోక్షాలని సాధకుడు సాధించగలుగుతాడు”  అని పై శ్లోకభావం.

పైన చెప్పుకున్నట్లుగా, మననం చూచినదానిని, వినినదానిని, తినినదానిని –  ఈ విధంగా ఇంద్రియానుభవపరిధిలోకి వచ్చే విషయానికి పరిమితమైవుంటుంది. చింతన ఇంద్రియానుభవపరిధిని దాటినదానిగురించికూడా లోతైన ఆలోచనని చేస్తుంది. అంటే, “స్ఫురణ“కి వచ్చినదానిని కూడా చింతన తన ఆలోచనకి ఆలంబనగా చేసుకుంటుంది. “స్ఫురణ లేక స్ఫురణము” అంటే, “flashing  of an idea or thought on the mind”, అంటే మనస్సులో హఠాత్తుగా మనకి అనుభవంలోలేని ఒకానొక భవ్యభావం ఒక మెరుపులాగ తనంతతానుగా ఆలోచనాకాంతిని ప్రసరింపజెయ్యడం అన్నమాట! ఇటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మన పెద్దలు ఇలాగ అంటున్నారు:—

“ఉత్తమా తత్త్వచింతా చ
మధ్యమం శాస్త్రచింతనమ్ |
అధమా మంత్రచింతా చ
తీర్థభ్రాంత్యధమాధమమ్ “||

“తాత్త్వికవిషయంగురించి చేసే చింత ఉత్తమమైనది. శాస్త్రసంబంధమైన  వివరంగురించి చేసే చింతన మధ్యమమైనది. మంత్రంగురించి చేసే చింతన అధమమైనది. తీర్థయాత్రలుచేయడం అధమమైనదానికన్న తక్కువైనది”.

పై శ్లోకంలోని తారతమ్యవివేచన ఆయావిషయాలనిగురించి ఎక్కువ-తక్కువలు చేసిచెప్పడం పెద్దల అభిమతం కానేకాదు. ఈ విషయాలలోని సోపానక్రమాన్ని సాధకులమైన మనవంటివారికి తెలియజెప్పడమే వారి మనోగత తాత్పర్యం. ఒకటవతరగతినుంచి పట్టభద్రతని పొందడంగురించిన తర-తమభేదం చెప్పడం ఎటువంటిదో, ఇదికూడా అటువంటిదే! ఒకటవతరగతి చదివే బాల,బాలికలే కాలాంతరంలో విశ్వవిద్యాలయ కులపతులౌతారు. ఆ విధమైన పరిణామక్రమం అటువంటి వివిధసోపాన ఆరోహణపద్ధతిద్వారా సాధ్యమౌతుందని చెప్పడమే ఈ శ్లోకంలోని అంతర్నిహిత మౌలిక సందేశం. ఒక మేడమీదకి ఎక్కడానికి ఇరవై మెట్లు ఉంటే, వాటిలో మొదటిమెట్టునుంచి, ఇరవైయవ మెట్టువరకు అన్నీకూడా  మేడ ఎక్కేవారికి ఆలంబనని ఇవ్వడంలో సమప్రాధాన్యతని కలిగి ఉంటాయి. ఈ శ్లోక సందేశ సారాంశం ఇదే!

స్వస్తి|

You may also like...

7 Responses

  1. Dr nishanth says:

    In many stotras we hear the term vichantayami. Can you elaborate on it. Pranams.

  2. Dr nishanth says:

    Two with regards to mantra, it is said mananat trayate ithi mantra, could it be that just repeating the syallabalic form is manana and pondering over the tattva of the diety invoked is chintana with regards to mantra. Could that explain what looks like a strange comparison of various paths to the absolute.

  3. v.v.krishnarao says:

    “విచింతయామి” అంటే, “విశేషేన చింతయామి, ఏకాగ్రకృత
    ప్రత్యయేన పూర్ణబుద్ధ్యా వా భావయామి” ఇత్యర్థః|
    విమలమతితో, ఏకాగ్రచిత్తంతో చింతించడం లేక భావన చెయ్యడం అని అర్థం. “Absolutely focussed contemplaton” అని చెప్పాలి.

  4. సి.యస్ says:

    ఈ వారం తీసుకున్న విషయం పరిమాణంలో
    చిన్నదైనా పరిధిలో విస్తృతమైనది.
    మననం– చింతన అనే పదాల గురించి చేసిన
    విశ్లేషణ వాటివాటి అర్థాల పట్ల మంచి స్ఫురణని
    కలుగచేసింది.
    ఆ రెండు మాటలకీ…. కేవలం పదార్థాలే కాకుండా సూక్ష్మ
    పరిశీలనలో వాటిమధ్య ఉన్న భేదాలు కూడా స్పష్టమయ్యాయి.
    ఇంద్రియానుభవంకాని వాటిగురించి చేయగలిగిన ఆలోచన-
    చింతన అనే చింతన చేయడం ఏమంత చిన్న విషయం కాదు.
    ఇక ‘ చితి-చింత’ గురించిన శ్లోకం ఎందరో చింతనాపరుల
    అనుభవాసారం.

  5. చింతనాశీలురైన, తాత్విక జనులను దృష్టి లో ఉంచుకొని వ్రాసిన విషయాలు మనోరంజకంగా ఉన్నాయి. అభినందనలు… థన్యవాదాలు.

  6. సి.యస్ says:

    చింత యైన గాని చితియైన గానిమ్ము
    కాల్చి వేయు నరుని కాయమెల్ల
    చితి శవమునె కాల్చు జీవితం ముగిశాక
    చింత కాల్చు బతుకు చివరి దాక

  7. v.v.krishnarao says:

    When a spiritual seeker worships God with “Japa” then
    he has to contemplate upon the quintessential semantic kernel of the Mantra as it is declared in the
    Yoga Sastra “Tat japah tat artha bhaavanam”.
    If it is not Japa but only a remembering the name of the chosen Deity, it can be, at the bottom line, a mere
    repetition of the Name of the Deity. Though there is
    bound to be a qualitative difference in both procedures
    there is nothing to worry as the chosen Deity surely
    helps the spiritual seeker as is needed by the context.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *